పేదల రుణాలకు ఏదీ స్వాతంత్ర్యం?
పేదల రుణాలకు ఏదీ స్వాతంత్ర్యం?
Published Mon, Aug 15 2016 4:38 PM | Last Updated on Mon, Sep 4 2017 9:24 AM
పంద్రాగస్టు నాడు ఆస్తుల పంపిణీలతో...
నాడు కళకళ.. నేడు వెలవెల
సబ్సిడీ నిధులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం
కష్టాల కడలిలో కార్పొరేషన్లు
పంద్రాగస్టు అంటే నిరుపేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేది.. పోలీస్ పెరేడ్ గ్రౌండ్‌లో అందరి సమక్షంలో ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా రుణం పొందుతామనే ఆనందం వారిలో కనిపించేది.. ఇదంతా గతం.. ప్రస్తుతం నాటి కల... నేడు కలగా మారింది.. ‘మా రుణాలకు స్వాతంత్య్రం ఎప్పుడొస్తుంది’ అని పేదలు ప్రశ్నిస్తున్నారు.
కడప రూరల్: నిరుపేదల సంక్షేమం అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, క్రైస్తవ, స్టెప్ కార్పొరేషన్లు గుర్తుకొస్తాయి. ఈ శాఖల ద్వారా నిరుపేదలైన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందించాల్సి ఉంది. కాగా పాలకులు బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాల లక్ష్యాలను ఘనంగా ప్రకటిస్తున్నారు. అయితే అమలు మాత్రం చేయడం లేదు. తమ వాటాగా ప్రభుత్వం సబ్సిడీ నిధులను సకాలంలో విడుదల చేయనందున 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని శాఖల ద్వారా కొంత మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మరి కొన్ని శాఖలకు ఒక్క పైసా కూడా రానందున ఇంత వరకు ఏ ఒక్కరూ రుణం పొందలేక పోయారు.
నిర్వీర్యంగా కార్పొరేషన్లు
2016-2017 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టి నెలలు గడుస్తున్నప్పటికీ.. కార్పొరేషన్లలో ప్రగతి లేక నిర్వీర్యంగా మారుతున్నాయి. గతంలో రుణాలను పంపిణీ చేసినా, చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాత్రం తప్పనిసరిగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అర్హులకు అందించే వారు. ఇప్పుడా పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. చెప్పుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏవో అలా ఇచ్చేస్తున్నారనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది.
కార్పొరేషన్ల స్థితిగతుల ప్రగతిని పరిశీలిస్తే ఇలా ఉన్నాయి.
జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజి కింద 1846 యూనిట్లను అందుకు గాను సబ్బిడీతో కలిపి రూ 23.24 కోట్లు అవసరం (అందులో సగం సబ్సిడీ ఉంటుంది). అయితే ప్రభుత్వం బ్యాకెండ్ సబ్సిడీ విధానాన్ని ఉన్నఫలంగా ప్రవేశ పెట్టింది. అంటే మొదట బ్యాంకర్లు సబ్సిడీతో కలిపి మొత్తం రుణాన్ని అర్హులకు అందజేయాలి. రెండేళ్ల తరువాత యూనిట్ ఉంటే లబ్ధిదారునికి సబ్సిడీని అందిస్తారు. ఇటీవల ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు ఎంత మందికి రుణాలు అందించారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎన్‌ఎస్‌కేఎఫ్‌డీసీ కింద 51 యూనిట్లను 55 మంది లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇంత వరకూ ఎవరికీ రుణం మంజూరు కాలేదు. ఎన్‌ఎస్‌ఎఫ్‌డీసీ రుణాలను 195 యూనిట్లను 195 మందికి అందించాల్సి ఉండగా.. వీటిని మాత్రం అధికారులు కొంత మందికి అందిస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్ వారు 224 యూనిట్లను 268 మంది లబ్ధిదారులకు అందజేయాలి. అందుకోసం సబ్సిడీతో కలిపి మొత్తం రూ 3.02 కోట్లు (అందులో సగం సబ్సిడీ ) అవసరం కాగా సబ్సిడీ విడుదల కానందున ఎవరూ రుణం పొందలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 1800 యూని ట్లు అంతే మందికి అందాల్సి ఉండగా, 1300 మంది రుణాలు పొందారు. ఇక బీసీలకు చెందిన ఫెడరేషన్ల ప్రగతి కూడా నత్తనడకన సాగుతోంది.
కొత్తగా ఏర్పడిన కాపు కార్పొరేషన్ వలన 1854 యూనిట్లను అంతే మందికి అందజేయాలి. అందుకోసం కేవలం సబ్సిడీకి మాత్రమే 5.68 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ 2.82 కోట్లు మంజూరు కావడంతో గ డిచిన మే నెలాఖరు వరకు 924 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. తరువాత మరెవరికీ రుణం అందలేదు. ఇక అన్ని వర్గాలకు చెందిన స్టెప్ పూర్తిగా నిర్వీర్యమైంది. రెండేళ్ల నుంచి ఆ శాఖ ద్వారా ఎవరికీ రుణాలు మంజూరు కాలేదు.
Advertisement
Advertisement