- నత్తనడకన ‘వాటర్‌గ్రిడ్’
- కొన్ని జిల్లాల్లో లైన్ సర్వేకు ఖ రారు కాని టెండర్లు
- కొన్ని సెగ్మెంట్లలో ముందుకు రాని కాంట్రాక్టర్లు
- వచ్చినవారితోనే పనిచేయిస్తామంటున్న అధికారులు
సాక్షి, హైదరాబాద్: మూడేళ్లలో వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును పూర్తి చేసి ఇంటింటికీ నల్లా కనెక్షన్ ఇస్తామని ఓ వైపు ప్రభుత్వం దూకుడుగా ప్రకటనలు చేస్తుంటే.. మరోవైపు గ్రిడ్‌కు సంబంధించిన పనులేమో క్షేత్రస్థాయిలో నత్తనడకన జరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన తెలంగాణ డ్రింకింగ్ వాటర్‌ప్రాజెక్టు (వాటర్‌గ్రిడ్) తొలిదశకు సంబంధించిన లైన్ సర్వే ప్రక్రియ మొదలై ఆర్నెల్లు గడుస్తున్నా.. ఇంతవరకు కొన్ని జిల్లాల్లో లైన్ సర్వే కొలిక్కిరాలేదు.
కొన్ని సెగ్మెంట్లలో ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కాక లైన్ సర్వే చేసేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాని పరిస్థితి నెలకొంది. అర్హతగల కాంట్రాక్టర్లు ముందుకురాని సెగ్మెంట్లలో అధికారులు వారికి.. నచ్చిన వాళ్లతోనే సర్వే పనులు చేయించాలని యోచిస్తున్నారు. విచిత్రమైన విషయం ఏమంటే వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేలో ‘లైడార్’వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తున్నామని ప్రభుత్వ పెద్దలు చెబుతుంటే.. ప్రస్తుతం జిల్లాల్లో లైన్ సర్వే పనులన్నీ సంప్రదాయ విధానంలోనే జరుగుతున్నాయి.
కాంట్రాక్టర్లు ముందుకు రాకనే..
వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టుకు సంబంధించి సుమారు 45 వేల కిలోమీటర్ల సెకండరీ పైప్‌లైన్ వేయాల్సి ఉంది. ఈ పైప్‌లైన్ నిర్మాణం కోసం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లైన్ సర్వే నిర్వహించాల్సి ఉంది. ఆయా మార్గాల్లో ఎత్తుపల్లాలు, పొడవు, వెడల్పు..తదితర సర్వే అంశాల అధారంగానే నిర్మాణ పనులను నిర్వహిస్తారు. లైన్ సర్వే పూర్తికాకుంటే ప్రాజెక్టు అంచనాల రూపకల్పన, పైప్‌లైన్ నిర్మాణం ప్రారంభించేందుకు వీలుకాదు. ఈ నేపథ్యంలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు బాధ్యతలను చేపట్టిన గ్రామీణ నీటి సరఫరా విభాగం గతేడాది అక్టోబర్‌లోనే లైన్ సర్వే కోసం టెండర్ల(ఈవోఐ)ను పిలిచింది.
రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన 58 ఏజెన్సీలు ఈ టెండర్లలో పాల్గొన్నాయి. ఇందులో ప్రభుత్వం విధించిన నిబంధనల మేరకు 35 ఏజెన్సీలు మాత్రమే అర్హత(ఫైనాన్షియల్, టెక్నికల్) సాధించాయి. అయితే.. ఏజెన్సీలు తమ టెండర్లలో పేర్కొన్న ధరల్లో అతితక్కువ ధర(కిలోమీటరుకు రూ.3,500)నే సర్కారు ఖరారు చేసింది. దీంతో లైన్ సర్వే పనులు చేపట్టేందుకు కేవలం 18 ఏజెన్సీలే ముందుకు వచ్చాయి.
ఇలా వచ్చిన ఏజెన్సీలతోనే ఆయా జిల్లాల్లోని సెగ్మెంట్లలో పనులు చేపట్టారు. అయితే.. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల్లోని కొన్ని సెగ్మెంట్లలో సర్వే పనులు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఆయా సెగ్మెంట్లలో సర్వే పనులకు ప్రభుత్వం నిర్ణయించిన ధర గిట్టుబాటు కానందునే అర్హత కలిగిన కంపెనీలు పనులు చేపట్టేందుకు ముందుకు రాలేదని సమాచారం. దీంతో మరలా టెండర్లు పిలిచేందుకు ఇష్టపడని అధికారులు తమకు నచ్చిన ఏజెన్సీలతోనే పనులు చేయించేందుకు మొగ్గుచూపుతున్నారు.
‘లైడార్’పై వెనక్కి తగ్గిన ప్రభుత్వం
తెలంగాణ వాటర్‌గ్రిడ్ లైన్‌సర్వేను వేగంగా పూర్తి చేసేందుకు ‘లైటింగ్ డిటెక్షన్ రేంజింగ్(లైడార్)’ టెక్నాలజీని వినియోగించే ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం విరమించుకున్నట్లు తెలిసింది. లైడార్ టెక్నాలజీకి బదులుగా సంప్రదాయ (టోటల్ స్టేషన్ అండ్ డీజీపీఎస్) పద్ధతులనే అవలంబించాలని నిర్ణయించినట్లు సమాచారం. లేజర్ కిరణాలతో రిమోట్ సెన్సింగ్(లైడార్) ద్వారా భూ ఉపరితలాన్ని సర్వే చేసే ప్రక్రియకు, సంప్రదాయ విధానం కంటే అధికంగా ఖర్చవుతుండడమే ఇందుకు కారణంగా ప్రభుత్వం భావిస్తోంది. మూడేళ్లలో వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పూర్తి కావాలనే ప్రభుత్వ లక్ష్యం నెరవేరాలంటే అధునాతన పద్ధతులతోనే సాధ్యమని, సంప్రదాయ పద్ధతుల ద్వారా నిర్దేశిత సమయంలో లక్ష్యాలను చేరుకోవడం అసాధ్యమని వాటర్‌గ్రిడ్ ప్రాజెక్ట్ అధికారులు అంటున్నారు.