న్యూఢిల్లీ: దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని, వాడకాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్–2 స్కీమ్ నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలపై చట్టపరమైన చర్యలకు కూడా కేంద్రం సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా, పథకం కింద పొందిన రూ. 469 కోట్ల పైచిలుకు సబ్సిడీ ప్రోత్సా హకాలను తిరిగి చెల్లించాలంటూ ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల తయారీ సంస్థలకు నోటీసులు ఇచ్చింది.
హీరో ఎలక్ట్రిక్, ఒకినావా ఆటోటెక్, యాంపియర్ ఈవీ, రివోల్ట్ మోటార్స్, బెన్‌లింగ్ ఇండియా, ఎమో మొబిలిటీ, లోహియా ఆటో ఈ జాబితాలో ఉన్నట్లు సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వీటిలో రివోల్ట్ మోటార్స్ మాత్రమే ప్రోత్సాహకాలను తిరిగి చెల్లించేందుకు ముందుకు వచి్చనట్లు వివరించారు. మిగతా సంస్థలు ఇంకా స్పందించలేదని పేర్కొన్నారు. రీఫండ్‌కు డెడ్‌లైన్ దాదాపు ముగిసిపోతోందని చెప్పారు. ‘వచ్చే వారం కేంద్రం కొన్ని నిర్ణయాలు తీసుకునే అవకాశం
ఉంది. చట్టపరమైన చర్యలకు గల అవకాశాలను పరిశీలిస్తున్నాం’ అని అధికారి వివరించారు.
ఉల్లంఘనలు ఇలా..
ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేసేలా రూ. 10,000 కోట్ల ప్రోత్సాహకాలతో కేంద్రం 2019లో ఫేమ్–2 పథకాన్ని ఆవిష్కరించింది. ఇది 2015లో రూ. 895 కోట్లతో ప్రకటించిన తొలి ఫేమ్ వెర్షన్‌కు కొనసాగింపు. ఫేమ్–2 పథకం నిబంధనల ప్రకారం .. దేశీయంగా తయారైన పరికరాలతో ఎలక్ట్రిక్ వాహనాలను ఉత్పత్తి చేసిన కంపెనీలకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. అయితే, పలు కంపెనీలు వీటిని ఉల్లంఘిస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో ఈ స్కీముతో ప్రయోజనం పొందిన కంపెనీలపై భారీ పరిశ్రమల శాఖ విచారణ జరిపింది.
వీటిలో ఏడు సంస్థలు నిబంధనలకు విరుద్ధంగా దిగుమతి చేసుకున్న పరికరాలను ఉపయోగించినట్లుగా వెల్లడైంది. దీంతో గత ఆర్థిక సంవత్సరం సబ్సిడీలను విడుదల చేయడంలో కేంద్రం ఆలస్యం చేసింది. ఫలితంగా అటు సబ్సిడీ బకాయిలు చిక్కుబడిపోయి, ఇటు మార్కెట్ వాటా కోల్పోయి ఎలక్ట్రిక్ వాహన సంస్థలు దాదాపు రూ. 9,000 కోట్లు నష్టపోయినట్లు విద్యుత్ వాహనాల తయారీ సంస్థల సమాఖ్య ఎస్‌ఎంఈవీ అంచనా వేసింది. కొనుగోళ్లపై పొందిన రిబేట్లను తిరిగి చెల్లించేలా కస్టమర్లకు సూచించే అవకాశాలను పరిశీలించాలంటూ సబ్సిడీలపరమైన మద్దతు కోల్పోయిన ఏడు ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల కంపెనీలు కేంద్రాన్ని కోరాయి.
Comments
Please login to add a commentAdd a comment