ముంబై: పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ భారీ వృద్ధి లక్ష్యాల సాధన దిశగా ప్రణాళికలు ప్రకటించింది. ఇందులో భాగంగా వినాయక చవితి కల్లా జియో ఎయిర్‌ఫైబర్‌ను అందుబాటులోకి తేనుంది. అలాగే, జియో ఫైనాన్షియల్స్ విభాగం ద్వారా బీమా ఉత్పత్తులను ఆవిష్కరించనుంది. వచ్చే అయిదేళ్లలో 100 కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) ప్లాంట్లను నెలకొల్పాలని లక్ష్యంగా పెట్టుకుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ 46వ సర్వ సభ్య సమావేశంలో (ఏజీఎం) చైర్మన్ ముకేశ్ అంబానీ ఈ విషయాలు ప్రకటించారు. అదే క్రమంలో వారసత్వ ప్రణాళికలను కూడా వెల్లడించారు. ఆయన ముగ్గురు సంతానం (ఆకాశ్, ఈషా, అనంత్) కంపెనీ బోర్డులో నియమితులైనట్లు పేర్కొన్నారు. అలాగే, 2024 ఏప్రిల్ 19తో తన పదవీకాలం ముగియనున్నప్పటికీ.. మరో అయిదేళ్ల పాటు చైర్మన్‌గా కొనసాగనున్నట్లు ఆయన తెలిపారు.
ఏజీఎంలో మరిన్ని విశేషాలు..
ఎయిర్‌ఫైబర్‌తో వైర్‌లెస్ బ్రాడ్‌బ్యాండ్..
సెప్టెంబర్ 19న వినాయక చవితి సందర్భంగా జియో ఎయిర్‌ఫైబర్ సరీ్వసులు ప్రారంభమవుతాయి. ఇది వైర్లు అవసరం లేని 5జీ బ్రాడ్‌బ్యాండ్ సరీ్వసులాంటిది. నెట్ కనెక్టివిటీకి ఎదురయ్యే అవరోధాలను అధిగమించేందుకు .. 5జీ నెట్‌వర్క్‌ను, అధునాతన వైర్‌లెస్ టెక్నాలజీలను ఉపయోగించుకుని ఇది వరుసలో చిట్టచివర్న ఉన్న వారికి కూడా బ్రాడ్‌బ్యాండ్ సేవలను అందుబాటులోకి తేగలదని ముకేశ్ అంబానీ తెలిపారు.
ఆప్టికల్ ఫైబర్‌తో రోజూ 15,000 ప్రాంగణాలను కనెక్ట్ చేయగలుగుతుంటే, జియోఎయిర్‌ఫైబర్ దీనికి పది రెట్లు అధికంగా కనెక్ట్ చేయగలదు. తద్వారా 20 కోట్ల గృహాలు, ప్రాంగణాలకు జియో మరింత చేరువ కాగలదు. ఈ సందర్భంగా జియో ట్రూ5జీ డెవలపర్ ప్లాట్‌ఫాంను కూడా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్ ఆకాశ్ అంబానీ ప్రకటించారు.
రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో ఏర్పాటు చేసే తొలి జియో ట్రూ5జీ ల్యాబ్‌లో టెక్నాలజీ భాగస్వాములు, ఎంటర్‌ప్రైజ్ కస్టమర్లు .. వివిధ పరిశ్రమలకు అవసరమైన సొల్యూషన్స్‌ను రూపొందించవచ్చు. వాటిని పరీక్షించవచ్చు. అటు, కృత్రిమ మేధ (ఏఐ) ప్రయోజనాలను అందరికీ, అన్నిచోట్ల అందుబాటులోకి తెచ్చేందుకు జియో ప్లాట్‌ఫామ్స్ కృషి చేస్తోందని ముకేశ్ అంబానీ చెప్పారు. డిసెంబర్ ఆఖరు నాటికి దేశవ్యాప్తంగా 5జీ నెట్‌వర్క్ విస్తరణ పూర్తి చేసే దిశగా పనులు సాగుతున్నాయని తెలిపారు. జియోసినిమా వినోదానికి దేశీయంలోనే అతి పెద్ద డిజిటల్ వేదికగా మారిందని ఆయన పేర్కొన్నారు.
సీబీజీ ప్లాంట్లు.. గిగా ఫ్యాక్టరీలు..
2035 నాటికి కర్బన ఉద్గారాల విషయంలో తటస్థ స్థాయిని సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. జామ్‌నగర్‌లో రెండు కంప్రెస్డ్ బయోగ్యాస్ (సీబీజీ) డెమో యూనిట్లను నెలకొల్పాక, కేవలం 10 నెలల వ్యవధిలోనే ఉత్తర్‌ప్రదేశ్‌లోని బారాబంకీలో వాణిజ్యావసరాల కోసం తొలి సీబీజీ ప్లాంటును ఏర్పాటు చేసినట్లు అంబానీ చెప్పారు. వీటిని త్వరితగతిన 25కి, అటుపైన వచ్చే అయిదేళ్లలో 100కు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు ఆయన వివరించారు. 2026 నాటికి బ్యాటరీ గిగా ఫ్యాక్టరీ నెలకొల్పే లక్ష్యం పెట్టుకున్నట్లు చెప్పారు. సోలార్ ప్యానెళ్లు, బ్యాటరీల తయారీ కోసం జామ్‌నగర్ రిఫైనరీ కాంప్లెక్స్‌లో రూ. 75,000 కోట్లతో నాలుగు గిగాఫ్యాక్టరీలు ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు.
బీమాలోకి జేఎఫ్‌ఎస్...
జియో ఫైనాన్షియల్ సరీ్వసెస్ (జేఎఫ్‌ఎస్) బీమా రంగంలోకి విస్తరించనున్నట్లు ముకేశ్ అంబానీ తెలిపారు. ఇది సరళమైన ఆరోగ్య, జీవిత, సాధారణ బీమా పాలసీలను అందిస్తుందని పేర్కొన్నారు. మ్యూచువల్ ఫండ్స్ వ్యాపారంలోకి విస్తరించేందుకు బ్లాక్‌రాక్‌తో కలిసి జేఎఫ్‌ఎస్ జాయింట్ వెంచర్‌ను ప్రకటించింది. టెలికం విభాగం జియోకి ఉన్న 45 కోట్ల మంది మొబైల్ ఫోన్ యూజర్లకు తమ ఉత్పత్తులను విక్రయించే యోచనలో ఉంది.
టాప్ 4లో రిటైల్..
పలు అంతర్జాతీయ దిగ్గజాలు రిలయన్స్ రిటైల్‌లో ఇన్వెస్ట్ చేసేందుకు ఆసక్తిగా ఉన్నట్లు ముకేశ్ అంబానీ చెప్పారు. ఒకవేళ దీన్ని స్టాక్ ఎక్సే్చంజీల్లో లిస్ట్ చేసి ఉంటే ప్రస్తుత వేల్యుయేషన్ ప్రకారం టాప్ 4 లిస్టెడ్ సంస్థల్లో రిటైల్ కూడా ఒకటిగా ఉండేదని ఆయన తెలిపారు. ‘‘2020 సెప్టెంబర్‌లో నిధులు సమీకరించినప్పుడు రిటైల్ వేల్యుయేషన్ రూ. 4.28 లక్షల కోట్లుగా ఉంది.
మూడేళ్ల కన్నా తక్కువ వ్యవధిలోనే ఇది రెట్టింపయింది. రూ. 8.278 లక్షల కోట్ల వేల్యుయేషన్‌తో ఇటీవలే ఖతర్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (క్యూఐఏ) 1 శాతం వాటాను కొనుగోలు చేసింది. నాణ్యత, నవకల్పన, కస్టమరు ప్రధానంగా కార్యకలాపాలు నిర్వహించడం, పరిస్థితులకు అనుగుణంగా వ్యూహాలను మార్చుకోగలుగుతుండటం వంటి సామర్థ్యాలకు ఇది నిదర్శనం’’ అని అంబానీ తెలిపారు. అటు రూ. 22 కోట్లకు కొనుగోలు చేసిన సాఫ్ట్‌డ్రింక్ క్యాంపా కోలాను ఆసియా, ఆఫ్రికాతో పాటు అంతర్జాతీయ మార్కెట్లకు కూ డా తీసుకెళ్లనున్నట్లు ఈషా అంబానీ తెలిపారు.
వారసత్వ ప్రణాళికలు..
ప్రస్తుతం రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో భాగమైన వివిధ వ్యాపార విభాగాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న ముకేశ్ అంబానీ ముగ్గురు సంతానం తాజాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో చేరారు. నాన్–ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా నియమితులయ్యారు. వారు ఈ హోదాను ‘కష్టపడి సంపాదించుకున్నారని’ అంబానీ తెలిపారు. ‘‘ఈషా, ఆకాశ్, అనంత్‌లో నేను, మా తండ్రిగారు ధీరుభాయ్ అంబానీ నాకు కనిపిస్తారు. ధీరుభాయ్‌లోని ఆ మెరుపు వారిలో నాకు కనిపిస్తుంది’’ అని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం జియో ఇన్ఫోకామ్‌ను ఆకాశ్, రిటైల్ వ్యాపారాన్ని ఆయన కవల సోదరి ఈషా (31), కొత్త ఇంధన వ్యాపార విభాగాన్ని అనంత్ (27) పర్యవేక్షిస్తున్నారు. 2002లో ధీరుభాయ్ మరణానంతరం సోదరుడు అనిల్ అంబానీతో వ్యాపార పంపకాలపరంగా వివాదం తలెత్తిన నేపథ్యంలో ముకేశ్ తాజా వారసత్వ ప్రణాళికలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. మరోవైపు, రిలయన్స్ ఫౌండేషన్ కార్యకలాపాలపై మరింతగా దృష్టి పెట్టే ఉద్దేశంతో ముకేశ్ సతీమణి నీతా అంబానీ రిలయన్స్ బోర్డు నుంచి తప్పుకున్నారు. అయితే, ఫౌండేషన్ చైర్‌పర్సన్‌గా శాశ్వత ఆహా్వనితురాలు హోదాలో ఆమె బోర్డు సమావేశాలన్నింటికి యథాప్రకారంగా హాజరవుతారు.
అత్యధిక డిమాండ్ ఉన్నవి, అనేక దశాబ్దాల పాటు ఆరోగ్యకరమైన వృద్ధి సాధించగలిగేవి అయిన వ్యాపారాలను మేము ఎంచుకున్నాం. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో వ్యాపారాలను
నిర్మించగలిగాం. మా మూడు వృద్ధి చోదకాలు .. (ఓ2సీ, రిటైల్, జియో డిజిటల్ సర్వీసులు) మరింత విలువ జోడించగలవు. కొత్తగా మా నాలుగో వృద్ధి ఇంజిన్ జియో ఫైనాన్షియల్
సర్వీసెస్ కూడా వీటికి తోడుగా చేరింది.
– ముకేశ్ అంబానీ, రిలయన్స్ చైర్మన్
Comments
Please login to add a commentAdd a comment