అనుమతివ్వండి... ప్రాజెక్ట్ కట్టుకుంటాం
బెంగళూరు : కావేరినది కర్ణాటక భూ భాగంలోని మేకెదాటు వద్ద జలాశయం నిర్మించడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా ప్రధాని నరేంద్రమోదీని అఖిల పక్షం కోరింది. ఢిల్లీలో గురువారం కర్ణాటక సీఎం సిద్ధరామయ్య నేతృత్వంలో అన్ని పార్టీ నాయకులు మోదీని కలిసి ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు ఆరోపిస్తున్నట్లు మేకెదాటు వద్ద నిర్మించే జలాశయం వల్ల అందుబాటులోకి వచ్చే నీటిని వ్యవసాయ పనులకు వినియోగించబోమన్నారు. ప్రస్తుతం కేఆర్‌ఎస్, కబినీ జలాశయాల నుంచి బెంగళూరు నగరంతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు తాగునీటిని అందిస్తున్నామన్నారు.
పెరుగుతున్న అవసరాలతో ఈ రెండు జలాశయాల నుంచి వచ్చే నీరు సరిపోవడం లేదన్నారు. పరిస్థితి ఇలాగే ఉంటే భవిష్యత్‌లో తాగునీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని తెలిపారు. అందువల్లే మేకెదాటు వద్ద నూతన జలాశయాన్ని నిర్మించాలని భావిస్తున్నామని వివరించారు. అందువల్ల జలాశయ నిర్మాణానికి అవసరమైన అనుమతులను తొందరగా ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ప్రధానిని కలిసిన వారిలో సీఎం సిద్ధరామయ్యతో పాటు కేంద్ర మంత్రులు అనంతకుమార్, డీ.వీ సదానందగౌడ తదితులు ఉన్నారు.