సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్‌లో సంస్థాగత కమిటీల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ఈ నెల 2న ఇది ప్రారంభం కాగా 12లోగా గ్రామ పంచాయతీ, మున్సిపల్ వార్డుల స్థాయిలో కమిటీలు పూర్తి చేయాల్సి ఉంది. పార్టీ షెడ్యూల్ ప్రకారం ఈ నెల 20లోగా మండల, మున్సిపల్, పట్టణ కమిటీలు కూడా పూర్తి కావాలి.
20 తర్వాత జిల్లా, రాష్ట్ర కమిటీలను పార్టీ అధినేత కేసీఆర్ సూచనల మేరకు నియమిస్తారు. కేసీఆర్ నిర్ణయం మేరకు గతంలో నియోజకవర్గ, రాష్ట్ర స్థాయి కమిటీలు ఏర్పాటు కాగా, తాజాగా జిల్లా కమిటీలను పునరుద్ధరించాలని నిర్ణయించారు. దీంతో అధికారిక పదవులు దక్కని నేతలు పార్టీ జిల్లా, రాష్ట్ర కమిటీల్లో చోటు కోసం ప్రయత్నాలు ప్రారంభించారు.
ముఖ్య నేతలకు ప్రాధాన్యం...
2017, అక్టోబర్‌లో నియమించిన టీఆర్‌ఎస్ రాష్ట్ర కమిటీ నాలుగేళ్లుగా స్వల్ప మార్పులతో కొనసాగుతూ వస్తోంది. ఈ కమిటీలో పార్టీ పార్లమెంటరీ నేత కె.కేశవరావుకు సెక్రటరీ జనరల్ పదవి, 20 మందికి ప్రధాన కార్యదర్శులుగా, 33 మందికి కార్యదర్శులుగా, 12 మందికి సహాయ కార్యదర్శులుగా పదవులు దక్కాయి. వీరిలో ప్రస్తుతం సత్యవతి రాథోడ్‌కు మంత్రి పదవి, కొందరికి ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ దక్కగా, మరికొందరు ఇతర నామినేటెడ్ పదవులు పొందారు.
వివిధ సందర్భాల్లో పార్టీలో చేరిన ముఖ్య నేతలు కొందరికి అటు అధికార పదవులు, ఇటు పార్టీ పదవులు లేకపోవడంతో అసంతృప్తి చెందుతున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా కమిటీలు, రాష్ట్ర కమిటీల్లో ఇలాంటి వారికి ప్రాధాన్యత ఇవ్వాలని కేసీఆర్ భావిస్తున్నారు. పార్టీ బలోపేతానికి వీరి సేవలు, అనుభవాన్ని వాడుకునేలా ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఇప్పటికే అధికార పదవులు అనుభవిస్తున్న నేతలకు పార్టీ కమిటీల్లో చోటు లభించే అవకాశం లేదని సమాచారం.
త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ?
పార్టీ రెండోసారి అధికారంలోకి వచ్చి సుమారు మూడేళ్లు కావస్తున్నా నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ పూర్తిగా జరగలేదు. 50కి పైగా ప్రభుత్వ కార్పొరేషన్లు, మండళ్లలో చైర్మన్, డైరెక్టర్ స్థానాలు కలుపు కొని సుమారు 500 వరకు పదవులు భర్తీ చేయాల్సి ఉంది.
త్వరలో వీటి భర్తీని చేపడతామని మంగళవారం జరిగిన ‘గ్రేటర్’టీఆర్‌ఎస్ భేటీలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రకటించారు. మరో 18 ఎమ్మెల్సీ స్థానాలకు వచ్చే జనవరిలోగా ఎన్నికలు జరగాల్సి ఉంది. దీంతో అధికార, నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు ఆశిస్తున్న నేతలు కేసీఆర్, కేటీఆర్ దృష్టిలో పడేందుకు తమవంతు ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment