న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీ తీన్‌మూర్తి భవన్‌లో అంతర్జాతీయ ప్రఖ్యాతి వహించిన నెహ్రూ మెమోరియల్ మ్యూజియం అండ్ లైబ్రరీ (ఎన్‌ఎంఎంఎల్)ని ప్రధానమంత్రి మ్యూజియం అండ్ లైబ్రరీ సొసైటీ (పీఎంఎంల్) అని అధికారికంగా పేరు మార్చడం వివాదస్పదమవుతోంది. కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటలు మంటలు చెలరేగాయి. నెహ్రూ పేరుని చరిత్ర పుటల్లోంచి తొలగించడానికి ప్రధాని మోదీ ప్రయతి్నస్తున్నారంటూ కాంగ్రెస్ మండిపడుతూ ఉంటే, ప్రధానమంత్రులందరికీ సమ ప్రాధాన్యం ఇచ్చామని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
నెహ్రూ మ్యూజియం పేరు మార్చాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినప్పుడే దీనిపై వివాదం రేగింది. కాగా మ్యూజియం పేరు మారుస్తూ సోమవారం నాడు అధికారికంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ‘‘నెహ్రూ మెమోరియల్ మ్యూజియం లైబ్రరీ ఇక నుంచి ప్రైమ్ మినిస్టర్స్ మ్యూజియం అండ్ లైబ్రరీగా మారింది. ప్రజాస్వామ్యానికి అనుగుణంగా వైవిధ్యాన్ని చాటి చెప్పడానికే ఈ పేరు మార్పు జరిగింది. ఈ నెల 14 నుంచి ఉత్వర్వులు అమల్లోకి వచ్చాయి’’ అని పీఎంఎంల్ వైస్ చైర్మన్ సూర్యప్రకాశ్ వెల్లడించారు. తీన్‌మూర్తి భవనంలో 16 ఏళ్లపాటు నెహ్రూ అధికారిక నివాసంగా ఉంది. 1966 , ఏప్రిల్1న అందులో నెహ్రూ మ్యూజియంను ఏర్పాటు చేశారు.
నెహ్రూని అప్రతిష్టపాల్జేయడమే మోదీ ఎజెండా: కాంగ్రెస్
నెహ్రూ వారసత్వాన్ని అప్రతిష్టపాల్జేయడమే ప్రధాని మోదీ ఎజెండా అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ఆరోపించారు. ఈ మేరకు ట్విటర్‌లో ఒక పోస్టు పెట్టారు. ‘‘ప్రధాని మోదీ అభద్రతా భావం, భయాందోళనల మధ్య నెహ్రూ మ్యూజియం పేరు మార్చారు. నెహ్రూ వారసత్వాన్ని విధ్వంసం చేయాలని ఆయన భావిస్తున్నారు. మ్యూజియం పేరులో ఎన్ స్థానంలో పీ అని మార్చారు. అందులో ‘‘పీ’’ అంటే చిన్నతనం, ఇబ్బంది పెట్టడం’’ అని జైరామ్ రమేష్ పేర్కొన్నారు. నెహ్రూ పేరు మార్చారు కానీ స్వాతంత్య్ర సంగ్రామంలో ఆయన పోషించిన పాత్రను, భారత్‌ను లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా ఆయన నడిపించిన విధానాన్ని చెరిపేయలేరని ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.
ప్రధానమంత్రులందరి ఘనత చాటడానికే: బీజేపీ
కాంగ్రెస్ చేసిన ఆరోపనల్ని బీజేపీ కొట్టిపారేసింది. దేశ ప్రధానమంత్రులందరి ఘనతలు ప్రపంచానికి చాటి చెప్పడానికే మ్యూజియం పేరుని మార్చినట్టు స్పష్టం చేసింది. లాల్‌బహదూర్ శాస్త్రి, పీ.వీ.నరసింహారావు, హెచ్.డి.దేవెగౌడ, ఐకే గుజ్రాల్ ఇలా ఎందరో భారత దేశాన్ని గొప్పగా తీర్చిదిద్దారని, ఈ మ్యూజియం ఏ ఒక్కరికో, ఒక కుటుంబానికో చెందినది కాదని బీజేపీ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా అన్నారు.
నెహ్రూ మ్యూజియం కాదు.. ఇక ప్రధానమంత్రి మ్యూజియం
Published Thu, Aug 17 2023 3:55 AM | Last Updated on Thu, Aug 17 2023 3:55 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment