Compressed Natural Gas
-
Interim Budget 2024: ఎలక్ట్రిక్.. ఇక ఫుల్ చార్జ్!
న్యూఢిల్లీ: చార్జింగ్, తయారీ మౌలిక సదుపాయాల కల్పన ద్వారా ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థను బలోపేతం చేయడంపై ప్రభుత్వం దృష్టి పెట్టనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రజా రవాణా వ్యవస్థలో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించనున్నట్లు వివరించారు. రవాణా కోసం ఉపయోగించే సీఎన్‌జీలోనూ, పైపుల ద్వారా సరఫరా చేసే సహజ వాయువులోను కంప్రెస్డ్ బయోగ్యాస్‌ను కలపడం తప్పనిసరని ఆమె పేర్కొన్నారు. మరోవైపు మధ్యంతర బడ్జెట్లో చర్యలను స్వాగతించిన క్వాంటమ్ ఎనర్జీ ఎండీ సి. చక్రవర్తి .. కొన్ని ఆకాంక్షలు మాత్రం నెరవేరలేదని పేర్కొన్నారు. 2024 మార్చితో ముగిసిపోనున్న ఫేమ్ 2 సబ్సిడీ ప్రోగ్రామ్‌ను పొడిగిస్తారని ఆశలు నెలకొన్నప్పటికీ ఆ దిశగా ప్రతిపాదనలు లేవని ఆయన తెలిపారు. గడువు పొడిగించి ఉంటే ఎలక్ట్రిక్ వాహనాల పరిశ్రమకు గట్టి మద్దతు లభించి ఉండేదన్నారు. అలాగే లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్‌లు, సెల్స్‌పై జీఎస్టీని 18 శాతం నుంచి 5 శాతానికి తగ్గించి ఉంటే ఈవీల ధరలు మరింత అందుబాటు స్థాయిలోకి వచ్చేందుకు ఆస్కారం లభించేందని చక్రవర్తి తెలిపారు. సోలార్ రూఫ్‌టాప్ స్కీములు.. స్వచ్ఛ విద్యుత్ లక్ష్యాల సాధనకు తోడ్పడగలవని సీఫండ్ సహ వ్యవస్థాపకుడు మయూరేష్ రౌత్ తెలిపారు. మరోవైపు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీముకు కేటాయింపులను బడ్జెట్లో కేంద్రం రూ. 2,671 కోట్లుగా ప్రతిపాదించారు. 2023–24 ఆర్థిక సంవత్సరానికి గాను సవరించిన అంచనాల (రూ. 4,807 కోట్లు) కన్నా ఇది 44 శాతం తక్కువ. ప్రస్తుతమున్న ఫేమ్ 2 ప్లాన్‌ను మరోసారి పొడిగిస్తారా లేదా అనే దానిపై స్పష్టత లేని పరిస్థితుల్లో ఇది ప్రాధాన్యం సంతరించుకుంది. ఆటోమొబైల్‌కు పీఎల్ఐ బూస్ట్ .. వాహన పరిశ్రమకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం (పీఎల్ఐ) స్కీము కింద బడ్జెట్లో కేటాయింపులను కేంద్రం ఏకంగా 7 రెట్లు పెంచి రూ. 3,500 కోట్లుగా ప్రతిపాదించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సవరించిన అంచనా ప్రకారం ఇది రూ. 484 కోట్లు. కాగా, అడ్వాన్స్డ్ కెమిస్ట్రీ సెల్, బ్యాటరీ స్టోరేజీకి కేటాయింపులను రూ. 12 కోట్ల నుంచి రూ. 250 కోట్లకు పెంచారు. ఈవీల షేర్లు అప్ .. బడ్జెట్లో సానుకూల ప్రతిపాదనల నేపథ్యంలో ఎలక్ట్రిక్ వాహనాల సంస్థల షేర్లు పెరిగాయి. బీఎస్ఈలో జేబీఎం ఆటో 2.48 శాతం పెరిగి రూ. 1,963 వద్ద, గ్రీవ్స్ కాటన్ సుమారు 1 శాతం పెరిగి రూ. 165 వద్ద ముగిశాయి. ఒలెక్ట్రా గ్రీన్‌టెక్ మాత్రం లాభాల స్వీకరణతో 0.69 శాతం క్షీణించి రూ. 1,729 వద్ద ముగిసింది. అయితే, ఒక దశలో 6 శాతం ఎగిసి 52 వారాల గరిష్టమైన రూ. 1,849 స్థాయిని తాకింది. -
Reliance AGM 2023: జియో ఎయిర్‌ఫైబర్ వచ్చేస్తోంది..
ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది. రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు. ఏజీఎంలో మరిన్ని విశేషాలు.. ఎయిర్‌ఫైబర్‌తో వైర్లెస్ బ్రాడ్‌బ్యాండ్.. సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు. ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు. రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు. సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు.. 2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. బీమాలోకి జేఎఫ్ఎస్... జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది. టాప్ 4లో రిటైల్.. పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది. మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు. వారసత్వ ప్రణాళికలు.. ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు. అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది. – ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్ -
CNG Price: సీఎన్జీ వినియోగదారులకు చేదు వార్త
సాక్షి, హైదరాబాద్: కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర మళ్లీ పెరిగింది. కిలోపై రూ. 2 పెరగడంతో హైదరాబాద్‌లో దీని ధర రూ.92కు చేరింది. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ వైపు వాహనదారులు మొగ్గు చూపుతుండగా తాజాగా సీఎన్జీ ధర కూడా అదే స్థాయికి ఎగబాగుతోంది. మరోవైపు పెట్రోల్ బంకులో కిలో ధరపై అదనంగా రూ.5 నుంచి రూ.10 బాదేస్తున్నాయి. కాలుష్య రహితంతో పాటు మైలేజీ అధికంగా వస్తుందన్న కారణంతో సీఎన్జీ వినియోగం వైపు వెళితే.. పెరిగిన ధరలతో మళ్లీ వెనక్కి వెళ్లని పరిస్థితి నెలకొంది. వాస్తవంగా పెట్రోల్, డీజిల్ కంటే సీఎన్జీ, గ్యాస్‌తో నడిచే వాహనాలు మైలేజీ అధికంగా ఇస్తాయి. పెట్రోల్, డీజిల్ లీటర్‌కు 15 నుంచి 20 కిలో మీటర్ల వరకు మైలేజీ ఇస్తే సీఎన్జీ, ఆటో గ్యాస్, ఎల్పీజీ కిలోకు 22 నుంచి 28 కిలో మీటర్ల వరకు మైలేజీ వస్తుందని అంచనా. ప్రయాణికులను చేరేవేసే ఆటోలు, ఇతర వాహనదారులు తమ ట్యాంకులను ఎక్కువ శాతం సీఎన్జీకి బదిలీ చేసుకున్నాయి. మరోవైపు ఇంధన కొరత మహానగరంలో సీఎన్జీ కొరత ఏర్పడింది. పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలను తట్టుకోలేక సీఎన్జీ గ్యాస్ కిట్లు అమర్చుకున్న వాహనాలకు కొరత వెంటాడుతోంది. గత ఆరు నెలలలో వాహనాల సంఖ్య ఎగబాగడంతో సీఎన్జీ బంకులకు సరఫరా అవుతున్న గ్యాస్ ఏ మూలకు సరిపోని పరిస్థితి నెలకొంది. బంకుల్లో లోడ్ నింపిన నాలుగైదు గంటల్లోనే గ్యాస్ నిండుకుంటోంది. ఫలితంగా వాహనదారులు సీఎన్జీ కోసం క్యూ కడుతున్నారు. (క్లిక్ చేయండి: అత్యంత విలువైన రైల్వే భూముల్లో రియల్ దందా) -
సీఎన్జీ వాహనాలకు డిమాండ్..
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ రేట్లు ఆకాశాన్ని తాకుతుండటంతో వాహనదారులు ఇతర ప్రత్యామ్నాయ వాహనాల వైపు చూస్తున్నారు. దీంతో, వాటితో పోలిస్తే చౌక ఇంధనమైన సీఎన్జీతో (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) నడిచే వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. దేశీ ఆటోమొబైల్ దిగ్గజం మారుతీ సుజుకీ మొత్తం విక్రయాల్లో సీఎన్జీ వాహనాల వాటా దాదాపు అయిదో వంతుకు చేరింది. సరఫరాపరమైన సమస్యలు లేకపోతే ఈ ఆర్థిక సంవత్సరంలో డీజిల్ వాహన విక్రయాల గరిష్ట స్థాయిని (4,74,953) సీఎన్జీ విభాగం దాటేస్తుందన్న అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం 1,30,000 పైచిలుకు సీఎన్జీ వాహనాల ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నాయి. అత్యధికంగా ఎర్టిగా మోడల్ కోసం 8–9 నెలల పైగా వెయిటింగ్ పీరియడ్ ఉంటోందని సంస్థ వర్గాలు తెలిపాయి. మరోవైపు, కొరియన్ ఆటోమొబైల్ దిగ్గజం హ్యుందాయ్ అమ్మకాల్లో కూడా ఇదే ధోరణి నెలకొంది. ఈ ఏడాది సగటున నెలవారీగా చూస్తే సీఎన్జీ వాహనాల అమ్మకాలు 58 శాతం పెరిగాయి. రాబోయే నెలల్లోనూ ఇదే తీరు కొనసాగవచ్చని సంస్థ ఆశిస్తోంది. గతేడాది మొత్తం మీద 37,584 సీఎన్జీ వాహనాలను అమ్మిన హ్యుందాయ్ ఈ ఏడాది తొలి అయిదు నెలల్లో ఇప్పటికే 24,730 పైగా సీఎన్జీ వాహనాలను విక్రయించింది. మూడు దిగ్గజాలు.. గతేడాది ఆగస్టులో జరిగిన భారతీయ ఆటోమొబైల్ తయారీ సంస్థల సమాఖ్య సియామ్ 61వ వార్షిక సదస్సు సందర్భంగా.. డీజిల్ వాహనాలను తగ్గించి, ప్రత్యామ్నాయ ఇంధనాల వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడంపై దృష్టి పెట్టాలని పరిశ్రమకు కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితన్ గడ్కరీ సూచించారు. తద్వారా ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవచ్చని పేర్కొన్నారు. తదనుగుణంగానే దేశీ ఆటొమొబైల్ సంస్థలు తమ వంతు కసరత్తు చేస్తున్నాయి. ప్రస్తుతం మారుతీ సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ కలిసి సీఎన్జీకి సంబంధించి 14 వాహనాలను అందిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో పరిశ్రమవ్యాప్తంగా సీఎన్జీ వాహన విక్రయాలు 2,61,000 యూనిట్లుగా నమోదయ్యాయి. టాటా మోటర్స్ ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ విభాగంలోకి ప్రవేశించింది. ఇప్పటికే టిగోర్, టియాగో వాహనాలకు సంబంధించి ఈ వేరియంట్ అమ్మకాలు 52 శాతానికి చేరినట్లు సంస్థ వర్గాలు తెలిపాయి. తమ మొత్తం పోర్ట్‌ఫోలియోలో సీఎన్జీ వాహన శ్రేణి వాటా 10 శాతం దాకా ఉంటుందని వివరించాయి. నిర్వహణ వ్యయాలు తక్కువ.. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌తో నడిచే వాహనాలతో పోలిస్తే సీఎన్జీ వాహనాలను నడిపే వ్యయాలు తక్కువగా ఉంటున్నాయి. ద్రవ ఇంధనాలతో నడిచే వాహనాలకు సంబంధించిన ఖర్చు ప్రతి కిలోమీటరుకు రూ. 5.30–5.45గా ఉంటోంది. అదే సీఎన్జీ వాహనాల వ్యయం అందులో సగానికన్నా తక్కువగా ప్రతి కిలోమీటరుకు రూ. 2.1–2.2 స్థాయిలో ఉంటోంది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులు కూడా ఇంధన భారాన్ని తగ్గించుకునే దిశగా సీఎన్జీ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో సీఎన్జీ డిస్ట్రిబ్యూషన్ అవుట్లెట్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. 3–4 ఏళ్ల క్రితం 1,400 అవుట్లెట్లు ఉండగా ప్రస్తుతం 3,700కు చేరిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. -
పెట్రో, డీజిల్ ధరల పెరుగుదల: సీఎన్జీపై బాదుడు
సాక్షి, హైదరాబాద్: పెట్రో, డీజిల్ ధరల పెరుగుదలతో నింపే కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరపై అనధికార బాదుడు ప్రారంభమైంది. కాలుష్య రహితం, మైలేజీ అధికంతో పాటు ధర తక్కువగా ఉండటంతో నేచురల్ గ్యాస్‌కు బాగా డిమాండ్ పెరుగుతోంది. నగరంలో కేజీ సీఎన్జీ ధర రూ.69 ఉండగా అదనంగా రూ.10 కలిపి బంకుల నిర్వాహకులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ధరపై నిలదీస్తే. ఇది అంతే.. అంటూ దబాయింపులకు పాల్పడుతున్నట్లు ఆటో డ్రైవర్లు ఆరోపిస్తున్నారు. స్టేషన్లకు పెరిగిన తాకిడి మహా నగర పరిధిలోని సీఎన్జీ కేంద్రాలకు తాకిడి పెరిగింది. నగరం మొత్తం సుమారు 84 ప్రత్యేక సీఎన్జీ కేంద్రాలు ఉండగా, దాదాపు 42,705 సీఎన్జీ వాహనాలు ఉన్నట్లు అధికార గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తాజాగా రోజువారీ సవరణలతో పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో గ్యాస్ వినియోగం అధికమైంది. దీంతో కార్లు, ఆ వాహనదారులకు సీఎన్జీపై ఆసక్తి పెరిగింది. చదవండి: బంజారాహిల్స్: డబ్బు తీసుకురాకపోతే చంపేస్తా... ఇప్పటికే కొందరు అధికారికంగా అనుమతి తీసుకొని వాహనాల ట్యాంకులు గ్యాస్‌కు అనుగుణంగా మార్చుకుంటుండగా.. మరికొందరు అనధికారికంగానే వినియోగిస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. దీంతో సీఎన్జీ వినియోగం విపరితంగా పెరిగింది. మార్కెట్లో పెట్రోల్, డీజిల్ బంకులతో పాటు ఆటో గ్యాస్, లిక్విడ్ గ్యాస్ కేంద్రాలు ఉన్నప్పటికీ.. అధిక మైలేజీ ఫలితంగా సీఎన్జీపైనే వాహనాలదారులు మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. సాధారణంగా గ్యాస్ స్టేషన్లకు ప్రతిరోజు 5000 ఆటోలు, 1000 వరకు కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలు, కాగా నాలుగు కిలలో వరకు, కార్ల సామర్థ్యం పది కిలోలకుగాను ఎనిమిది కిలోల వరకు గ్యాస్ నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుందన్నది అంచనా. డిమాండ్‌కు సరిపడా సీఎన్జీ సరఫరా లేదని డీలర్లు పేర్కొంటున్నారు. -
రూ.5,000 కోట్లతో ‘మేఘా గ్యాస్’ ప్రాజెక్ట్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: మౌలిక రంగ సంస్థ మేఘా ఇంజనీరింగ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ (ఎంఈఐఎల్) ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు చకచకా సాగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో భాగంగా మేఘా గ్యాస్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో 16 జిల్లాల్లో పైపుల ద్వారా సహజ వాయువును (పీఎన్జీ) గృహాలకు, పారిశ్రామిక అవసరాలకు సరఫరా చేయనుంది. ఎల్పీజీతో పోలిస్తే పీఎన్జీ ధర 35–40 శాతం తక్కువగా ఉంటుందని కంపెనీ తెలిపింది. ఇక వాహనాల కోసం కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) స్టేషన్లను సైతం ఏర్పాటు చేస్తోంది. ప్రాజెక్టు కోసం సంస్థ రూ.5,000 కోట్లు వెచ్చించనుంది. ఇందులో ఇప్పటికే రూ.1,100 కోట్లు ఖర్చు చేసింది. 2019లో మొదలైన సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను మేఘా గ్యాస్ 2026కి పూర్తి చేయాల్సి ఉంటుంది. 2021 డిసెంబర్ నాటికి.. మేఘా గ్యాస్ 7 జియోగ్రాఫికల్ ఏరియాల్లో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ పనులను చేపట్టింది. మూడు రాష్ట్రాల్లోని 16 జిల్లాలు దీని కింద కవర్ అవుతున్నాయి. 2026 కల్లా పైపుల ద్వారా దాదాపు 11 లక్షల గృహాలకు సహజ వాయువు సరఫరా చేయాలని సంస్థ నిర్దేశించుకుంది. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, కర్ణాటకలోని బెల్గాం, తూముకూరు ఏరియాలు పూర్తి అయ్యాయి. ఈ మూడు యూనిట్స్ కింద 62,000 గృహాలకు కనెక్షన్లు ఇచ్చారు. తెలంగాణలోని నల్లగొండ యూనిట్ ఇటీవలే కార్యరూపం దాల్చింది. ఇక రంగారెడ్డి, ఖమ్మం, వరంగల్ ఏరియాలు 2021 డిసెంబరుకల్లా పూర్తి చేయాలన్నది కంపెనీ లక్ష్యం. వచ్చే ఆరేళ్లలో ఈ ఏడు యూనిట్స్‌లో మొత్తం 250 సీఎన్జీ స్టేషన్లు ఏర్పాటు కానున్నాయని ఎంఈఐఎల్ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ బిజినెస్ హెడ్ పి.వెంకటేశ్ సాక్షి బిజినెస్ బ్యూరోకు తెలిపారు. ఇందులో 25 స్టేషన్లు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రత్యక్షంగా 1,000 మంది, పరోక్షంగా 3,000 మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. -
గ్యాస్ ఇన్‌ఫ్రాలోకి పెట్టుబడులు..
న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్ఎన్జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ)తో పాటు ఎల్ఎన్జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు. ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు. చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. -
గ్యాస్ తుస్
ఐదేళ్లుగా పురో‘గతి’ లేని బీజీఎల్ పథకం చింతల్ దాటని పైప్‌లైన్ పనులు ఇప్పటికీ అందని వంటగ్యాస్ సిటీబ్యూరో: మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. ఐదేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ప్రాజెక్టు ఆచరణలో చతికిలబడింది. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలపై నత్తనడకన సాగుతున్న పైప్‌లైన్ పనులు నీళ్లు చల్లుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా కనీసం 30 శాతం పైప్‌లైన్ పనులు కూడా పూర్తి కాలేదు. నాలుగేళ్ల నుంచి పైప్లైన్ల పనుల తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఐదేళ్లక్రితం ఆర్భాటం.. సరిగ్గా ఐదేళ్ల క్రితం నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసి ఇంటింటికీ పైప్డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలని నిర్ణయించారు. అందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజేఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలో గల నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని గృహ సముదాయాల్లోని 30 ఫ్లాట్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో వెయ్యి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినా 410 కుటుంబాలకు మాత్రమే వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే పైప్‌లైన్ పనులు మాత్రం చింతల్ దాటలేదు. మరోవైపు ఇప్పటికే కనెక్షన్లు అందించిన వినియోగాదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. సీఎన్జీ కూడా అంతంతే.. మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం మందుకు సాగడం లేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 164 బస్సులకు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో 236 బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా 23 వేల వాహనాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. వాస్తవంగా ప్రతిరోజు నగరంలోని సీఎన్జీ వినియోగదారుల నుంచి 20 వేల కిలో లీటర్లకు పైగా డిమాండ్ ఉంది. కానీ, ప్రతినిత్యం 12 వేల కిలో లీటర్లకు మించి సరఫరా కావడం లేదని డీలర్లు వాపోతున్నారు. పురోగతి లేని పైప్‌లైన్ పనులు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్ల క్రితం ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రణాళిక లక్ష్యానికి తగ్గట్టు పురోగతి సాధించలేకపోయింది. ఇప్పటిదాకా శామీర్‌పేట నుంచి చింతల్ వరకు 33.55 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. తాజాగా బాలాపూర్ వరకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే సరిగ్గా మూడు కిలో మీటర్లు కూడా పూర్తికానట్టు ప్రగతి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రూ.733 కోట్లతో ప్రాజెక్టు.. మహానగరానికి ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.733 కోట్లతో ప్రణాళిక వేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని నిర్ణయించింది. కానీ కొంతకాలం గ్రిడ్ నుంచి సరైన గ్యాస్ సరఫరా లేక, ఆ తర్వాత పైప్‌లైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ రాక పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు తాజాగా పనులు ప్రారంభమయ్యాయి. -
ప్రయాణికులపై అదనపు భారం
సాక్షి, ముంబై: ముంబైకర్లపై మరోసారి చార్జీల భారం మోపేందుకు బృహన్ ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థ సన్నద్ధమవుతోంది. మహానగర పాలక సంస్థ (బీఎంసీ) ఆర్థిక సాయం అందజేయని పక్షంలో వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి చార్జీలు పెంచక తప్పదని పేర్కొంటోంది. అయితే బీఎంసీ కనుక ఆర్థిక సాయం అందజేస్తే కనీస చార్జీ రూపాయి లేదా రెండు రూపాయలమేర పెంచాలని ఇటీవల జరిగిన సమావేశంలో నిర్ణయించారు. ప్రస్తుతం కనీస చార్జీలు ఆరు రూపాయలుగా ఉంది. కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర పెరుగుదల కూడా బెస్ట్ సంస్థకు శాపంగా పరిణమించింది. నష్టాల బాటలో నడుస్తున్న బెస్ట్ సంస్థను గట్టెక్కించాలంటే చార్జీలు పెంచడం తప్ప మరో మార్గం లేదని సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. సంస్థను నష్టాల నుంచి గట్టెక్కించేందుకు సంస్థ అధికారులు అనేక ప్రయత్నాలు చేశారు. అయినప్పటికీ ఫలితం లేకపోయింది. దీనికి తోడు నవంబరు ఒకటో తేదీ నుంచి సీఎన్జీ ధర కేజీకీ రూ.4.50 చొప్పున పెరగడం ...మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా మారింది. సీఎన్జీ ధర పెరుగుదల కారణంగా ఈ సంస్థకు సంవత్సరానికి దాదాపు రూ.30.24 కోట్ల మేర నష్టం వాటిల్లుతున్నట్టు అధికారులు అంచనావేశారు. కాలుష్యానికి అడ్డుకట్టవేయాలనే ఉద్దేశంతో సంస్థ పరిపాలనా విభాగం డీజిల్ కంటే సీఎన్జీ బస్సుల కొనుగోలుకు ప్రాధాన్యమిచ్చింది. ఈ సంస్థ అధీనంలో మొత్తం 4,100 బస్సులున్నాయి. ఇందులో 2,970 బస్సులు సీఎన్జీతోనూ, మిగతావి డీజిల్‌తోనూ నడుస్తున్నాయి. సీఎన్జీ సరఫరాచేసే మహానగర్ గ్యాస్ కంపెనీ బెస్ట్‌కు ప్రతి కిలోకూ 70 పైసల మేర రాయితీ ఇస్తోంది. వాస్తవానికి సీఎన్జీ గ్యాస్ కిలో ధర రూ.38.95 ఉండగా నవంబర్ ఒకటో తేదీ నుంచి అది రూ.43.40 కి చేరుకుంది. మహానగర్ గ్యాస్ కంపెనీ 70 పైసలు రాయితీ ఇవ్వడంతో ప్రస్తుతం రూ.42.70 చొప్పున చెల్లిస్తోంది. అయినప్పటికి ధర పెరుగుదల భారం ఈ సంస్థపై పడుతోంది. ఈ నేపథ్యంలో నగరవాసులు మరోసారి చార్జీల పెరుగుదల భారాన్ని మోయక తప్పేలా కనిపించడం లేదు. -
సీఎన్జీ.. నో స్టాక్
మహా నగరానికి సీఎన్జీ (కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్) సరఫరా నిలిచి పోయింది. దీంతో నగరంలోని సుమారు 25 వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం (గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సాక్షి, హైదరాబాద్: మహా నగరానికి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) సరఫరా నిలిచిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నగర శివారులోని శామీర్పేటలోగల మదర్స్టేషన్కు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ పంపిణీ ఆగిపోయింది. ఫలితంగా మదర్ స్టేషన్‌కు సమీపంలోని నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లో 30 ఫ్లాట్లతో పాటు మేడ్చల్ మండల కేంద్రంలో సుమారు 410 కుటుంబాలకు వంటగ్యాస్(పీఎన్జీ), నగరంలోని 15 ఫిల్లింగ్ స్టేషన్లకు సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. ఇటీవల తూర్పుగోదావరి జిల్లా నగరం గ్రామంలో జరిగిన గెయిల్ పైప్‌లైన్ ఘటన ప్రభావం పైప్‌లైన్ గ్యాస్ సరఫరాపై పడినట్లయింది. ఆగిన సీఎన్జీ వాహనాలు: నగరంలోని సుమారు 25వేల సీఎన్జీ ఆటోలు, పదివేల కార్లు, 131 ఆర్టీసీ బస్సులు ఇంధనం(గ్యాస్) లేక ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. సీఎన్జీ సరఫరా లేకపోవడంతో పెట్రోల్ బంకుల్లోని స్టేషన్లను మూసివేసి నో స్టాక్ అని బోర్డులను ప్రదర్శించారు. దీంతో మంగళవారం రాత్రి పలు ఫిల్లింగ్ స్టేషన్ల వద్ద వాహనాలు కిక్కిరిసిపోయాయి. వాస్తవంగా నగరంలోని ఒక్కో స్టేషన్‌కు ప్రతి రోజూ 1000 ఆటోలు, 200 కార్ల తాకిడి ఉంటుంది. ఆటోల సీఎన్జీ కిట్స్ సామర్థ్యం నాలుగున్నర కిలోలుకాగా 4 కిలోల వరకు, కార్ల సామర్థ్యం పదికిలోలు కాగా ఎనిమిది కిలోల వరకు నింపుతారు. ఒక్కో స్టేషన్‌కు ప్రతిరోజూ 6 వేల కిలోల వరకు గ్యాస్ డిమాండ్ ఉంటుంది. అంటే సగటున ప్రతిరోజూ మొత్తం స్టేషన్లకు 90 వేల కిలోల గ్యాస్ సరఫరా అవసరం. వారం వరకు సరఫరా బంద్: గెయిల్ దుర్ఘటన దృష్ట్యా పైప్‌లైన్ పనుల మరమ్మతులకు వారం పట్టవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. దీంతో పలు సీఎన్జీ వాహనాలకు ప్రత్యాయ్నాయం లేకుండా పోయింది. ఆటోడ్రైవర్ల ఆందోళన: సీఎన్జీ గ్యాస్ సరఫరా నిలిచిపోవడంతో ఆటో్రైడె వర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్యాస్ ఆటోలను నడిపితే రాయితీలతో పాటు ఐదేళ్ల పాటు రోడ్డు పన్ను మినహాయింపు ఉంటుంది. దీంతో వేల రూపాయలు ఖర్చు చేసి సీఎన్జీ కిట్స్ అమర్చుకున్న ఆటో డ్రైవర్లు గ్యాస్ కోసం స్టేషన్ల ముందు పడిగాపులు గాస్తున్నారు. -
తడిసిమోపెడు
సాక్షి,సిటీబ్యూరో: ‘ఉన్న నాలుకకు మందేస్తే..కొండనాలుక ఊడిందన్నట్లుంది..’ గ్రేటర్ ఆర్టీసీ పరిస్థితి. నగరంలో కాలుష్యాన్ని తగ్గించడంతోపాటు వ్యయం తగ్గించుకోవాలని కొన్నాళ్ల కిందట ప్రవేశపెట్టిన కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) బస్సులు ప్రస్తుతం సంస్థకు భారంగా మారాయి. అసలే నష్టాల్లో ఉన్న ఆర్టీసీకి ఈ బస్సులు పెద్దగుదిబండగా మారాయని నూటికి నూరుపాళ్లు చెప్పొచ్చు. దీంతో అధికారులు ఇప్పుడున్న బస్సులకంటే ఒక్క బస్సును కూడా కొత్తగా ప్రవేశపెట్టేందుకు జంకుతున్నారు. ప్రస్తుతం నగరంలో 110 సీఎన్జీ బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో బస్సుకు ప్రతిరోజు 80 కిలోల గ్యాస్‌ను వినియోగిస్తున్నారు. ఈ మేరకు రోజుకు 8800 కిలోల సీఎన్జీని బీజీఎల్ (భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్) నుంచి ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ప్రస్తుత సీఎన్జీ ధరల ప్రకారం ప్రతిరోజు ఈ ఇంధనం కోసం ఆర్టీసీ రూ.4,84,000 వెచ్చిస్తోంది. ప్రస్తుతం కిలో సీఎన్జీ రూ.55కు లభిస్తుండగా,లీటర్ డీజిల్ రూ.58.60కి లభిస్తోంది. ఈ రెండింటి మధ్య కేవలం 3.60 వ్యత్యాసం ఉండడం,పైగా డీజిల్ కంటే సీఎన్జీ ఇంధన వినియోగం అత్యధికంగా ఉండడం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకొని సీఎన్జీ బస్సుల పెంపును ఆర్టీసీ ఉపసంహరించుకుంది. డీజిల్ బస్సులను కూడా సీఎన్జీలోకి మార్చడం కూడా బాగా ఖర్చుతో కూడుకున్న పనికావడం గమనార్హం. ఒక లీటర్ డీజిల్ వల్ల మెట్రో బస్సులు 4కిలోమీటర్లు, ఆర్డినరీ బస్సులు 5 కి.మీ మైలేజీ వస్తుంటే...అదే సీఎన్జీ బస్సులు 3 కిలోమీటర్లకు మించి పరుగులు తీయలేకపోతున్నాయి. భారం భారీగా..: గ్రేటర్లో ఆర్డినరీ బస్సులకు మాత్రమే సీఎన్జీని వినియోగిస్తున్నారు. ఒక బస్సు ప్రతిరోజు 240 కి.మీ దూరం వెళ్లాలంటే ప్రతి 3 కిలోమీటర్లకు ఒకకిలో చొప్పున 80 కిలోల సీఎన్జీ అవసరం. ఇందుకోసం రూ.4,400 ఖర్చవుతోంది. ఒక ఆర్డినరీ బస్సు ఒక లీటర్ డీజిల్‌కు 5 కిలోమీటర్ల చొప్పున కేవలం 50 లీటర్లకే 250 కిలోమీటర్లు పయనిస్తుంది. ప్రస్తుతం లీటర్ డీజిల్ ధర (రూ.58.60) ప్రకారం 250 కిలోమీటర్ల దూరానికి రూ.2930 ఖర్చవుతుంది. ఇది సీఎన్జీ వినియోగం వల్ల వచ్చే ఖర్చు కంటే తక్కువ. 110 డీజిల్ బస్సుల నిర్వహణకు రోజుకయ్యే ఖర్చు రూ.3,22,300. సీఎన్జీ బస్సుల కంటే (రూ.4,84,000) తక్కువ. ఈ లెక్కన డీజిల్ కంటే సీఎన్జీ భారమే ఆర్టీసీపై ఎక్కువగా ఉందని, ఏటా ఇందుకోసం రూ.కోట్లు వెచ్చించాల్సి వస్తోందని అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఒక్కటి కూడా పెంచేది లేదు.. : సీఎన్జీ బస్సులు ఆర్థికంగా భారమవుతున్న నేపథ్యంలో ఇప్పుడున్న బస్సులకంటే ఒక్క బస్సును కూడా పెంచేది లేదని అధికారులు చెబుతున్నారు. దీంతో రోజురోజుకు భయానకమవుతున్న వాహన కాలుష్యం దృష్ట్యా అన్నిరకాల వాహనాలు సీఎన్జీ వినియోగంలోకి మారాలని, ఆర్టీసీ వెంటనే ఆమార్పును చేపట్టాలని డాక్టర్ భూరేలాల్ కమిటీ గతంలో చేసిన సిఫార్సులు ప్రహసంగానే మిగిలాయని చెప్పొచ్చు. అరకొర సరఫరా: మేడ్చల్,కంటోన్మెంట్,హకీంపేట డిపోల్లో మొదట 350 బస్సుల ను సీఎన్జీలోకి మార్చి ఆ తర్వాత గ్యాస్ సరఫరా పెరిగే కొద్దీ దశలవారీగా అన్ని బస్సులను సీఎన్జీ వినియోగంలోకి తేవాలని అధికారులు భావించారు. ఈ మేరకు ఈ మూడు డిపోల్లో గ్యాస్ నిల్వకోసం ట్యాంకులు (డాటర్ స్టేషన్స్) నిర్మించారు. కానీ ఆశించిన స్థాయిలో సరఫరా లేకపోవడంతో 110 బస్సులకే పరిమితమైంది. ప్రస్తుతం ఈ బస్సులకు కూడా సిలిండర్ల ద్వారా భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సరఫరా చేస్తోంది. -
తక్ష ణమే తగ్గించండి
సాక్షి, న్యూఢిల్లీ : సీఎన్జీ (కంప్రెస్డ్ న్యాచురల్ గ్యాస్), పీఎన్జీ (పైపుడ్ న్యాచురల్‌గ్యాస్) ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ ఢిల్లీప్రదేశ్ నాయకులు హెచ్చరించారు. సీఎన్జీ, పీఎన్జీల ధరలు పెంచుతూ ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న 15 ఏళ్లలో నగరంలో సీఎన్జీ ధరలు 250, ఎల్పీజీ గ్యాస్ ధరలు 300 శాతం వరకు పెరిగాయని ఆ పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాజా పెంపు నిర్ణయం నగరంలోని 3.5 లక్షల కుటుంబాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.‘ఈ పెంపు నిర్ణయం బస్సులు, ఆటోరిక్షాలు,ట్యాక్సీలు, ప్రైవేటు వాహనదారులపై ప్రభావం చూపుతుంది. ఇందువల్ల అన్ని వస్తువుల ధరలు చుక్కలనంటడం ఖాయం. సామాన్యుడి ఇబ్బందులు అర్ధం చేసుకునే స్థితిలోనూ కాంగ్రెస్ నాయకులు లేరు’ అని గోయల్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా నగరంలోని సామాన్యులు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, సీఎన్జీ వినియోగదారులను నిరాశకు గురిచేస్తోందన్నారు. ఈవిధంగా చేయడం వల్ల నగరంలో కాలుష్యం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నగరవాసులకు పీఎన్జీ ధరల పెంపు అదనపు భారమే అవుతుందన్నారు.