Assembly Deputy Speaker
-
జనసేనకు డిప్యూటీ స్పీకర్?
సాక్షి, అమరావతి: కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ పదవి దక్కే అవకాశం కనిపిస్తోంది. ఇప్ప టికే జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్‌కు ఉప ముఖ్యమంత్రి పదవి లభించిన విషయం తెలిసిందే. 21 మంది ఎమ్మెల్యే లున్న నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్టు తెలుస్తోంది. దీనికి చంద్రబాబు అంగీకరించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత జనసేనకు మూడో వంతు పదవులు వస్తాయని పవన్‌కళ్యాణ్ చెప్పేవారు. ఈ నేపథ్యంలో డిప్యూటీ స్పీకర్ పదవి లభించే అవకాశం ఉందని సమాచారం. ఈ పదవికి జనసేన పార్టీ నుంచి అవనిగడ్డ, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యేలు మండలి బుద్ధప్రసాద్, బొలిశెట్టి శ్రీనివాస్ పేర్లు వినిపిస్తున్నాయి. బుద్ధప్రసాద్ ఎన్నికలకు ముందు టీడీపీ నుంచి జనసేనలో చేరారు. బొలిశెట్టి తొలినుంచీ జనసేనలోనే ఉన్నారు. నిజంగా అవకాశం వస్తే వీరిద్దరిలో ఒకరు ఆ పదవిలో కూర్చోవడం ఖాయమని చెబుతున్నారు. మరోవైపు స్పీకర్ పదవికి టీడీపీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్నపాత్రుడి పేరును పరిశీలిస్తున్నారు. ఇదిలావుండగా ఈ నెల 19వ తేదీ నుంచి శాసనసభ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. రెండు రోజులపాటు సమావేశాలు నిర్వహించే అవకాశం ఉంది. తొలిరోజు ప్రొటెం స్పీకర్‌తో ఎమ్మెల్యేల ప్రమాణ స్వీకారం, రెండో రోజు స్పీకర్, డిప్యూటీ స్పీకర్ ఎన్నిక నిర్వహిస్తారని సమాచారం. -
‘ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్‌రెడ్డిని కోరా’
సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఢిల్లీలో పర్యటనలో భాగంగా శనివారం కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, పరాస్ పాశ్వాన్‌ను కలిశారు. మంత్రులతో భేటీ అనంతరం కోనరఘుపతి మీడియాతో మాట్లాడుతూ.. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ 74శాతం వ్యవసాయంపై ఆధారపడిందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ మినిస్ట్రీ పథకాలను కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పర్యాటక అభివృద్ధికి కృషి చేయాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు ఆయన పేర్కొన్నారు. భవిష్యత్‌లో ఏపీ టూరిజం హబ్‌గా మారబోతుందని కోన రఘుపతి చెప్పారు. -
'భయపడొద్దు.. నేను ఆరోగ్యంగా ఉన్నా'
సాక్షి, హైదరాబాద్ : ‘ఆరోగ్యంగా ఉన్నాను... ప్రజల అభిమానం... ఆశీస్సులతో కరోనాను జయించి తిరిగి వారి మధ్యకు వస్తాను’ అని తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మోండా డివిజన్ టకారబస్తీలోని తన నివాసంలో హోం క్వారంటైన్లో ఉన్న డిప్యూటీ స్పీకర్ బుధవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడారు. కరోనా కారణంగా కొద్ది రోజులు హోమ్ క్వారెంటైన్‌కు పరిమితం కావలసి వచ్చిందన్నారు. కరోనాకు సంబంధించి తనకు ఎలాంటి లక్షణాలు బయట పడలేదని... పరీక్షల్లో మాత్రమే తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు దూరంగా ఉండాల్సి రావడం కొంత ఇబ్బంది అయినా తప్పడం లేదన్నారు. ప్రజలెవరూ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుట పడేవరకూ మా నివాసానికి రాకుండా ఉండాలని పద్మారావుగౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తప్పని సరి అయితే తప్ప బయటకు రావద్దన్నారు. నా ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న... అమ్మవారి ఆశీస్సులతో త్వరగా పరిపూర్ణ ఆరోగ్య వంతుడిగా ప్రజల మధ్యకు వస్తానన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలతో హోం క్వారంటైన్లో ఆత్మవిశ్వాసంతో గడుపుతున్నానని, కరోనాకు మందుకన్నా మనోధైర్యం ఎంతో మేలు చేస్తుందన్నారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మారావుగౌడ్ ఏకగ్రీవం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు భట్టి విక్రమార్క తదితరులు పద్మారావుగౌడ్‌ను స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు. ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేం దర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, సభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, దానం నాగేందర్, కౌసర మోహినుద్దీన్, రాజాసింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ స్పీకర్ పోచారం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కొద్దిసేపు సభ ఆయనకు నివాళులు అర్పించింది. గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు... పద్మారావుగౌడ్ హైదరాబాద్ కార్పొరేటర్‌గా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన గతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వివిధ కర్మాగారాలకు కార్మిక నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను డిప్యూటీ స్పీకర్‌గా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవం కాలేదు. అప్పుడు పోటీలో ఉండా ల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేము సహకరించాం. నేను డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాను. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఉప సభాపతిగా పనిచేసినా తర్వాత అనేక అవకాశాలు వస్తాయనడానికే ఇలా చెబుతున్నా. – మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత నిబద్ధతతో పనిచేశారు... గత ప్రభుత్వ హయాంలో నిబద్ధతతో పని చేసి పదవులకు అలంకారం తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈ పదవికీ వన్నె తెస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది. – కేటీఆర్ ఆప్యాయత ఆయన చిరునామా... ఆయన ఏ హోదాలో ఉన్నా పజ్జన్నగా పిలుచుకునే వాళ్లం. ఆప్యాయతే ఆయన చిరునామా. అన్నారు. గతంలో ఎన్నో పదవులు అలంకరించి వికసించినట్లే ఇప్పుడూ పద్మంలా వికసిస్తారని విశ్వసిస్తున్నా. – హరీశ్‌రావు అండర్‌స్టాండింగ్‌తోనే అలా పోటీ చేశాం 2004 ఎన్నికల్లో నాపై పద్మారావు గెలిస్తే 2008 ఉప ఎన్నికల్లో నేను ఆయనపై గెలిచా. 2009లో సనత్‌నగర్ నుంచి ఇద్దరం పోటీ చేసి ఓడిపోయాం. 2014 ఎన్నికల్లో మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌తోనే వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచాం. – మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నా పెళ్లి చేసింది ఆయనే... ఉద్యమ సమయంలో ఓయూలో ఉన్న మాకు పజ్జన్న వెన్నుదన్నుగా నిలిచారు. 2012లో నా పెళ్లి చేసింది ఆయనే. పెళ్లికి అత్తమామ ఒప్పుకోకపోతే పద్మారావు పెద్ద మనసుతో వారితో మాట్లాడి నా ప్రేమ వివాహానికి ఒప్పించారు. – బాల్క సుమన్ ఆయన ఉద్యమ నాయకుడు పద్మారావుగౌడ్‌తో గత 20 ఏళ్ల నుంచి నాకు ఉన్న అనుబంధం మరచిపోలేనిది. రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన పదవి వదులుకొని 2001లో టీఆర్ఎస్లో చేరారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావుగౌడ్. ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శం. పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి సభ విజయవంతం అయ్యేలా ఆయన కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్ఎస్ విజయంలో ఆయన పాత్ర కీలకం. రాజధానిలో కల్లు దుకాణాలు మూసివేయొద్దం టూ సమైక్య రాష్ట్రంలో పోరాడారు. 2014లో పద్మారావు ఆబ్కారీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరం లో మళ్లీ కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. లక్షలాది ఈత, తాటి మొక్కలను ఆయన నాటిం చారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. – సీఎం కేసీఆర్ స్ఫూర్తివంతంగా సభను నిర్వహిస్తా నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం కేసీఆర్‌తోపాటు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. శాసనసభకు గౌరవ ఉపసభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజ లకు ఉపయోగపడే చర్చలు జరగాలని ఆశిస్తు న్నా. ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా అభిప్రాయం. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా. – పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్ -
బాధ్యతలు స్వీకరించిన పద్మారావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా మాజీమంత్రి, సికింద్రాబాద్ శాసనసభ్యుడు పద్మారావు గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన ఎన్నికకు సభలోని అని పార్టీలు మద్దతు తెలపడంతో ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ తెలిపారు. సభాపతి ప్రకటన అనంతరం బాధ్యతలు చేపట్టిన.. పద్మారావుకు సభలోని సభ్యులందరూ అభినందనలు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో పద్మారావు పాత్ర మరువలేనిదని సీఎం కేసీఆర్ గుర్తుచేశారు. సభావతి ప్రకటన అనంతరం కేసీఆర్ ఆయనను దగ్గరుండి తీసుకెళ్లి స్పీకర్ చైర్లో కూర్చోబెట్టారు. పద్మారావు ఏకగ్రీవ ఎన్నికకు సహకరించిన విపక్ష పార్టీ సభ్యులకు కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. -
డిప్యూటీ స్పీకర్‌గా పద్మా దేవేందర్‌రెడ్డి
హైదరాబాద్: అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్‌గా టీఆర్ఎస్ అభ్యర్థి పద్మా దేవేందర్‌రెడ్డిని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గురువారం అసెంబ్లీ సమావేశం ప్రారంభమైన వెంటనే ఆమె డిప్యూటీ స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు స్పీకర్ మధుసూదనాచారి ప్రకటించారు. అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ, వైఎస్సార్సీపీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం సభ్యులు ఆమెను సాదరంగా స్పీకర్ పీఠం వద్దకు తీసుకెళ్లి కూర్చొబెట్టి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ పద్మా దేవేందర్‌రెడ్డి పార్టీకి అందించిన సేవలను కొనియాడారు. ఆమెను తన బిడ్డగా సంబోధిస్తూ తమ జిల్లా వాసి డిప్యూటీ స్పీకర్ అవడం ఆనందంగా ఉందన్నారు. న్యాయవాదిగా రంగారెడ్డి జిల్లా కోర్టు, హైకోర్టులో పని చేశారని, అనంతరం టీఆర్ఎస్లో చేరి సేవలు అందించారని పేర్కొన్నారు. ఇతర పార్టీల వారికి డిప్యూటీ స్పీకర్ పదవి ఇమ్మని కోరారని, అయితే అప్పటికే నిర్ణయం జరిగినందున మనసు నొచ్చుకోవద్దని చెప్పానన్నారు. రెండు మూడు రోజుల ముందుగా అడిగితే బాగుండేదని పేర్కొన్నారు. విపక్షాలకు ఇవ్వకపోయినా ఏకగ్రీవ ఎన్నికకు సహకరించారని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. కొత్త రాష్ట్రమైనా అంతా హుందాగా సహకరించారన్నారు. శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి టి.హరీష్‌రావు మాట్లాడుతూ ప్రజలు గర్వించేలా హుందాగా సభను నడుపుతారనే నమ్మకం తమకు ఉందన్నారు. నిజాం షుగర్స్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో పద్మాదేవేందర్‌రెడ్డి క్రియాశీలంగా వ్యవహరించారన్నారు. ఆర్థిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ మాట్లాడుతూ అందరికీ ఆడబిడ్డగా ఉద్యమాల్లో కీలంగా వ్యవహరించారన్నారు. కేసీఆర్ నిర్వహించిన పాదయాత్ర, సైకిల్ యాత్రల్లో పాల్గొన్నారన్నారు. కాంగ్రెస్ సీనియర్ సభ్యురాలు జె.గీతారెడ్డి మాట్లాడుతూ మహిళల సమస్యలపై ఒక మహిళగా డిప్యూటీ స్పీకర్ ఎప్పుడూ సానుకూలంగా స్పందిస్తారని ఆశిస్తున్నామన్నారు. తొలి అసెంబ్లీలో మహిళా డిప్యూటీ స్పీకర్‌గా చరిత్ర పుటల్లోకి వెళతారన్నారు. టీడీపీ సభ్యుడు వివేకానంద మాట్లాడుతూ పద్మా దేవేందర్‌రెడ్డి డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైనందున తమను మాటల్తో అడ్డుకునే ఒక వికెట్ పడిపోయిందని చమత్కరించారు. బీజేపీ సభ్యుడు చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మహిళకు అవకాశం ఇవ్వడం అభినందనీయమన్నారు. అయితే ఆమె ఈ సీట్లోకంటే ఆ సీట్లో కూర్చుంటే బాగుండేదని సీఎం సీటును చూపిస్తూ పేర్కొన్నారు. అలాగే వైఎస్సార్సీపీ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, వివిధ పార్టీల సభ్యులు డీకే అరుణ, సున్నం రాజయ్య, సునీత, కృష్ణారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, రెడ్యానాయక్, రవీంద్రకుమార్ మాట్లాడారు. ప్రజల దృష్టి మన సభపైనే: పద్మా దేవేందర్‌రెడ్డి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో 60 ఏళ్ల కల సాకారమైందని, ప్రజల దృష్టి రాష్ట్ర పునర్నిర్మాణంపై, అందుకు సభ చేసే నిర్ణయాలపై ఉంటుందని డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి అన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన నిర్ణయాలు ఉండాలన్నారు. సద్విమర్శలతో పరస్పర సహకారంతో ముందుకు సాగుదామన్నారు. సభా హక్కులకు, సంప్రదాయాలకు భంగం కలగకుండా 29వ రాష్ట్రంగా దేశంలోనే ఆదర్శంగా ఉండాలన్నారు. సభ నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరిస్తానన్నారు