గ్యాస్ తుస్
ఐదేళ్లుగా పురో‘గతి’ లేని బీజీఎల్ పథకం
చింతల్ దాటని పైప్‌లైన్ పనులు
ఇప్పటికీ అందని వంటగ్యాస్
సిటీబ్యూరో: మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. ఐదేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ప్రాజెక్టు ఆచరణలో చతికిలబడింది. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలపై నత్తనడకన సాగుతున్న పైప్‌లైన్ పనులు నీళ్లు చల్లుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా కనీసం 30 శాతం పైప్‌లైన్ పనులు కూడా పూర్తి కాలేదు. నాలుగేళ్ల నుంచి పైప్‌లైన్ల పనుల తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది.
ఐదేళ్లక్రితం ఆర్భాటం..
సరిగ్గా ఐదేళ్ల క్రితం నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసి ఇంటింటికీ పైప్డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలని నిర్ణయించారు. అందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజేఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలో గల నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని గృహ సముదాయాల్లోని 30 ఫ్లాట్‌లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో వెయ్యి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినా 410 కుటుంబాలకు మాత్రమే వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే పైప్‌లైన్ పనులు మాత్రం చింతల్ దాటలేదు. మరోవైపు ఇప్పటికే కనెక్షన్లు అందించిన వినియోగాదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది.
సీఎన్జీ కూడా అంతంతే..
మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం మందుకు సాగడం లేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 164 బస్సులకు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో 236 బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా 23 వేల వాహనాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. వాస్తవంగా ప్రతిరోజు నగరంలోని సీఎన్జీ వినియోగదారుల నుంచి 20 వేల కిలో లీటర్లకు పైగా డిమాండ్ ఉంది. కానీ, ప్రతినిత్యం 12 వేల కిలో లీటర్లకు మించి సరఫరా కావడం లేదని డీలర్లు వాపోతున్నారు.
పురోగతి లేని పైప్‌లైన్ పనులు
భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్ల క్రితం ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రణాళిక లక్ష్యానికి తగ్గట్టు పురోగతి సాధించలేకపోయింది. ఇప్పటిదాకా శామీర్‌పేట నుంచి చింతల్ వరకు 33.55 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. తాజాగా బాలాపూర్ వరకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే సరిగ్గా మూడు కిలో మీటర్లు కూడా పూర్తికానట్టు ప్రగతి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి.
రూ.733 కోట్లతో ప్రాజెక్టు..
మహానగరానికి ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.733 కోట్లతో ప్రణాళిక వేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని నిర్ణయించింది. కానీ కొంతకాలం గ్రిడ్ నుంచి సరైన గ్యాస్ సరఫరా లేక, ఆ తర్వాత పైప్‌లైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ రాక పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు తాజాగా పనులు ప్రారంభమయ్యాయి.