న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు.
మరోవైపు మధ్యంతర బడ్జెట్‌లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్‌టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు.
సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్‌లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది.
ఆటోమొబైల్‌కు పీఎల్‌ఐ బూస్ట్ ..
వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్‌ఐ) స్కీము కింద బడ్జెట్‌లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్‌డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు.
ఈవీల షేర్లు అప్ ..
బడ్జెట్‌లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్‌ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల
గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment