దసరా పండుగ నాడు ఢిల్లీ ‘భారత మండపం’లోని ‘గతిశక్తి అనుభూతి కేంద్ర’ను మోదీ హఠాత్తుగా సందర్శించారు. ఆ రోజు ‘ప్రధాన మంత్రి గతి శక్తి’ కేంద్రం మూడవ వార్షికోత్సవం వేళ అక్కడికి వెళ్లి తన ప్రాధాన్యాన్ని దేశానికి వెల్లడించారు. అయితే, ఇది అందరికీ ఒకేలా అర్థం కావాలనే షరతు ఏమీ లేదు. వీటి తాత్పర్యం చంద్ర బాబుకు ఒకలాగా, జగన్‌మోహన్ రెడ్డికి మరొక లాగా అర్థం కావొచ్చు. అందుకు వాళ్ళ వయస్సు, వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చిన కాలం, వారి ప్రాపంచిక దృక్పథం, మరెన్నో కారణాలు కావొచ్చు. అయితే తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన ఈ పదేళ్ళలో అదీ దేశానికి తూర్పున ఈ చివరన ఉన్నామేమో, ఇందులో ‘మనకు ఏముంది’ అని చూసినప్పుడు, మనం అర్థం చేసుకోవాల్సింది కొంచెం ఎక్కువే ఉంది.
ఇందులో కేంద్ర ప్రభుత్వం రూ. 15.39 లక్షల కోట్ల వ్యయంతో చేపట్టిన 208 భారీ మౌలిక వసతుల కల్పన ప్రాజెక్టులు ఉన్నాయి. దీని అమలుకు వేర్వేరు శాఖలు, రాష్ట్ర, కేంద్రపాలిత ప్రభుత్వాలతో సమన్వయం కోసం ఒక ‘నెట్ వర్క్ ప్లానింగ్ గ్రూప్’ పనిచేస్తున్నది. ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఆఫ్ ఇండస్ట్రీ – ఇంటర్నల్ ట్రేడ్’ కార్యదర్శి అమర్ దీప్ సింగ్ భాటియా... ‘ఇందులో 101 జాతీయ రహదారులు, 73 రైల్వే ప్రాజెక్టులు, 12 పట్టణ అభివృద్ధి ప్రణాళికలు, 4 చమురు–గ్యాస్ ప్రాజెక్టులు ఉన్నాయి’ అంటున్నారు. ఈ నాలుగు రంగాలు కూడా ప్రాంతాల మధ్య దూరాలనుతగ్గించి వాటిని చేరువ చేస్తూ, విద్యుత్తు భద్రత, పట్టణీకరణ లకు దోహదం చేస్తాయి. ఇందులో కీలకమైన అంశం ‘పి.ఎం. గతిశక్తి’... ‘బ్రాడర్ విజన్’ పేరుతో దేశవ్యాప్తంగా 1600 రకాల ‘జియో స్పైటల్ డేటా’ను సేకరించి ఈ ‘నేషనల్ మాస్టర్ ప్లాన్’ ప్రాజెక్టు కోసం ఇక్కడ భద్రపరుస్తున్నారు.
పక్కా ‘డేటా’తో అభివృద్ధి ప్రణాళికల తయారీకోసం వీటిని సేకరిస్తున్నారు. ఇందులో ‘నేచురల్ రిసోర్సెస్ డేటా’ సేకరణ ఒక అంశంగా ఉంది. ప్రాంతాల స్వరూపం తెలి యడం కోసం ‘ల్యాండ్ రికార్డ్ డేటా’ అవసరం. అలాగే సాగు కోసం భూగర్భ జలాల వినియోగం ఎంతో తెలియడానికి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అమర్చాలి. నిజానికి ఇవి కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు. వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం అమలు లోకి తెచ్చిన వీటిని ప్రతిపక్షాలు ఎన్నికల్లో ఏ స్థాయిలో అల్లరి చేసిందీ తెలిసిందే. ‘అభివృద్ధి’ గురించి ఆంధ్రప్రదేశ్‌లో మాట్లాడితే అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా ఏడాది ముందు మార్చి 2023లో విశాఖలో జరిగిన ‘గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్’లో కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ చెప్పింది ఏమిటో చూడాలి.
ఇందులో కీలకం ఏమంటే, ఆయన దృష్టి ఆసాంతం ఢిల్లీ నుంచి కిందికి దక్షిణాదికి దిగే క్రమంలో ఢిల్లీ యంత్రాంగాన్ని నేరుగా తూర్పు తీరానికి చేర్చడంపై పెట్టారు. ‘ప్రస్తుతం ఢిల్లీ నుంచి బొంబాయి చేరి అక్కణ్ణించి నాగపూర్ వచ్చి అక్కణ్ణించి దక్షిణాది రాష్ట్రాల్లోకి ప్రవేశించడానికి రోడ్డు ప్రయాణంలో ఎదురవుతున్న కష్టాన్ని చెబుతూ... ఇప్పుడు నిర్మాణంలో ఉన్న ‘నేషనల్ హైవేస్’ డిసెంబర్ 2024 నాటికి పూర్తి అవుతాయనీ, అవి పూర్తి అయితే వాటిలో ఒకటైన ‘రాయపూర్–విశాఖపట్టణం’ రోడ్డు ద్వారా ఖనిజ నిక్షేపాలు ఉన్న ఛత్తీస్‌గఢ్‌కు ఏపీ పోర్టులు అందుబాటులోకి వస్తాయనీ ఆయన అన్నారు. ప్రస్తుతం ఇక్కడ 2,014 కి.మీ. పొడవైన 70 రోడ్డు ప్రాజెక్టులు రూ. 33.540 కోట్ల వ్యయంతో నిర్మిస్తు న్నామన్నారు.
ఇలా ఢిల్లీ నుంచే కాకుండా, సెంట్రల్ ఇండియా నుంచి దక్షిణాన మన సముద్ర తీరానికి రెండు మూడు మార్గాల్లో తేలిగ్గా చేరవచ్చన్నారు. సరే, ఇది విని ‘ఎందుకు?’ అని మనం ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు నాలుగు నెలల తర్వాత కాకినాడలో దొరికింది. అక్టోబర్ 28న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, పరిశ్రమలు–వాణిజ్య శాఖా మంత్రి పీయూష్ గోయల్ ‘ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్’ సదరన్ కేంపస్ ప్రారంభానికి హాజరై ఆంధ్ర సముద్ర తీరం డిల్లీకి ఎంత కీలకమో చెప్పకనే చెప్పారు. ఇక వెనకబడిన మెట్ట కరవు ప్రాంతాలను ‘ఓపెన్’ చేయడానికి నడికుడి– శ్రీకాళహస్తి ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా నడికుడి నుంచి పల్నాడు జిల్లా శావల్యాపురం వరకు పనులు పూర్తి చేశారు.
రెండో దశలో దర్శి వరకు రైల్వే లైన్ మార్చి నాటికి పూర్తయింది. అద్దంకి రోడ్డు వద్ద స్టేషన్ ఏర్పాటు చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొత్త రాష్ట్రంలో గత వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తనదైన సంక్షేమ ముద్రను ప్రతి రంగం మీద వేసింది. కుర్చీ ఎక్కిన ఆరు నెలల్లోనే వచ్చిన ‘కరోనా’ మహమ్మారిని నిలువరించడంలో దేశంలోనే ‘ఏపీ’ ముందు నిలిచింది. జగన్ ముందు చూపు అప్పట్లో అందరికీ అర్థం కాలేదు. కేంద్రం ‘గతిశక్తి సంఘటన్’ పేరుతో చేస్తున్న మౌలిక వసతుల కల్పన వల్ల రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకుని, జగన్ ప్రభుత్వం ప్రజల పాటవ నిర్మాణం (కెపా సిటీ బిల్డింగ్) పై దృష్టి పెట్టింది.
సంక్షేమ పథకాలు అమలు చేస్తూనే, విద్య–వైద్యం ప్రాధాన్యత పెంచింది. కొత్త జిల్లాలతో ప్రభుత్వాన్ని, కొత్త మెడికల్ కాలేజీలతో వైద్యాన్ని కొత్త ప్రాంతాలకు చేర్చింది. నైపుణ్యాలు తప్పనిసరి అయ్యే సామాజిక వర్గాలు – ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల జీవిక కోసం ‘స్కిల్ డెవలప్మెంట్’పై దృష్టి పెట్టింది. అయినా ఎన్నికలప్పుడు ‘అభివృద్ధి ఏది?’ అనే విమర్శ చేయడం చాలా తేలిక. కానీ ‘అభివృద్ధి’ అంటే ‘మానవాభివృద్ధి’ అని అర్థమయ్యేట్టుగా చెప్పడం మరీ కష్టం.
వ్యాసకర్త అభివృద్ధి – సామాజిక అంశాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment