నక్కలగండి..!నత్తేనయం..!!
దేవరకొండ : నక్కలగండి బండ్ (రిజర్వాయర్) పనుల ప్రక్రియ నత్తకంటే నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఐదు నెలల కాలంగా ఏ ఫైలు గానీ, ఏ పని గానీ ఇంచు కూడా ముందుకు జరగలేదు. ఈ విషయం అందరికీ తెలిసినా పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నికలకు ముందు రేపటినుంచే పనులు చేస్తామన్నట్లు హడావిడి చేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రిజర్వాయర్‌కు సేకరించిన భూమిలో నష్టపరిహారం చెల్లించకపోవడం..మరోవైపు పనులు ముం దు కు సాగకపోవడంతో అటు ముంపు బాధితులు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనైనా సమస్యను పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు.
ఇదీ.. అసలు కథ
ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టు 2009వరకు పూర్తి కావాల్సి ఉండగా మూడేళ్లు పొడిగించి2012వరకు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల జాప్యానికి చేరి 2014లో పూర్తిచేస్తామన్నారు. సొరం గం 49 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉండగా టన్నెల్-1, టన్నెల్-2 కలిసి ఇప్పటివరకు 25కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తయింది. బడ్జెట్ కేటాయింపులో ప్రాజెక్టులపై గత ఏడాది తక్కు వ మొత్తంలో కేటాయించడంతో అతిపెద్ద ప్రాజె క్టు అయినా ఎస్‌ఎల్‌బీసీ పనుల్లో కూడా జాప్యం జరిగింది. దీనిలో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కట్ట (బండ్) పనుల విషయానికి వస్తే మొత్తం 3700ఎకరాల భూసేకరణ చేయగా, అందులో బండ్ నిర్మాణానికి 85 ఎకరాలు అవసరమని గుర్తించి ఆ భూముల రైతులకు పరిహారం కూడా చెల్లించారు.
వీటితోపాటు 3700ఎకరాల్లో కేవలం సుమారు 300 ఎకరాలకు మాత్రమే రైతులకు నష్టపరిహారం చెల్లించగా, ఇంకా 3400 ఎకరాల మేర నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. అయితే రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు 2007లో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలవగా లెస్‌లో జీవీవీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.200 కోట్లతో పనులు చేపడితే నష్టం వచ్చే అవకాశముందని భావించి టెండర్ కాస్ట్ పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ససేమిరా అనడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోగా, పనుల్లో జాప్యం జరిగే అవకాశమున్నందున తాజాగా టెండర్లు పిలువచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం రిజర్వాయర్ కట్ట పనులకు రూ.435 కోట్ల అంచనా వ్యయంతో సంబంధిత అధికారులు ఆన్‌లైన్ టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది.
కొత్తరాష్ట్రంలోనైనా ఆశలు నెరవేరేనా..
అయితే ఇక్కడిరైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. తమ ఆవేదనను తెలంగాణ ప్రభుత్వమైనా అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు పనులు, సొరంగం పనులు ఏళ్ల తరబడి సాగడం వల్ల చుట్టు పక్కల భూముల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా నష్టపరిహారం పూర్తిగా చెల్లించి పనులు పూర్తవుతాయన్న ఆశతో ఉన్నారు.