న్యూఢిల్లీ: పర్యావరణ అనుకూల స్వచ్ఛ ఇంధనాల వినియోగాన్ని పెంచడంపై కేంద్రం మరింతగా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో 66 బిలియన్ డాలర్ల పెట్టుబడులతో గ్యాస్ మౌలిక సదుపాయాల కల్పన జరుగుతోందని కేంద్ర చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తెలిపారు. జాతీయ గ్రిడ్ ఏర్పాటు కోసం ప్రస్తుతమున్న 16,800 కి.మీ. నెట్‌వర్క్‌కు అదనంగా మరో 14,700 కి.మీ. మేర గ్యాస్ పైప్‌లైన్లను నిర్మించే ప్రక్రియ జరుగుతోందని ఆయన పేర్కొన్నారు.
ఇంధన వినియోగంలో సహజ వాయువు వాటాను 2030 కల్లా 15 శాతానికి పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు కేపీఎంజీ ఇండియా నిర్వహించిన ఎన్‌రిచ్ 2020లో వార్షిక ఇంధన సదస్సులో పాల్గొన్న సందర్భంగా మంత్రి వివరించారు. ప్రస్తుతం ఇది 6.3 శాతంగా ఉంది. పశ్చిమ, తూర్పు తీరాల్లో ద్రవీకృత సహజ వాయువు (ఎల్‌ఎన్‌జీ) దిగుమతికి టెర్మినల్స్‌ను పెంచుకోవడంపైనా కసరత్తు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. ట్రక్కులు, బస్సులకు కూడా కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్‌జీ)తో పాటు ఎల్‌ఎన్‌జీని కూడా ఇంధనంగా వినియోగించడాన్ని ప్రోత్సహిస్తున్నట్లు వివరించారు. ఇక పునరుత్పాదక విద్యుత్ సామర్థ్యాన్ని 2022 నాటికి 175 గిగావాట్లు, 2030 నాటికి 450 గిగావాట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు తెలిపారు.
ఇరాన్ చమురుకు అవకాశం లభించాలి
ఇరాన్, వెనెజులా నుంచి చమురు దిగుమతులను పునరుద్ధరించే దిశగా అమెరికా కొత్త ప్రభుత్వం తగు నిర్ణయాలు తీసుకోవాలని ఆశిస్తున్నట్లు ప్రధాన్ చెప్పారు. దీనివల్ల మరిన్ని ప్రాంతాల నుంచి కొనుగోళ్లు జరిపేందుకు భారత్‌కు అవకాశం లభించగలదని తెలిపారు.
చమురు క్షేత్రాలపై ఎక్సాన్ ఆసక్తి
భారత్‌లోని చమురు, గ్యాస్ క్షేత్రాల్లో వాటాల కొనుగోలుకు ఎక్సాన్ మొబిల్ చర్చలు జరుపుతోందని ప్రధాన్ చెప్పారు. ఆఫ్‌షోర్ బ్లాక్‌ల అభివృద్ధిలో సాంకేతిక నైపుణ్యాన్ని అందించేందుకు ప్రభుత్వ రంగ ఓఎన్‌జీసీతో ఎక్సాన్ మొబిల్ గతేడాదే ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment