- ప్రాజెక్టు తొలిదశ పూర్తికే రూ.15 వేల కోట్ల వ్యయం!
- అలుగు పునాదిని పెంచాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సూచించిన సీడీవో
- ఈ మార్పులతో మరో రూ.500 కోట్ల మేర పెరగనున్న అంచనాలు
సాక్షి, హైదరాబాద్: పాలమూరు ఎత్తిపోతల ప్రాజె క్టు అంచనా వ్యయం మరింత పెరగనుంది. ప్రాజెక్టు తొలి దశ పూర్తి చేసేందుకే దాదాపు రూ.15 వేల కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రాజెక్టు అలుగు పునాది (ఫౌండేషన్ లెవల్)ని మరింత కిందకు తీసుకెళ్లాలని, ప్రధాన కాల్వలకు లైనింగ్ చేయాలని సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్(సీడీఓ) సూచించిన నేపథ్యంలో వ్యయం పెరగనున్నట్లు తెలుస్తోంది.
ఈ పథకం ద్వారా మూడు జిల్లాల పరిధిలోని సుమారు 10 లక్షల ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలని సంకల్పించిన తెలంగాణ ప్రభుత్వం గత జూలై నెలలోనే ప్రాజెక్టు సమగ్ర నివేదిక తయారీకోసం ఇంజనీరింగ్ స్టాఫ్ కాలేజీకి రూ.5.73 కోట్లను విడుదల చేసింది. ఈ కాలేజీ తొలిదశ సర్వేను డిసెంబర్‌లోనే పూర్తి చేసింది. పైప్‌లైన్, ఓపెన్ చానల్, టన్నెల్ అలైన్‌మెంట్, రిజర్వాయర్ల గుర్తింపు, పంపింగ్ స్టేషన్లు, ముంపు గ్రామాల గుర్తింపు ప్రక్రియను పూర్తి చేసింది.
దీని ప్రకారం జూరాల నుంచి వరద ఉండే 25 రోజుల్లో 70 టీఎంసీల నీటి తరలింపునకు 5 కిలోమీటర్ల మేర ఓపెన్ చానల్, 25 కిలోమీటర్ల మేర టన్నెల్‌ను నిర్మించాలని సూచించింది. ఈ నీటిని 70 టీఎంసీల సామర్థ్యం ఉండే మొదటి రిజర్వాయర్ కోయిల కొండలోకి 170 మీటర్ల ఎత్తునుంచి ఎత్తిపోయాల్సి ఉంటుంది. దీనికోసం ఇక్కడ ఏర్పాటు చేసే పంపిం గ్ స్టేషన్ వద్ద 160మెగావాట్ల సామర్థ్యం కలిగిన 14 పంపులను ఏర్పాటు చేయాలి. ప్రాజెక్టు తొలిదశ నిర్మాణ పనులకు సుమారు రూ. 14,950 కోట్ల మేర అవసరం ఉంటుందని అంచనా వేసింది.
దీనిపై డిసెంబర్ రెండో వారంలోనే పరిశీలన చేసిన ఆర్థిక శాఖ రూ.14,400 కోట్లకు డీపీఆర్‌ను ఆమోదించి తదుపరి పరిశీలన కోసం సీడీఓకు పంపింది. అన్ని అంశాలను పరిశీలించిన సీడీఓ, ప్రాజెక్టు వద్ద రాళ్లు, మట్టి సామర్థ్యాన్ని బట్టి అలుగు పునాదిని మరింత కిందకు తీసుకెళ్లాలని సూచించింది. దీని కోసం అదనంగా మరో రూ. 60 నుంచి రూ.80 కోట్ల మేర ఖర్చు పెరుగుతుందని అంచనా వే సింది. ప్రధాన కాల్వలకు కాంక్రీట్ లైనింగ్ చేయాలని దీనికి మరో రూ.200 నుంచి రూ.300ల కోట్ల మేర వ్యయం పెరుగుతుందని సీడీఓ పేర్కొన్నట్లుగా తెలిసింది.
ఇక వీటితోపాటే రిజర్వాయర్‌ల వద్ద ఏర్పాటు చేసే పంప్‌హౌస్‌ల నిర్మాణంలోనూ కొన్ని మార్పులు చేర్పులు చేసినట్లుగా సమాచారం. వీటన్నింటినీ కలుపుకొని అదనంగా రూ.500 కోట్ల మేర వ్యయం అయ్యే అవకాశాలు ఉన్నట్లు నీటి పారుదల శాఖ అంచనా వస్తోంది. కాగా మరో మూడు, నాలుగు రోజుల్లోనే సీడీఓ తన నివేదికను ప్రభుత్వానికి సమర్పించనుందని తెలిసింది. అనంతరం ప్రాజెక్టుకు పరిపాలనా అనుమతులు, శంకుస్థాపన తదితరాలపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది.