Pipeline
-
క్లోరిన్ గ్యాస్ లీక్.. 60 మందికి అస్వస్థత
షాడోల్: మధ్యప్రదేశ్‌లో ప్రమాదం చోటుచేసుకుంది. షాడోల్-అనుప్పూర్ సరిహద్దులో ఉన్న సోడా ఫ్యాక్టరీలో క్లోరిన్ గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ కారణంగా ఆ ప్రాంతంలో విషవాయువు వ్యాపించింది. జనం ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. సమాచారం అందిన వెంటనే అనుపూర్ పరిపాలన అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని, బాధితులను ఆస్పత్రికి తరలించారు.ఈ గ్యాస్ లీకేజీ కారణంగా పలువురు కళ్లలో మంటలు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారు. 60 మందికి పైగా బాధితులను చికిత్స కోసం సమీప ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వీరిలో పెద్దలు, వృద్ధులు, పిల్లలు కూడా ఉన్నారు. బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నట్లు తెలుస్తోంది.శనివారం రాత్రి 8.30 గంటల తర్వాత సోడా ఫ్యాక్టరీ సమీపంలో నివాసం ఉంటున్న కొందరికి ఒక్కసారిగా ఊపిరాడక, కళ్లు తిరగడం మొదలైంది. అకస్మాత్తుగా ఇలా ఎందుకు జరుగుతోంతో ముందుగా ఎవరూ గ్రహించలేకపోయారు. కొద్దిసేపటి తరువాత ఫ్యాక్టరీలోని క్లోరిన్ గ్యాస్ పైపు లీకేజీ అయిందన్న వార్త వ్యాపించింది. నిముషాల వ్యవధిలోనే స్థానికులు ఈ విష వాయువు బారిన పడ్డారు. బాధితులతో ఆస్పత్రి కిటకిటలాడుతోంది. వైద్య సిబ్బంది బాధితులకు చికిత్స అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: పట్టాలు తప్పిన ముజఫర్‌పూర్- పూణె స్పెషల్ రైలు -
అమ్మోనియా గ్యాస్ లీక్.. 12 మందికి అస్వస్థత
చెన్నై: తమిళనాడులోని కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. ఈ పరిశ్రమ పైపులైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. ఈ ప్రమాదంలో 12 మంది ఆసుపత్రి పాలైనట్లు పోలీసులు తెలిపారు. అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో లీకులు ఏర్పడినట్లు సమాచారం. ఎన్నూర్‌లో ఉన్న కోరమండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఒక ప్రైవేట్ కంపెనీ. ఎరువులు తయారు చేస్తుంది. ఇందుకు అమ్మోనియాను ముడిసరుకుగా ఉపయోగిస్తారు. అయితే.. మంగళవారం అర్ధరాత్రి సమయంలో పరిశ్రమ పైప్‌లైన్ నుంచి అమ్మోనియా గ్యాస్ లీక్ అయింది. రాత్రి 12:45 సమయంలో పోలీసులకు సమచారం అందింది. పైప్‌లైన్ ప్రీ-కూలింగ్ ఆపరేషన్ సమయంలో ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు. గ్యాస్ లీకేజీ వల్ల స్థానిక పెరియకుప్పం, చిన్నకుప్పం వంటి గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఘాటైన వాసన రావడంతో శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడిందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అప్రమత్తమైన ఆరోగ్య శాఖా అధికారులు.. ఆయా గ్రామాల్లో అంబులెన్స్‌లు, ఇతర ట్రాన్స్‌పోర్టు సదుపాయాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 12 మంది ఆస్పత్రిలో చేరినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. గ్యాస్ లీకేజీతో స్థానిక గ్రామాల ప్రజలను పునరావాస ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. సముద్ర తీరానికి సమీపంలో అమ్మోనియా అన్లోడ్ చేస్తున్న సబ్-సీ పైప్‌లైన్‌లో మంగళవారం రాత్రి 11.30 గంటలకు లీకు ఏర్పడినట్లు కోరమండల్ సంస్థ తెలిపింది. వెంటనే అమ్మోనియా సరఫరాను తక్కువ చేసి పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకువచ్చామని పేర్కొంది. ఘటనపై సంబంధిత అధికారులకు సమాచారం అందించామని వెల్లడించింది. కోరమండల్ ఎల్లప్పుడూ అత్యున్నత భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉంటుందని స్పష్టం చేసింది. ఇదీ చదవండి: ఢిల్లీని కమ్మేసిన పొగమంచు.. వాహనదారులకు అవస్థలు -
కార్మికులు కనిపించారు
ఉత్తరకాశీ/న్యూఢిల్లీ: ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగం కూలిన 10వ రోజైన మంగళవారం సానుకూల పరిణామం సంభవించింది. లోపల చిక్కుకున్న 41 మంది కార్మికులతో వారి కోసం బయట వేచి ఉన్న కుటుంబసభ్యులు మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడారు. అంతేకాకుండా, లోపలున్న వారికి సంబంధించిన విజువల్స్ మొట్టమొదటిసారిగా బయటకు వచ్చాయి. దీంతో, కూలిన సొరంగం శిథిలాల్లోంచి తవ్విన ఆరంగుళాల పైప్‌లైన్ ద్వారా ఎండోస్కోపిక్ కెమెరాను పంపించి, లోపలున్న వారి యోగ క్షేమాలను తెలుసుకునేందుకు అధికారులు చేసిన ప్రయత్నాలు విజయవంతమైనట్లయింది. ఈ పైపును 53 మీటర్ల మేర అడ్డుపడిన శిథిలాల గుండా సోమవారం లోపలికి ప్రవేశపెట్టారు. కెమెరాను సోమ వారం రాత్రి ఢిల్లీ నుంచి అక్కడికి పంపించారు. పసుపు, తెలుపు రంగుల హెల్మెట్లను ధరించిన కార్మికులు, పైపులైన్‌ద్వారా లోపలికి పంపించిన ఆహార పదార్థాలను ఒకరికొకరు అందించుకుంటూ, మాట్లాడుకుంటూ ఆ విజువల్స్‌లో కనిపించారు. బయటున్న అధికారులు పెద్ద స్క్రీన్‌పై వారిని చూస్తూ తగు సూచనలు ఇచ్చారు. కెమెరా లెన్స్ శుభ్రంగా ఉంచుతూ, తమను తాము పరిచయం చేసుకోవాలని కోరారు. పైప్‌లైన్ దగ్గరకు చేరుకుని లోపలికి పంపించిన వాకీటాకీలతో మాట్లాడాలని చెప్పారు. అనంతరం ఆ కెమెరాను వెనక్కి తీశారు. ఇప్పటికే కొందరి కుటుంబసభ్యులు నాలుగంగుళాల కంప్రెషర్ ట్యూబ్ ద్వారా లోపలున్న తమ వారితో మాట్లాడారు. ఆ ట్యూబ్ ద్వారానే డ్రైఫ్రూట్స్ వంటివి కూడా లోపలికి పంపించారు. అయితే, తాజాగా అందుబాటులోకి వచ్చిన పైప్‌లైన్ కార్మికుల పాలిటి లైఫ్‌లైన్‌గా మారింది. ఇంతకుముందు కంటే ఎక్కువ ఆహారాన్ని పంపొచ్చు. కుటుంబసభ్యులతో మరింత సులువుగా, స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. కొత్త పైపు ద్వారా లోపలున్న వారికి నారింజ, అరటి, యాపిల్ పండ్లు, బాటిళ్లలో కిచిడీ, సెల్ఫోన్లు, చార్జెర్లను సైతం పంపించారు. ఒక డాక్టర్ కూడా లోపలున్న కార్మికులతో మాట్లాడారు. వారి ఆరోగ్య సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కడుపులో మంట, మూత్ర విజర్జనలో సమస్య..తదితరాలను తెలపగా వారికి మల్టీవిటమిన్ ట్యాబెట్లు, ఎలక్ట్రోలైట్ పౌడర్, యాంటీ డిప్రెస్సెంట్లను పంపినట్లు డాక్టర్ పీఎస్ పొఖ్రియాల్ చెప్పారు. సొరంగంలో చిక్కుకుపోయిన ప్రదీప్ కిక్సు క్షేమంగానే ఉన్నట్లు ఆయన మరదలు తెలిపారు. -
దొంగ తెలివి మామూలుగా లేదు!. ఆయిల్ చోరీకి ఏకంగా సొరంగమే తవ్వేశాడు
తాళం వేసిన ఇళ్లలోకి చొరబడి, డబ్బులు, బంగారం, నగలు చోరీ చేసిన ఘటనలు చూసే ఉంటాం. చైన్ స్నాచింగ్‌లు సైతం పెరిగిపోయాయి. జేబులోని పర్సులు, మొబైల్ విషయాల్లోనూ కొందరు చేతివాటం ప్రదర్శిస్తూ ఉంటారు. తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ దొంగతనం గురించి తెలిస్తే షాక్ అవ్వకుండా అస్సలు ఉండలేదు. ఆయిల్‌ను దొంగతనం చేసేందుకు ఓ వ్యక్తి ఏకంగా సొరంగం తవ్వేశాడు. పోచన్‌పూర్‌కు చెందిన రాకేష్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీఎల్) పైపుల నుంచి ఆయిల్‌ను అపహరించడానికి పెద్ద పథకమే వేశాడు. ఢిల్లీ - పానిపట్ ఇండియన్ ఆయిల్ పైప్‌లైన్ ప్రాంతానికి సొరంగం తవ్వాడు. ప్లాస్టిక్ పైపులు ఏర్పాటుచేసి పైపులైన్‌లోని ఆయిల్‌ను తోడేయడం ప్రారంభించాడు. ఆయిల్ సరఫరా తగ్గడంతో అనుమానం వచ్చిన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్.. పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: ఇదెక్కడి వింత.. దోమలను ఆసుపత్రికి తీసుకొచ్చిన వ్యక్తి, షాకైన వైద్యులు సెప్టెంబర్ 29న పైప్‌లైన్‌ను తనిఖీ చేయగా.. ఢిల్లీలోని ద్వారక ప్రాంతంలో ఆయిల్ దొంగిలిస్తున్నట్లు తెలిసిందని ఫిర్యాదులో తెలిపింది. కంపెనీ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని సందర్శించి అక్కడ తవ్వకాలు జరిపి ఆశ్చర్యపోయారు. మెయిన్ ఆయిల్ లైన్‌కు డ్రీల్లింగ్ ద్వారా రంధ్రాలు చేసి ప్లాస్టిక్ పైపులు పెట్టి ఆయిల్ దొంగతనం చేసేందుకు ఓ మిషన్‌ను అమర్చినట్లు గుర్తించారు. సొరంగం ద్వారా ఐఓసీఎల్ పైప్‌లైన్‌కు 40 మీటర్ల దూరం వరకు పైపులు వేసినట్లు తేలింది. ఈ పైపులు 52 ఏళ్ల రాకేష్ అలియాస్ గోలు అనే వ్యక్తికి చెందిన పొలంలోకి ఉండటంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. నిందితుడిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని, మిగతా వారిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. -
‘డబుల్’ ఇళ్లు పూర్తయ్యేదెప్పుడో..! ఆరేళ్లుగా సాగుతున్న పనులు
బెల్లంపల్లి: పేదల సొంతింటి కల సాకారం చేయాలనే లక్ష్యంతో బెల్లంపల్లిలో చేపట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం ఏళ్లు గడుస్తున్నా పూర్తి కావడం లేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. కన్నాల శివారు జాతీయ రహదారిని ఆనుకుని 2017 జూన్ 10న ఇళ్ల నిర్మాణాలకు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ భూమి పూజ చేశారు. ఇళ్ల నిర్మాణాలు ప్రారంభమై ఆరేళ్లు కావస్తుండగా ఇప్పటికీ పూర్తి కాలేదు. అనేక అవరోధాలతో అపసోపాలు పడుతూ ప్రస్తుతం సగానికి పైగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు తుది దశకు చేరాయి. రూ.968 లక్షల అంచనాతో 160 2బీహెచ్‌కే ఇళ్ల నిర్మాణాలు ప్రారంభించారు. నిర్మాణ వ్యయం యేటా పెరుగుతుండగా ఇప్పటికే పూర్తి కావాల్సిన ఇళ్లు అసంపూర్తిగా ఉన్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎంతో ఆశతో లబ్ధిదారులు ఎదురు చూస్తున్నారు. తుది దశలో పనులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లకు సంబంధించిన పైపులైన్ పనులు కొనసాగుతున్నాయి. మరోపక్క పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు తలుపులు, కిటికీలు బిగించాల్సి ఉంది. ఆయా పనులు పూర్తయితే దాదాపు ఇళ్ల నిర్మాణాలు పూర్తయినట్లే. 160 ఇళ్లకు గాను పైపులైన్ పనులు 100 ఇళ్ల వరకు పూర్తి చేసే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇళ్ల నిర్మాణ కాంట్రాక్టర్‌కు గత రెండేళ్లుగా బిల్లులు చెల్లించపోవడంతో ఆలస్యం జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కేటాయిపులపై ఆశలు అసెంబ్లీ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్ వరకు జరిగే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఎన్నికల తంతు ప్రారంభం కాకముందే పెండింగ్ పనులు పూర్తి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర కసరత్తు చేస్తోంది. ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడానికి ముందస్తుగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను పేదల పరం చేసి ఎన్నికలకు వెళ్లాలనే ధృడ సంకల్పంతో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో బెల్లంపల్లిలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పనులు తుది దశలో ఉండడంతో పేదలు ఆశలు పెంచుకుంటున్నారు. నోటిఫికేషన్ వచ్చేలోగానే అర్హులకు కేటాయించే అవకాశాలు ఉంటాయని చర్చించుకుంటున్నారు. గృహలక్ష్మి వైపు చూపులు.. డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఈసారి కూడా పూర్తికాని పరిస్థితులు ఏర్పడితే లబ్ధిదారులు గృహలక్ష్మి పథకం వైపు దృష్టి సారించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సొంతింటి స్థలం ఉన్న లబ్ధిదారులకు నిర్మాణానికి ప్రభుత్వం రూ.3 లక్షలు ఇస్తామని ప్రకటించడంతో పేదల్లో ఆశలు రేకేత్తిస్తున్నాయి. బెల్లంపల్లి మున్సిపాలిటీలో ప్రభుత్వ, సింగరేణి లీజు భూములు ఉన్నాయి. ఇటీవలనే ఇళ్లు కట్టుకున్న లబ్ధిదారులకు పట్టాలు కూడా జారీ చేస్తున్నారు. మున్సిపాలిటీ వ్యాప్తంగా 10 వేల మందికి ఇళ్లపట్టాలు వచ్చే అవకాశాలు ఉండగా, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు పూర్తికాని పక్షంలో నివేశన స్థలం ఉన్న పేదలు గృహలక్ష్మి పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి సమాలోచనలు చేస్తున్నారు. పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నాం డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ప్రస్తుతం ప్లాస్టరింగ్ పనులు నిర్వహిస్తున్నారు. కొన్ని ఇళ్లకు పైపులైన్ పనులు నిర్వహిస్తున్నారు. వీలైనంత త్వరగా ఇళ్లనిర్మాణ పనులు పూర్తి చేయించడానికి చర్యలు తీసుకుంటున్నాం. పెండింగ్ బిల్లుల కోసం ప్రభుత్వానికి నివేదిక పంపాం. బిల్లుల చెల్లింపు అంశం ప్రభుత్వ పరిధిలో ఉంది. – పెద్దయ్య, ఆర్అండ్బీ ఇంచార్జి ఈఈ, మంచిర్యాల -
జిల్లాకు చుక్క నీరైనా ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం
ఖలీల్‌వాడి: తొమ్మిది ఏళ్లలో సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు చుక్కనీరు అందించలేదని రాష్ట్ర కిసాన్ సెల్ అధ్యక్షుడు ఆన్వేష్‌రెడ్డి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ భవన్లో మంగళవారం జిల్లా కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ముప్ప గంగారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ సమీక్ష సమా వేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కిసాన్ కాంగ్రెస్ కమిటీ, మండల అధ్యక్షులను ప్రకటిస్తూ నియామక పత్రాలు అందించారు. అనంతరం అన్వేష్‌రెడ్డి మాట్లాడుతూ.. జిల్లాకు సాగు నీరు అందించడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. 21 ప్యాకేజీ ద్వారా గ్రావిటీ ద్వారా సాగు నీరు అందించే అవకాశం ఉన్నా, కమీషన్ల కోసం పైపు లైన్ ఏర్పాటు చేసి, ఇంత వరకు సాగునీరు అందించలేదన్నారు. కాంగ్రెస్ హయాంలో గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకం నిర్మించామన్నారు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డి ఆధ్వర్యంలో సాగునీటిపై రైతులతో సమావేశాలు ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలో తరుగు పేరు మీద దోపిడీ జరిగితే మంత్రి, ఎమ్మెల్యేలు మౌనంగా ఉన్నారని, ఎందుకు అడ్డుకోలేదని ప్రశ్నించారు. అకాల వర్షాలతో పంట నష్టపోయినా ఇంత వరకు బీఆర్ఎస్ ప్రభుత్వం పరిహారం అందించలేదన్నారు. రైతులకు ఇంతవరకు రుణమాఫీ చేయలేదన్నారు. ముప్ప గంగారెడ్డి మాట్లాడుతూ.. గ్రామాల్లో కిసాన్ కాంగ్రెస్ నాయకులు ప్రజల వద్దకు వెళ్లి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు చేసిన మోసాలను వివరించాలన్నారు. రాబోయే కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేసే పనులను రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తుందని తెలిపారు. భూమిలేని ఉపాధి హామీ కూలీలకు రూ.12వేలు ప్రతియేటా అందిస్తామన్నారు. పీసీసీ ఉపాధ్యక్షుడు తాహెర్‌బిన్‌హందాన్, జిల్లా కిసాన్ సెల్ ఇన్‌ఛార్జి ఆదిరెడ్డి, కామారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు. -
గోళ్లపాడు తరహాలో మరో ప్రాజెక్టు!
ఖమ్మంఅర్బన్: జిల్లా కేంద్రంలో ఏళ్లుగా మురికికూపంలా ఉన్న గోళ్లపాడు చానల్‌ను ఆ జాడలు లేకుండా పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లతో తీర్చిదిద్దిన విషయం విదితమే. అచ్చం అదే మాదిరి నగరంలో మరో ప్రాజెక్టు నిర్మాణానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరవై డివిజన్ల నుంచి వెలువడే మురుగు నీరు నాలాల ద్వారా వెళ్లే క్రమంలో బయటకు కనిపించకుండా, చెరువుల్లోకి చేరుతుండడంతో అక్కడి నీరు కలుషితం కాకుండా నేరుగా మున్నేరులోకి తరలించేందుకు ఈ ప్రాజెక్టు నిర్మిస్తారు. తద్వారా వర్షాకాలంలో దుర్వాసన, దోమల బెడదతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజల సమస్యకు పరిష్కారం లభించనుంది. పైపులైన్ ఏర్పాటు, ఇతర పనులను సుమారు రూ.180కోట్లతో చేపట్టే ఈ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. త్వరలో ఖమ్మం రానున్న రాష్ట్ర మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా శంకుస్థాపన చేయించాలని భావనతో ఉన్నట్లు సమాచారం. ఏం చేస్తారు? నగరంలోని సుమారు 20 డివిజన్ల పరిధిలో నివాసాల్లో వాడుకునే మురుగు నీరు చెరువుల్లోకి చేరుతోంది. ఈ సమయంలో దుర్వాసన వెదజల్లడమే కాక వర్షాకాలంలో నీరు సాఫీగా సాగక జనావాసాలను ముంచెత్తుతోంది. దీనిని అధిగమించేందుకు ఇళ్ల నుంచి వెలువడే నీరు చెరువుల్లో చేరకుండా, డ్రెయిన్లకు లింక్‌గా ప్రత్యేక పైపులైన్ ఏర్పాటుచేసి మున్నేరుకు నీటిని తరలిస్తారు. ఇందుకోసం సుమారు 20 కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ పైపులైన్ వేయనున్నట్లు తెలిసింది. ఈ మొత్తం 20 కిలోమీటర్ల నిడివిలో రెండు మురుగునీరు శుద్ధీకరణ ప్లాంట్లు కూడా ఏర్పాటుచేయనున్నట్లు సమాచారం. అంతేకాక పైపులైన్ పైభాగంలో పార్క్‌లు, ఓపెన్ జిమ్‌లు నిర్మించిన శుద్ధీకరణ ప్లాంట్లలో శుభ్రం చేసే నీటిని మొక్కల పెంపకానికి విని యోగించాలనే ప్రతిపాదనను అంచనాల్లో పొందు పర్చినట్లు తెలిసింది. ఇందుకోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిధులతోపాటు కార్పొరేషన్ నిధులు కూడా వెచ్చించనున్నారు. ఇప్పటికే పనులకు ఆమోదం లభించినప్పటికీ మంత్రి కేటీఆర్ పర్యటన సందర్భంగా ప్రకటన చేసి శంకుస్థాపన చేయించాలనే యోచనలో మంత్రి పువ్వాడ అజయ్ ఉన్నట్లు సమాచారం. త్వరలోనే టెండర్లు రాష్ట్ర మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఇటీవల ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ‘వాడవాడకు పువ్వాడ’ పేరిట ప్రత్యేక కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా మురుగుబాధ తొలగించాలని పలు డివిజన్ల ప్రజల నుండి వెల్లువెత్తుతున్న వినతులతో మంత్రి గోళ్లపాడు చానల్ తరహాలోనే మరో అండర్ డ్రెయిన్ నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. సుమారు రూ.180కోట్ల వ్యయమయ్యే ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు సిద్ధం కాగా.. పది రోజుల్లో టెండర్ల ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
వరికపుడిశెల వాగు ఎత్తిపోతలకు తొలగిన అడ్డంకి
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కృషితో పల్నాడు ప్రాంత ప్రజల దశాబ్దాల స్వప్నం వరికపుడిశెల ఎత్తిపోతలకు అడ్డంకులు తొలగిపోయాయి. కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతులు లభించక దశాబ్దాలుగా పనులు ప్రారంభం కాని ఈ ప్రాజెక్టును సీఎం జగన్ సాధించారు. శ్రీశైలం – నాగార్జునసాగర్ టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల ఎత్తిపోతల పనులు చేపట్టేందుకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇచ్చింది. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టుపై పంప్‌హౌస్, టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో 4 కిలోమీటర్ల పైపులైన్ నిర్మాణానికి మార్గం సుగమమైంది. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతాల్లో పల్నాడు ఒకటి. పక్కనే వరికపుడిశెల వాగు, కృష్ణా నదులు ప్రవహిస్తున్నా పల్నాడులో సాగు, తాగు నీటికి తీవ్ర ఇబ్బందులే. నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు 40 కిలోమీటర్ల ఎగువన కృష్ణా నదిలో వరికపుడిశెలవాగు కలిసే ప్రాంతానికి ముందే ఆ వాగు నీటిని ఎత్తిపోసి పల్నాడును సుభిక్షం చేయాలనే ప్రతిపాదన దశాబ్దాలుగా ఉంది. ఇందుకోసం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్‌లో పనులు చేయాల్సి ఉంటుంది. ఈ పనులకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అనుమతి ఇవ్వకపోవడంతో ఆ ఎత్తిపోతల కాగితాలకే పరిమితమైంది. పల్నాడును సుభిక్షం చేసే దిశగా.. పల్నాడు ప్రాంతానికి సాగు, తాగు నీటిని అందించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గట్టి సంకల్పం తలపెట్టారు. వరికపుడిశెలవాగు, కృష్ణా, గోదావరి జలాలను తరలించి పల్నాడుకు అందించాలని జలవనరుల శాఖ అధికారులను ఆదేశించారు. దాంతో వరికపుడిశెల వాగు కుడి గట్టున ఎత్తిపోతలను నిర్మించి, తొలి దశలో రోజుకు 281 క్యూసెక్కుల చొప్పున 1.57 టీఎంసీలను తరలించాలని ప్రణాళిక రూపొందించారు. రూ. 340.26 కోట్లు ఖర్చయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా వెల్దుర్తి మండలంలో 24,900 ఎకరాలకు నీళ్లందించవచ్చు. టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో వరికపుడిశెల వాగుపై ఎత్తిపోతల నిర్మాణం, దాని ద్వారా నీటిని తరలించడానికి 4 కిలోమీటర్ల పైపు లైన్ నిర్మాణానికి 19.13 హెక్టార్ల అటవీ భూమిని కేటాయించాలని కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. ఇందుకు ప్రతిగా దుర్గి మండలంలో 21 హెక్టార్ల భూమిని అటవీ శాఖకు బదలాయించి, పరిహారాన్ని కూడా ప్రభుత్వం చెల్లించింది. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ అధికారులతో పల్నాడు ప్రాంత ప్రజాప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులు పలు మార్లు చర్చలు జరపడంతో కేంద్రం కదిలింది. వరికపుడిశెల ఎత్తిపోతలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో టైగర్ రిజర్వు ఫారెస్ట్‌లో పంప్‌హౌస్, పైపు లైన్ నిర్మాణం చేపట్టేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఎత్తిపోతల ద్వారా తరలించే నీటిని వెల్దుర్తి, ఉప్పలపాడు, గొట్టిపాళ్ల, సిరిగిరిపాడు, బొదిలవీడు, గంగులకుంట, లోయపల్లి గ్రామాల పరిధిలో 24,900 ఎకరాలకు సరఫరా చేయడానికి పైపు లైన్ల నిర్మాణం ఇప్పటికే ప్రారంభించారు. ఇప్పుడు అటవీ ప్రాంతంలో పైపులైన్ నిర్మిస్తారు. పైపు లైన్ల ద్వారా నీటిని తరలిస్తే సరఫరా నష్టాలు ఉండవని, ఆయకట్టుకు సమర్థవంతంగా నీటిని అందింవచ్చని అధికారవర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో పైపు లైన్ ద్వారా ఆయకట్టుకు నీళ్లందించే తొలి ఎత్తిపోతల పథకం ఇదే. వరికపుడిశెల ఎత్తిపోతల తొలి దశకు అడ్డంకులు తొలగడంతో పల్నాడులో భారీ ఎత్తున ఆయకట్టుకు నీళ్లందించేలా రెండో దశకు సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) తయారీకి అధికారులు కసరత్తు చేస్తున్నారు. -
హఠాత్తుగా పెళపెళమంటూ రోడ్డు బద్ధలై ఒక్కసారిగా..
ఏమైందో ఏమో ఉన్నటుండి ఒక్కసారిగా రహదారి బద్ధలై నీళ్లు ఫౌంటైన్ మాదిరి వెదజిమ్ముతూ బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉండే వారెవరికీ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇదేమైన మరో ప్రకృతి విపత్తా? అన్నట్లుగా జరిగిందా ఆ ఘటన. సరిగ్గా అదే సమయంలో స్కూటీపై పింక్ కలర్ దుస్తులతో ఒక అమ్మాయి వెళ్తోంది. ఈ హఠాత్పరిణామనికి వెదజిమ్ముతున్న నీటి కారణంగా కిందపడిపోవడమే గాక ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది. అంత ఘోరంగా నీళ్లు పైకి ఎగదన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు మధ్యలో చోటు చేసుకుంది. ఐతే చుట్టుపక్కల స్థానికులు ఆమెను రక్షించినట్లు సమాచారం. భూగర్భ పైప్ లైన్ పగిలిపోవడంతో నీటి ప్రవాహానికి రోడ్డు పెళపెళమంటూ.. విరిగిపోతూ నీళ్లు బయటకు ఉబికివచ్చేశాయి. దీంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, ఆ రహదారి మొత్తం నీళ్లతో నిండిపోయి, కంకరాళ్లతో చెల్లచెదురుగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తుంది. #WATCH | Road cracked open after an underground pipeline burst in Yavatmal, Maharashtra earlier today. The incident was captured on CCTV. A woman riding on scooty was injured. pic.twitter.com/8tl86xgFhc — ANI (@ANI) March 4, 2023 (చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!) -
మూణ్నెళ్లలో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా: ఏజీ అండ్ పీ ప్రథాన్
వచ్చే సెప్టెంబరు నెల నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తరూ జిల్లా సమీప ప్రాంతాల్లో ఇంటింటికీ పైప్‌లైన్ గ్యాస్ సరఫరా ప్రారంభించడానికి కృషి చేస్తున్నామని ప్రముఖ ఇంథన సరఫరా సంస్థ ఏజీ అండ్ పీ ప్రథాన్ రీజనల్ హెడ్ చిరాగ్ ‘సాక్షి’కి తెలిపారు. సింగపూర్ కు చెందిన ఈ కంపెనీ ఇటీవలే కేంద్ర పెట్రోలియం బోర్డ్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అవసరమైన అనుమతులు పొంది ఇంధన సరఫరా ప్రారంభించనుంది. భవిష్యత్తులో పోర్టబుల్ జనరేటర్స్, ఎయిర్ కంటిషనర్స్ కూడా గ్యాస్‌తో వినియోగించుకునే పరిస్థితి రానుందంటున్న ఆయన సాక్షితో పంచుకున్న విశేషాలు ఆయన మాటల్లోనే... ‘ఆదా’కు ఆదా... భధ్రతకు భరోసా ఈ పైప్‌లైన్ గ్యాస్ ద్వారా బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ప్రస్తుత సిలిండర్‌కి సరిపడా గ్యాస్ దీని ద్వారా రూ.750 నుంచి రూ 800 వరకూ ధరలోనే వస్తుంది. అంటే ప్రస్తుతం అవుతున్న ఖర్చులో 10 నుంచి 15శాతం ఆదా అవుతుంది. ఈ పైప్డ్ నేచురల్ గ్యాస్ సంప్రదాయ సిలిండర్ గ్యాస్‌తో పోలిస్తే చవక మాత్రమే కాదు అత్యంత సురక్షితం కూడా. సరఫరా మొత్తం పైప్‌లైన్ సిస్టమ్‌లోనే సాగుతుంది. కాబట్టి ప్రత్యేకించి స్టోరేజ్ అవసరం లేదు. పైప్‌లైన్ ద్వారా ఒక కిచెన్ పాయింట్ అందిస్తాం. అవసరాన్ని బట్టి ఓ అడిషనల్ పాయింట్ కూడా అదే కిచెన్‌లో తీసుకోవచ్చు. బాత్ రూమ్ కోసం కావాలంటే మరో అదనపు పాయింట్ ఇస్తాం. మునిసిపల్ వాటర్ నీటి పంపు తిప్పితే నీళ్లొచ్చినట్టే ఈ గ్యాస్ కూడా వస్తుంది. వినియోగించిన ఇంధనాన్ని లెక్కించేందుకు మీటర్ ఏర్పాటు ఉంటుంది. మీటర్‌ను బట్టి వాడుకున్న ఇంధనానికి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. కరెంట్ బిల్లుల్లానే కాకపోతే అందులోలా ఇందులో స్లాబ్స్ ఉండవు. ఇక గ్యాస్ వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి 24/7 ఇన్స్టాలేషన్ తర్వాత సర్వీస్ అందిస్తున్నాం. దీని కోసం ఒక పూర్తిస్థాయి టీమ్ పనిచేస్తుంది. రెస్టారెంట్స్‌కు మరింత మేలు... నివాస గృహాలతో పోలిస్తే రెస్టారెంట్స్ లాంటి వ్యాపార సంస్థలకు పైప్‌లైన్ గ్యాస్ ద్వారా ఆదా అయ్యే 10శాతం అంటే చాలా పెద్ద మొత్తం అనే చెప్పాలి. ఇది వారి లాభాలను బాగా పెంచుతుంది. వారాంతాల్లో హోటల్స్ దాబాలు వంటి చోట్ల డిమాండ్ కారణంగా అధిక ఇంధనం కోసం అదనపు సిలిండర్లు మీద ఆధారపడతారు. అయితే ఇక్కడ ఆ కొరత ఉండదు. ఎంత కావాలంటే అంత గ్యాస్ సిద్ధంగా ఉంటుంది. ఈ ఆకర్షణీయమైన ప్రయోజనం కారణంగా భవిష్యత్తులో తిరుపతిలో అన్ని రెస్టారెంట్స్ పైప్డ్ గ్యాస్‌కి కనెక్ట్ అవుతాయి. రాబోయే రోజుల్లో తిరుమలకు కూడా అందించడానికి తితిదేతో చర్చలు నడుస్తున్నాయి. అయితే దీని కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది. స్పందన బాగుంది... ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కోరుతూ ప్రజల నుంచి ఇప్పటికే వేల సంఖ్యలో దరఖాస్తులు అందుకున్నాం. కేవలం 4 నెలల్లోనే 2వేల 500 కంటే పైగా అప్లికేషన్స్ వచ్చాయి. స్థానిక సంస్థలు మాకు అవసరమైన విధంగా సహకరించాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే జీవో జారి చేసింది గూడూరు మునిసిపల్ కార్పొరేషన్, తిరుపతి మునిసిపల్ కార్పొరేషన్, నాయుడు పేట మునిసిపల్ కార్పొరేషన్.. ల నుంచి పైప్‌లైన్ నిర్మాణాల అనుమతుల కోసం దరఖాస్తు చేశాం. ఇన్స్టలేషన్ ప్రారంభించాం... తిరుపతి టౌన్లో కూడా శ్రీనివాసపురం, రోడ్‌నెం 15, 16లలో డొమెస్టిక్ సర్వీసెస్ స్టార్ట్ చేశాం. 300 నివాస గృహాల్లో ఇన్స్టలేషన్ పూర్తయింది. నెల్లూరులో కూడా 450 ఇళ్లకి డొమెస్టిక్ ఇన్స్టలేషన్ పూర్తయింది. పైప్‌లైన్ ప్రోగ్రెస్‌లో ఉంది. వచ్చే 2నెలల్లో పూర్తి అవుతుంది. స్థానిక సరఫరా పైప్‌లైన్ నెట్వర్క్ని నాయుడపేట టౌన్, ఇండస్ట్రియల్ ఏరియాలో కూడా ప్రారంభించాం. ప్రభుత్వం చెప్పినట్టుగా రిఫండబుల్ డిపాజిట్ రూ.6వేలు తీసుకోవచ్చు కానీ మేం అది తీసుకోకుండానే ప్రస్తుతం కనెక్షన్ వర్క్ పూర్తి చేస్తున్నాం. వాహనాల కోసం సీఎన్జీ పెట్రోల్, డీజిల్ వాహనాలను పిఎన్జి వాహనాలుగా మార్చే రెట్రో ఫిట్మెంట్ సెంటర్స్ ద్వారా సేవలు కూడా అందిస్తున్నాం. చిత్తూరు, నెల్లూరు, అనంతపురం కడప లాంటి చోట్ల డీజిల్ ఆటోలు బాగా ఎక్కువ వాటిని సీఎన్జీ ఆటోలుగా మార్చవచ్చు. దీని వల్ల పర్యావరణానికి ఎంతో ఉపయక్తం. అంతేకాక ఈ మార్పిడి కోసం అయ్యే ఖర్చు వాహన యజమానులకు కేవలం 6 నెలల్లో రికవరీ చేసుకోవచ్చు. డీజిల్‌తో పోలిస్తే సిఎన్జి వల్ల 30 నుంచి 50శాతం ఇంధన ఖర్చు అంటే కనీసం నెలకు రూ.5వేలు ఆదా అవుతుంది. ఇక భారీ వాహనాలు, ఎక్కువ దూరాలు నడిపేవారికి ఒక్క రోజులోనే భారీ మొత్తంలో ప్రయోజనం కలుగుతుంది. ఇంధనాన్ని నింపుకోవడంలో ఇబ్బందులు రాకుండా ప్రతీ 60 నుంచి 100 కి.మీ లోపు సిఎన్జి స్టేషన్స్ ఉండేలా చూస్తున్నాం. -
రాజయ్యపేట తీరానికి కొట్టుకొచ్చిన భారీ పైపులైన్
నక్కపల్లి: అనకాపల్లి జిల్లా నక్కపల్లి మండలం రాజయ్యపేట సముద్రతీరానికి భారీ పై పులైను ఆదివారం కొట్టుకొచ్చింది. వేటకు వెళ్లిన మత్స్యకారులు ఈ పైపులైను చూసి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. చాలామంది ఈ పైపులైనును ఒడ్డుకు చేర్చాలని ప్రయత్నించారు. కానీ భారీ పైపులైను కావడంతో కదపలేకపోయారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ డి.వెంకన్న రాజయ్యపేట సముద్రతీరానికి వెళ్లి పైపులైన్‌ను పరిశీలించారు. ఉన్నతాధికారులకు ఈ విషయాన్ని తెలియజేశారు. ఇది కేంద్ర రక్షణ శాఖ ఎస్.రాయవరం మండలం బంగారమ్మపాలెం సమీపంలో నిర్మిస్తున్న ఎన్‌ఏవోబీ (నేవల్ ఆల్టర్నేనేటివ్ బేస్)కు చెందిన పైపులైనుగా ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. నేవల్ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వనున్నట్లు ఎస్ఐ వెంకన్న తెలిపారు. (క్లిక్: మార్కాపురం వాసిని అభినందించిన ప్రధాని మోదీ) -
మురుగునీటి పైప్‌లైన్ పనులు ప్రారంభం
ఆల్విన్‌కాలనీ: ఆల్విన్‌కాలనీ డివిజన్ సాయినగర్ ఈస్ట్, ఖాజా నగర్లలో హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ ఆధ్వర్యంలో చేపట్టిన నూతన మురుగునీటి పైప్‌లైన్ పనులను శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాందీ, ఆల్విన్‌కాలనీ డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్‌తో కలిసి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ... నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ నార్నే శ్రీనివాసరావు, శ్రీనివాస్ గౌడ్, జీఎం ప్రభాకర్‌రావు, డీజీఎం వెంకటేశ్వర్లు, మేనేజర్లు ప్రియాంక, ఝాన్సీ, వర్క్ ఇన్స్పెక్టర్ రవీందర్‌రెడ్డి, నాయకులు సమ్మారెడ్డి, జిల్లా గణేశ్, రాజేష్ చంద్ర, కాశీనాథ్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
వామ్మో!...పైప్‌లైన్‌లో నోట్ల కట్టలు..!!
మనం సినిమాల్లో బ్లాక్‌మనీని కారు టైర్లలోనూ, గోడల్లోనూ దాచడం చూసి ఉంటాం. కానీ నిజజీవితంలో అలా దాచేవాళ్లను చూడటం చాలా అరుదు. మహా అయితే పలానా అధికారి ఇంట్లో ఇంత సోమ్ము స్వాధీనం చేసుకున్నాం అని విని ఉంటాం తప్ప ఎలాంటి చోట్ల వాళ్లు దాచుతారో చూసి ఉండం. కానీ కర్ణాటకలోని పీడబ్ల్యూడీ ఇంజనీర్ అవినీతి సోమ్మును ఎక్కడా దాచాడో చూస్తే అవాక్కవ్వాల్సిందే.! బెంగళూరు: అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రభుత్వ అధికారులపై రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన చర్యలలో భాగంగా కల్బుర్గి జిల్లాలోని పీడబ్ల్యూడీ జాయింట్ ఇంజనీర్ శాంతగౌడ్ బిరాదార్ నివాసంపై దాడులు చేసినట్లు అవినీతి నిరోధక శాఖ అధికారులు తెలిపారు. అంతేకాదు పబ్లిక్ వర్క్స్ డెవలప్మెంట్ (పీడబ్ల్యూడీ)కి చెందిన ఇంజనీర్ నివాసంలో తాము ఒక ప్లంబర్ సాయంతో పైప్లైన్ల నుంచి కరెన్సీ నోట్లను తీశామని అధికారులు వెల్లడించారు. (చదవండి: పాపం ఎంత దాహం వేసిందో!.....ఆ కోబ్రా గ్లాస్‌తో తాగేస్తోంది) పైగా తమకు పైపులైన్లో నగదు దాచినట్లు సమాచారం రావడంతోనే ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. ఈ మేరకు సుమారు రూ. 25 లక్షల నగదు, భారీ మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. అయితే అవినీతి నిరోధక శాఖ ఇప్పటి వరకు దాదాపు 15 మంది అధికారులపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసులకు సంబంధించన సోదాలు నిర్వహించినట్లు తెలిపింది. ఇటీవల బెంగళూరు డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయంపై కూడా అవినీతి నిరోధక శాఖ దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంతో కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై మాట్లాడుతూ.." రాష్ట్ర ప్రభుత్వం అవినీతిని ఏ రూపంలోనూ సహించదు. అవినీతి నిరోధక శాఖ ఇచ్చే నివేదిక ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వారిపై తగిన చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు. (చదవండి: పెళ్లి బాజాలతో.. 65 కోళ్లు మృతి!..ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చిందంటే ఇదేనేమో!!) -
మిషన్ భగీరథ పైపులైన్‌ను ఢీకొట్టిన లారీ
మిషన్ భగీరథ పైపులైన్‌ను లారీ ఢీకొన్న ఘటనలో నీరు భారీగా ఎగసిపడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక ఈద్గామ్ చౌరస్తా నుంచి భైంసా వెళ్లే మార్గంలో మిషన్ భగీరథ పైపులైన్ వద్ద నిలిపి ఉన్న లారీని, భైంసా నుంచి వస్తున్న టిప్పర్ వెనకనుంచి ఢీకొట్టింది. ఈ క్రమంలో లారీ ముందు భాగం పైపును ఢీకొట్టడంతో ఒక్కసారిగా నీరు ఎగసిపడింది. దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ ఘటనలో టిప్పర్ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అక్కడికి చేరుకుని త్వరితగతిన మరమ్మతులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. – నిర్మల్ చైన్‌గేట్ -
ఆస్తుల నగదీకరణ తప్పదు!
‘జాతీయ ఆస్తుల నగదీకరణ’ మంచిదే. ప్రైవేట్ పరిశ్రమకు కట్టబెడుతున్న ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆస్తులు అంతిమంగా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయి. నాలుగేళ్లలో రూ. 6 లక్షల కోట్ల సమీకరణ ద్వారా మౌలిక వసతులను మెరుగుపర్చడమే నగదీకరణ లక్ష్యం. ఇది ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని అంచనా. నిరర్ధక ఆస్తులను వాణిజ్యానికి అప్పగించడం లాభసాటి అని కేంద్రం భావన. ఆగస్టు నెల చివరివారంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ జాతీయ ఆస్తుల నగదీకరణ విధానాన్ని (నేషనల్ మోనిటైజేషన్ పైప్‌లైన్) ప్రారంభించారు. కేంద్ర ప్రభుత్వ, ప్రభుత్వ రంగ ఆస్తుల నిర్వహణను ప్రైవేట్ యాజమాన్యా లకు అప్పగించడం ద్వారా 2021–22 నుంచి 2024–25 ఆర్థిక సంవత్సరాల మధ్య కాలంలో ఆరు లక్షల కోట్ల రూపాయల నగదు సమీకరించడమే దీని లక్ష్యం. 12 ప్రభుత్వ శాఖలకు చెందిన 20కి పైగా ఆస్తులు ఈ నగదీకరణలో భాగంగా ఉంటాయి. వీటిలో ప్రధానంగా రహదారులు, రైల్వేలు, విద్యు త్తు వ్యవస్థ ఉన్నాయి. 2022 నుంచి 2025 వరకు ఈ కార్యక్రమం అమలవుతుంది. ఈ విధానం కింద భారతీయ రైల్వేకి చెందిన 400 స్టేషన్లు, 90 ప్రయాణికుల రైళ్లు, 265 గూడ్స్ షెడ్లు, 15 రైల్వే స్టేడియంలు ప్రైవేట్ సంస్థలకు అప్పగిస్తారు. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని 25 విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తారు. ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు తదితర విమానాశ్రయాల్లో ప్రభుత్వ వాటాలను పూర్తిగా విక్రయిస్తారు. 9 మేజర్ పోర్టుల్లో ఉన్న 31 ప్రాజెక్టులను పీపీపీ విధానంలో అప్పగిస్తారు. బీబీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలీ కమ్యూనికేషన్స్‌లో ఉన్న ఆస్తులన్నింటినీ ప్రైవేటు వారికి ఇచ్చేస్తారు. జాతీయ స్టేడియంలు, ప్రాంతీయ కేంద్రాలు, పట్టణ ప్రాంతాల్లోని కాలనీలు, అతిథిగృహాలు, హోటళ్లు వంటి వాటిని ప్రైవేటుకు అప్పగిస్తారు. అయితే జాతీయ నగదీకరణ విధానం కింద అప్పగిస్తున్న ఆస్తులు ఆ తర్వాత కూడా ప్రభుత్వ యాజమాన్యం కిందే ఉంటాయని ఆర్థికమంత్రి స్పష్టంచేశారు. కొంతకాలం ప్రైవేట్ నిర్వహణ కింద ఉన్న తర్వాత వీటిని తిరిగి ప్రభుత్వానికి ఇచ్చివేయవలసి ఉంటుంది. ఈ కొత్త విధానం కింద ప్రభుత్వం మౌలిక వసతుల రంగంలో పెడుతున్న వ్యయాన్ని పెంచేలా నగదు లభ్యతను మెరుగుపరుస్తుందని మంత్రి వ్యాఖ్య. మౌలిక వసతుల రంగంలో కేంద్ర ప్రభుత్వం పెడుతున్న వ్యయాన్ని ఇంకా పెంచాల్సిన అవసరముందని, ప్రభుత్వ రంగ మౌలిక వసతుల ఆస్తులను ప్రైవేట్ యాజమాన్యాలకు అప్పగించడం అతి ముఖ్యమైన ఆర్థిక ఎంపిక అని, నూతన మౌలిక వసతుల నిర్మాణానికి ఇది చాలా ముఖ్యమైనదని మంత్రి సెలవిచ్చారు. ఈ కొత్త విధానంలో భాగంగా విమానయాన రంగం నుంచే దాదాపు రూ. 20,800 కోట్ల ఆస్తులను ప్రైవేట్‌కి అప్పగించనున్నారు. టెలికం రంగం నుంచి రూ. 35,100 కోట్ల ఆస్తులను నగదీకరణ కింద అప్పగించనున్నారు. ఇకపోతే రైల్వే రంగం నుంచి రూ. లక్షా 50 వేల కోట్లు, రహదారుల రంగం నుంచి రూ. లక్షా 60 వేల కోట్లు, విద్యుత్ పంపిణీ రంగం నుంచి రూ. 45,200 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేట్ నిర్వహణకు అప్పగిస్తారు. ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థను పునర్జీవింపజేసి, మహమ్మారి వల్ల దెబ్బతిన్న అభివృద్ధి పనులను వేగవంతం చేస్తుందని కేంద్రం అంచనా. దీనికి గాను ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల ఆదాయాన్ని గణనీయంగా పెంచుకోవాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకుంది. నగదీకరణలో నాలుగు ప్రయోజనాలున్నాయి. 1. ప్రభుత్వ, ప్రభుత్వ రంగ సంస్థల రాబడులను పెంచడం కోవిడ్ మహమ్మారి ప్రభావం కారణంగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక స్థితి, ప్రభుత్వ రంగ యాజమాన్యంలోని సంస్థల ఆర్థిక స్థితి విధ్వంసానికి గురైంది. 2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి 7.3 శాతానికి పడిపోయింది. ద్రవ్యలోటు జీడీపీలో 9.3 శాతానికి పెరిగింది. లాక్ డౌన్ల వల్ల ప్రభుత్వ రాబడులు క్షీణించిపోవడమే కాకుండా, పేదలకు ఉపశమనం కలిగించడానికి ప్రభుత్వం తన వ్యయాన్ని బాగా పెంచాల్సి వచ్చింది. దానికి తోడుగా ప్రభుత్వ, కేంద్రప్రభుత్వ రంగ సంస్థల విభాగాలు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటూండటం కూడా తెలిసిన విషయమే. ఇవి భారీ స్థాయిలో రుణాలు, నష్టాల బారినపడి కునారిల్లుతున్నాయి. అందుకే ప్రభుత్వ రంగ సంస్థల అభివృద్ధి కోసం పెట్టుబడుల ఉపసంహరణ చర్యలు తప్పనిసరయ్యాయి. భారతదేశంలో నష్టాల బారిన పడుతున్న పీఎస్‌యూల సంఖ్య 2015–16లో 79 నుంచి 2019–20 సంవత్సరానికి 84కు చేరుకుంది. ఇదే కాలానికి లాభాలు ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థల సంఖ్య 175 నుంచి 171కి పడిపోయిందని ఆర్థిక శాఖ సహాయ మంత్రి పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో వివరించారు. వీటిలో 30 ప్రభుత్వ రంగ సంస్థల నష్టం ఇప్పటికే రూ. 1,06,879 కోట్లకు చేరుకుంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ విధానం ప్రభుత్వానికి అదనపు రాబడులను తీసుకువస్తుంది. 2. పీఎస్‌యూలకు బడ్జెటరీ మద్దతును తగ్గించడం ప్రభుత్వ రంగ సంస్థలు తమ మూలధన వ్యయ అవసరాలను నెరవేర్చుకోవడానికి, అంతర్జాతీయ సంస్థలకు రుణాలు తిరిగి చెల్లించడానికి, కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా కొంత నగదును వాటికి అప్పగిస్తోంది. రుణ సేవలు, వీఆర్ఎస్ పథకాలు, ఉపశమన చర్యలు, రాయితీలు, ప్రత్యేక ప్యాకేజీలు వంటివి వీటికి అదనం. ఉదాహరణకు, ఆర్థిక స్థితి దిగజారిపోయిన ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ సంస్థల పునరుద్ధరణ కోసం కేంద్రప్రభుత్వం రూ. 70 వేల కోట్ల ప్యాకేజీనీ ప్రకటించింది. ఆస్తుల నగదీకరణ వల్ల దేశ ఆర్థిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. దీని వల్ల కేంద్ర ప్రభుత్వం పీఎస్‌యూలకు బడ్జెటరీ కేటాయింపులు కొన్ని సంవత్సరాల కాలంలో గణనీయంగా తగ్గుముఖం పడతాయని అంచనా. దీంతో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఆర్థిక భారం నుంచి తప్పించుకోవచ్చు కూడా. పైగా కేంద్ర ప్రభుత్వ ఆర్థిక, ద్రవ్యస్థితి గణనీయంగా మెరుగుపడుతుంది. ప్రభుత్వం పీఎస్‌యూలకు తప్పనిసరిగా పెడుతున్న వ్యయాన్ని సామాజిక సంక్షేమ ప్రాజెక్టులు వంటివాటికి ఉపయోగించవచ్చు. 3. కొత్త మౌలిక వసతుల కల్పనకు నిధులు లభ్యం ప్రభుత్వం నగదీకరణ ద్వారా తన వద్ద నగదు నిల్వలను పెంచుకుంటే కొత్త ఆస్తులను సృష్టించవచ్చు. ఇది దానికదేగా ఉద్యోగాల కల్పనకు వీలు కల్పిస్తుంది. దీనివల్ల పెట్టుబడులను మరింతగా ఆకర్షించి, అభివృద్ధిని ముందుకు తీసుకుపోయే అవకాశం ఉంది. జీడీపీలో పెట్టుబడుల శాతం తగ్గుతూ వస్తోంది. అదే సమయంలో మహమ్మారి అనంతరం డిమాండు పునరుద్ధరణ చర్యలకు ప్రైవేట్ రంగం వేచి చూస్తోంది. ప్రభుత్వం రంగ సంస్థల వద్ద వనరులు తగ్గిపోయాయి.ఈ నేపథ్యంలో జాతీయ ఆస్తుల నగదీకరణ విధానం ఆర్థిక వ్యవస్థలోకి పెట్టుబడులను పునరుద్ధరిస్తుంది. కోవిడ్ –19 వల్ల ఏర్పడిన ఆర్థిక మందగమనం నుంచి భారత్ కోలుకునేలా చేయవచ్చు. పీఎస్‌యూలు నిర్మాణ రంగ నష్టాలను ఎదుర్కొంటున్నందున వాటి ఆస్తుల నగదీకరణను నిరంతరంగా చేపట్టాల్సి వస్తోంది. అదే సమయంలో ప్రైవేట్ రంగం నష్టభయం లేని ఆస్తుల అండతో ముందుకెళుతోంది. పైగా పర్యావరణ అనుమతులు, ప్రాజెక్టుల జాప్యం ద్వారా నష్టం, వ్యాజ్యాలు వంటివి ప్రైవేట్ రంగానికి ఉండవు. 4. ఉద్యోగాలు, పెట్టుబడులకు కొత్త అవకాశాలు ప్రభుత్వ ఆస్తుల నగదీకరణ ద్వారా ఆశిస్తున్న నగదు పరిమాణంతో ప్రభుత్వరంగ పరిశ్రమల విలువ అమాంతం పెరుగుతుంది. దీనివల్ల ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న గతి శక్తి ప్రణాళికకు గొప్ప చేయూత లభిస్తుంది. ఈ పథకం కింద కేంద్రప్రభుత్వం రూ. 100 లక్షల కోట్ల విలువైన మౌలిక వసతుల కల్పనను ప్రకటించింది. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో సాగే ఆ సృజనాత్మక పద్ధతి వల్ల కార్పొరేట్ రంగం ఆకాంక్షలకు ఊతం లభిస్తుంది. ప్రైవేట్ రంగానికి ప్రభుత్వ ఆస్తులను కట్టబెట్టడం వల్ల ఆర్థిక వ్యవస్థ బహువిధాలుగా లాభపడుతుంది. ఇంతవరకు ఉపయోగంలో లేకుండా వృథాగా పడివున్న ఆస్తులను ప్రైవేట్ రంగం సమర్థంగా ఉపయోగించుకుని కొత్త ఉద్యోగావకాశాలను ఇతోధికంగా పెంచగలుగుతుంది. ప్రభుత్వ రంగ ఆస్తులను వీలైనంతవరకు విడుదల చేసి ఆర్థిక వ్యవస్థను ముందుకు తీసుకెళ్లేందుకు తగిన సమయం ఆసన్నమైందని, ప్రభుత్వం దృఢ నిర్ణయాలు తీసుకొనక తప్పటం లేదని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొనడం గమనార్హం. – అమితాబ్ తివారీ, ఆర్థిక రంగ విశ్లేషకులు (యాహూ సౌజన్యంతో) -
కందకంలో పడిన చిన్నారులు క్షేమం
-
పగిలిన మిషన్ భగీరధ పైప్‌లైన్
-
ఇంటింటికీ కుళాయి..ఎప్పటికోయి..!
జంగారెడ్డిగూడెం రూరల్: వేసవి ప్రారంభంలోనే జిల్లావాసుల గొంతెండిపోతోంది. ఒక పక్క ఎండలు ముదురుతున్నాయి. వేసవిలో ఏర్పడే నీటి ఎద్దడిని నివారించేందుకు చేపట్టాల్సిన పనులు సైతం ప్రణా ళికల స్థాయిలోనే ఉన్నాయి. తాగునీటి సమస్యను తీర్చేందుకు చేపట్టాల్సిన ఇంటింటికీ కుళాయి పథకం ప్రణాళిక దశలోనే ఉంది. జిల్లాలో మధ్యతరహా ప్రాజెక్టుగా పేరున్న జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎ ర్రకాలువ జలాశయం మంచినీటి పథకాలు ముందుకు సాగడం లేదు. ఇంకెంత కాలం జిల్లావాసులు తాగునీటి ఎద్దడిని అధిగ మించేందుకు గతేడాది గ్రామస్థాయి నుంచి ఇంటింటా కుళాయిలు ఏర్పాటు చేసేం దుకు జిల్లా యంత్రాంగం మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. జిల్లాలో ముంపు మండలాలు కుక్కునూరు, వేలేరుపాడు మినహా 46 మండలాల పరిధిలో సమగ్ర ప్రణాళికలు రూపొందించారు. ఈ పథకం ఇంకా కార్యరూపం దాల్చలేదు. సర్వే మొదలైందని అధికారులు చెబుతున్నారు. మరో రెండు నెలలు పట్టే అవకాశం ఉందని అంటున్నారు. రూ.4.71 కోట్లతో యాక్షన్ ప్లాన్ వేసవిలో తాగునీటి ఎద్దడిని గుర్తించి ఆయా గ్రామాల్లో అవసరాన్ని తీర్చే క్రమంలో భాగంగా ఆర్డబ్ల్యూఎస్ శాఖ రూ.4 కోట్ల 71 లక్షల యాక్షన్ ప్లాన్‌ను రూపొం దించింది. 377 గ్రామాల్లో నీటి అవసరాలు తీర్చేందుకు ఈ నిధులు వినియోగించనున్నారు. ఎర్రకాలువపై నీటి పథకాలసాకారం ఎప్పటికో.. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెం కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం ఏడాదంతా నీటితో కళకళలాడుతుంది. మెట్ట రైతులకు సాగునీటి అవసరార్థం నిర్మించిన ఈ జలాశయ నీటిని శుద్ధి చేసి గ్రామీణ ప్రాంతాలకు తాగునీటి అందించాలనే లక్ష్యంతో గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా రూ.5 కోట్ల నిధులతో మంచినీటి పథకాన్ని ప్రారంభించారు. జలాశయం నీటిని ఇక్కడ నిర్మించిన ట్యాంకుల ద్వారా ఫిల్టర్ చేసి జంగారెడ్డిగూడెం మండలంలో 21 పంచాయతీల్లోని గ్రామాలను నీటిని అందించేందుకు ఈ పథకాన్ని ఏర్పాటుచేశారు. అయితే అనుకున్న లక్ష్యం మేర తాగునీరు గ్రామాలకు అందటం లేదు. ఈ మంచినీటి పథకం ప్రారంభించి ఏళ్లు దాటుతున్నా పూర్తిస్థాయిలో తాగునీటి అందడం లేదు. 8 గ్రామాలకు 5 లక్షల లీటర్ల నీటిని మాత్రమే జలాశయం అందిస్తున్నారు. ఎ.పోలవరం, చిన్నంవారిగూడెం, పిషరీస్ కాలనీ, చల్లావారిగూడెం, తాడువాయి, మాన్నతగూడెం, జొన్నవారిగూడెం మంగిశెట్టిగూడెం, గొల్లగూడెం గ్రామాలకు మరికొద్ది రోజుల్లో నీటిని సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ గ్రామాలకు కూడా నీటి సరఫరా జరిగితే మరో 5 లక్షల లీటర్ల నీరు పంపిణీ అవుతోంది. దీంతో పలుగ్రామాల్లో మంచినీటి ఎద్దడితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఇదే జలాశయం నుంచి జంగారెడ్డిగూడెం నగర పంచాయతీకి మంచినీటి అందించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చింది. రూ.88 కోట్లలో 10 శా తం నగరపంచాయతీ, 10 శాతం ప్రభుత్వం, మిగిలిన 80 శాతం ఏషియన్ బ్యాం కు రుణంతో పనులు చేపట్టేలా ప్రణాళికలు రూపొందించారు. పథకంలో భాగంగా ట్యాంకులు నిర్మించి 41 లక్షల లీటర్ల ఎర్రకాలువ జలాశయం నీటిని స్టోర్ చేస్తారు. అయితే ప్రస్తుతం ఈ పథకం ప్రారంభం కావడానికి మరింత ఆలస్యం జరిగే అవకాశం ఉంది. సర్వే మొదలైంది ఇంటింటికీ కుళాయి కనెక్షన్ ఏర్పాటుపై సర్వే మొదలైంది. వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు మునిగిపోయే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఈ మండలాలు మినహా జిల్లా అంతా ఈ పథకం వర్తిస్తుంది. డీపీఆర్‌లు సిద్ధం చేస్తున్నాం. మరో నెల, రెండు నెలల్లో పూర్తయి అందుబాటులోకి ఈ పథకం రానుంది. ఈ వేసవిలో తాగునీటి అవసరాల కోసం రూ.4.71 కోట్లతో యాక్షన్ ప్లాన్ రూపొందించాం.– అమరేశ్వరరావు, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ -
పైప్‌లైన్ మరమ్మతు.. తాగునీటి సరఫరా
► ‘తాగునీటి తండ్లాట’ తీర్చిన అధికారులు నార్నూర్(ఆసిఫాబాద్): ఆదిలాబాద్ జిల్లా నార్నూర్ మండలం మాదాపూర్, అన్నాభావ్‌సాఠెనగర్, మాదాపూర్ గూడేల్లో 40 ఏళ్లుగా ఎదుర్కొంటున్న నీటి సమస్యకు పరిష్కారం లభించింది. శుక్రవారం ‘సాక్షి’ మెయిన్ పేజీలో ‘తాగునీటి తండ్లాట’శీర్షికన ప్రచురితమైన కథనానికి అధికారులు స్పందించారు. ఆయా గ్రామాల్లో 500 జనాభా ఉండగా.. మూడు చేతిపంపులు ఉన్నా పని చేయడం లేదని, పదేళ్లుగా నిరుపయోగంగా ఉన్నాయనే విషయాన్ని ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న చిత్తగూడ సమీపంలోని బావి నుంచి పైప్‌లైన్ ద్వారా ట్యాంక్‌కు నీటి సరఫరా చేసేవారు. పైప్‌లైన్ మరమ్మతులు చేపట్టకపోవడంతో నీటి సరఫరా కాక నిరుపయోగంగా మారింది. ఆయా గ్రామాల ప్రజల కష్టాలను ప్రచురించడంతో స్పందించిన అధికారులు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాన్ని సందర్శించారు. పైపులైన్ పనులకు మరమ్మతులు చేపట్టారు. ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ శ్రీనివాస్ దగ్గరుండి పనులను పర్యవేక్షించారు. మధ్యాహ్నం వరకు గ్రామంలో ఉన్న నీటిట్యాంక్‌కు నీటిని సరఫరా చేయడంతో గ్రామస్తులు ఆనందం వ్యక్తం చేశారు. సమస్యను వెలుగులోకి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు. -
ఔటర్ చుట్టూ జలహారం
⇒ఘన్పూర్ నుంచి ముత్తంగి వరకు భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ ⇒హైటెక్‌సిటీ సహా 4 మున్సిపల్ సర్కిళ్లకు తీరనున్న దాహార్తి ⇒60 గ్రామాలకు లబ్ది ⇒వ్యయం రూ.398 కోట్లు.. మార్గం 48 కి.మీ సిటీబ్యూరో: గ్రేటర్‌కు మణిహారంలా ఉన్న ఔటర్‌రింగ్ రోడ్డు(ఓఆర్ఆర్) చుట్టూ జలహారం ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి సరఫరా నిలిచిపోవడంతో ఈ భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ పనులకు జలమండలి త్వరలో శ్రీకారం చుట్టనుంది. ఈ భారీ పైప్‌లైన్ ఏర్పాటుతో పటాన్చెరు, ఆర్సీ పురం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిళ్లతో పాటు ఔటర్‌కు ఆనుకొని ఉన్న 60 గ్రామాల దాహార్తి సమూలంగా తీరనుంది.సుమారు రూ.398 కోట్ల అంచనా వ్యయంతో 48 కి.మీ మార్గంలో 1800 డయా వ్యాసార్థం గల భారీ మైల్డ్ స్టీల్ పైప్‌లైన్ ఏర్పాటు చేసి గోదావరి జలాలను నగరానికి సరఫరా చేయనున్నారు. జలహారం ఏర్పాటు ఇలా.. మంచిర్యాల జిల్లా ఎల్లంపల్లి నుంచి 186 కి.మీ దూరంలో ఉన్న నగరానికి జలమండలి నిత్యం 108 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలను తరలిస్తున్న విషయం విదితమే. నగర శివార్లలోని ఘన్పూర్ రిజర్వాయర్‌కు ఈ నీటిని తరలించి, అక్కడి నుంచి రింగ్‌మెయిన్ పైప్లైన్ల ద్వారా నగరం నలుమూలలకు సరఫరా చేస్తున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఘన్పూర్ నుంచి మంజీరా, సింగూరు సరఫరా వ్యవస్థలున్న ముత్తంగి (ఓఆర్ఆర్ జంక్షన్) వరకు భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్‌ను ఓఆర్ఆర్కు ఆనుకొని సుమారు 48 కి.మీ మార్గంలో ఏర్పాటు చేయనున్నారు. కాగా ఇప్పటికే ఘన్పూర్ రిజర్వాయర్ నుంచి రెండు రింగ్‌మెయిన్ పైప్లైన్లు అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఇందులో ఒక రింగ్‌మెయిన్ కాప్రా, అల్వాల్, సైనిక్‌పురి ప్రాంతాలకు గోదావరి జలాలను సరఫరా చేస్తోంది. మరొకటి లింగంపల్లి, కుత్బుల్లాపూర్, కూకట్పల్లి, శేరిలింగంపల్లి ప్రాంతాల దాహార్తి తీరుస్తోంది. తాజాగా ఏర్పాటు చేయనున్న దానితో రింగ్‌మెయిన్ పైప్లైన్ల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. దీంతో గ్రేటర్ చుట్టూ వాటర్‌గ్రిడ్ ఏర్పాటు చేసినట్లైందని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ పైప్లైన్ల ఏర్పాటుతో కొరత ఉన్న ప్రాంతాలకు ఎక్కడి నుంచి అయినా నీటిని సరఫరా చేసే అవకాశం ఉండడం విశేషం. గంగా.. దాహార్తి తీర్చంగా ఈ భారీ రింగ్‌మెయిన్ పైప్‌లైన్ ద్వారా పటాన్చెరు, రామచంద్రాపురం, శేరిలింగంపల్లి, కుత్బుల్లాపూర్ మున్సిపల్ సర్కిళ్లు, జీహెచ్ఎంసీకి ఆవల, ఔటర్‌కు వెలుపలున్న సుమారు 60 గ్రామాల దాహార్తి సమూలంగా తీరనుంది. సమీప భవిష్యత్‌లో ఈ పైప్‌లైన్‌కు అనుసంధానంగా రేడియల్ మెయిన్ పైప్లైన్ల ఏర్పాటు చేసి ఓఆర్ఆర్ లోపలున్న సుమారు 200 గ్రామాల దాహార్తిని దశల వారీగా తీర్చే అవకాశం ఉందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి. త్వరలో టెండర్లు... ఈ పైప్‌లైన్ పనులకు ప్రభుత్వం ఇటీవలే పరిపాలన పరమైన అనుమతులు జారీ చేసింది. సుమారు రూ.398 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న ఈ పనులకు ప్రభుత్వం తాజా వార్షిక బడ్జెట్లో రూ.198 కోట్లు కేటాయించింది. మరో రూ.200 కోట్ల నిధులను హడ్కో రుణం నుంచి కేటాయించనున్నారు. ఈ నెలాఖరులోగా టెండర్లు ఖరారు చేసి నాలుగు నెలల్లో పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. -
ఔటర్ చుట్టు జలహారం
∙రూ.400 కోట్లతో పనులు.. ∙తొమ్మిది నెలల్లో పూర్తి ∙కృష్ణా, గోదావరితో నీటి సరఫరాకు ఏర్పాట్లు ∙నీటి వృథాపై సర్వే.. వాణిజ్య నల్లాలపై నజర్ ∙జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ దానకిశోర్ సిటీబ్యూరో: రాజధానికి మణిహారంలాంటి ఔటర్ రింగ్‌రోడ్డు చుట్టూ భారీ మంచినీటి పైప్‌లైన్ (రింగ్‌మెయిన్)తో గ్రేటర్ వాటర్ గ్రిడ్ ఏర్పాటుకు జలమండలి శ్రీకారం చుడుతోంది. ఇందుకు రూ.400 కోట్ల అంచనా వ్యయంతో సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధంచేసి తాజాగా రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పించింది. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పదిరోజుల్లో ఈ పనులకు టెండర్లు పిలిచి.. 9 నెలల్లో పనులు పూర్తి చేసేందుకు అధికారులు ప్రణాళిక సిద్ధం చేశారు. మహా నగరానికి సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రత్యామ్నాయంగా ఈ గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. దీనిద్వారా ఎల్లంపల్లి నుంచి ప్రస్తుతం సిటీకి తరలిస్తున్న 116 మిలియన్ గ్యాలన్లకు అదనంగా.. మరో 54 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరం నలుమూలలకు సరఫరా చేసేందుకు వీలవుతుంది. ఇందుకోసం 1800 డయా వ్యాసార్థం గల భారీ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే సింగూరు, మంజీరా నీటి సరఫరా వ్యవస్థలున్న పటాన్చెరు, రామచంద్రాపురం, కుత్బుల్లాపూర్ ప్రాంతాల దాహార్తి సమూలంగా తీరుతుంది. ప్రస్తుతం జంట జలాశయాలు, సింగూరు, మం జీరా జలాశయాల నుంచి నీటిసరఫరా లేకున్నా కృష్ణా, గోదావరి నుంచి నిత్యం 372 మిలియన్ గ్యాలన్ల నీటిని నగరానికి తరలించి సరఫరా చేస్తున్నారు. ఖైరతాబాద్‌లోని జలమండలి ప్రధాన కార్యాలయంలోసోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ ఎం.దానకిశోర్.. ఈడీ సత్యనారాయణ, డైరెక్టర్లు శ్రీధర్‌బాబు, ఎల్లాస్వామి, సత్య సూర్యనారాయణతో కలిసి ఈ వివరాలను వెల్లడించారు. రుతుపవనాలు కరుణిస్తే ఈ ఏడాది జూలై నుంచి నగరంలో రోజూ నీటి సరఫరాకు ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రస్తుతం 170 బస్తీల్లో 10 వేల నల్లాలకు రోజూ నీటి సరఫరా చేస్తున్నామని తెలిపారు. ఔటర్ గ్రామాలకు తీరనున్న దాహార్తి.. వచ్చే వేసవి (2018 మే) నాటికి ఔటర్ రింగ్‌రోడ్డుకు లోపలున్న 190 గ్రామాలు, నగర పంచాయతీల దాహార్తిని తీర్చేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు దానకిశోర్ తెలిపారు. రూ.628 కోట్లతో యాన్యుటీ విధానంలో చేపట్టనున్న పనులకు సింగిల్ టెండరు దాఖలైంది. దీంతో ఇటీవల ఈ టెండరును రద్దుచేసి తాజాగా టెండర్లు పిలవనున్నట్లు చెప్పారు. ఇందులో పలు సంస్థలు పాల్గొనేందుకు వీలుగా వడ్డీరేటులో సడలింపు, 70 శాతం పనులు పూర్తయిన తరవాతే కమర్షియల్ ఆపరేషన్స్ డేట్ వర్తింపు వంటి అంశాల్లో వెసులుబాటు కల్పించామన్నారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడిపై సర్పంచ్‌లతో పాటు రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల కలెక్టర్లు, గ్రామీణ తాగునీటి సరఫరా విభాగం అధికారులతో చర్చించి దాహార్తిని తీర్చేందుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. శరవేగంగా హడ్కో పనులు శివారు మున్సిపల్ సర్కిళ్ల పరిధిలో రూ.1900 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టిన తాగునీటి పథకం పనుల్లో మొత్తం 2,600 కి.మీ. పైప్‌లైన్ వ్యవస్థకు ఇప్పటి వరకు 908 కి.మీ. పైప్లైన్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఈనెలలో 20, ఏప్రిల్‌లో 15, మేలో మరో 15, జూన్‌లో 10 భారీ స్టోరేజీ రిజర్వాయర్లను పూర్తి చేస్తామన్నారు. పనుల్లో నాణ్యత లోపించకుండా 10 మంది ఇంజినీర్లతో నాణ్యతా తనిఖీ బృందం ఏర్పాటు చేశామని, బయటి ఏజెన్సీలతో నాణ్యత పరీక్షలు నిర్వహిస్తున్నామని చెప్పారు. కృష్ణా ఫేజ్–2 పైప్‌లైన్ పనులకు 3 కి.మీ. మార్గంలో మరమ్మతులు చేపట్టి నీటి వృథాను అరికట్టడం ద్వారా పాతనగరానికి ఈ వేసవిలో 25 మి.గ్యాలన్ల జలాలను అదనంగా సరఫరా చేస్తామన్నారు. జంటజలాశయాలపై అధ్యయనం.. జంట జలాశయాల పరిరక్షణకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ అధ్యయనం చేస్తుందని, ఈ అంశంపై గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలు, సుప్రీంకోర్టు తీర్పు మేరకు పరిరక్షణ చర్యలు తీసుకుంటామన్నారు. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలకు తావులేదన్నారు. ప్రస్తుతం 43 శాతం ఉన్న నీటి సరఫరా నష్టాలను తగ్గించేందుకు నారాయణగూడ, ఎస్.ఆర్.నగర్, మారేడ్‌పల్లి డివిజన్లలో ప్రయోగాత్మకంగా శాస్త్రీయ సర్వే చేస్తామని తెలిపారు. వచ్చే నాలుగు నెలల్లో ఈసర్వే పూర్తవుతుందన్నారు. రెవెన్యూ నష్టాలను తగ్గించే దిశగా ఇటీవల రూ.46 కోట్ల మొండి బకాయిలు వసూలు చేశామన్నారు. వాణిజ్య నల్లాల గుర్తింపునకు 360 డిగ్రీ సర్వేకు ఉన్నతాధికారులను రంగంలోకి దించామన్నారు. గృహ వినియోగ కేటగిరీ కింద ఉన్న 5,942వాణిజ్య భవంతులను గుర్తించామన్నారు. దెబ్బతిన్న పైప్లైన్లను గుర్తించేందుకు గ్రౌండ్ పెనిట్రేటషన్ రాడార్ సాంకేతికత, ఎన్జీఆర్ఐ సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. నెక్లెస్‌రోడ్‌లో దెబ్బతిన్న భారీ సీవరేజీ పైప్‌లైన్‌ను క్యూర్డ్ ఇన్ప్లేస్పైప్ సాంకేతికతతో మరమ్మతులు చేపట్టనున్నట్లు వివరించారు. -
గ్యాస్ తుస్
ఐదేళ్లుగా పురో‘గతి’ లేని బీజీఎల్ పథకం చింతల్ దాటని పైప్‌లైన్ పనులు ఇప్పటికీ అందని వంటగ్యాస్ సిటీబ్యూరో: మహానగరంలో ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యం నీరుగారుతోంది. ఐదేళ్ల క్రితం ఆర్భాటంగా ప్రారంభమైన ప్రాజెక్టు ఆచరణలో చతికిలబడింది. పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ చౌకగా అందుతుందన్న నగరవాసుల ఆశలపై నత్తనడకన సాగుతున్న పైప్‌లైన్ పనులు నీళ్లు చల్లుతున్నాయి. ప్రాజెక్టు ప్రారంభమై ఐదేళ్లు గడిచినా కనీసం 30 శాతం పైప్‌లైన్ పనులు కూడా పూర్తి కాలేదు. నాలుగేళ్ల నుంచి పైప్లైన్ల పనుల తీరు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఐదేళ్లక్రితం ఆర్భాటం.. సరిగ్గా ఐదేళ్ల క్రితం నగర శివారులోని రంగారెడ్డి జిల్లా శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటుచేసి ఇంటింటికీ పైప్డ్ నాచురల్ గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలని నిర్ణయించారు. అందుకు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజేఎల్) సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు అమలుకు శ్రీకారం చుట్టింది. తొలుత శామీర్‌పేట మదర్ స్టేషన్‌కు సమీపంలో గల నల్సార్ విశ్వవిద్యాలయం క్యాంపస్‌లోని గృహ సముదాయాల్లోని 30 ఫ్లాట్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందించారు. తర్వాత సమీపంలోని మేడ్చల్ మండల కేంద్రంలో వెయ్యి కనెక్షన్లు ఇవ్వాలని నిర్ణయించినా 410 కుటుంబాలకు మాత్రమే వంటగ్యాస్ కనెక్షన్లు ఇచ్చారు. ఆ తర్వాత సుచిత్ర, కొంపల్లి, జీడిమెట్ల ప్రాంతాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్ణయించారు. అయితే పైప్‌లైన్ పనులు మాత్రం చింతల్ దాటలేదు. మరోవైపు ఇప్పటికే కనెక్షన్లు అందించిన వినియోగాదారులకు సైతం పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేసేందుకు బీజీఎల్ ఆపసోపాలు పడుతోంది. సీఎన్జీ కూడా అంతంతే.. మహానగరానికి పూర్తి స్థాయిలో సీఎన్జీని అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం మందుకు సాగడం లేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులోకి తెచ్చినప్పటికీ కొంతకాలంగా గ్యాస్ కొరతతో గ్రిడ్ నుంచి స్టేషన్లకు డిమాండ్‌కు తగ్గ సరఫరా చేయలేక పోతోంది. వాస్తవంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణాకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలకు సగటున రోజుకు 7,62,500 కిలోల (1.067 ఎంఎంఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరమని బీజేఎల్ అంచనా వేసింది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డిపోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 164 బస్సులకు మాత్రమే సరఫరా చేస్తోంది. దీంతో 236 బస్సులు డిపోల్లోనే మూలుగుతున్నాయి. ఇక నగరంలో ఏర్పాటు చేసిన సీఎన్జీ స్టేషన్ల ద్వారా 23 వేల వాహనాలకు మాత్రమే గ్యాస్ సరఫరా చేస్తోంది. వాస్తవంగా ప్రతిరోజు నగరంలోని సీఎన్జీ వినియోగదారుల నుంచి 20 వేల కిలో లీటర్లకు పైగా డిమాండ్ ఉంది. కానీ, ప్రతినిత్యం 12 వేల కిలో లీటర్లకు మించి సరఫరా కావడం లేదని డీలర్లు వాపోతున్నారు. పురోగతి లేని పైప్‌లైన్ పనులు భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ ఐదేళ్ల క్రితం ప్రాజెక్టు కోసం రూపొందించిన ప్రణాళిక లక్ష్యానికి తగ్గట్టు పురోగతి సాధించలేకపోయింది. ఇప్పటిదాకా శామీర్‌పేట నుంచి చింతల్ వరకు 33.55 కిలో మీటర్ల మేర మాత్రమే పనులు జరిగాయి. తాజాగా బాలాపూర్ వరకు పైప్‌లైన్ పనులు జరుగుతున్నాయి. గత మూడేళ్లలో పైప్‌లైన్ పనులను పరిశీలిస్తే సరిగ్గా మూడు కిలో మీటర్లు కూడా పూర్తికానట్టు ప్రగతి నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. రూ.733 కోట్లతో ప్రాజెక్టు.. మహానగరానికి ఇంటింటికీ పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ రూ.733 కోట్లతో ప్రణాళిక వేసింది. వచ్చే 20 ఏళ్లలో రూ.3,166 కోట్లతో సిటీగ్యాస్ డిస్ట్రిబ్యూషన్‌ను కూడా విస్తరించాలని నిర్ణయించింది. కానీ కొంతకాలం గ్రిడ్ నుంచి సరైన గ్యాస్ సరఫరా లేక, ఆ తర్వాత పైప్‌లైన్ వేసే మార్గంలో క్లియరెన్స్ రాక పనులు ముందుకు సాగలేదు. ఇప్పుడు తాజాగా పనులు ప్రారంభమయ్యాయి. -
జిల్లా మీదుగా ఐవోసీ పైపులైన్
కామవరపుకోట : ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) ఉత్పత్తి చేసే ఆయిల్‌ను పరదీప్ నుంచి హైదరాబాద్ వరకు పైపులైన్ ద్వారా సరఫరా చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ప్రాజెక్ట్ కాంపినెంట్ అధారిటీ అనిల్ జెస్సీ తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో రైతుల పొలాల మీదుగా 1,150 కిలోమీటర్ల మేర పైపులైన్ వేయనున్నామన్నారు. సర్వే ఆధారంగా ఒక్కో రైతు పొలంలో 18 మీటర్ల మేర భూమి తీసుకుంటామని, ఇందుకు మార్కెట్ విలువలో పదో వంతు ధర చెల్లిస్తామన్నారు. తూర్పు, పశ్చిమ, కృష్ణా జిల్లాల్లో 31 మండలాల్లో 34 గ్రామాల ద్వారా పైపులైన్ వెళుతుందని చెప్పారు. కామవరపుకోట మండలంలో యడవల్లి, రామన్నపాలెం, కామవరపుకోట, మంకినపల్లి, మైసన్నగూడెం, ఆర్.నాగులపల్లి, గుంటుపల్లి గ్రామాల మీదుగా పైపులైన్ వెళుతుందన్నారు. ఆయా గ్రామాల్లో సర్వే పూర్తయ్యిందని చెప్పారు. పైపులైన్‌తో ప్రయోజనాలెన్నో.. పైపులైన్ ద్వారా ఆయిల్ సరఫరా వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఐఓసీ చీఫ్ కనస్ట్రక్షన్ మేనేజర్ ప్రసాద్ తెలిపారు. ట్యాంకర్లు, వ్యాగన్ల వంటి వాటి ద్వారా సరఫరా చేయడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతోందన్నారు. అంతే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, ఇతర ఉపద్రవాలు ఏర్పడినప్పుడు ఆయిల్ సరఫరాకు ఆటంకం ఉందన్నారు. విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, హైదరాబాద్‌లో ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. -
పైపులైన్ల ద్వారా వంటగ్యాస్
ఏలూరు (మెట్రో) జిల్లాలో పైపుల ద్వారా ఇంటింటా వంటగ్యాస్ అందించే కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుందని 2017లో ప్రతి ఇంటికీ పైపు ద్వారా వంటగ్యాస్ అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ కాటంనేని బాస్కర్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్, గోదావరి గ్యాస్ ప్రయివేటు లిమిటెడ్ కార్పొరేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటా పైపు ద్వారా వంటగ్యాస్, వాహనాలకు సిఎన్జి గ్యాస్ ఫిల్లింగ్ స్టేషన్లు ఏర్పాటుపై శనివారం రాష్ట్ర గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.రమేష్, ఇంజనీర్ ఆదిత్యతో కలెక్టర్ చర్చించారు. జిల్లాలో 30 కోట్ల రూపాయల వ్యయంతో సిఎన్జి మదర్ స్టేషన్‌ను ఏర్పాటుతోపాటు పెద్ద ఎత్తున జిల్లా అంతటా ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసి 2018 సంవత్సరం నాటికల్లా పూర్తిస్థాయిలో అందరికీ ఇంటి వద్దే తాగునీరులా వంటగ్యాస్ పైపులైన్ ద్వారా వినియోగించుకునే సౌకర్యాన్ని కల్పించనున్నట్లు కలెక్టర్ భాస్కర్ చెప్పారు. ఏలూరు సమీపంలోని కొప్పాకలో ఉన్న గెయిల్ గ్యాస్ స్టేషన్ నుండి ఏలూరులో సిటీ గేట్ స్టేషన్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ఏలూరు నగర వాసులకు ప్రథమంగా ప్రత్యేక పైపులైను ద్వారా వంటగ్యాస్ సరఫరా చేస్తామన్నారు. రానున్న సంవత్సరంలో ఏలూరు అంతటా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయనున్నట్లు కలెక్టర్ చెప్పారు. బీమడోలు సమీపంలోని ఎం గాగులపలి, తణుకు సమీపంలోని పెరవలి, భీమవరంలలో ప్రస్తుతం గెయిల్ గ్యాస్ స్టేషన్లు ఉన్నాయనీ అక్కడి నుండి సమీప ప్రధాన కేంద్రాలను కలిపేందుకు గేట్ స్టేషన్లు రహదార్ల పక్కనే ఏర్పాటు చేసేందుకు అవసరమైన ప్రబుత్వ స్థలాన్ని కేటాయిస్తామని ఈ మేరకు ఏలూరు, కొవ్వూరు ఆర్‌డిఒలతో త్వరలో ప్రభుత్వ స్థలాలను సిద్ధం చేయాలని కలెక్టర్ ఆదేశించారు. గ్యాస్ కంపెనీ కార్యాలయాన్ని తాత్కాలికంగా ఏలూరులో ఏర్పాటు చేసేందుకు కలెక్టరేట్ సమీపంలోని కేంద్రీయ విద్యాలయ భవనాన్ని కేటాయిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ పులిపాటి కోటేశ్వరరావు, అదనపు జాయింట్ కలెక్టర్ షరీఫ్, ఆర్‌డిఒలు నంబూరి తేజ్‌భరత్, బి.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
దేవాదుల పైప్‌లైన్ గేట్‌వాల్వ్ లీకేజీ
శాయంపేట : భీంఘన్‌పూర్ రిజర్వాయర్ నుంచి ఫేజ్–1 పైప్‌లైన్ ద్వారా గోదావరి జలాలను పులుకుర్తి పంప్‌హౌస్‌కు దేవాదుల అధికారులు కొద్దిరోజులుగా పంపింగ్ చేస్తున్నారు. ఈ క్రమంలో మండలంలోని గోవిందాపూర్, పరకాల మండలం కామారెడ్డిపల్లి గ్రామాల శివారులో ఉన్న ఫేజ్–1 పైప్‌లైన్ గేట్‌వాల్వ్ వద్ద రెండు రోజులుగా లీక్ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే, సోమవారం పూర్తి స్థాయిలో గేట్‌వాల్వ్ లీకేజీ కావడంతో నీరు ఎగిసిపడింది. ఇలా బయటకు వచ్చిన నీరు పక్కనే ఉన్న ముప్పవాని చెరువులోకి చేరింది. -
పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలి
హుజూర్నగర్ : పట్టణంలోని ప్రధాన రహదారిపై తాగునీటి పైపులైన్ మరమ్మతు పనులు పూర్తి చేయాలని కోరుతూ కాంగ్రెస్, టీడీపీ, సీపీఎం నాయకులు ఆదివారం రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బేతవోలు నుంచి పట్టణానికి నీటి సరఫరా జరిగే పైపులైన్ లీకేజీ వల్ల రహదారి ధ్వంసమైందన్నారు. పైపులైన్ మరమ్మతుల పేరుతో ప్రతిసారీ గుంతలు తీసి రోజుల కొద్దీ ఉంచడం వల్ల ఇబ్బందులు ఏర్పడుతున్నాయన్నారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలకు గుంతలు నీటితో నిండి ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. నగరపంచాయతీ, ఆర్అండ్బీ అధికారులు స్పందించి నూతన పైపులైన్ నిర్మాణం చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో డీసీసీ అధికార ప్రతినిధి ఎండి.అజీజ్‌పాషా, టీడీపీ పట్టణ అధ్యక్షుడు అట్లూరి హరిబాబు, సీపీఎం మండల కార్యదర్శి ములకలపల్లి సీతయ్య, చిలకరాజు లింగయ్య, అహ్మద్‌హుస్సేన్, బెల్లంకొండ గురవయ్య, కోల మట్టయ్య, ఆయూబ్, వెంకటేశ్వర్లు, వెంకన్న, వీరబాబు, శేఖర్, జాలగురవయ్య, నాగరాజు, సలీం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ట్యాపు తిప్పితే గ్యాస్
పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ సరఫరా విజయవంతంగా 225 ఇళ్లకు సరఫరా త్వరలో నగరమంతటా విస్తరణకు గెయిల్ గ్యాస్ లిమిటెడ్ సన్నాహాలు బెంగళూరు: నగర మహిళలకు శుభవార్త. గ్యాస్ అయిపోయింది. ఎప్పుడు సిలెండర్ వస్తుందో అని చింతించనక్కరలేదు. 24 గంటల పాటు 365 రోజులూ కొళాయి తరహాలో పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా కానుంది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే 225 ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను విజయవంతంగా సరఫరా చేసి సంతృప్తికర ఫలితాలు పొందిన అధికారులు ఈ ప్రాజెక్టును నగరమంతటా విస్తరింపజేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు. ప్రస్తుతం వంటింట్లో గ్యాస్ అయిపోయిన తర్వాత గ్యాస్ బుక్ చేస్తే గరిష్టంగా పది రోజుల తర్వాత సిలెండర్ అందుతోంది. దీంతో గృహిణులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరోవైపు ఒక సారి సిలెండర్ బుక్ అయిన తర్వాత కనీసం 20 రోజుల పాటు మరో సిలెండర్ బుక్ చేయడానికి వీలు ఉండదు. (ఈ నిబంధనలు ఒక కంపెనీ నుంచి మరో కంపెనీకు మారుతుంటాయి). ఇటు వంటి సమస్యను పరిష్కరించడంలో భాగంగా గెయిల్ గ్యాస్ లిమిటెడ్ పైప్‌లైన్ ద్వారా గ్యాస్‌ను (పీఎన్జీ) సరఫరా చేయడానికి ముందుకు వచ్చింది. మహారాష్ట్రలోని దబోల్ నుంచి బెంగళూరు వరకూ 1,386 కిలోమీటర పొడవున పైప్‌లైన్ ఏర్పాటైంది. ఈ పైప్ లైన్ ద్వారా ప్రస్తుతం హెచ్.ఎస్.ఆర్ లేఅవుట్, బెల్లందూర్, సింగసంద్ర, డాలర్స్కాలనీ, మంగమ్మనపాళ్యలో సరఫరా చేయడానికి బృహత్ బెంగళూరు మహానగర పాలికే నుంచి అనుమతి కూడా పొందింది. పెలైట్ ప్రతిపాదికన ఇప్పటికే హెచ్ఎస్ఆర్ లే అవుట్ (సెక్టార్-2)లోని 225 ఇళ్లకు ఇప్పటికే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తేంది. మరో 7,000 మంది పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను పొందడానికి వీలుగా ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. పీఎన్జీ కనెక్షన్ కోసం రూ.5,800 సెక్యూరిటీ డిపాజిట్‌గా కట్టాల్సి ఉంటుంది. ఇక గ్యాస్ బిల్లును రెండు నెలలకు ఒకసారి చెల్లించాల్సి ఉంటుంది. ఈ విషయమై సంస్థ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ... ‘ప్రస్తుతం గృహ అవసరాలకు మాత్రమే పైప్ లైన్ ద్వారా గ్యాస్‌ను సరఫరా చేస్తున్నాం, ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే వాణిజ్య అవసరాలకు సంబంధించి కూడా గ్యాస్‌ను సరఫరా చేస్తాం. 2017 ఫిబ్రవరిలోపు నగరంలోని 25 వేల మందికి పైప్ ద్వారా గ్యాస్‌ను అందజేయాలన్నది లక్ష్యంగా నిర్ణయించుకున్నాం.’ అని పేర్కొన్నారు. -
వంటింటికి మహాభాగ్యం!
* లక్ష ఇళ్లకు గ్యాస్ పైప్‌లైన్ * బీజీఎల్ విస్తరణకు కేంద్రం చర్యలు * కేంద్రమంత్రి ప్రకటనతో చిగురించిన ఆశలు సాక్షి, సిటీబ్యూరో: మహానగరానికి పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్ అందించే ప్రాజెక్టులో కదలిక వచ్చింది. ఐదేళ్లుగా సా...గుతున్న పనులు.. కేంద్ర పెట్రోలియం మంత్రి ప్రకటనతో ఆశలు చిగురించాయి. వచ్చే రెండేళ్లలో లక్ష ఇళ్లకు, ఐదేళ్లలో రెండున్నర లక్షల ఇళ్లకు పైప్‌లైన్ ద్వారా పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ)ని అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ రూపొందించింది. ఇందుకోసం నగరానికి పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేస్తున్న భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ (బీజీఎల్) సంస్థను బలోపేతం చేయనుంది. సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టును సైతం విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే అదనంగా పైప్లైన్ల నిర్మాణానికి టెండర్ల ప్రక్రియ కూడా పూర్తయింది. వంట గ్యాస్‌తో పాటు సీఎన్జీ స్టేషన్లను కూడా పెంచేందుకు చర్యలు చేపట్టింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ హైదరాబాద్ పర్యటన సందర్భంగా పైప్‌లైన్ పనులపై బీజీఎల్ ప్రతినిధులతో చర్చించారు. మరోమారు క్షేత్ర స్థాయి పరిశీలన కోసం కేంద్ర మంత్రి నగరానికి రానున్నారు. ఐదేళ్లుగా నత్తనడకనే.. హైదరాబాద్‌లో ఇంటింటికి పైప్‌లైన్ ద్వారా వంట గ్యాస్ (పీఎన్జీ), వాహనాలకు కంప్రెస్డ్ నాచురల్ గ్యాస్ (సీఎన్జీ) అందించాలన్న లక్ష్యంతో ప్రారంభమైన ‘భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్’ (బీజీఎల్) సంస్థ సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టు పనులు ఐదేళ్లుగా ఒక అడుగు ముందుకు మూడడుగులు వెనక్కి అన్న చందంగా సాగుతున్నాయి. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను ఏర్పాటు చేసి 2011 నవంబర్ 21న సిటీ ప్రాజెక్టుకు బీజీఎల్ శ్రీకారం చుట్టింది. ఐదేళ్లలో 2.66 లక్షల కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా వంటగ్యాస్, 50 స్టేషన్ల ద్వారా సీఎన్జీ గ్యాస్ అందించాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. మొదటి విడతగా 2014 ఏప్రిల్ నాటికి లక్ష కుటుంబాలకు పైప్‌లైన్ ద్వారా గ్యాస్ సరఫరా చేయాలని లక్ష్యంగా నిర్ణయించింది. అయితే, ఇప్పటికి కేవలం 1140 ఇళ్లకు మాత్రమే సరఫరా చేసింది. భాగ్యనగర్ గ్యాస్ లిమిటెడ్ సంస్థ పీఎన్జీ, సీఎన్జీ విస్తరణ కోసం రూపొందించిన ప్రణాళిక కూడా కాగితాలకే పరిమితమైంది. ఐదేళ్లలో శామీర్‌పేట నుంచి కుత్బుల్లాపూర్ వరకు 33 కిలో మీటర్ల పనులు మాత్రమే జరిగాయి. బంజారాహిల్స్, మాదాపూర్, జూబ్లిహిల్స్ ప్రాంతాలకు సైతం పైప్‌లైన్ నిర్మాణ పనులు పడకేశాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించడంతో పనుల్లో కదలికలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎన్జీ అంతంతే.. భాగ్యనగరాన్ని పూర్తి స్థాయిలో సీఎన్జీ అందుబాటులోకి తెచ్చే ప్రక్రియ సైతం ఆచరణకు నోచుకోలేదు. శామీర్‌పేటలో మదర్ స్టేషన్‌ను నిర్మించి సీఎన్జీని అందుబాటులో తెచ్చినా.. డిమాండ్‌కు తగ్గట్టు గ్రిడ్ నుంచి గ్యాస్ సరఫరా లేదు. వాస్తవంగా నగరంలో ప్రజా రవాణకు వినియోగించే 85 వేల ఆటోలు, 7,500 బస్సులు, 20 వేలకు పైగా టాక్సీలు ఉన్నాయి. వీటికి రోజుకు సగటున 7,62,500 కిలోల (1.067 ఎస్‌సీఎండీ) సీఎన్జీ అవసరం ఉంటుందని బీజీఎల్ అంచనా వేసింది. అందుకు అనుగుణంగా సరఫరా చేయాలని సంస్థ సిద్ధమైంది. ప్రాజెక్టు ప్రారంభించిన తొలిదశలో మేడ్చల్, హకీంపేట, కంటోన్మెంట్ తదితర డి పోలకు చెందిన 350 ఆర్టీసీ బస్సులకు సీఎన్జీ సరఫరా చేస్తామని ప్రకటించింది. అయితే, కొద్ది రోజులు 164 బస్సులకు సరఫరా చేసి, ప్రస్తుతం 110 బస్సులకే పరిమితమైంది. నగరంలో మొత్తం 20 సీఎన్జీ స్టేషన్లు ఉండగా, అందులో ఆర్టీసీకి 3, ప్రయివేటు వాహనాల కోసం 17 ఉన్నాయి. వీటిలో రెండింటిని బీజీఎల్ సంస్థ నిర్వహిస్తోంది. ప్రస్తుతం నగరంలో సీఎన్జీ వాహనాలు 23 వేలకు మించి లేవు. ఢిల్లీలో మాత్రం 10 లక్షల వాహనాలు ఉన్నాయి. నగరంలో సైతం అదే స్థాయిలో విస్తరించేందుకు మరిన్ని సీఎన్జీ బంకులను ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. -
గోదావరి పైప్‌లైన్‌ను పగులగొట్టారు..
సుల్తానాబాద్: కరీంనగర్ జిల్లా పెద్దపల్లి సమీపంలోని గోదావరి నుంచి హైదరాబాద్‌కు నీటిని తరలించే పైపులైన్‌ను టీడీపీ నాయకులు పగులగొట్టారు. శనివారం ఉదయం సుల్తానాబాద్ మండలం పూసాల గ్రామ సమీపంలో పైపును పగులగొట్టి నీటిని చెరువులు, కుంటలకు మళ్లించారు. జిల్లా ప్రజలు తాగునీరు దొరక్క అల్లాడుతుంటే నగరానికి సరఫరా చేయటమేంటని పైపు పగులగొట్టే కార్యక్రమానికి నేతృత్వం వహించిన టీడీపీ జిల్లా అధ్యక్షుడు విజయరామారావు అన్నారు. చెరువులు, కుంటలు నిండేదాకా ఈ కార్యక్రమం ఆగదని చెప్పారు. మన నీరు మనకే అని నినదించే టీఆర్ఎస్ నాయకులు ఈ విషయం గమనించాలని అన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలిని పరిశీలించి వెళ్లిపోయారు. -
మరో నాలుగు గ్రామాలకు గోదారమ్మ
గడువుకు ముందే పైప్‌లైన్ కనెక్షన్ హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు గజ్వేల్: గడువుకు ముందే గజ్వేల్ మండలంలోని ధర్మారెడ్డిపల్లి, గిరిపల్లి, బయ్యారం, బెజుగామ గ్రామాలకు గురువారం రాత్రి గోదావరి జలాలను అందించారు. ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు నేతృత్వంలో ‘మిషన్ భగీరథ’ గజ్వేల్ ఈఈ రాజయ్య ఆయా గ్రామాల్లో గోదావరి జలాల పైప్‌లైన్‌ను లింక్ చేశారు. కొన్ని రోజులుగా దాహార్తితో అల్లాడుతున్న ఈ గ్రామాలకు ‘గోదారమ్మ’ రావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘గడా’ ఓఎస్డీ హన్మంతరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో ‘మిషన్ భగీరథ’ పనులు వేగంగా సాగుతున్నాయని వెల్లడించారు. ఏప్రిల్ 30 నాటికి నియోజకవర్గంలోని 128 పంచాయతీలకు నీటి సరఫరా అందించేందుకు ముందుకు సాగుతున్నామని పేర్కొన్నారు. ‘మిషన్ భగీరథ’ అధికారులు చురుకుగా పనిచేయడం వల్లే ఇది సాధ్యమవుతుందన్నారు. ఈ సందర్భంగా గోదావరి జలాలను అందుకున్న ఆయా గ్రామాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. -
వ్యర్థాలన్నీ మా నెత్తిపైనా?
⇒ రూ.70 వేలకు మా బతుకులను పణంగా పెట్టమంటారా? ⇒ 45 కంపెనీల పైపులైన్‌కు ప్యాకేజీ ఇదేనా? ⇒ పైపులైన్‌తో మాకు భవిష్యత్తే ఉండదు ⇒ డిమాండ్లు నెరవేర్చే వరకు అనుమతిచ్చే ప్రసక్తే లేదు ⇒ కలెక్టర్ ఎదుట కుండబద్దలు కొట్టిన పూడిమడక గ్రామస్తులు విశాఖపట్నం: ‘45 కంపెనీల వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు పైపులైన్ వేస్తా మంటున్నారు. రసాయన వ్యర్థాలు సముద్రంలో కలిస్తే ఇక మాకు జీవనోపాధి ఎక్కడ ఉంటుంది. ఈ ప్రాంతంలో ఎక్కడైనా మత్స్యసంపద కాదు కదా.. కనీసం చేప పిల్లకూడా దొరకదు. మేం ఎలాబతకాలి. మా పిల్లల్ని ఎలా పోషించుకోవాలో మీరే చెప్పండి. మీరిచ్చే రూ.70 వేలకు మా వందేళ్ల జీవితాన్ని పణంగా పెట్టమంటారా?’ అంటూ అచ్యుతాపురం మండలం పూడిమడక గ్రామస్తులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ప్రతిసారి ఇలా కలెక్టరేట్లో సమావేశాలు పెట్టడం.. ప్యాకేజీ ఇస్తాం.. పైపులైన్ నిర్మాణానికి అడ్డుపడొద్దంటూ ఒత్తిడితేవడంసరి కాదు. మాప్రాంతంలో కాలుష్యం వెదజల్లే పరిశ్రమల ఏర్పాటుకు, కలుషిత వ్యర్థాలను మా గ్రామం వద్ద సముద్రంలో కలిపేందుకు అత్యుత్సాహం చూపే మీరు.. మా భవిష్యత్ కోసం ఆలోచించరా? అంటూ ప్రశ్నించారు. కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం పూడిమడక పైపులైన్ నిర్మాణ విషయమై మత్స్యకార సంఘాల నాయకులతో కలెక్టర్ డాక్టర్ ఎన్.యువరాజ్ ప్రత్యేక సమావేశం నిర్వహించారు. సమావేశంలో పూడిమడక గ్రామస్తుల తరపున మత్స్యకార సంఘాల నాయకులు మాట్లాడుతూ పైపులైన్ ఏర్పాటుకు తాము వ్యతి రేకం కాదని.. మా బతుకులకు భరోసా ఇవ్వమని మాత్రమే కోరుతున్నామని చెప్పారు. రూ.70 వేల ప్యాకేజీకి మేమంతా ఒప్పంకుంటున్నట్టు ప్రకటనలు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని, 45 కంపెనీలకు చెందిన పైపులైన్‌కు ఇచ్చే ప్యాకేజీ ఇదేనా అని వారు ప్రశ్నించారు. తక్షణమే మా గ్రామాన్ని పూర్తిగా దత్తత తీసుకొని అన్ని రంగాల్లో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పదవతరగతి విద్యార్హత ఉన్న ప్రతీ ఒక్కరికి రూ.6 వేల కనీస వేతనంతో ఆయా కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ట్రైనింగ్ పూర్తిచేసుకున్న 600 మందికి ఉపాధి కల్పించాలన్నారు. విద్యార్హత లేని 40ఏళ్ల నిండిన వారికి రిహేబిటేషన్ కార్డు ఇప్పించాలని కోరారు. ఏపీఎస్ఈజెడ్ పరిధిలో కనీసం 4వేల స్టయిఫండ్‌తో అన్నిరకాల ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇనిస్టిట్యూట్ ఏర్పాటుచేయాలని, ఇక్కడ ట్రైనింగ్ పూర్తి చేసిన ప్రతీ ఒక్కరికి స్థానిక పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. కులవృత్తుల వారికి పర్మినెంట్ వర్క్ కార్డు ఇప్పించాలని, అగ్రిమెంట్ ప్రకారమే కాకుండా ఏటా 150 నుంచి 200 మంది స్థాని క యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పైపులైన్ ద్వారా వచ్చే వ్యర్థాల వలన ఎన్టీపీసీ కంపెనీ ద్వారా వచ్చే కాలుష్యం బారిన పడి అనారోగ్యాల పాలవుతున్న గ్రామస్తుల కోసం ఓ ఉచిత మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మించాలన్నారు. గ్రామంలోని పిల్లలకు కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలని, ప్రకృతి వైపరీత్యాల నుంచి కాపాడేందుకు రక్షణ గోడతో పాటు జెట్టీ నిర్మించాలని కోరారు. ప్రతి ఒక్కరికి ఉద్యోగం: పైపులైన్ నిర్మాణ విషయంలో మత్స్యకార కుటుంబానికి ప్రత్యేక ప్యాకేజీ కింద రూ.70వేలు ఇస్తామని, ప్రతీ కుటుంబంలో అర్హులైన ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు. ఇప్పటికే సర్వే పూర్తయిందని. గ్రామంలో 398 మంది డిగ్రీ చదువు కున్నట్టు గుర్తించామని, మరికొంత మంది యువతకు సాంకేతిక విద్యార్హతలను బట్టి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. జెట్టీ నిర్మాణానికి అవసరమైన డీపీఆర్ తయారీకి ఏజెన్సీని త్వరలో ఖరారుచేస్తామని చెప్పారు. ఇతర డిమాండ్లను ప్రభుత్వానికి నివేదిస్తామని, సీజన్ దాటిపోకుండా ఆఫ్‌షోర్ పైపులైన్ నిర్మాణానికి గ్రామస్తులు అనుమతించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేసినా, మత్స్యకార సంఘ నాయకులు మాత్రం ససేమిరా అన్నారు. ప్యాకేజీ మొత్తాన్ని పెంచాల్సిందేనని, తాము సూచించిన డిమాండ్లను పరిష్కరించేంత వరకు పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటామని తేల్చి చెప్పారు. ఈ సమావేశంలో కలెక్టర్ జె.నివాస్, అనకాపల్లి ఆర్డీవో పద్మావతి, ఎస్డీసీ సత్తిబాబు, ఏపీఐఐసీ జెడ్ఎం యతిరాజు, మత్స్యశాఖ జేడీ కోటేశ్వరరావు, వైఎస్సార్సీపీ యలమంచిలి సమన్వయకర్త ప్రగడ నాగేశ్వరరావు, స్థానిక మత్స్యకార నాయకులు చినరాజలు, చేపల శ్రీరాములు, మేరుగ బాపు నాయుడు తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రవల్లి టూ మిషన్ భగీరథ పైప్‌లైన్
మెదక్: తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రం నుంచి మిషన్ భగీరథకు పైపులైన్ ఏర్పాటు చేశారు. రైట్ ఆఫ్ వే చట్టం కింద ఫాంహౌస్ నుంచి పైపులైన్ వేసినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. పైపులైన్ కోసం ఫాంహౌస్‌లో కొంతమేర అల్లం పంటను తొలగించినట్లు తెలిపారు. మిషన్ భగీరథకు అందరూ సహకరించాలని సీఎం కేసీఆర్ కోరారు. -
గ్యాస్ పైప్‌లైన్ లీకేజీ భారీగా మంటలు
-
రూ.1,400 కోట్లతో న్యాచురల్ గ్యాస్ పైప్‌లైన్
► కృష్ణపట్నంపోర్టులో ప్రత్యేక బెర్తు ఏర్పాటు ► 2017లో పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా ముత్తుకూరు/చిల్లకూరు: కృష్ణపట్నం పోర్టు కేంద్రంగా భారీ సహజ వాయువుల పైపులైను ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ సంస్థ రూ. 1,400 కోట్ల అంచనాలతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా చిల్లకూరు మండలంలోని తమ్మినపట్నంలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం కృష్ణపట్నం పోర్టులో ఎల్ఎన్జీ(లిక్విడ్ నాచురల్ గ్యాస్) బెర్తు నిర్మిస్తారు. ఇక్కడ నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఏర్పాటయ్యే పరిశ్రమలకే కాకుండా ఇఫ్కో, శ్రీసిటీ, మేనకూరు సెజ్‌లు, తొట్టంబేడు, ఏర్పేడు, మాంబట్టు, గుమ్మడిపూడి, మనాలి పారిశ్రామికవాడలకు గ్యాస్ సరఫరా చేస్తారు. 2017లో పూర్తయ్యే ఈ ప్రాజెక్టు ద్వారా ఎన్నూరు, నెల్లూరు, కృష్ణపట్నం, సుళ్లూరుపేట, రేణిగుంట వరకు పైపులైను ద్వారా గ్యాస్ సరఫరా చేస్తారు. తెలంగాణ, పాండిచ్చేరి, కర్ణాటక రాష్ట్రాలకు ట్రక్కుల ద్వారా గ్యాస్ రవాణా జరుగుతుంది. కృష్ణపట్నం పోర్టు, అపోలో ఆసుపత్రుల యాజమాన్యాల సహకారంతో, జపాన్, చైనా పెట్టుబడులతో ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతుంది. రివర్‌బే గ్రూపు, కేఈఐ గ్రూపులు ఈ ఎల్ఎన్జీ భారత్ టెర్మినల్‌లో ప్రధాన పాత్ర పోషించనున్నాయి. గ్యాస్ కొరతను తీరుస్తాం: మూర్తి కృష్ణపట్నం పోర్టులో తమ్మినపట్నం పంచాయతీ పరిధిలో 5 ఎమ్ఎమ్టీపీఏ సామర్థ్యం ఉన్న ఎల్ఎన్జీ ఫ్లోటింగ్ స్టోరేజి యూనిట్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు రాజమండ్రికి చెందిన కేఈఐ-ఆర్‌ఎస్‌ఓఎస్ పెట్రోలియం ఎనర్జీ ఎండీ మూర్తి మంగళవారం తెలిపారు. ఈ యూనిట్ ద్వారా విద్యుత్, ఎరువుల పరిశ్రమలకు గ్యాస్‌ను అందించే వీలుంటుందన్నారు. భారతదేశ గ్యాస్ మార్కెట్లో సుమారు 45 ఎంఎంఎస్సీ ఎండీ కొరత ఉందని, డిమాండ్‌కు తగ్గట్టుగా అందించడానికి కృష్ణపట్నం పోర్టు ప్రాంతంలో ఎన్ఎన్జీ స్టోరేజీ పాయింట్‌ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సుమారుగా 1.30 లక్షల ఎల్‌త్రీ ఎల్ఎన్జీని నిల్వచేసే ఒక ఎఫ్‌ఎస్‌యూ(నిల్వలతో తేలియాడే యూనిట్ షిప్)ను కృష్ణపట్నంలోని ప్రత్యేక జట్టీతో కలిపి ఉంచుతామన్నారు. దీనివలన చుట్టుపక్కల గ్రామాల్లోని ప్రజలకు కాలుష్యం ఉండదని తెలిపారు. -
గూడెం ఎత్తిపోతల పైపులైను లీకేజి
-
ఇంటింటికీ గ్యాస్
- పైపులైన్ గ్యాస్‌తో నిరంతర సరఫరా - మీటర్ల ఏర్పాటు - వాడకం తర్వాతే బిల్లుల చెల్లింపు - 200 కనెక్షన్లకు ఇప్పటికే సరఫరా విజయవాడ : పైప్‌లైన్ ద్వారా ఇంటింటికీ గ్యాస్ సరఫరా కార్యక్రమంలో మళ్లీ కదలిక వచ్చింది. 2010లో ప్రారంభమైన భాగ్యనగర్ గ్యాస్ లైన్లను నగరంలో ఇప్పటికే 40 కిలోమీటర్ల మేర విస్తరించారు. మరో 200 కిలోమీటర్ల మేర పైపులైన్లు వేయటానికి కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది. దీనిద్వారా నగరంలో లక్ష కనెక్షన్లు ఇవ్వటానికి దోహదపడుతుందని కంపెనీ అధికారులు చెబుతున్నారు. ఆయా ప్రాంతాల్లో పైపులైన్ ద్వారా ఇంటింటికి గ్యాస్ సరఫరాకు సిద్ధంగా ఉన్నట్లు భాగ్యనగర్ గ్యాస్ సీనియర్ మేనేజర్ వెంకటేష్ తెలిపారు. కనెక్టివిటీ ఇలా... నగరంలో ఇంటింటికి పైపుల ద్వారా పైపుడ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) సరఫరా చేసేందుకు భాగ్యనగర్ గ్యాస్ కంపెనీ ప్రణాళిక సిద్ధం చేసింది. నగరంలో పాముల కాలువ నుంచి ప్రారంభమైన గ్యాస్ పైపు మెయిన్ లైన్‌ను సత్యనారాయణపురం బస్టాండ్, ఐదో నంబర్ రోడ్డు మీదుగా ఆటోనగర్ వరకు ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో 10 కిలోమీటర్లు, సత్యనారాయణపురంలో 30 కిలోమీటర్ల మేర వీటిని తాజాగా విస్తరించింది. నగరంలో సింగ్‌నగర్, ముత్యాలంపాడు, సత్యనారాయణపురం, బావాజీపేట, లక్ష్మీనగర్, హనుమాన్‌పేట, పాత ప్రభుత్వాస్పత్రి ప్రాంతం, దేవీనగర్, రామకృష్ణానగర్ తదితర ప్రాంతాల్లో పైపులైన్ కనెక్టివిటీ ఏర్పాటు చేసింది. సింగ్‌నగర్‌లో ఇప్పటికే పైపులైన్ ద్వారా 200 గ్యాస్ కనెక్షన్లు సరఫరా చేశారు. ఎల్పీజీ కంటే ధర తక్కువ... పీఎన్ జీ గ్యాస్ ధర కిలో రూ.24.90. ఇంట్లో వాడుకునే గ్యాస్ సిలెండర్ బరువు 14.2 కిలోలు. దానికి సరిపోయే పీఎన్జీ గ్యాస్ ధర సుమారు రూ.350 అవుతుంది. ఎల్పీజీ సిలెండర్‌కు సబ్సిడీతో కలిపి చెల్లిస్తున్నది రూ.450. సబ్సిడీ లేకుంటే చెల్లించాల్సింది రూ.668. ఈ క్రమంలో పీఎన్జీ గ్యాస్ వాడితే మనం రూ.100 ఆదా చేసుకోవచ్చు. సిలెండర్ బుక్ చేయాల్సిన అవసరం లేదు. కుళాయి నుంచి నీరు వచ్చినట్లు పైపులైన్ నుంచి నిరంతరం గ్యాస్ సరఫరా అవుతుంది. మీటరు ద్వారా లెక్కింపు... విద్యుత్ మీటర్ల మాదిరిగానే గ్యాస్ వాడకానికి సంబంధించి కూడా మీటర్లు ఏర్పాటు చేస్తారు. దాని ప్రకారం బిల్లులు ఇస్తారు. వినియోగదారుడు ప్రతి రోజూ తాము వాడిన గ్యాస్ వివరాలు మీటరులో తెలుసుకోవచ్చు. పీఎన్జీ గ్యాస్ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదు. ఎల్పీజీ గ్యాస్ బరువు అధికంగా ఉండటంతో లీక్ అయిన వెంటనే అది భూమి మీద పేరుకు పోయి ఉంటుంది. సీజీఎన్జీ గాలి కంటే తేలిక కావటంతో లీకైన వెంటనే అది బయటకు, పైకి వ్యాపించి వాతావరణంలో కలిసిపోతుంది. అందువల్ల ప్రమాదాలు జరిగే అవకాశం లేదని కంపెనీ అధికారులు చెపుతున్నారు. పీఎన్జీ గ్యాస్‌ను 24 గంటలు సరఫరా చేస్తారు. గ్యాస్ కనెక్షన్ అవసరమైన వారు 7036518964, 0866 -6515986, 0866-2572522 నంబర్లలో సంప్రదించాలని కంపెనీ అధికారులు సూచిస్తున్నారు. కనెక్షన్ ఇలా పొందాలి... - కనెక్షన్ కావలసినవారు రూ.5 వేలు డిపాజిట్ చెల్లించాలి. - కనెక్షన్ రద్దు చేసుకున్నప్పుడు ఈ సొమ్ము తిరిగి ఇచ్చేస్తారు. - డీడీ అందిన వెంటనే కంపెనీ నిపుణులు దరఖాస్తుదారుని ఇంటిని పరిశీలిస్తారు. - కనెక్షన్‌కు అవసరమైన పైపులైన్ ఏర్పాటు చేస్తారు. స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దాలి : కలెక్టర్ పీఎన్జీ గ్యాస్ విధానం అమలుకు అందరూ సహకరించాలని, స్మార్ట్ గ్యాస్ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛందంగా తరలిరావాలని జిల్లా కలెక్టర్ బాబు.ఏ కోరారు. ఇటీవల ఆయన సత్యనారాయణపురంలో అల్లూరు సీతారామరాజు వీధిలో ఓ ఇంటి వద్ద పైపులైన్ ద్వారా గ్యాస్ సరఫరా కార్యక్రమాన్ని ప్రారంభించారు.పైపులైన్ ద్వారా గ్యాస్ కనెక్షన్ తీసుకున్న సిహెచ్.శివ, మహాలక్ష్మి దంపతులను కలెక్టర్ అభినందించారు. పైపులైన్ గ్యాస్ ఎంతో సురక్షితమని, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పడుతుందని ఆయన చెప్పారు. మూడు నెలలకు రూ.840 బిల్లు వచ్చింది మాకు కనెక్షన్ ఇచ్చి మూడు నెలలైంది. మొత్తంగా రూ.840 బిల్లు వచ్చింది. అంటే నెలకు రూ.300 కూడా కాలేదు. అంతేగాక ఇది సురక్షితమైనది. గ్యాస్ అయిపోయిన వెంటనే సిలెండర్ వచ్చేవరకు పడిగాపులు కాయాల్సిన పనిలేదు. లీకేజీ సమస్య లేకపోవటంతో ధైర్యంగా ఉండొచ్చు. 24 గంటలూ నిరంతరాయంగా సరఫరా అవుతోంది. - డి.వెంకటేశ్వరరావు, జీఆర్పీ సూపరింటెండెంట్, రైల్వేస్టేషన్ -
పైపులైన్ నిర్మాణాన్ని అడ్డుకుంటాం
నీలకంఠరాజపురం(వేపాడ): ప్రాణాలైన అర్పిస్తాం- రైవాడ పైపులైన్‌ను అడ్డుకుంటామని సీపీఎం జిల్లా నాయకుడు చల్లా జగన్ చెప్పారు. పైపు లైన్ నిర్మాణం ప్రతిపాదనలు విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ మండలంలో నీలకంఠరాజపురం గ్రామసమీపంలో రైవాడ కాలువ వద్ద సీపీఎం,వైఎస్ఆర్ సీపీ ఆధ్వర్యంలో రైతులు ఆందోళన చేశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ నేటికి 40 ఏళ్లుగా సాగునీరు వస్తుందని ఎదురుచూస్తున్న రైతుల ఆశలను పైపులైన్ నిర్మాణం ప్రతిపాదనలతో టీడీపీ ప్రభుత్వం ఆవిరి చేస్తోందన్నారు. ఈకార్యక్రమంలో వైఎస్ఆర్ సీపీ నాయకుడు మూకల సత్యంనాయుడు, మల్లికార్జున రైతుసంఘం సభ్యులు బీలసతీష్, వేపాడ మండలరైతుసంఘం అధ్యక్షులు పి.త్రినాథ్, గిరిజన సంఘనాయకుడు కపాటి వెంకటరావు తదితరు రైతులు,మహిళలు పాల్గొన్నారు. -
పైపులైను లీకేజీతో 3 రోజులుగా నీరు బంద్
బాపట్ల(గుంటూరు): రెండు శాఖల మధ్య వివాదంతో 25 గ్రామాల ప్రజలు తాగు నీరు అందక మూడు రోజులుగా అవస్థలు పడుతున్నారు. వివరాలివీ..గుంటూరు జిల్లా బాపట్ల మండలంలో అటవీ అధికారులు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా దరివాగు కొత్తపాలెం సమీపంలో శనివారం గుంతలు తీస్తుండగా మంచినీటి పైపులైనుకు రంధ్రం పడింది. నీరు వృథాగా పోతుండటంతో సరఫరాను వెంటనే ఆపివేశారు. అటవీ శాఖ అధికారులే పైపు లీకేజికి కారణంగా కాబట్టి వాళ్లే లీకేజీని ఆపాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పట్టించుకోలేదు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ పైపులైను సంగతి తమకెందుకని అటవీ అధికారులు మిన్నకుండిపోయారు. రెండు శాఖల మధ్య నలుగుతున్న వ్యవహారంతో ప్రజలకు మూడు రోజులుగా ఇబ్బంది తప్పటం లేదు. -
మంజీర తీరాన... మహా జలహారం
మెదక్: మంజీర తీరాన మహా జలహారం రూపుదిద్దుకుంటోంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతోన్న వాటర్‌గ్రిడ్ పథకం పనులకు శ్రీకారం చుట్టనున్నారు. మూడు నియోజకవర్గాలను కలుపుతూ ఈ ప్రాజెక్టును రూపొందించారు. సుమారు పది లక్షల మందికి తాగునీటిని అందించాలనే లక్ష్యంతో రూపకల్పన చేశారు. గ్రిడ్ పైలాన్ కూడా సిద్ధమైంది. పంచాయతీ రాజ్ శాఖమంత్రి కేటీఆర్ ఈ పైలాన్‌ను శుక్రవారం ప్రారంభించే అవకాశం ఉంది. జిల్లాలో చేపట్టనున్న వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు రూ.750 కోట్లు కేటాయించారు. 873 గ్రామాల్లో సుమారు పది లక్షల మందికి తాగు నీరందించేలా రూపకల్పన చేశారు. సింగూర్ ప్రాజెక్ట్ దిగువన గల పుల్కల్ మండలం పెద్దారెడ్డిపేట శివారులోని బ్యాక్ వాటర్ నుంచి సెకండ్ లెవల్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నారు. అక్కడి నుంచి ప్రత్యేక పైప్‌లైన్ ద్వారా నారాయణఖేడ్, అందోల్, మెదక్ నియోజకవర్గాలకు తాగునీటిని అందిస్తారు. ఈ పథకం కింద నారాయణఖేడ్ నియోజకవర్గంలోని ఐదు మండలాలు, అందోల్‌లోని ఐదు మండలాలు, మెదక్‌లోని నాలుగు మండలాలతోపాటు మెదక్ మున్సిపాలిటీ, జోగిపేట నగర పంచాయతీలకు తాగునీరందిస్తారు. రోజుకు గ్రామీణ ప్రాంతంలో ఒక్కో వ్యక్తికి వంద లీటర్లు, మున్సిపల్ ప్రాంతంలో 130 లీటర్ల తాగునీటిని అందించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. పెద్దారెడ్డిపేట నుంచి ప్రారంభమయ్యే పైప్‌లైన్ మధ్యలో ఓవర్‌హెడ్ ట్యాంకులు, సంపులు, గ్రౌండ్ లెవల్ ట్యాంకులు నిర్మించనున్నారు. రామాయంపేట మండలం వరకు సెకండ్ లెవల్ గ్రిడ్ ద్వారా తాగునీరందుతుందని ఆర్డబ్ల్యూఎస్ ఈఈ సురేశ్‌కుమార్ తెలిపారు. నేడు పైలాన్ ఆవిష్కరణ.. మెదక్ పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయ ప్రాంగణంలో వాటర్ గ్రిడ్ పైలాన్ సిద్ధమైంది. రాష్ట్ర ఐటీ, పంచాయతీరాజ్ శాఖల మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డిలు శుక్రవారం ఆవిష్కరించనున్నారు. -
అమరావతికి దారేది?
గుంటూరు: ప్రభుత్వం ఎంతో గొప్పగా ప్రకటించిన నూతన రాజధాని అమరావతికి రాత్రికి రాత్రి రోడ్డు మార్గం లేకుండా పోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. వివరాలు..గుంటూరు కార్పొరేషన్ అధికారులు నగరానికి నీరందించేందుకు పైప్‌లైన్‌ను శుక్రవారం తెల్లవారుజామున ఎలాంటి సమాచారం లేకుండా తవ్వారు.అయితే, ఈ పైప్‌లైన్ ఉండవల్లి గ్రామం గుంటూరు కెనాల్ సమీపంలో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే మార్గాన్ని రెండుగా చీల్చింది. దీంతో ఈ విషయం తెలియని ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా, ఈ విషయంపై ఆర్‌ఆండ్‌బీ అధికారి మధుబాబును వివరణ కోరగా ఎలాంటి అనుమతులు లేకుండా పైప్‌లైన్ తవ్వకాలు జరిపినట్లు ఆయన చెప్పారు. తవ్వకాలకు పాల్పడిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా పైప్‌లైన్ పనులు చేపట్టడంతో విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే ప్రయాణికులకు ప్రత్యామ్నాయం లేక ఇబ్బందులకు గురవుతున్నారు. (తాడేపల్లి) -
ఇంకా సర్వే దశ దాటలేదు!
నత్తనడకన ‘వాటర్‌గ్రిడ్’ కొన్ని జిల్లాల్లో లైన్ సర్వేకు ఖ రారు కాని టెండర్లు కొన్ని సెగ్మెంట్లలో ముందుకు రాని కాంట్రాక్టర్లు వచ్చినవారితోనే పనిచేయిస్తామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఓ వైపు ప్రభుత్వం దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గ్రిడ్‌కు సంబంధించిన పనులేమో క్షేత్రస్థాయిలో నత్తనడకన జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) తొలిదశకు సంబంధించిన లైన్ సర్వే ప్రక్రియ మొదలై ఆర్నెల్లు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్ని జిల్లాల్లో లైన్ సర్వే కొలిక్కిరాలేదు. కొన్ని సెగ్మెంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాక లైన్ సర్వే చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అర్హతగల కాంట్రాక్టర్లు ముందుకురాని సెగ్మెంట్లలో అధికారులు వారికి.. నచ్చిన వాళ్లతోనే సర్వే పనులు చేయించాలని యోచిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే వాటర్‌గ్రిడ్ లైన్సర్వేలో ‘లైడార్’వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. ప్రస్తుతం జిల్లాల్లో లైన్ సర్వే పనులన్నీ సంప్రదాయ విధానంలోనే జరుగుతున్నాయి. కాంట్రాక్టర్లు ముందుకు రాకనే.. వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 45 వేల కిలోమీటర్ల సెకండరీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పైప్‌లైన్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లైన్ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆయా మార్గాల్లో ఎత్తుపల్లాలు, పొడవు, వెడల్పు..తదితర సర్వే అంశాల అధారంగానే నిర్మాణ పనులను నిర్వహిస్తారు. లైన్ సర్వే పూర్తికాకుంటే ప్రాజెక్టు అంచనాల రూపకల్పన, పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుకాదు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం గతేడాది అక్టోబర్‌లోనే లైన్ సర్వే కోసం టెండర్ల(ఈవోఐ)ను పిలిచింది. రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 58 ఏజెన్సీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 35 ఏజెన్సీలు మాత్రమే అర్హత(ఫైనాన్షియల్, టెక్నికల్) సాధించాయి. అయితే.. ఏజెన్సీలు తమ టెండర్లలో పేర్కొన్న ధరల్లో అతితక్కువ ధర(కిలోమీటరుకు రూ.3,500)నే సర్కారు ఖరారు చేసింది. దీంతో లైన్ సర్వే పనులు చేపట్టేందుకు కేవలం 18 ఏజెన్సీలే ముందుకు వచ్చాయి. ఇలా వచ్చిన ఏజెన్సీలతోనే ఆయా జిల్లాల్లోని సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. అయితే.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయా సెగ్మెంట్లలో సర్వే పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కానందునే అర్హత కలిగిన కంపెనీలు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో మరలా టెండర్లు పిలిచేందుకు ఇష్టపడని అధికారులు తమకు నచ్చిన ఏజెన్సీలతోనే పనులు చేయించేందుకు మొగ్గుచూపుతున్నారు. ‘లైడార్’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం తెలంగాణ వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్)’ టెక్నాలజీని వినియోగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలిసింది. లైడార్ టెక్నాలజీకి బదులుగా సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్(లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధునాతన పద్ధతులతోనే సాధ్యమని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు. -
పోలీసు బందోబస్త్ మధ్య పైప్ లైన్ పనులు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా జైపూర్ పవర్ ప్లాంట్‌కు గోదావరి జలాలు తరలించేందుకు పైపులైన్ పనులు పోలీసుల సహాయంతో రెండోరోజు శుక్రవారం కొనసాగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలోని జైపూర్ పవర్ ప్లాంట్‌కు ఓ టీఎంసీ గోదావరి నీటిని తరలించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఈ క్రమంలో గందిపల్లి నుంచి పైపులైన్ పనులు ప్రారంభించగా గ్రామ రైతులు అడ్డుకున్నారు. అంతేకాకుండా పైపులైన్ కోసం తమ భూములు ఇచ్చేందుకు నిరాకరించారు. దీంతో పోలీసుల సహాయంతో గురువారం పనులు ప్రారంభించిన సంగతి తెలిసిందే. -
దప్పిక తీరాలంటే.. ఊరు దాటాల్సిందే
అడుగంటుతున్న భూగర్భ జలాలు పనిచేయని చేతిపంపులు వ్యవసాయ బావులే దిక్కు గ్రామాలు,తండాల్లో అరిగోస వేసవి రానేలేదు.. అప్పుడే పాని‘పాట్లు’.. బోరుబావులు, నల్లాల, ట్యాంకర్ల వద్ద సిగపట్లు..! బావులు, చెరువులు, వాగులు, వంకలు వట్టిపోయూరుు.. ట్యాంకులు నీటిచుక్క అందించక నిలువెత్తు ఉత్సవ విగ్రహాల్లా మిగిలారుు.. తండా, గూడేలు, పల్లెవాసులు మైళ్ల దూరం వెళ్లి నీటిని తెచ్చుకుంటున్నారు.. అధికారులు ముందస్తుగా చర్యలు తీసుకుని నీటి గోస తీర్చాలని ప్రజలు కోరుతున్నారు.. - కేసముద్రం : మండలంలోని మహముద్‌పట్నం శివారు కాలనీతండావాసులు నీటి కోసం పక్క ఊరికి వెళ్లాల్సి వస్తోంది. ఇక్కడ సుమారు 250 కుటుంబాలున్నారుు. బావిలో నీళ్లు అడుగంటారుు. రెండు బోరింగ్లలో ఉప్పు నీళ్లు వస్తున్నారుు. దీంతో మూడు కిలోమీటర్లలోని కేసముద్రం దర్గా వద్ద బోరింగ్‌ను ఆశ్రరుుస్తున్నారు. బావిలో పూడికతీయూలన్న స్థానికుల విజ్ఞప్తిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు, అధికారులు పైప్‌లైన్ వేయడం గమనార్హం. పాలకుర్తి/దేవరుప్పుల : మండలంలో 22 గ్రామాలు 45 గిరిజన తండాలున్నాయి. చెన్నూరులో తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ప్రైవేటు వ్యవసాయ బోరును అద్దెకు తీసుకుని తాగు నీరందిస్తున్నారు. ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకును నిర్మించి 17 ఏళ్లు కావస్తున్నా వినియోగంలోకి రావడం లేదు. బమ్మెర పరిధిలోని దుబ్బతండా, ఎల్లమ్మ గడ్డ తండాలో, గూడూరు గ్రామ శివారు కిష్టపురం తండా, ముత్తారం గ్రామ శివారు తండాల్లో తాగు నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. వల్మిడి, శాతపురం గ్రామం, తండాల్లో గుక్కెడు నీరు కరువవుతోంది. దేవరుప్పుల మండలం ధర్మాపురం, మాదాపురం, ధారావత్‌తండా పంచాయతీ పరిధి తండాల్లోనూ నీటి సమస్య తీవ్రంగా ఉంది. నీర్మాల, కడవెండిలో తాగునీటి వనరులున్నా.. తరచూ బోర్లు మరమ్మతుకు వస్తున్నారుు. పని చేయని నీటి ట్యాంకులు ఏటూరునాగారం : ఏజెన్సీలో చెలిమె నీరే దిక్కవుతోంది. చెల్పాక, అల్లంవారి ఘణపురం ప్రజలు దయ్యాలవాగు నుంచి నీరు తెచ్చుకుంటున్నారు. నల్లాలు, నీటి ట్యాంకులు నిరుపయోగంగా మారింది. చెల్పాకలో నీటిట్యాంక్‌కు మోటారు అమర్చలేదు. అల్లంవారిఘణపురంలో ట్యాంక్, నల్లాలు అమర్చినా మోటారు, కనెక్షన్ ఇవ్వలేదు. 19 గ్రామాల్లో ఆర్డబ్ల్యూఎస్ పరిధిలోని 32 చేతిపంపులు మరమ్మతుకు నోచుకోవడం లేదు. ఐటీడీఏ పరిధిలోని నీటి ట్యాంకులేవీ పనిచేయట్లేదు. హసన్‌పర్తి: బల్దియాలో విలీనమైన హసన్‌పర్తి, హన్మకొండలో 29 గ్రామాలు, మరో 10గ్రామాలకు సమీకృత నీటిని సరఫరా చేస్తున్న డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టులు పూర్తిగా ఎండిపోయాయి. భీమారంలోని పుట్టలమ్మ డీ ఫ్లోరైడ్, హసన్‌పర్తిలోని చౌదరికుంట, ఆరెపల్లిలోని డీ ఫ్లోరైడ్ ప్రాజెక్టుల్లో చుక్క నీరు లేదు. మానేరు నుంచి నీరు విడుదలైతేనే.. ఈ ప్రాజెక్టులు నిండేది. ఆగస్టులోనే ఓ దఫా నీరు విడుదలైంది. ప్రస్తుతం మూడు నెలలుగ రిజర్వాయర్లు ఎండిపోయి కనిపిస్తున్నాయి. సుమారు 1.50లక్షల మంది ఈ ప్రాజెక్టులపై ఆధారపడి ఉన్నారు. ప్రాజెక్టు నిర్మించిన 18 ఏళ్లలో చుక్క నీరు లేని పరిస్థితి రావడం ఇదే తొలిసారి. హసన్‌పర్తిలోని యాదవనగర్, వంగపహాడ్, దేవన్నపేటల్లో నీటి ట్యాంకులు శిథిలావస్థకు చేరారుు. ఊన్యాతండా గోడు.. నర్సింహులపేట : కొమ్ములవంచ శివారు ఊన్యాతండాలో గిరిజనులు నెలల తరబడి నీటి కష్టాలు పడుతున్నారు. తండాలో 50 కుటుంబాలున్నారుు. తాగునీటి బావి ఎండిపోరుుంది. మూడు బోరింగ్లు అడుగంటారుు. స్థానికులు రాత్రీపగలు తేడా లేకుండా కరెంటు ఎప్పుడొస్తే అప్పుడు వ్యవసాయ బావుల నుంచి నీరు తెచ్చుకోవాల్సి వస్తోంది. కరెంటు ఎప్పుడొస్తదో తెలియట్లేదని, పనులు మానుకొని నీటి కోసం ఇంటి వద్దే ఉంటున్నామని తండావాసులు పేర్కొంటున్నారు. బీల్యాతండా, మధుతండా, రూప్లాతండాలోనూ నీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. కాగా, వారంలోగా అద్దె బావుల ద్వారా నీరందిస్తామని ఏఈ సూర్యనాయక్ తెలిపారు. ఎండిన బావులు.. దుగ్గొండి : చాపలబండలోని బావిలో 20 మీటర్ల లోతులోనూ చుక్క నీరు లేదు. రేబల్లెలో మూడు రోజులకోసారి నీరు సరఫరా చేస్తున్నారు. నాచినపల్లిలో సగం జనాభాకు ఆధారమైన బావిలో నీటి మట్టం తగ్గింది. నాలుగు రోజులకోసారి సరఫరా చేస్తున్నారు. జనం వ్యవసాయ బావులను ఆశ్రరుుస్తున్నారు. బావుల్లో నీరు లేక రేబల్లె, కేశవాపురం, గోపాలపురంలో ఓవర్హెడ్ట్యాంక్లు నిరుపయోగంగా ఉన్నాయి. మండలంలో నేటికీ 24 బావులు ఎండిపోయూరుు. 41 బోరు బావులు పనిచేయడం లేదు. 63 చేతిపంపులు మరమ్మతు కోసం నిరీక్షిస్తున్నారుు. ఆర్నెల్లుగా ఇదే గోస ఆర్నెల్ల సంది నీటి కోసం శానా ఇబ్బందులు పడుతున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. బావి, మూడు బోరింగ్లు ఎండిపోయాయి. దూర ప్రాంతాల నుంచి నీరు తెచ్చుకుంటూ అరిగోస పడుతున్నాం. - జాటోతు లచ్చమ్మ, ఊన్యాతండా నాలుగు రోజులకోసారి నీళ్లు పరకాల : నాగారంలోని రెండు బావుల్లో నీటి మట్టం తగ్గిపోవడంతో నాలుగు రోజులకోసారి నల్లా నీళ్లు వస్తున్నారుు. నడికూడలో నాలుగు బావులకు అదనంగా మరో బావిని అద్దెకు తీసుకున్నా.. నాలుగు రోజులకోసారే నీటి సరఫరా సాధ్యమవుతోంది. కంఠాత్మకూరులో రెండు బావులుండగా రెండు గంటలకు మించి నీరు రావడం లేదు. చర్లపల్లి, ముస్త్యాలపల్లిలోనూ ఇదే పరిస్థితి. పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజిపేటలో చేతిపంపు వద్ద మహిళలు బిందెలతో బారులు తీరుతున్నారు. ప్రణాళికలు రూపొందించని అధికారులు హన్మకొండ: తాగునీటి ముప్పు ముంచుకొస్తున్నా.. అధికార యంత్రాంగంలో చలనం లేదు. నీటి ఎద్దడి నివారణకు నెలాఖరులోగా ప్రణాళికలు రూపొందించాలని ఈ నెల 19న జెడ్పీ సర్వసభ్య సమావేశంలో జెడ్పీ చైర్పర్సన్, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, సభ్యులు సూచించారు. నేటికీ ఆర్డబ్ల్యూఎస్ ఈ దిశగా పని ప్రారంభించలేదు. మరో రెండు నెలల్లో భూగర్భ జలాలు మరింత పడిపోనున్నాయి. గ్రిడ్ పేరుతో తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో 18,295 చేతిపంపులు, 2155 రక్షిత మంచినీటి సరఫరా పథకాలున్నాయి. తాగునీటి సమస్య పరిష్కారానికి ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధుల కింది 253 పనులు మంజూరయ్యూరుు. వీటిలో 87 పనులు కొనసాగుతుండగా, 118 పనులు పూర్తయ్యాయి. 48 పనులు మొదలు కాలేదు. టీఎఫ్సీ నిధుల ద్వారా 97 పనులు మంజూరు కాగా 31 పనులు మొదలు పెట్టలేదు. 42 పనులు కొనసాగుతుండగా 24 పనులు పూర్తయ్యాయి. టీఎఫ్సీ గిరిజన సంక్షేమశాఖ ద్వారా మూడు పనులు మంజూరు కాగా నేటికీ మొదలు పెట్టలేదు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చినా మూడు రకాల నిధుల కింద మొత్తం 353 పనులు మంజూరు కాగా ఇప్పటికే 82 పనులు మొదలు పెట్టలేదంటే అధికారుల చిత్తశుద్ధి అర్థమవుతోంది! సర్పంచ్‌కూ తిప్పలే.. చిత్రంలో కనిపిస్తున్న మహిళ పరకాల మండలం రాజిపేట సర్పంచ్ తూర్పాటి ఎల్లమ్మ. గ్రామంలో పక్షం రోజుల క్రితమే బావులు వట్టిపోయూరుు. బోర్లు పనిచేయడం లేదు. నీళ్ల కోసం మైళ్ల దూరం నడిచి తీసుకొచ్చుకుంటుంది. ఇప్పుడే ఇలా ఉంటే వచ్చేది వేసవి కాలం. మరి ఎలా ఉంటుందో తల్చుకుంటే భయమేస్తుంది అని తెలిపింది. సర్కారోళ్లు రెండు బోర్లు, ఒక బావి వేరుుంచాలని కోరుతోంది. -
‘పాలమూరు’ అంచనాలు పైపైకి
ప్రాజెక్టు తొలిదశ పూర్తికే రూ.15 వేల కోట్ల వ్యయం! అలుగు పునాదిని పెంచాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సూచించిన సీడీవో ఈ మార్పులతో మరో రూ.500 కోట్ల మేర పెరగనున్న అంచనాలు సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టు అంచనా వ్యయం మరింత పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకే దాదాపు రూ.15 వేల కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని మరింత కిందకు తీసుకెళ్లాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) సూచించిన నేపథ్యంలో వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది. ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి రూ.5.73 కోట్లను విడుదల చేసింది. ఈ కాలేజీ తొలిదశ సర్వేను డిసెంబర్లోనే పూర్తి చేసింది. పైప్‌లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది. దీని ప్రకారం జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటి తరలింపునకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించాలని సూచించింది. ఈ నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉండే మొదటి రిజర్వాయర్ కోయిల కొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసే పంపిం గ్ స్టేషన్ వద్ద 160మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 పంపులను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులకు సుమారు రూ. 14,950 కోట్ల మేర అవసరం ఉంటుందని అంచనా వేసింది. దీనిపై డిసెంబర్ రెండో వారంలోనే పరిశీలన చేసిన ఆర్థిక శాఖ రూ.14,400 కోట్లకు డీపీఆర్‌ను ఆమోదించి తదుపరి పరిశీలన కోసం సీడీఓకు పంపింది. అన్ని అంశాలను పరిశీలించిన సీడీఓ, ప్రాజెక్టు వద్ద రాళ్లు, మట్టి సామర్థ్యాన్ని బట్టి అలుగు పునాదిని మరింత కిందకు తీసుకెళ్లాలని సూచించింది. దీని కోసం అదనంగా మరో రూ. 60 నుంచి రూ.80 కోట్ల మేర ఖర్చు పెరుగుతుందని అంచనా వే సింది. ప్రధాన కాల్వలకు కాంక్రీట్ లైనింగ్ చేయాలని దీనికి మరో రూ.200 నుంచి రూ.300ల కోట్ల మేర వ్యయం పెరుగుతుందని సీడీఓ పేర్కొన్నట్లుగా తెలిసింది. ఇక వీటితోపాటే రిజర్వాయర్ల వద్ద ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. వీటన్నింటినీ కలుపుకొని అదనంగా రూ.500 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అంచనా వస్తోంది. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లోనే సీడీఓ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిసింది. అనంతరం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు, శంకుస్థాపన తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. -
రాజయ్యా.. తగునా..?
ముత్తారం మండలం పారుపెల్లికి చెందిన సుమారు 30 మంది దళిత కుటుంబాలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున ప్రభుత్వం గతంలో సర్వే నెంబర్ 603లో భూమిని కేటాయించింది. తీరా సర్వే నెంబర్లో ఎంత భూమి ఉందని లెక్కలు తీస్తే అందులో 20 ఎకరాల భూమి మాత్రమే ఉందని తేలింది. దీంతో ఆలోచనలో పడిన రైతులు అదే సర్వే నంబర్‌ను ఆనుకుని ఉన్న ప్రభుత్వ భూమిని చదను చేసి పంట పండించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆ సమయంలో దళితులకు తారసపడిన మాజీ ఎంపీటీసీ మల్యాల రాజయ్యకు జరిగిన విషయం తెలిపి వాపోయారు. ఆ వెంటనే రాజయ్య స్పందిస్తూ ‘మీతోపాటు నన్ను కలుపుకుంటే నేను కొంత భూమిని పట్టా చేసుకోవడంతో పాటు మీకు ఎలాంటి ఖర్చులు లేకుండా ప్రభుత్వ భూమిని పట్టాలు చేయించి ఇస్తాను. అంతేగాకుండా ఆ భూమిని చదును చేసి పైపులైన్ కూడా వేయిస్తా. ఒకవేళ నేనట్లా చేయకుంటే నా ప్రభుత్వ భూమిని కూడా మీరే సాగు చేసుకోవచ్చు’ అని మభ్యపెట్టారు. ఎలాంటి ఖర్చులు లేకుండా భూమి రావడంతో పాటు ఇబ్బందుల్లేకుండా సాగుకు ఉపయోగపడుతుందని భావించిన దళితులు రాజయ్య ప్రతిపాదనకు ఒప్పుకున్నారు. అనంతరం 2011 నవంబర్ 11న రూ.50 బాండ్ పేపర్‌పై ఇరువర్గాలు ఒప్పందం చేసుకున్నాయి. అధికార బలంతో తిమ్మిని బమ్మిని చేసిన వైనం అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీగా ఉన్న రాజయ్య తన అధికారాన్ని, రాజకీయ పలుబడిని ఉపయోగించి 23 మంది దళితలకు ఒక్కొక్కరికి ఎకరం చొప్పున, తన ఇద్దరు కు టుంబసభ్యులు, మరో ఇద్దరు సమీప బం ధువుల పేరిట ఒక్కొక్కరికి రేండేసి ఎకరాల చొప్పున పట్టాలు చేయించాడు. అయితే పట్టాలు చేయించే సమయంలో రెవెన్యూ అధికారులు పెద్దమొత్తంలో ఖర్చులు అడుగుతున్నారని సాకు చూపి ఒక్కో దళితుడి నుంచి రూ.5వేల చొప్పున వసూలు చేశా రు. తీరా పట్టాపాస్ పుస్తకాలు వచ్చిన తరువాత మరో మోసానికి తెరతీశారు. ‘మీ పాస్ పుస్తకాల కోసం సొంతంగా లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన. ఆ పాస్ పుస్తకాలను బ్యాంక్‌లో తాకట్టు పెట్టి రుణం తీసుకుంట. వచ్చే ఏడాది వడ్డీతో సహా నేనే చెల్లిస్తా’ అని నమ్మబలికాడు. సదరు మాజీ ప్రజాప్రతినిధి చెప్పిన మాటలను నమ్మిన దళితలు సరేననడంతో 23 మంది దళితుల పేరిట ఉన్న కొత్త, పాత పట్టాపాస్‌బుక్‌లను బ్యాంక్‌లో పెట్టి దాదాపు రూ.8లక్షల రుణం తీసుకున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇటీవల ఆయా దళితులంతా రుణాల కోసం బ్యాంకుకు వెళితే అసలు విషయం తెలిసి నివ్వెరపోయారు. ‘మీరు తీసుకున్న పంట రుణాలు మాఫీ కాలేదు. మీరెవరూ డబ్బులు చెల్లించలేదు. కాబట్టి రుణాలు చెల్లించాల్సిందే. అప్పటిదాకా కొత్త రుణాలిచ్చేది లేదు’ అని బ్యాంకు అధికారులు చెప్పడంతో అవాక్కయిన సదరు దళితులు రాజయ్య వద్దకు వెళ్లి నిలదీశారు.రాజయ్య నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో దళితులంతా పెద్దమనుషులను ఆశ్రయించారు. అయితే ఎవరెన్ని చెప్పినా తాను పంట రుణాలు చెల్లించేది లేదని మొండికేయడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి దళితులది. రెవెన్యూ అధికారుల తప్పిదం వల్ల రుణమాఫీ అనర్హులు వాస్తవానికి పంట రుణాలను మాఫీ చేస్తూ ప్రభుత్వం ఇటీవల ప్రకటించడంతోపాటు కొంత సొమ్మును కూడా బ్యాంకులకు జమ చేసిన సంగతి తెలిసిందే. అయితే దళితుల భూమి విషయానికొచ్చే సరికి సర్వేనంబర్ 603లో అసలు మిగులు భూమి లేదు. ఈ విషయం తెలియని రెవెన్యూ అధికారులు అదే నంబర్‌పైన పట్టాపాస్ పుస్తకాలు జారీ చేశారు. అయితే ఇది ముత్తారం, కాల్వశ్రీరాంపూర్ సరిహద్దులో ఉంది. రెండు మండలాల సరిహద్దు వివాదం ఉండడంతో ప్రజల నుంచి అందిన ఫిర్యాదు మేరకు జేసీ పలుమార్లు పరిశీలించారు. సరిహద్దులు నిర్ణయించడానికి సర్వే చేయించారు. తీరా హద్దులు నిర్వహించగా దళితులకు పట్టాలు జారీ చేసిన భూమి సర్వేనంబర్ 603 కాదని తేలిపోయింది. ఈ విషయం బయటకు పొక్కితే పరువు పోతుందని గ్రహించిన రెవెన్యూ అధికారులు రికార్డుల్లో సర్వేనంబర్ 774 పేరిట పత్రాలు రూపొందించారు. రుణమాఫీ గురించి పహణీల కోసం దరఖాస్తు చేసుకున్న దళితలకు సర్వేనంబర్ 774పైన పహణీలు జారీ చేశారు. ఈ విషయం తెలియని దళితులు సదరు పహణీలతో బ్యాంక్ అధికారులను సంప్రదించగా ‘తొలుత రుణం పొందింది సర్వేనంబర్ 603పైన మాత్రమే రుణాలు పొందారు. ఇప్పుడు 774 సర్వేనంబర్ పహణీలు తీసుకురావడం వల్ల మీకు రుణమాఫీ వర్తించదు’ అని తిప్పిపంపించారు. ఉపకారం చేస్తే అపకారం తలపెడతారా ఉపకారం చేయబోతే అపకారం అయినట్లుగా మారింది నాపరిస్థితి. నేను దళితులకు సేవ చేయాలనే ఉద్దేశంతో నా డబ్బులతో వారికి భూ పట్టాలు చేయించడంతోపాటు భూమిని చదును చేయించి ఇచ్చాను. అయితే నేనంటే గిట్టని ఓ వ్యక్తి దీన్ని పెద్ద రాద్ధాంతం చేసి నన్ను బదనాం చేస్తున్నాడు. దళితుల కోసమే పంట రుణాలు తీసుకోవడం జరిగింది. అయినా పట్టాదారులు లేకుండా బ్యాంక్ అధికారులు పంట రుణం ఎలా ఇస్తారు. - మాజీ ఎంపీటీసీ రాజయ్య వివరణ ప్రీగా చేసిస్తానన్నాడు.. మాతో కలుపుకుని ప్రభుత్వ భూమిలో తనకు కొంత అవకాశం కల్పిస్తే దళితులందరికి ప్రభుత్వ భూమిని పట్టాలు చేయించి ఇస్తానని ముందుగా నమ్మబలికాడు. ఆ తరువాత ఖర్చులు ఎక్కువైనయని డ బ్బులు వసూలు చేసిండు. - బూడిద మల్లమ్మ, బాధితురాలు పైపులైన్ వేసిస్తానన్నాడు ప్రభుత్వ భూమిని ఒక్కొక్కరికి రెండు ఎకరాలు పట్టాలు చేసిన తరువాత చదును చేసి వ్యవసాయం చేసుకోవడానికి వీలుగా సాగునీటి పైపులైన్ వేసిస్తానని చెప్పాడు. ఆ తరువాత మాకు ఒక్కొక్కరికి ఎకరం పట్టా మాత్రమే చేయించాడు. - ఇనుముల రాయమ్మ, బాధితురాలు ఐదువేలు వసూలు చేసిండు రెవెన్యూ అధికారులు పట్టాలు చేయడానికి చాలా పైసలు అడుతున్నారు కనుక ఒక్కొక్కరు ఐదు వేలు ఇవ్వాలని మా దగ్గర బలవంతంగా పైసలు వసూలు చేసిండు. పైసలు ఇవ్వకపోతే భూమి రాదనే భయంతో ఇవ్వాల్సి వచ్చింది. - ఇరుకురాల లక్ష్మి, బాధితురాలు లోన్లు కడతనని మోసం చేసిండు మీకు పట్టాలు చేసిన భూమి మీద తీసుకుంటున్న బ్యాంక్ లోన్లు యేడాది లోపు నేనే కడతానని తీసుకుని, ఇప్పుడు లోన్లు కట్ట ఏం చేసుకుంటరో చేసుకోండని మమ్మల్ని నమ్మించి మోసం చేస్తుండు. - ఇరుకురాల లింగమ్మ, బాధితురాలు చట్టపరంగా చర్యలు తీసుకోవాలే చదువు ముక్కరాని మాలాంటి గరీబు దళితులను మోసం చేసిన అతనిపైన చట్టపరంగా చర్యలు తీసుకోవాలే. మా పేరిట తీసుకున్న లోన్లను అతనితోని కట్టించి మాకు న్యాయం చేయాలి. - ఇరుకురాల రాయపోశమ్మ, బాధితురాలు ఎనిమిదెకరాలు పట్టా చేయించుకున్నడు ప్రభుత్వ భూమిలో పొరకలు కొట్టుకుని సాగు చేసుకుందామని సిద్ధమైన మాకు మాయమాటలు చెప్పి ఒక్కక్కరికి ఎక రం భూమి పట్టా చేయించి తా ను మాత్రం కుటుంబసభ్యులు, బంధువుల పేరిట ఎనిమిదెకరాలు పట్టా చేయించుకున్నడు. - ఇనుముల సమ్మమ్మ, బాధితురాలు -
గెయిల్ పైపులైన్లలో నాణ్యతెంత ?
-
పచ్చని కోనలో ఆరని చిచ్చు
-
పైప్‌లైన్ టెండర్ల తకరారు
కాలం చెల్లిన చెక్కులిచ్చిన కాంట్రాక్టర్ టెండర్ ఖరారు చేసిన అధికారులు నిలదీసిన వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మచిలీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : స్థానిక బైపాస్‌రోడ్‌లో పైప్‌లైన్ నిర్మాణ పనుల బండారం బట్టబయలయ్యింది. పైప్‌లైన్ నిర్మాణ పనులు నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్నాయంటూ ఈ నెల ఆరో తేదీ శుక్రవారం సాక్షిలో ‘నిబంధనలకు విరుద్ధంగా పైప్‌లైన్ నిర్మాణం’ అనే శీర్షికతో వార్త ప్రచురితమైంది. ఈ పనులకు సంబంధించిన వివరాల ఫైల్‌ను తమకు చూపాలని వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు రెండు రోజులుగా కమిషనర్‌ను కలసి డిమాండ్ చేశారు. రెండు రోజులుగా సంబధిత గుమస్తా నవప్రకాష్ సెలవులో ఉన్నాడంటూ ఇంజినీరింగ్ అధికారులు దాటవేస్తూ వచ్చారు. శనివారం ఈ పైప్‌లైన్ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ను చూపుతామని కౌన్సిలర్లకు హామీ ఇచ్చారు. దీంతో కౌన్సిలర్లు శనివారం కమిషనర్ ఛాంబర్‌కు వెళ్లి ఫైల్ తెప్పించి చూపాలని కోరారు. దీంతో ఆయన ఫైల్‌ను తెప్పించారు. ఈ ఫైల్‌ను కౌన్సిలర్లు పరిశీలించగా పలు లోపాలు బహిర్గతమయ్యాయి. స్థానిక శ్రీనివాసనగర్‌లోని సంపు నుంచి బైపాస్ రోడ్‌లోని సర్కిల్ వరకూ 250 మీటర్ల మేర రూ.3.60 లక్షలతో నూతన హెచ్డీపీఈ పైప్‌లైన్‌ను ఏర్పాటు చేసేందుకు అర్జెంట్ షార్ట్టెండర్ను 2014 మార్చి 10వ తేదీన పిలిచారు. ఈ పనులు చేసేందుకు కాంట్రాక్టర్లు డొక్కు వీర్రాజు, డొక్కు రమేష్‌కుమార్ మాత్రమే టెండర్లు దాఖలు చేశారు. వీరిద్దరిలో వీర్రాజు రెండు శాతం తక్కువకు పనులు చేసేందుకు టెండర్ వేసి పనులను దక్కించుకున్నాడు. కాగా ఈ పనులను దక్కించుకున్న వీర్రాజు టెండర్ ధరావతును డీడీ రూపంలో టెండర్ పిలిచిన తేదీ తర్వాత తేదీతో ఇవ్వాల్సి ఉంది. అయితే వీర్రాజు 2013 డిసెంబర్ 5వ తేదీన తీసిన బ్యాంక్ ఆఫ్ బరోడా చెక్కులను టెండర్‌కు జతచేశాడు. అయితే ఈ టెండర్ షెడ్యూల్‌కు ధరావతు డీడీలను జత చేయాల్సి ఉండగా చెల్లని చెక్కులు ఇచ్చాడు. ఈ అంశంపై వైఎస్సార్ సీపీ కౌన్సిలర్లు మేకల సుబ్బన్న, లంకా సూరిబాబు, షేక్ అచ్చేబాలు కమిషనర్, ఏఈ రాంపరసాద్, గుమస్తా నవప్రకాష్ను నిలదీశారు. ఇన్ని లోపాలు ఉండగా ఈ టెండర్‌ను ఎలా పరిగఱణలోకి తీసుకున్నారని ప్రశ్నించారు. కాంట్రాక్టర్ సర్టిఫికెట్ ఫోర్స్‌లో లేని రమేష్‌కుమార్ వేసిన టెండర్‌ను ఎలా పరిగణనలోకి తీసుకున్నారని నిలదీశారు. ఈ పనులకు సంబంధించిన టెండర్ ప్రకటనలను ఏ పత్రికలోనూ, ఆన్లైన్లో ఈ- ప్రొక్యూర్మెంట్ ద్వారాను పిలువకుండానే టెండర్లు ఎలా ఆమోదించారని, అలాగే మినిట్స్ పుస్తకంలో ఈ పని వివరాలు నమోదే చేయకుండా ఎలా పని చేయిస్తున్నారని వారు ప్రశ్నించారు. అసలు ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఈ టెండర్‌ను ఎందుకు పెట్టారని, బైపాస్ రోడ్లో ఎన్నో యేళ్లుగా పైప్‌లైన్ లీకవుతుంటే ఈ పనులు ఇప్పుడే ఇంత అడ్డగోలుగా ఎందుకు చేయిస్తున్నారని ప్రశ్నించారు. ఒక వేళ అంత అవసరం అనుకుంటే చిన్న పనే కాబట్టి ఈ పనిని శాఖా పరంగానే ఎందుకు చేయలేకపోయారని అడిగారు. మెదటి సారి తప్పు తమ దృష్టికి వచ్చింది కాబట్టి సిబ్బంది తప్పైపోయింది అని ఒప్పుకుంటే ఇక్కడి నుంచి వెళ్లిపోతామని లేకుంటే తప్పులు రుజువైనందున సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు కమిషనర్‌ను డిమాండ్ చేశారు. రెండు రోజులుగా టెండర్ ఫైల్ చూపుతామని హామీ ఇచ్చిన ఎంఈ గద్దె ప్రదీప్‌కుమార్ శనివారం లేకపోవడాన్ని కౌన్సిలర్లు ప్రశ్నించారు. ఈ అంశంపై స్పందించిన కమిషనర్ మారుతీదివాకర్ మాట్లాడుతూ ఈ పనులకు సంబంధించిన టెండర్ఫైల్ల్లో లోపాలు ఉన్న మాట వాస్తవమేనని, అయితే మున్సిపాలిటీకి చెందిన ధనం మాత్రం వృథాకాలేదన్నారు.సోమవారం సమగ్రంగా విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కమిషనర్‌ను కలసిన కౌన్సిలర్లలో మీర్ అస్గర్‌అలీ, గూడవల్లి నాగరాజు, కాగిత జవహర్లాల్, శీలం బాబ్జీ, ధనికొండ నాగమల్లేశ్వరి, బందెల కవిత, మట్టా తులసి, కే లీలాకుమారి తదితరులు ఉన్నారు. -
నీళ్లకోసం ఘర్షణ
కత్తులతో దాడులు నలుగురికి తీవ్ర గాయాలు మదనపల్లెక్రైం, న్యూస్‌లైన్: మంచినీళ్ల కోసం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. చిన్నపాటి ఘర్షణ చినికిచినికి పెద్దది కావడంతో కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ దాడిలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆది వారం అర్ధరాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుల కథనం మేరకు.. రాత్రి పూట కరెంటు సరఫరా ఉండడంతో వేంపల్లెలో అర్ధరాత్రి మంచినీటి సరఫరా చేస్తున్నా రు. గ్రామానికి వేసిన పైపులైన్లలో ప్రధాన పైపులైను చెరువుకట్ట మీద నుంచి వెళుతోంది. ఆ పైపు పగిలిపోవడంతో గ్రామానికి సరిగ్గా నీళ్లు సరఫరా కావడం లేదు. దీంతో గ్రామానికి చెందిన శ్రీనివాసులు(38), ఇతని కుమారుడు రాజశేఖర్(21) గమనించి నీరు వృథాకాకుండా పైపును తాడుతో గట్టిగా కట్టేశారు. తెల్లవారే సరికి తిరిగి ఆ తాడు ను స్థానికంగా ఉంటున్న రమేష్ అతని కుమారుడు రాఘవేంద్ర తెంపేస్తున్నారు. ఇలా రెండు రోజులు చేశారు. ఎన్నిసార్లు పైపును కట్టినా తెంపేస్తుండడంతో నీళ్లు వృథాగా పోతున్నాయి. ఆదివారం రాత్రి తిరిగి శ్రీనివాసులు, రాజశేఖర్, శ్రీనివాసులు అన్న నారాయణ (40), కుమారుడు చెన్నకేశవ(21) నలుగురు కలిసి నీటి సరఫరా జరిగే సమయంలో చెరువుకట్టమీదకు వెళ్లి నీటిపైపును తాడుతో బిగి స్తున్నారు. అక్కడికి వచ్చిన రమేష్, అతని కుమారుడు రాఘవేంద్ర, వీరి బంధువు నరేష్ అడ్డు తగిలారు. పైపును కట్టడానికి మీరెవరు.. సర్పంచ్‌ను పిలవండి అంటూ పరుష పదజాలంతో దూషించారు. ‘‘నీళ్లు వృథాగా పోతుంటే సర్పంచే రానక్కరలేదు.. ఎవరైనా సరిచేయవచ్చు’’ అంటూ వారు పైపును కడుతున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. గొడవ పెద్దది కావడంతో పరస్పర దాడులకు పూనుకున్నారు. ఇలా జరుగుతుందని ముందే ఊహించిన రమేష్, రాఘవేంద్ర, నరేష్ పక్కనే ఉన్న కత్తులు, బాకులతో దాడులు చేశారు. బాధితుల అరుపులు కేకలు విన్న గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. పరిస్థితిని అదుపులోనికి తీసుకువచ్చారు. తీవ్రంగా గాయపడిన రాజశేఖర్, శ్రీనివాసులు, నారాయణ, చెన్నకేశవను 108 వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐ రవిప్రకాష్‌రెడ్డి గ్రామంలో జరిగిన సంఘటనపై విచారించారు. హత్యాయత్నానికి పాల్పడినట్టు విచారణ లో తేలడంతో నలుగురు నిందితులపై 326, 307, 324, 323 రెడ్‌విత్ 34 ఐపీసీ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పైప్లైన్లపై మరోసారి అధ్యయనం
సాక్షి, ముంబై: నగర భూగర్భంలోని నీటిపైప్‌లైన్లపై మరోసారి అధ్యయనం చేపట్టాలని నగర పాలక సంస్థ (బీఎంసీ) నిర్ణయించింది. వలసలు పెరగడంతో నగరం నానాటికీ విస్తరిస్తోంది. ముంబైతోపాటు తూర్పు, పశ్చిమ శివారు ప్రాంతాల్లో అనేక కట్టడాలు, వంతెనలు, మెట్రో, మోనో రైలు ప్రాజెక్టు పనులు జరుగుతున్నాయి. తవ్వకాల కారణంగా భూగరంలోని పైపులు తరచూ పగిలిపోతుండడంతో బీఎంసీకి తీవ్రనష్టం వాటిల్లుతోంది. గడ చిన దశాబ్దకాలంలో నగరంలో అనేక మార్పులు జరిగాయి. మూతపడిన మిల్లుస్థలాల్లో అనేక కట్టడాలు వెలుస్తున్నాయి. రహదారులపై ఫ్లైఓవర్లు, సబ్‌వేలను నిర్మిస్తున్నారు. అయితే ఇందుకు సంబంధించి ఓ మ్యాపును రూపొందించకపోవడంతో భూగర్భంలో నీటి పైపుల జాడ తెలియడం లేదు. దీంతో మరోసారి అధ్యయనం చేయాలని బీఎంసీ యోచిస్తోంది. ప్రస్తుతం బీఎంసీ వద్ద ఉన్న భూగర్భ మ్యాపు నాలుగు దశాబ్దాల క్రితం నాటిది. ఆ తరువాత నగరం అనేక విధాలుగా అభివృద్ధి చెందింది. వాస్తవానికి ఈపాటికే మరోసారి అధ్యయనం జరిపి ఉండాల్సింది. అయితే అలా జరగలేదు. దీనికితోడు బీఎంసీలో అనుభవం కలిగిన సిబ్బంది సంఖ్య కూడా అంతంత మాత్రమే. లీకేజీల గుర్తింపు విభాగంలో కేవలం 27 మంది మాత్రమే పనిచేస్తున్నారు. గతంలో 300 నీటి కనెక్షన్లను ఓ జోన్‌గా పరిగణించేవారు. వలసలు పెరగడం, నగరంతోపాటు శివారు ప్రాంతాలు విస్తరించడంతో రెండు వేల కనెక్షన్లను ఒక జోన్‌గా నిర్ణయించారు. దీంతో సిబ్బందిపై పనిభారం కూడా పెరిగింది. -
రూ.50 కోట్లు నీళ్లపాలు!
సాక్షి, సిటీబ్యూరో : కంచే చేను మేయడమంటే ఏంటో జలమండలి ఎయిర్ వాల్వ్‌ల విషయంలో మరోసారి రుజువైంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా ఐదేళ్లుగా కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్లపై నాసిరకం వాల్వ్‌లు ఏర్పాటు చేయడం వల్ల రూ.50 కోట్లు నీళ్ల పాలయ్యాయి. ఈ నిర్వాకంలో కొందరు బోర్డు అధికారులే సూత్రధారులవడం సంచలనం సృష్టిస్తోంది. ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సిన వాల్వ్‌లు మూడేళ్లకే చిల్లులు పడి ముక్కలవుతున్నాయి. దీంతో వాటి స్థానే నాణ్యతగల వాల్వ్‌లు ఏర్పాటు చేయడం జలమండలికి అదనపు భారంగా పరిణమిస్తోంది. అయినప్పటికీ ఈ నాసిరకం సరుకు సరఫరా చేసిన ఓ బడా కంపెనీపై కొందరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. తాజాగా కృష్ణా మూడోదశ పైప్లైన్లపై వాల్వ్‌లు ఏర్పాటు చేసేందుకు అదే సంస్థకు రూ.28 కోట్ల మేర ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఇప్పటికే రూకల్లోతు కష్టాల్లో ఉన్న జలమండలికి నాసిరకం వాల్వులతో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. నల్లగొండ జిల్లా కోదండాపూర్ నుంచి నగర శివార్లలోని సాహెబ్‌నగర్ వరకు 110 కిలోమీటర్ల మేర కృష్ణా మొదటి, రెండవ దశల పైప్‌లైన్ ఉంది. మరోవైపు నగరం నలుమూలలా మంచినీటి సరఫరాకు మరో వంద కిలోమీటర్ల మేర పైప్లైన్లున్నాయి. వీటిపై 2010లో సుమారు 600 ఎం.ఎం. సామర్థ్యం గల బటర్‌ఫ్లై, నాన్ రిటర్న్ వాల్వ్‌లు 300, 2000 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్‌లు 35 వరకు ఏర్పాటు చేశారు. వీటి ధర సామర్థ్యాన్ని బట్టి ఒక్కొక్కటి రూ.7 నుంచి రూ.20 లక్షల వరకు ఉంటుంది. ఇవన్నీ పుణేకు చెందిన ఓ బడా కంపెనీ సరఫరా చేసినవి కావడం గమనార్హం. వీటి ఏర్పాటుకు జలమండలి ఇప్పటివరకు రూ.50 కోట్లు వ్యయం చేసింది. ఇవి ఐదేళ్లపాటు నిర్విరామంగా పనిచేయాల్సి ఉంది. విద్యుత్ సరఫరాలో అంతరాయం తలెత్తినపుడు పైప్లైన్లలో ఏర్పడే అత్యధిక పీడనం, గాలి ఒత్తిడిని బయటికి పంపి పైప్‌లైన్‌ను రక్షించి నీటిసరఫరాకు ఆటంకం లేకుండా చేయడం వీటి విధి. అయితే ఇపుడు వీటి పనితీరే ప్రశ్నార్థకంగా మారింది. వీటిలో సింహభాగం ఏర్పాటుచేసిన మూడేళ్లకే మొరాయిస్తున్నాయి. మరికొన్ని అలంకార ప్రాయంగా మారాయి. సాంకేతిక లోపాలు, నాసిరకం విడిభాగాలు వాడడం, తయారీ లోపాలతో అత్యధిక నీటి ఒత్తిడికి తట్టుకోలేక తరచూ వీటికి చిల్లులు పడుతున్నాయి. దీంతో కృష్ణా మొదటి, రెండో దశల ద్వారా సిటీకి సరఫరా అవుతున్న 180 మిలియన్ గ్యాలన్ల నీటిలో నిత్యం 40 శాతం నీరు వృథా అవుతున్నట్లు సమాచారం. మరోవైపు రూ.50 కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన వాల్వ్‌ల స్థానే ప్రస్తుతం కొత్తవి ఏర్పాటు చేయాల్సిన దుస్థితి తలెత్తింది. విజిలెన్స్ విచారణ జరపాలి ఈ నాసిరకం వాల్వ్‌లు సరఫరా చేసిన కంపెనీపై కొం దరు జలమండలి అధికారులకు ప్రేమ తగ్గడం లేదు. గతంలో ఏర్పాటు చేసినవాటి పనితీరే ఇలా ఉంటే.. ప్రస్తుతం జరుగుతున్న కృష్ణా మూడోదశ పైప్లైన్లపై ఏర్పాటు చేసేందుకు రూ.28 కోట్ల మేర వాల్వ్‌లు సరఫరా చేయాలని సదరు కంపెనీకి ఆర్డరు ఇచ్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. నగర బహిరంగ మార్కెట్లో నాణ్యత, మన్నిక కలిగిన వాల్వ్‌లు సరసమైన ధరలకు లభిస్తున్నప్పటికీ సదరు కంపెనీపై అధికారులు వల్లమాలిన ప్రేమ చూపుతుండటం విస్మయం కలిగిస్తోంది. సదరు కంపెనీ తాయిలాలకు కక్కుర్తి పడి ఇంటి దొంగలే దానికి అనుకూలంగా పనిచేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. బోర్డు ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టి సారించి గతంలో జరిగిన అక్రమాలపై విజిలెన్స్ విచారణ జరపాలని బోర్డు కార్మికసంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నీళ్ల పాలు ఇలా వాల్వ్‌ల కోసం ఐదేళ్లుగా జలమండలి చేసిన వ్యయం : రూ.50 కోట్లు 600 ఎం.ఎం. సామర్థ్యం గల వాల్వ్‌లు : 300 2000 ఎం.ఎం. సామర్థ్యం గలవి : 35 ఒక్కో వాల్వ్ ధర : రూ.7 లక్షలు -రూ.20 లక్షలు వాల్వ్‌లు ఏర్పాటు చేసింది..: కృష్ణా మొదటి, రెండవ దశ పైప్లైన్లపై మూడోదశ పైప్‌లైన్‌పై వాల్వ్‌ల కోసం ఆర్డర్ ఇచ్చింది : గత కంపెనీకే తాజా ఆర్డర్ విలువ: రూ.28 కోట్లు -
దగాపడ్డ దళితులు
ప్రొద్దుటూరు, న్యూస్‌లైన్: ఆ పథకం పూర్తయితే తమ భూములు బంగారు భూములుగా మారతాయని ఆ గ్రామంలోని ఎస్సీ కుటుంబాలకు చెందిన వారు ఎన్నో కలలుకన్నారు. అయితే ఇటు రాజకీయ అండతో కొంతమంది గ్రామ నాయకులు, అటు అధికారులు కలిసి ఆ పొలాలకు పైపులైన్ వేయకుండానే పనులు పూర్తిచేశారు. గ్రామంలో తమకు అనుకూలమైన వారి పొలాలకు మాత్రమే పైపులైన్ వేసి వీరికి మాత్రంమినహాయించారు. ఇందుకు సంబంధించి పనులు కూడా పూర్తయినట్లు బిల్లులు కూడా తీసుకున్నారు. మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కోరిక మేరకు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రొద్దుటూరు మండలంలోని నాగాయపల్లె గ్రామానికి ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేశారు. గ్రామానికి సంబంధించి చెరువు ఉండగా అందరి పొలాలకు చెరువు ద్వారా నీరు అందుతోంది. మరికొందరు కుందూనది నుంచి మోటార్ల ద్వారా నీటిని సరఫరా చేసుకుంటున్నారు. ఇదిలా ఉండగా గ్రామంలోని 64 మంది ఎస్సీ కుటుంబాలకు ప్రభుత్వం గ్రామంలోని 32 ఎకరాల భూములను కొనుగోలు చేసి ఒక్కొక్కరికి అర ఎకరా చొప్పున ఇచ్చింది. ప్రధానంగా ఎత్తిపోతల పథకం మంజూరుకు ఎస్సీల భూములే కారణం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ తో మొత్తం అన్ని వర్గాలవారికి చెందిన 250 ఎకరాల ఆయకట్టును ఇందులో చూపించారు. మరో ఆసక్తికర విషయమేమంటే రెండెకరాల పొలానికి నీరందించేందుకు వందల అడుగులు ప్రత్యేకంగా పైపులైన్ వేసిన అధికారులు దగ్గరలో ఉన్న ఎస్సీ భూములకు మాత్రం పైపులైన్ వేయలేదు. గ్రామానికి చెందిన వరదరాజలరెడ్డి వర్గీయుడైన రమణారెడ్డి ఈ పనులు చేయడంతోపాటు ఆయనే ప్రస్తుతం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. దీంతో గ్రామానికి చెందిన ఎస్సీ రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అగ్రవర్ణాలవారు కలిసి తమ కడుపుకొట్టారని అంటున్నారు. ప్రభుత్వమేమో తమ కోసం పథకాన్ని మంజూరు చేసినా అగ్రవర్ణాలవారు తమకు రానీయడం లేదన్నారు. దీంతో ఎస్సీల భూమలు నీటి వసతి , మోటార్లు ఏర్పాటు చేసుకునే ఆర్థికస్తోమతలేని కారణంగా ఆరుతడిపంటలు సాగుచేసుకుంటున్నారు. తమ అరెకరానికి సాగునీరు అందితే కష్టపడి పండించి తమ కుటుంబాలను పోషించుకుంటామని తెలిపారు. మరోవైపు పథకం సక్రమంగా పనిచేయకున్నా అన్నీ సవ్యంగా ఉన్నట్లు చూపి అధికారులు బిల్లులు చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం ఇందిరమ్మ కలలు పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే అధికారుల దృష్టికి మాత్రం ఈ సమస్య రాకపోవడం గమనార్హం. పథకం పూర్తయి ఇన్నేళ్లు అయినా పరిస్థితి ఇలాగే ఉంది. ఈ విషయంపై కమిటీ చైర్మన్ రమణారెడ్డిని న్యూస్‌లైన్ వివరణ కోరగా ఎస్సీల భూములకు పైపులైన్ వేయించాలని పలుమార్లు ప్రయత్నించామన్నారు. భూములు ఎత్తులో ఉండడంతో పైపులైన్ వేయడం సాధ్యం కాలేదన్నారు. నీటిపారుదల శాఖ డీఈ వేణుగోపాల్‌రెడ్డిని వివరణ కోరగా ప్రస్తుతం నేనే బదిలీ అయ్యానన్నారు. గ్రామ నాయకులే అడ్డుకున్నారు మా పొలాలకు పైపులైన్వేయకుండా గ్రామ నాయకులే అడ్డుకున్నారు. పొలాలకు నీరు అంది ఉంటే ఆర్థికంగా అభివృద్ధి చెంది మా జీవితాలు మెరుగు పడేవి. - వంగలి పెద్ద ఓబన్న ప్రభుత్వం ఏమో నిధులిస్తోంది ఎస్సీల సంక్షేమం కోసం ప్రభుత్వం మాత్ర నిధులు కేటాయిస్తోంది. అయితే కింది స్థాయికి వచ్చే సరికి అవి అమలుకు నోచుకోలేదు. దీంతో మేము నలిగిపోతున్నాం. ఎన్నిమార్లు విన్నవించినా ఫలితం లేదు. - కొట్టం దస్తగిరి ఏదో ఒకటి చెప్పి మభ్యపెడతారు మా పొలాలకు పైపులైన్ వేయలేదని పలు మార్లు అధికారులు విచారణకు వచ్చారు. అయితే మా ఇళ్లల్లో ఎవరినో ఒకరిని తీసుకెళ్లి మాయో మంత్రమో చేసి వారికి అనుకూలంగా రాయించుకుంటున్నారు. మద్యం సీసాలు కూడా ఇస్తున్నారు. అందువల్లే సమస్య పరిష్కారం కాలేదు. 16పిడిటిఆర్03 - లక్షుమయ్య పచ్చగా పంటలు సాగు చేసేవారం ఎత్తిపోతల పథకం ద్వారా సాగు నీరు అందివుంటే పచ్చగా పంట పొలాలు సాగు చేసి ఉండేవారం. నీరు లేని కారణంగానే శనగ, ఇతర ఆరుతడి పంటలను సాగు చేస్తున్నాం. నాయకులు, అధికారులు కలిసి ఇలా చేస్తున్నారు. - మడూరు ఓబన్న