సాక్షి, హైదరాబాద్ : ‘ఆరోగ్యంగా ఉన్నాను... ప్రజల అభిమానం... ఆశీస్సులతో కరోనాను జయించి తిరిగి వారి మధ్యకు వస్తాను’ అని తెలంగాణ శాసన సభ డిప్యూటీ స్పీకర్ టి.పద్మారావు గౌడ్ పేర్కొన్నారు. మోండా డివిజన్ టకారబస్తీలోని తన నివాసంలో హోం క్వారంటైన్‌లో ఉన్న డిప్యూటీ స్పీకర్ బుధవారం ‘సాక్షి’తో ఫోన్‌లో మాట్లాడారు. కరోనా కారణంగా కొద్ది రోజులు హోమ్ క్వారెంటైన్‌కు పరిమితం కావలసి వచ్చిందన్నారు. కరోనాకు సంబంధించి తనకు ఎలాంటి లక్షణాలు బయట పడలేదని... పరీక్షల్లో మాత్రమే తనకు పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యిందన్నారు. దీంతో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నేతలు, అభిమానులకు దూరంగా ఉండాల్సి రావడం కొంత ఇబ్బంది అయినా తప్పడం లేదన్నారు.
ప్రజలెవరూ తనతో పాటు తన కుటుంబ సభ్యుల ఆరోగ్యం కుదుట పడేవరకూ మా నివాసానికి రాకుండా ఉండాలని పద్మారావుగౌడ్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని... మాస్కు ధరించి, భౌతిక దూరం పాటించాలని సూచించారు. తప్పని సరి అయితే తప్ప బయటకు రావద్దన్నారు. నా ఆరాధ్యదైవం కొమురవెల్లి మల్లన్న... అమ్మవారి ఆశీస్సులతో త్వరగా పరిపూర్ణ ఆరోగ్య వంతుడిగా ప్రజల మధ్యకు వస్తానన్నారు. డాక్టర్ల పర్యవేక్షణలో వారి సలహాలు, సూచనలతో హోం క్వారంటైన్‌లో ఆత్మవిశ్వాసంతో గడుపుతున్నానని, కరోనాకు మందుకన్నా మనోధైర్యం ఎంతో మేలు చేస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment