సాక్షి, విజయవాడ : రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో టీడీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు యూ టర్న్ స్పష్టంగా బహిర‍్గతం అవుతోంది. ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా చంద్రబాబు వ్యవహరించిన తీరు.... వెనకటికి పెద్దలు సామెత చెప్పినట్లు తాను చేస్తే సంసారం... ఎదురు వాళ్లు చేస్తే వ్యభిచారం అన్న చందంగా మారింది. ఒకప్పుడు ప్రత్యేక హోదా కోసం వైఎస్సార్ సీపీ ఉద్యమిస్తే ఎద్దేవా చేయడమే కాకుండా, ఎక‍్కడికక్కడ అడ్డుకోవడమే కాకుండా, అరెస్ట్‌లకు పాల్పడింది.
అలాంటిది మోదీ గుంటూరు పర్యటన నేపథ్యంలో టీడీపీ... నల్ల చొక్కాలు, జెండాలు, బెలూన్లతో హడావుడి చేసింది. గతంలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతూ విశాఖలో తలపెట్టిన నిరసన కార్యక్రమానికి వెళుతుండగా చంద్రబాబు ప్రభుత్వం విమానాశ్రయంలోనే అడ్డుకుని అరెస్టులు చేసింది. 2015లో ప్రధాని నరేంద్ర మోదీ ఏపీకి వస్తున్నారని.. హోదా కోసం అప్పటికే ఆమరణ దీక్ష చేస్తున్న వైఎస్ జగన్‌ను అరెస్టు చేశారు. పోరాటం చేసియాల్సిన సమయంలో చేయకుండా బీజేపీతో నాలుగేళ్లు కాపురం చేసిన టీడీపీ ప్రజలు ప్రత్యేక హోదా కోరుతూ రోడ్డెక్కితే అరెస్టులు చేసి ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేశారు.
హోదా సంజీవనా? హోదా వచ్చిన రాష్ట్రాలకు ఏం ఒరిగింది? అందరికంటే మనమే ఎక్కువ సాధించాం, హోదా అంటే జైలుకే అంటూ ప్రజల మనోభావాలను దెబ్బతీసి.. ఏపీకి ద్రోహం చేసిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం హడావిడిగా ఎన్నికల ముందు చేస్తున్న గారడీలను రాష్ట్రం నమ్మే పరిస్థితిలో లేదు. పైపెచ్చు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్టాండ్ ఏంటంటూ ఎదురు దాడికి దిగటం విడ్డూరంగా ఉందని ప్రతిపక్ష పార్టీ నేతలు మండిపడుతున్నారు. నాలుగున్నరేళ్లుగా హోదా కోసం ఎవరు పోరాటం చేస్తున్నారో ప్రజలందరికీ తెలుసని అంటున్నారు.
హోదా సజీవంగా బతికింది వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చేసిన పోరాటాల వల్లేనని, చంద్రబాబు, లోకేష్‌కు బుద్ధి చెప్పడానికి రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారని వైఎస్సార్ నేతలు స్పష్టం చేశారు. అంతేకాకుండా ట్విటర్‌లో మాత్రమే స్పందించే లోకేష్ తమ అధినేతను విమర్శించడం హాస్యాస్పదమని ...ఇన్నేళ్లు తండ్రీకొడుకులు ఎక్కడ దాక్కున్నారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. కేంద్రంపై టీడీపీ నేతలది ఉత్తుత్పి యుద్ధమేనని, ఏపీకి మోదీ వస్తే టీడీపీ నేతలు ఒక్కరూ కూడా రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపలేదన్నారు. ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా నిరసన తెలిపేందుకే నల్ల చొక్కా వేసుకున్నానన్న చంద్రబాబు ఇన్నిరోజులు ఏం చేశారని వైఎస్సార్ సీపీ నేతలు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment