పద్మారావుగౌడ్‌కు శుభాకాంక్షలు తెలుపుతున్న పోచారం, చిత్రంలో సీఎం కేసీఆర్, తలసాని, దానం, ప్రశాంత్‌రెడ్డి, భట్టి, రాజాసింగ్ తదితరులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా సికింద్రాబాద్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పద్మారావుగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఉప సభాపతి ఎన్నికలో భాగంగా శనివారం నామినేషన్ల దాఖలుకు గడువు ముగిసే సమయానికి పద్మారావుగౌడ్ ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవమైంది. ఈ మేరకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం అసెంబ్లీలో ప్రకటన చేశారు. అనంతరం సీఎం కేసీఆర్, ప్రతిపక్ష సభ్యులు భట్టి విక్రమార్క తదితరులు పద్మారావుగౌడ్‌ను స్పీకర్ స్థానం వరకు తీసుకెళ్లి సీట్లో కూర్చొబెట్టారు.
ఈ సందర్భంగా పద్మారావుగౌడ్‌కు స్పీకర్ పోచారం, సీఎం కేసీఆర్‌తోపాటు మంత్రులు మహమూద్ అలీ, ఈటల రాజేం దర్, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, సభ్యులు పద్మా దేవేందర్‌రెడ్డి, దానం నాగేందర్, కౌసర మోహినుద్దీన్, రాజాసింగ్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, సురేందర్ శుభాకాంక్షలు తెలిపారు. అసెంబ్లీ ప్రారంభమైన వెంటనే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి మరణానికి సంతాపం తెలుపుతూ స్పీకర్ పోచారం తీర్మానం ప్రవేశపెట్టారు. అనంతరం కొద్దిసేపు సభ ఆయనకు నివాళులు అర్పించింది.
గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు...
పద్మారావుగౌడ్ హైదరాబాద్ కార్పొరేటర్‌గా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆయన గతంలో యువజన కాంగ్రెస్ నాయకుడిగా పనిచేశారు. ఇందిరా గాంధీ పిలుపునిచ్చిన గరీబీ హఠావో ఉద్యమంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లో వివిధ కర్మాగారాలకు కార్మిక నాయకుడిగా పనిచేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో నేను డిప్యూటీ స్పీకర్‌గా పోటీ చేసినప్పుడు ఏకగ్రీవం కాలేదు. అప్పుడు పోటీలో ఉండా ల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మేము సహకరించాం. నేను డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశాను. ప్రస్తుత సీఎం కేసీఆర్ కూడా డిప్యూటీ స్పీకర్‌గా పనిచేశారు. ఉప సభాపతిగా పనిచేసినా తర్వాత అనేక అవకాశాలు వస్తాయనడానికే ఇలా చెబుతున్నా.
– మల్లు భట్టి విక్రమార్క, ప్రతిపక్ష నేత
నిబద్ధతతో పనిచేశారు...
గత ప్రభుత్వ హయాంలో నిబద్ధతతో పని చేసి పదవులకు అలంకారం తీసుకొచ్చారు. అదే మాదిరిగా ఈ పదవికీ వన్నె తెస్తారనే సంపూర్ణమైన విశ్వాసం ఉంది.
– కేటీఆర్
ఆప్యాయత ఆయన చిరునామా...
ఆయన ఏ హోదాలో ఉన్నా పజ్జన్నగా పిలుచుకునే వాళ్లం. ఆప్యాయతే ఆయన చిరునామా. అన్నారు. గతంలో ఎన్నో పదవులు అలంకరించి వికసించినట్లే ఇప్పుడూ పద్మంలా వికసిస్తారని విశ్వసిస్తున్నా.
– హరీశ్‌రావు
అండర్‌స్టాండింగ్‌తోనే అలా పోటీ చేశాం
2004 ఎన్నికల్లో నాపై పద్మారావు గెలిస్తే 2008 ఉప ఎన్నికల్లో నేను ఆయనపై గెలిచా. 2009లో సనత్‌నగర్ నుంచి ఇద్దరం పోటీ చేసి ఓడిపోయాం. 2014 ఎన్నికల్లో మేమిద్దరం అండర్‌స్టాండింగ్‌తోనే వేర్వేరు నియోజకవర్గాల నుంచి పోటీ చేసి గెలిచాం.
– మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్
నా పెళ్లి చేసింది ఆయనే...
ఉద్యమ సమయంలో ఓయూలో ఉన్న మాకు పజ్జన్న వెన్నుదన్నుగా నిలిచారు. 2012లో నా పెళ్లి చేసింది ఆయనే. పెళ్లికి అత్తమామ ఒప్పుకోకపోతే పద్మారావు పెద్ద మనసుతో వారితో మాట్లాడి నా ప్రేమ వివాహానికి ఒప్పించారు.
– బాల్క సుమన్
ఆయన ఉద్యమ నాయకుడు
పద్మారావుగౌడ్‌తో గత 20 ఏళ్ల నుంచి నాకు ఉన్న అనుబంధం మరచిపోలేనిది. రెండుసార్లు కార్పొరేటర్‌గా పనిచేసిన ఆయన పదవి వదులుకొని 2001లో టీఆర్‌ఎస్‌లో చేరారు. హైదరాబాద్ జంట నగరాల నుంచి ఉద్యమాన్ని నడిపిన నాయకుడు పద్మారావుగౌడ్. ప్రజలతో ఆయన మమేకమయ్యే తీరు అందరికీ ఆదర్శం. పరేడ్ గ్రౌండ్స్‌లో టీఆర్‌ఎస్ నిర్వహించిన తొలి సభకు రేయింబవళ్లు కష్టపడి పని చేసి సభ విజయవంతం అయ్యేలా ఆయన కృషి చేశారు. జంట నగరాల్లో టీఆర్‌ఎస్ విజయంలో ఆయన పాత్ర కీలకం. రాజధానిలో కల్లు దుకాణాలు మూసివేయొద్దం టూ సమైక్య రాష్ట్రంలో పోరాడారు. 2014లో పద్మారావు ఆబ్కారీశాఖ మంత్రిగా ఉన్నప్పుడు నగరం లో మళ్లీ కల్లు దుకాణాల పునరుద్ధరణ జరిగింది. లక్షలాది ఈత, తాటి మొక్కలను ఆయన నాటిం చారు. పదవిలో ఉన్నా లేకున్నా ఆయన ఒకేలా ఉంటారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా.
– సీఎం కేసీఆర్
స్ఫూర్తివంతంగా సభను నిర్వహిస్తా
నాకు శుభాకాంక్షలు తెలిపినందుకు సీఎం కేసీఆర్‌తోపాటు మిగతా సభ్యులందరికీ ధన్యవాదాలు. శాసనసభకు గౌరవ ఉపసభాపతిగా ఎన్నికైన తర్వాత సభలో నిష్పక్షపాతంగా, ప్రజ లకు ఉపయోగపడే చర్చలు జరగాలని ఆశిస్తు న్నా. ఇందుకోసం సభ్యులందరికీ సముచిత అవకాశాలు కల్పించాలనేది నా అభిప్రాయం. వర్తమాన తరానికే కాకుండా భావితరాల వారికి స్ఫూర్తివంతంగా సభా కార్యక్రమాలు నిర్వహిం చేందుకు కృషి చేస్తానని హామీ ఇస్తున్నా.
– పద్మారావుగౌడ్, డిప్యూటీ స్పీకర్
Comments
Please login to add a commentAdd a comment