సీఎన్‌జీ (కంప్రెస్‌డ్ న్యాచురల్ గ్యాస్), పీఎన్‌జీ (పైపుడ్ న్యాచురల్‌గ్యాస్) ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ ఢిల్లీప్రదేశ్ నాయకులు హెచ్చరించారు.
సాక్షి, న్యూఢిల్లీ : సీఎన్‌జీ (కంప్రెస్‌డ్ న్యాచురల్ గ్యాస్), పీఎన్‌జీ (పైపుడ్ న్యాచురల్‌గ్యాస్) ధరల పెంపు నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించకపోతే పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీజేపీ ఢిల్లీప్రదేశ్ నాయకులు హెచ్చరించారు. సీఎన్‌జీ, పీఎన్‌జీల ధరలు పెంచుతూ ఢిల్లీ సర్కారు తీసుకున్న నిర్ణయంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది.
కాంగ్రెస్‌పార్టీ అధికారంలో ఉన్న 15 ఏళ్లలో నగరంలో సీఎన్‌జీ ధరలు 250, ఎల్‌పీజీ గ్యాస్ ధరలు 300 శాతం వరకు పెరిగాయని ఆ పార్టీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ ఆరోపించారు. ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ తాజా పెంపు నిర్ణయం నగరంలోని 3.5 లక్షల కుటుంబాలపై ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.‘ఈ పెంపు నిర్ణయం బస్సులు, ఆటోరిక్షాలు,ట్యాక్సీలు, ప్రైవేటు వాహనదారులపై ప్రభావం చూపుతుంది.
ఇందువల్ల అన్ని వస్తువుల ధరలు చుక్కలనంటడం ఖాయం. సామాన్యుడి ఇబ్బందులు అర్ధం చేసుకునే స్థితిలోనూ కాంగ్రెస్ నాయకులు లేరు’ అని గోయల్ ధ్వజమెత్తారు. ప్రభుత్వ తప్పుడు విధానాల కారణంగా నగరంలోని సామాన్యులు ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే పెద్దఎత్తున ఆందోళనలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. ఈ ప్రభుత్వం అన్నీ తప్పుడు నిర్ణయాలు తీసుకుంటోందని, సీఎన్‌జీ వినియోగదారులను నిరాశకు గురిచేస్తోందన్నారు. ఈవిధంగా చేయడం వల్ల నగరంలో కాలుష్యం మరింత పెరిగిపోయే ప్రమాదం ఉందన్నారు. ఇప్పటికే ద్రవ్యోల్బణం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్న నగరవాసులకు పీఎన్‌జీ ధరల పెంపు అదనపు భారమే అవుతుందన్నారు.