subsidy funds
-
ఈ–టూవీలర్ కంపెనీలకు చెక్!
న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది. హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు. ఉల్లంఘనలు ఇలా.. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది. వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి. -
రైతులకు రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ
మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి బాన్సువాడ: రైతుల కోసం రూ.702 కోట్ల ఇన్ పుట్ సబ్సిడీని విడుదల చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి వెల్లడించారు. పెద్దనోట్ల రద్దుతో అవస్థల్లో ఉన్న రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఎంతో ఉపకరిస్తుందన్నారు. సోమవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వారంలోగా సబ్సిడీ నిధులు రైతులఖాతాల్లో జమ అవు తాయన్నారు. బ్యాం కర్లు సబ్సిడీ డబ్బులను రైతులకు అందజేయా లని సూచించారు. సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధతో ఈ ఇన్ పుట్ సబ్సిడీ విడుదల చేశారని, యాసంగి పంట సాగు కోసం ఇవి ఉపయోగపడతాయన్నారు. పెద్దనోట్ల రద్దు వల్ల రాష్ట్ర ఖజానాపై భారం పడుతున్నా, సాగునీటి ప్రాజెక్టులు, వ్యవ సాయ రంగంపై దీని ప్రభావం పడకుండా చర్యలు తీసుకొంటున్నామన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంపై పరోక్షంగా పెట్టుబడి పెట్టామని, ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఏడా దికి రూ. 25 వేల కోట్లు విడుదల చేస్తున్నా మని తెలిపారు. ప్రతి నెల రెండు వేల కోట్ల పనులు ప్రాజెక్టులకు వెచ్చిస్తు న్నామన్నారు. 2018 జూన్ నాటికి కాళేశ్వరం నీరు నిజాం సాగర్ ప్రాజెక్టుకు అందుతా యని, రెండు పంటలకు నీరందుతుందన్నారు. యాసంగికి 12.50 లక్షల మెట్రిక్ టన్నుల వరివిత్తనాలు సిద్ధంగా ఉన్నాయన్నారు. -
పేదల రుణాలకు ఏదీ స్వాతంత్ర్యం?
పంద్రాగస్టు నాడు ఆస్తుల పంపిణీలతో... నాడు కళకళ.. నేడు వెలవెల సబ్సిడీ నిధులకు సంకెళ్లు వేసిన ప్రభుత్వం కష్టాల కడలిలో కార్పొరేషన్లు పంద్రాగస్టు అంటే నిరుపేదల ముఖాల్లో సంతోషం వెల్లివిరిసేది.. పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో అందరి సమక్షంలో ప్రజా ప్రజాప్రతినిధులు, అధికారుల చేతుల మీదుగా రుణం పొందుతామనే ఆనందం వారిలో కనిపించేది.. ఇదంతా గతం.. ప్రస్తుతం నాటి కల... నేడు కలగా మారింది.. ‘మా రుణాలకు స్వాతంత్య్రం ఎప్పుడొస్తుంది’ అని పేదలు ప్రశ్నిస్తున్నారు. కడప రూరల్: నిరుపేదల సంక్షేమం అనగానే ఎస్సీ, ఎస్టీ, బీసీ, కాపు, మైనార్టీ, క్రైస్తవ, స్టెప్ కార్పొరేషన్లు గుర్తుకొస్తాయి. ఈ శాఖల ద్వారా నిరుపేదలైన అర్హులకు రాష్ట్ర ప్రభుత్వం రుణాలను అందించాల్సి ఉంది. కాగా పాలకులు బ్యాంకు లింకేజీ సబ్సిడీ రుణాల లక్ష్యాలను ఘనంగా ప్రకటిస్తున్నారు. అయితే అమలు మాత్రం చేయడం లేదు. తమ వాటాగా ప్రభుత్వం సబ్సిడీ నిధులను సకాలంలో విడుదల చేయనందున 2015-16 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కొన్ని శాఖల ద్వారా కొంత మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. మరి కొన్ని శాఖలకు ఒక్క పైసా కూడా రానందున ఇంత వరకు ఏ ఒక్కరూ రుణం పొందలేక పోయారు. నిర్వీర్యంగా కార్పొరేషన్లు 2016-2017 ఆర్థిక సంవత్సరంలోకి అడుగుపెట్టి నెలలు గడుస్తున్నప్పటికీ.. కార్పొరేషన్లలో ప్రగతి లేక నిర్వీర్యంగా మారుతున్నాయి. గతంలో రుణాలను పంపిణీ చేసినా, చేయకపోయినా స్వాతంత్య్ర దినోత్సవం నాడు మాత్రం తప్పనిసరిగా ఆస్తుల పంపిణీ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున రుణాలను అర్హులకు అందించే వారు. ఇప్పుడా పరిస్థితి ఏమాత్రం కనిపించడం లేదు. చెప్పుకోవాలి కాబట్టి తప్పని పరిస్థితుల్లో ఏవో అలా ఇచ్చేస్తున్నారనే అభిప్రాయం అందరిలో కలుగుతోంది. కార్పొరేషన్ల స్థితిగతుల ప్రగతిని పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బ్యాంకు లింకేజి కింద 1846 యూనిట్లను అందుకు గాను సబ్బిడీతో కలిపి రూ 23.24 కోట్లు అవసరం (అందులో సగం సబ్సిడీ ఉంటుంది). అయితే ప్రభుత్వం బ్యాకెండ్ సబ్సిడీ విధానాన్ని ఉన్నఫలంగా ప్రవేశ పెట్టింది. అంటే మొదట బ్యాంకర్లు సబ్సిడీతో కలిపి మొత్తం రుణాన్ని అర్హులకు అందజేయాలి. రెండేళ్ల తరువాత యూనిట్ ఉంటే లబ్ధిదారునికి సబ్సిడీని అందిస్తారు. ఇటీవల ప్రభుత్వం సబ్సిడీని విడుదల చేసినప్పటికీ బ్యాంకర్లు ఎంత మందికి రుణాలు అందించారో తెలియని పరిస్థితి ఏర్పడింది. అలాగే ఎన్ఎస్కేఎఫ్డీసీ కింద 51 యూనిట్లను 55 మంది లబ్ధిదారులకు అందించాలి. అయితే ఇంత వరకూ ఎవరికీ రుణం మంజూరు కాలేదు. ఎన్ఎస్ఎఫ్డీసీ రుణాలను 195 యూనిట్లను 195 మందికి అందించాల్సి ఉండగా.. వీటిని మాత్రం అధికారులు కొంత మందికి అందిస్తున్నారు. ఎస్టీ కార్పొరేషన్ వారు 224 యూనిట్లను 268 మంది లబ్ధిదారులకు అందజేయాలి. అందుకోసం సబ్సిడీతో కలిపి మొత్తం రూ 3.02 కోట్లు (అందులో సగం సబ్సిడీ ) అవసరం కాగా సబ్సిడీ విడుదల కానందున ఎవరూ రుణం పొందలేదు. బీసీ కార్పొరేషన్ ద్వారా దాదాపు 1800 యూని ట్లు అంతే మందికి అందాల్సి ఉండగా, 1300 మంది రుణాలు పొందారు. ఇక బీసీలకు చెందిన ఫెడరేషన్ల ప్రగతి కూడా నత్తనడకన సాగుతోంది. కొత్తగా ఏర్పడిన కాపు కార్పొరేషన్ వలన 1854 యూనిట్లను అంతే మందికి అందజేయాలి. అందుకోసం కేవలం సబ్సిడీకి మాత్రమే 5.68 కోట్లు అవసరం కాగా ఇప్పటి వరకు రూ 2.82 కోట్లు మంజూరు కావడంతో గ డిచిన మే నెలాఖరు వరకు 924 మంది మాత్రమే రుణాలు పొందగలిగారు. తరువాత మరెవరికీ రుణం అందలేదు. ఇక అన్ని వర్గాలకు చెందిన స్టెప్ పూర్తిగా నిర్వీర్యమైంది. రెండేళ్ల నుంచి ఆ శాఖ ద్వారా ఎవరికీ రుణాలు మంజూరు కాలేదు. -
సబ్సిడీ నిధులు ఆదా చేస్తే మీకే..!
రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్ * ఎల్పీజీ తరహాలో నేరుగా లబ్ధిదారులకే ప్రయోజనాలు * దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు * దేశవ్యాప్తంగా రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా * అన్ని రాష్ట్రాల్లోని లబ్ధిదారుల డేటా ఒకేచోటికి * డీబీటీ ప్రత్యేక సెల్ ఏర్పాటు చేసిన రాష్ట్ర ప్రభుత్వం సాక్షి, హైదరాబాద్: పెన్షన్లు.. స్కాలర్షిప్పులు.. ఉపాధిహామీ.. ప్రజాపంపిణీ.. ఉపాధి శిక్షణ.. వీటికి సంబంధించి అమలవుతున్న పథకాలు.. కార్యక్రమాలకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని అందిస్తోంది. వీటిలో కొన్ని నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు చేరుతున్నాయి. మరికొన్ని పథకాలకు సంబంధించిన సబ్సిడీ ముందుగా ఆయా శాఖలకు అందుతున్నాయి. అయితే ఈ సబ్సిడీ నిధులు వివిధ రకాలుగా దుర్వినియోగమవుతున్నాయి. దీంతో కేంద్ర ప్రభుత్వ ఉద్దేశం చాలావరకూ దెబ్బతింటోంది. ఈ నేపథ్యంలో రాష్ట్రాలకు బంపర్ ఆఫర్ ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. సబ్సిడీ నిధులను ఆదా చేస్తే ఆ డబ్బును రాష్ట్రాలకే పంచి పెడతామని ప్రకటించింది. వివిధ పథకాలకు ఇస్తున్న సబ్సిడీ నిధులను నేరుగా లబ్ధిదారులకు బదిలీ చేసే విధానాలను అమలు చేస్తే.. దేశవ్యాప్తంగా సుమారు రూ.36 వేల కోట్లు మిగులుతాయని అంచనా వేసింది. కేంద్రం ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సబ్సిడీలను నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు రూ.28 వేల కోట్లు ఆదా అయినట్లుగా లెక్కతేల్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు సహకరిస్తే సబ్సిడీ నిధులను ఆదా చేసే అవకాశముందని, వీటిని ఆయా రాష్ట్రాల ఖాతాలకే బదిలీ చేస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వాలు అందుకు తగిన వ్యూహాలను అమలు చేయాలని సూచించింది. ఇటీవల కేంద్ర కేబినెట్ సెక్రెటేరియట్ అన్ని రాష్ట్రాల ఆర్థిక శాఖ అధికారులతో ఢిల్లీలో ఈ అంశంపై ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహించింది. నేరుగా ప్రయోజనం ఉదాహరణకు రేషన్ బియ్యం, కిరోసిన్, ప్రజా పంపిణీ ద్వారా సరఫరా చేసే రేషన్ సరుకులపై కేంద్రం ఇచ్చే సబ్సిడీ నేరుగా రాష్ట్ర ఖాతాలో జమవుతుంది. అందుకు బదులుగా కిరోసిన్ లబ్ధి పొందే రేషన్ కార్డుదారుడికి.. ఆ నెల కిరోసిన్ అందిందా..? లేదా..? అనే వివరాలను సెల్‌ఫోన్‌కు ఎస్సెమ్మెస్ పంపించే విధానం అమలు చేయాలని నిర్ణయించింది. దీంతో సబ్సిడీ కిరోసిన్‌పై పక్కదారి పడుతున్న కోట్లాది రూపాయలు ఆదా అవుతాయని కేంద్రం భావిస్తోంది. కొన్ని పథకాలకు ఐరిష్ విధానం అమలు చేయాలని, మరికొన్నింటికి బయో మెట్రిక్‌ను.. ఇదేతరహాలో వివిధ విభాగాల్లో అమలవుతున్న పథకాలను, లబ్ధిదారుల డేటాను ఒకేచోటికి చేర్చడం ద్వారా భారీ మొత్తంలో నిధులు ఆదా అవుతాయని విశ్లేషించింది. దీంతో డూప్లికేట్లు, అనర్హులు, అక్రమార్కులకు ముకుతాడు పడుతుందనే అభిప్రాయపడింది. లబ్ధిదారుల డేటా ఒకేచోట.. అన్ని విభాగాల డేటాను సమ్మిళితం చేసేందుకు వీలుగా పథకాలన్నింటినీ ‘ఆధార్’తో అనుసంధానం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. అన్ని రాష్ట్రాలు తమ దగ్గర ఉన్న డేటాను కేంద్రం అధ్వర్యంలోని ‘సర్వం’ డేటాబేస్‌తో లింకప్ చేయాలని సూచించింది. దీంతో అన్ని రాష్ట్రాల్లో లబ్ధిదారుల డేటా ఒకేచోటికి చేరుతుంది. ప్రభుత్వం సైతం ఎప్పటికప్పుడు తమకు అవసరమైన సమాచారాన్ని ఈ డేటాబేస్ నుంచి రాబట్టుకునే అవకాశం ఉంటుంది. ఆధార్‌తో అనుసంధానం చేయటం ద్వారా.. ఏ గ్రామంలో.. ఏ కుటుంబం.. ప్రభుత్వం నుంచి ఏయే పథకాల్లో ఎంతమేరకు లబ్ధి పొందిందనే వివరాలను క్షణాల్లో తెలుసుకోవటం సాధ్యమవుతుందని, అది ప్రజా ప్రతినిధులకు, రాష్ట్ర ప్రభుత్వాలకు సైతం ఉపయుక్తంగా ఉంటుందని నిర్దేశించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ట్రాలు డెరైక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్(డీబీటీ) సెల్‌ను ఏర్పాటు చేయాలని కేంద్రం తక్షణ కార్యాచరణను నిర్దేశించింది. గత వారంలో జరిగిన ఈ సదస్సు నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం డీబీటీ సెల్‌ను ఏర్పాటు చేసింది. ఆర్థిక శాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్‌ను ఈ సెల్‌కు కో ఆర్డినేటర్‌గా, జాయింట్ సెక్రెటరీ వి.సాయిప్రసాద్‌ను నోడల్ ఆఫీసర్‌గా నియమించింది. అన్ని విభాగాల్లో పథకాలను, లబ్ధిదారుల డేటాను సమ్మిళితం చేసి.. ఒకే డేటాబేస్ కిందికి తీసుకువచ్చేందుకు డీబీటీ సెల్ ప్రత్యేక కార్యాచరణ చేపడుతుంది. రాష్ట్రంలో డేటా ఒకేచోటికి వచ్చిన తర్వాత.. కేంద్రం సూచించిన ‘సర్వం’ డేటాబేస్కు లింకప్ చేస్తారు. -
‘ఉచితం’పై డిస్కంల తప్పుడు లెక్కలు
అధిక సబ్సిడీ కోసం వ్యవసాయ విద్యుత్ వాడకాన్ని పెంచి చూపే యత్నం 2015-16లో 13,431 మిలియన్ యూనిట్లు అవ సరమని అంచనా ఈ అంచనాలను తప్పుబట్టిన తెలంగాణ ఈఆర్సీ 20 శాతం వ్యవసాయ విద్యుత్‌కు కత్తెర 10,650 మిలియన్ యూనిట్లు చాలంటూ సర్దుబాటు హైదరాబాద్: ఉచిత విద్యుత్ విషయంలో డిస్కంలు సర్కారును తప్పుదోవ పట్టించాయి. ప్రభుత్వం నుంచి సబ్సిడీ నిధులను ఎక్కువగా ఆశించి వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని పెంచి చూపేందుకు ప్రయత్నించాయి. అయితే కొత్త విద్యుత్ చార్జీలను ఆమోదించిన తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (టీఎస్ఈఆర్సీ) వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని భారీగా నియంత్రించింది. డిస్కంలు కోరినంతగా అవసరం లేదని ఏకంగా 20 శాతం మేరకు కత్తిరించింది. డిస్కంల అంచనాలను తప్పుబట్టింది. 2015-16 ఆర్థిక సంవత్సరంలో వ్యవసాయానికి 13,431 మిలియన్ యూనిట్లు అవసరమవుతాయన్న అంచనాలతో తెలంగాణ డిస్కంలు ప్రతిపాదనలు సమర్పించగా కేవలం 10,650 మిలియన్ యూనిట్లు సరిపోతాయని ఈఆర్సీ కత్తెర వేయటంతో ఈ విషయం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఇబ్బడిముబ్బడిగా అంచనాలు హైదరాబాద్ కేంద్రంగా ఉన్న తెలంగాణ సదరన్ డిస్కం వ్యవసాయానికి ఇచ్చే ఉచిత విద్యుత్‌ను అధికంగా చూపిందన్న అభిప్రాయాలున్నాయి. రాష్ట్ర విభజనకు ముందు కర్నూలు, అనంతపురం జిల్లాలు కలిసి ఉన్నప్పుడు... 2013-14లో వ్యవసాయానికి 6,694.29 మిలియన్ యూనిట్లు వినియోగించినట్లు లెక్కలున్నాయి. ఆ రెండు జిల్లాలు మినహాయిస్తే ఈ వినియోగం కొంత మేరకైనా తగ్గుముఖం పట్టాల్సింది. కానీ 2014-15లో 7,238.26 మిలి యన్ యూనిట్లు, 2015-16లో 7,529.19 మిలియన్ యూనిట్లు వ్యవసాయానికి అవసరమని సదరన్ డిస్కం అంచనా వేసింది. రాజధాని చుట్టూరా ఉన్న రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, మెదక్ జిల్లాల్లో అర్బన్ ప్రాంతమే ఎక్కువగా ఉంది. దీంతో వ్యవసాయ విద్యుత్ అవసరం అంత భారీగా పెరగదని ఈఆర్సీ గుర్తించింది. అందుకే ఎస్పీడీసీఎల్కు 6,350 మిలియన్ యూనిట్ల మేరకు వ్యవసాయ కేటగిరీకింద సరిపోతుం దని నియంత్రించింది. వరంగల్ కేంద్రంగా ఉన్న ఎన్పీడీసీఎల్ ప్రస్తుత సంవత్సరంలో 4,715.21 మిలియన్ యూనిట్ల విద్యుత్, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 4,903.82 మిలియన్ యూనిట్లు అవసరమని అంచనా వేసింది. కానీ ఈఆర్సీ 4,300 మిలియన్ యూనిట్లకు సర్దుబాటు చేసింది. వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఏటా పెరిగిపోతున్నాయని.. అందుకే ఉచిత విద్యుత్ వాడకం పెరిగిపోతుందనేది డిస్కంల వాదన. గతంలో ఈఆర్సీ నిర్ధారించినదాని కంటే ఎక్కువ విద్యుత్‌ను ఉచిత కేటగిరీకి సరఫరా చేసినట్లుగా డిస్కంలు తమ నివేదికల్లో స్పష్టం చేశాయి. వ్యవసాయానికి మీటర్లు లేకపోవటం, ఎంత విద్యుత్ సరఫరా అయిందో పక్కాగా లెక్కతేల్చే వ్యవస్థ లేకపోవటంతో ఈ వాదనకు బలం లేకుండా పోతోంది. పంపిణీ, సరఫరా నష్టాలు, భారీ విద్యుత్ చౌర్యంతో వచ్చే నష్టాలను పూడ్చుకునేందుకు.. డిస్కంలు ఉచిత విద్యుత్ కోటాలో ఎక్కువ విద్యుత్ వినియోగాన్ని చూపిస్తున్నాయనే విమర్శలున్నాయి. అందుకు భిన్నంగా ఉచిత విద్యుత్... నష్టాలు తెచ్చిపెడుతోందని.. ప్రభుత్వం సరిపడేంత సబ్సిడీ ఇవ్వకపోవటంతో ఆర్థికంగా భారంగా మారుతోందనేది డిస్కంల వాదన. టీ సర్కార్ తొలి ఏడాది నెలకు రూ. 300 కోట్ల చొప్పున ఉచిత విద్యుత్‌కు రూ.3,600 కోట్ల సబ్సిడీ విడుదల చేసింది. వ్యవసాయ విద్యుత్ డిమాండ్‌కు ఈఆర్సీ భారీ మొత్తంలోనే కత్తెర వేసినా వచ్చే ఆర్థిక సంవత్సరంలో సర్కారు రూ. 4,427 కోట్ల సబ్సిడీ ఇచ్చేందుకు అంగీకరించటం డిస్కంలకు ఊరటనిచ్చినట్లయింది. కాగ్ చెప్పింది కూడా ఇదే.. ఉచిత విద్యుత్ సరఫరాకు మీటర్లను అమర్చటం అత్యంత అవసరమని.. ఇటీవల కంప్ట్రోలర్ అండ్ అడిటర్ జనరల్ (కాగ్) నివేదిక కూడా వేలెత్తి చూపింది. విద్యుత్ వినియోగంలో తప్పుడు అంచనాలు డిస్కం లకు నష్టాలు తెచ్చి పెడుతున్నాయని అభిప్రాయపడింది. ‘2004-05లో వ్యవసాయ విద్యుత్ వినియోగాన్ని అంచనా వేసేందుకు మీటర్లను అమర్చాలని ఏపీఈఆర్సీ సూచిం చింది. కానీ.. డిస్కంలు ఆ విధానాన్ని అమలు చేయలేదు. 2010 నుంచి 2014 వరకు ఉచిత విద్యుత్ వినియోగం ఆమోదిం చినదాని కంటే 4,986.93 మిలియన్ యూనిట్లు మించిపోయి రూ.1,861.44 కోట్ల అధిక వ్యయమైంది. ఈఆర్సీ ఆమోదించిన పరిమితికి లోబడి ఉచిత విద్యుత్ నియంత్రణకు డిస్కంలు ఏ చర్యలూ తీసుకోలేదు. డిస్కంలకు ప్రభుత్వం రాయితీలు ఇవ్వటం ఆలస్యం కావటంతో రూ.76.83 కోట్ల వడ్డీ నష్టం వాటిల్లింది’ అని పేర్కొంది. -
మామూళ్లతో లాలూచీ పడుతున్న అధికారులు
చీరాల, న్యూస్‌లైన్: చేనేత కార్మిక సహకార సంఘాలు నిలువు దోపిడీకి పాల్పడుతున్నాయి. కార్మికుల పేరు చెప్పుకొని సంఘ పెద్దలు నిధులన్నీ బొక్కేస్తున్నారు. సొసైటీలో సభ్యులుగా ఉండే కార్మికులకు మాత్రం చివరకు అప్పులు, పస్తులే మిగులుతున్నాయి. కార్మికులంతా కలిసి ఓ సంఘంగా ఏర్పడి, ఆ సంఘంలోనే వస్త్రాలు ఉత్పత్తి చేసి ఆప్కో ద్వారా వాటిని విక్రయించి వచ్చిన లాభాలతో జీవనం సాగించాల్సి ఉంటుంది. అలానే ఆ సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీ రుణాలతో పాటు తక్కువ ధరకే నూలు, ఆప్కో సబ్సిడీతో పాటు అనేక రాయితీలు కల్పిస్తుంది. ఈ సంఘంలో పనిచేసే కార్మికులంతా ఐక్యంగా ఉండి వచ్చిన ఫలాలను సమానంగా పంచుకోవాలి. సహకార బ్యాంకుల ద్వారా కోట్లాది రూపాయలు పావలా వడ్డీ కింద రుణాలు తీసుకుంటున్నారు. అలానే ఎలాంటి వస్త్రాలు నేయకుండానే ఆప్కో ద్వారా అమ్మినట్లు రికార్డుల్లో చూపి అందులో వచ్చే 40 శాతం సబ్సిడీని కూడా మింగేస్తున్నారు. కానీ కనీసం పది మంది కార్మికులకు కూడా పని చూపుతున్న సంఘాలు లేవు. జిల్లాలో మొత్తం 74 చేనేత సొసైటీలుండగా వీటిలో 38 వేల మంది సభ్యులున్నారు. కోఆపరేటివ్ స్కీంలో 15 వేల మంది, బునకర్ బీమా యోజనలో 7 వేల మంది, ఇతర పథకాల్లో 16 వేల మంది సభ్యులుగా ఉన్నారు. చేనేత సొసైటీలు చీరాల నియోజకవర్గంలో 30, కనిగిరి నియోజకవర్గంలో 10, ఒంగోలు డివిజన్లో 10, బేస్తవారిపేటలో 10, ఉలవపాడులో 2, మార్టూరులో 3 సొసైటీలున్నాయి. ఈ 74 చేనేత సొసైటీల్లో క్యాష్ క్రెడిట్ కింద నాబార్డు నుంచి కేవలం 23 సొసైటీలకు * 2.8 కోట్లు మాత్రమే నిధులు విడుదల చేశారు. మిగిలిన 51 సొసైటీలకు చిల్లిగవ్వ కూడా కేటాయించలేదు. పొందుతున్న రాయితీలివే.. సొసైటీల మాటున సహకార బ్యాంకుల ద్వారా ఒక్కో సొసైటీ లక్ష నుంచి * 40 లక్షల వరకు రుణాలు పొందాయి. అలానే సహకార సంఘాల్లో ఎలాంటి వస్త్రాలు ఉత్పత్తి చేయకుండానే ఆప్కోలోని అధికారులతో కుమ్మక్కై ఉత్పత్తులు ఆప్కోకు విక్రయించినట్లు సొసైటీ నిర్వాహకులు రికార్డుల్లో చూపుతారు. దీని ద్వారా ఆప్కో 30 నుంచి 40 శాతం సబ్సిడీ రూపంలో సహకార సంఘాలకు అందిస్తుంది. అంటే లక్ష రూపాయల విలువైన వస్త్రాలను అమ్మితే * 40 వేలు సబ్సిడీ కింద సహకార సంఘానికి అందుతుంది. అలానే నేషనల్ కోఆపరేటివ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ నుంచి కూడా నామమాత్రపు వడ్డీలకు ఈ సొసైటీలకు భారీగా రుణాలందుతున్నాయి. ఎన్‌హెచ్‌డీసీ ద్వారా సబ్సిడీ నిధులు అందుతున్నాయి. అలానే ట్రైనింగ్‌లు, ఎగ్జిబిషన్ల పేరుతో సహకార సంఘాలకు నిధులు మంజూరవుతున్నాయి. ఇవన్నీ కార్మికులందరికీ సమానంగా రావాల్సి ఉంటే సొసైటీ పెద్దలు గద్దలుగా మారి ఈ నిధులన్నీ నిలువు దోపిడీ చేస్తున్నారు. ఉపాధి కోల్పోతున్న నేతన్నలు.. సహకార సంఘాల్లో ఉన్న చేనేత కార్మికులకు పనులు కల్పించాల్సిన సొసైటీలు నామమాత్రంగా కూడా కార్మికులకు పనులు కల్పించడం లేదు. పనులు కల్పించే నాథుడే లేక కార్మికుడు వేరే పనులపై ఆధారపడుతున్నాడు. నేతన్నలు బడాబాబుల మోసానికి గురవుతూ అర్ధాకలితో, అప్పుల ఊబిలో అలమటిస్తున్నారు. నిధులు మింగేందుకు పుట్టుకొచ్చిన కొత్త సొసైటీలు... సొసైటీలు లాభసాటి వ్యాపారంగా మారడంతో కేంద్ర, రాష్ట్రాల నుంచి నిధులు, రాయితీలను మింగేందుకు నూతనంగా మరికొన్ని సొసైటీలు ప్రవేశించాయి. కొత్తగా ఏడు సొసైటీలు జిల్లాలో ఏర్పడ్డాయి. చేనేత కార్మికుల బలహీనతను కొంత మంది సొసైటీ పెద్దలు అవకాశంగా తీసుకొని కోట్లకు పడగలెత్తుతున్నారు. కార్మికుల పేరుతో రుణాలు తీసుకొని వారు సకల భోగాలు అనుభవిస్తుంటే కార్మికులు మాత్రం కష్టాల పాలవుతున్నారు. అడ్డుకట్ట వేయాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే మామూళ్లకు కక్కుర్తిపడి వాటి వైపు కన్నెత్తి చూడటమే మరిచారు. అధికారుల లాలూచీతోనే అక్రమాలు.. చేనేత సొసైటీల అక్రమాలు ప్రధానంగా అధికారుల కన్నుసన్నల్లోనే జరుగుతున్నాయి. సొసైటీలు సక్రమంగా జరుగుతున్నాయా లేదా అనేది పరిశీలించాల్సిన అధికారులు సొసైటీ పెద్దలిచ్చే కాసులకు కక్కుర్తిపడి అటు వైపు చూడటం లేదు. రికార్డులపైనే నడుస్తున్న సొసైటీల గురించి పక్కా సమాచారం ఉన్నప్పటికీ వాటిపై చర్యలు తీసుకోవడం లేదు. చాలా సొసైటీల్లో పది మంది సభ్యులు కూడా లేకపోయినా సంబంధిత అధికారులు మాత్రం పట్టీపట్టనట్లుగా వ్యవహరించడం దారుణం.