deverakonda
-
Vijay Deverakonda & Rashmika Mandanna: గీత గోవిందం @5.. విజయ్-రష్మిక-పరశురాం ముచ్చట్ల (ఫొటోలు)
-
Vijay Deverakonda : విజయ్ దేవరకొండ కొత్త చిత్రం ఘనంగా ప్రారంభం (ఫొటోలు)
-
పాత ఈవో ఆదేశాల మేరకే..!
సాక్షి, మంచిర్యాల: బాసర నుంచి నల్లగొండ జిల్లా దేవరకొండకు సరస్వతి అమ్మవారి విగ్రహం తరలించిన ఉదంతంలో పెద్ద హస్తాలే ఉన్నట్లు తెలుస్తోంది. దేవరకొండలోని పాఠశాలలో అక్షరాభ్యాసం చేయించేందుకు బాసర నుంచి విగ్రహం తీసుకెళ్లాలనే ఆలోచన ఎవరికి వచ్చింది? ఎవరి ఆదేశాలతో అంత దూరం పూజారులు వెళ్లారనే విషయాన్ని దాస్తున్నట్లు తెలుస్తోంది. దేవరకొండలో నిర్వహించిన అక్షరాభ్యాస కార్యక్రమానికి గతంలో బాసర ఈవోగా పనిచేసి ప్రస్తుతం తెలంగాణ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈడీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఎం. వెంకటేశ్వర్లు హాజరయ్యారు. దేవరకొండలోని బచ్పన్ పాఠశాలతో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో సంబంధాలు ఉన్న ఆయన కోరిక మేరకే అమ్మవారి విగ్రహం తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన పేరు బయటకు రాకుం డా ప్రయత్నాలు జరిగినట్లు సమాచారం. ఆలయ అర్చకులపై వేటుతో సరా? ఆలయ ప్రధాన అర్చకుడు సంజీవ్ పూజారి, సప్తశతి పారాయణధారుడు ప్రణవ్శర్మలు దేవరకొండలోని రెండు ప్రైవేటు పాఠశాలల్లో అక్షరాభ్యాసం చేయించేందుకు అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్లినట్లు ప్రచారం జరగడంతో దేవాదాయ శాఖ స్పందించింది. దీంతో వారిద్దరినీ సస్పెండ్ చేశారు. ఈ వ్యవహారంలో ఆలయ పరిచారకుడు విశ్వజిత్ కూడా ఉన్నట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంలో అసలు వ్యక్తిని వదిలి పూజారులను బలి చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుత ఈవో ఏం చేస్తున్నట్లు? బాసర ఈవోగా ప్రస్తుతం ఎ. సుధాకర్‌రెడ్డి బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఆయనకు తెలియకుండా పూజారులే విగ్రహాన్ని దేవరకొండ తీసుకెళ్లారా అన్నది ప్రశ్న. తాను కొత్తగా వచ్చానని, దేవాలయంలో ఏం జరుగుతుందో తనకు తెలియదని, పూజారులకే తెలుసని ఆయన చెబుతుండడం కూడా అనుమానాలకు దారితీస్తోంది. అర్చకులను బలి చేసే విషయంలో ఓ టీఆర్ఎస్ నేత పూర్తిస్థాయిలో జోక్యం చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఆలయంలో దేవతా మూర్తులతో పాటు ఉత్సవ విగ్రహాల పరిరక్షణ బాధ్యతలు నిర్వర్తించే సూపరింటెండెంట్ గిరిధర్ ఉత్సవ విగ్రహాలు ఎక్కడికీ పోలేదని, స్టోర్‌రూంలోనే ఉన్నాయని చెబుతున్నారు. పూజారులు భక్తులు సమర్పించిన విగ్రహాలనే దేవరకొండ తీసుకెళ్లారని చెబుతుండడం గమనార్హం. ఏది ఏమైనా, ఆలయం నుంచి అమ్మవారి విగ్రహం తరలింపు వెనుక ఉన్నది ఎవరన్న విషయాన్ని తేల్చాలని భక్తులు కోరుతున్నారు. -
దేవరకొండలో దుబారా !
దేవరకొండ : విద్యుత్.. ఈ పదం ప్రభుత్వాలను నిలబెట్టగలదు.. కూల్చేయనూగలదు.. ఎందుకంటే రాష్ట్రంలో నెలకొన్న కరువులో విద్యుత్‌ను పక్క రాష్ట్రాల నుంచి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంది. ఈ సమస్యపై దేవరకొండ నగర పంచాయతీ అధికారులు గానీ.. ప్రజాప్రతినిధులు గానీ దృష్టి సారించడం లేదు. 40 వేల జనాభా ఉన్న నగర పంచాయతీలో సుమారు 100 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, 3 వేలకు పైగా విద్యుత్ స్తంభాలు ఉన్నాయి. ఈ విద్యుత్ స్తంభాలన్నింటికీ ట్యూబ్‌లైట్లు అమర్చారు. ఇందులో సుమారు రెండు వేల ట్యూబ్‌లైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు లేవు. దీంతో ఇవి 24 గంటలూ.. 365 రోజులూ.. విద్యుత్ ఉన్నంత సేపూ నిత్యం వెలుగుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో నగర పంచాయతీ ప్రతి నెలా సుమారు రూ. 3 లక్షలకుపైగా కరెంట్ బిల్లు చెల్లిస్తోంది. స్తంభాలకు ఉన్న ట్యూబ్‌లైట్లకు ఆన్ ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేయకపోవడంతో ఏటా అప్పనంగా సుమారు రూ.20 లక్షలు విద్యుత్ శాఖకు చెల్లిసున్నట్లు తెలుస్తోంది. పట్టించుకోని పాలకులు, అధికారులు ఇటీవల కాలంలో సుమారు 6 ట్రాన్స్ఫార్మర్ల పరిధిలో రూ.6 లక్షల వ్యయంతో కొన్ని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల నుంచి ఏప్ స్విచ్‌లు అమర్చేందుకు విద్యుత్ అధికారులు ఉన్నతాధికారులకు నివేదిక సమర్పించారు. మరో రూ.30 లక్షల వ్యయంతో నగర పంచాయతీలోని వీధి దీపాలన్నింటికి ఆన్ఆఫ్ స్విచ్‌లు ఏర్పాటు చేస్తే ప్రతి నెలా ఇప్పుడు చెల్లిస్తున్న రూ.3.20 లక్షల విద్యుత్ బిల్లులో సగం వరకు ఆదా అవుతుంది. అంటే సుమారు నగర పంచాయతీ ప్రతి ఏటా విద్యుత్ చార్జీలపైనే రూ. 20 లక్షల ఆదాయాన్ని మిగుల్చుకునే అవకాశం ఉంది. అయినా.. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. అయినా అంతే.. నగర పంచాయతీ గతంలో విద్యుత్ శాఖకు చెల్లించాల్సిన బకాయి రూ. కోటి వరకు ఉండేది. దీంతో విద్యుత్ శాఖ అధికారులు విద్యుత్ నిలిపివేశారు. ఎట్టకేలకు నగర పంచాయతీ అధికారులు కొంత వరకు బకాయిలు చెల్లించారు. దీంతో మళ్లీ కరెంట్ విద్యుత్‌ను పునరుద్ధరించారు. అయినా.. ఆదా చేయాలనే ఆలోచన ఎవరూ చేయక పోవడం గనార్హం. సమన్వయ లోపమే... సమన్వయ లోపంతోనే విద్యుత్ వృతా అవడంతోపాటు ప్రజాధనం దుబారా అవుతోంది. కరెంట్‌ను ఆదా చేసేందుకు విద్యుత్ అధికారుల కన్నా.. విద్యుత్ వృథాకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సి బాధ్యత ఆదాయం కోల్పోతున్న నగర పంచాయతీ అధికారులదే. ఏప్ స్విచ్‌లు అమర్చడానికి విద్యుత్ శాఖ అధికారులు సిద్ధంగా ఉన్నారు. అందుకయ్యే వ్యయం రూ.30 లక్షలు నగర పంచాయతీ భరించాల్సి ఉంది. కానీ.. ఆదాయం మిగుల్చుకునే ఆలోచన పంచాయతీ అధికారులుగానీ.. ప్రజాప్రతినిధులుగాని చేయడం లేదు. దీంతో ఏటా లక్షల రూపాయల ప్రజా ధనం దుబారా అవుతోంది. ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు విద్యుత్ వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
గడ్డి.. కరవాల్సిందే!
నల్లగొండ : అసలే కరువు.. ఆపై వానల్లేవు.. జనవరి ఇప్పుడే అయిపోయి ఫిబ్రవరి ప్రారంభమైందో.. లేదో.. ఎండలు మండిపోతున్నాయి.. ఇప్పట్లో గడ్డి మొలిచే పరిస్థితులుండవు.. ఈ నేపథ్యంలో జిల్లాలో బర్రెలు, గొర్రెలు, మేకలు, ఇతర పశువులు ఎలా బతుకుతాయో అనే ఆందోళన ప్రజల్లో నెలకొంది. పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉండడం, వానలు కురిసే పరిస్థితులు లేకపోవడంతో ఐదు నెలలపాటు పశుపక్షాదులు బతకడం కష్టమేనని అధికార యంత్రాంగమే అంచనా వేస్తోంది. జిల్లాలో మొదటి పేజీ తరువాయి అవసరమైన దానికన్నా 82వేల మెట్రిక్ టన్నుల గడ్డి కొరత నెలకొన్నట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో భవిష్యత్‌లో పాలు, పెరుగు కూడా ప్రియమయ్యే సూచనలుస్పష్టంగా కనిపిస్తున్నాయి. మూడు డివిజన్లలో కొరతే..జిల్లాలోని 59 మండలాల్లో 43 మండలాలు గడ్డి కొరతతో అల్లాడుతున్నాయి. 16 మండలాల్లో మాత్రమే అవసరమైన దాని కన్నా ఎక్కువగా గడ్డి లభించే పరిస్థితి కనిపిస్తోంది. ముఖ్యంగా దేవరకొండ ప్రాంతం గడ్డి కొరతతో అల్లాడుతోంది. ఆ ప్రాంతంలోని దేవరకొండ, డిండి, చందంపేట, మర్రిగూడ మండలాల్లో పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉంది. దేవరకొండ, డిండి మండలాల్లో అయితే దాదాపు సగం గడ్డి తక్కువ పడుతోంది. డివిజన్ల వారీగా పరిశీలిస్తే మిర్యాలగూడ మినహా భువనగిరి, నల్లగొండ, సూర్యాపేట డివిజన్లలో గడ్డి కొరత బాగా కనిపిస్తోంది. నల్లగొండ డివిజన్లో ఉన్న 16 మండలాల్లో కేతేపల్లి, శాలిగౌరారం మినహా అన్ని మండలాల్లో గడ్డి తక్కువగా ఉంది. భువనగిరి డివిజ న్లో మొత్తం 14 మండలాలుం డగా, 11 మండలాల్లో గడ్డి కొరత ఉందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. భూదాన్‌పోచంపల్లి, వలి గొండ, రామన్నపేటల్లో మాత్రం అవసరమైనంత గడ్డి అందుబాటులో ఉంది. సూర్యాపేట డివి జన్‌లో చిలుకూరు, కోదాడ మినహా అన్ని మండలాల్లో గడ్డి తక్కువగానే అందుబాటులో ఉన్నట్లు అధికారులు అంచనా వేశారు. సాగర్ ఆయక ట్టులో పర్వాలేదు జిల్లాలో నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలో మాత్రం గడ్డి కొరత లేదని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల లెక్కల ప్రకారం ఈ ఆయకట్టు ప్రాంతమంతా మిర్యాలగూడ డివిజన్లో వస్తుండగా, అనుములు, దామరచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మిర్యాలగూడ, మఠంపల్లి, నేరేడుచర్ల, త్రిపురారం, వేములపల్లిల్లో గడ్డి లభ్యత బాగానే ఉంది. ఈ డివిజన్లోని దేవరకొండ ప్రాంతంలోనే గడ్డి కొరత అధికంగా కనిపిస్తోంది. జిల్లాలో పెద్ద ఎత్తున గడ్డి కొరత ఉండడంతో పశువులను మేపలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే చాలా మంది తమతమ పశువులను కబేళాలకు తరలించడం, లేదంటే సంతల్లో అమ్మడం చేస్తున్నారు. ప్రస్తుతం గడ్డి మూట 150 రూపాయల వరకు ధర పలుకుతోంది. కొన్ని చోట్ల ట్రాక్టర్ గడ్డిని రూ.పదివేల వరకు విక్రయిస్తున్నారు. ఇప్పుడే ఈ పరిస్థితి ఉంటే... మరో రెండు నెలల తర్వాత గడ్డి కోసం గడ్డికరవాల్సిందేనని రైతులు వాపోతున్నారు. ప్రభుత్వం తగిన విధంగా స్పందించి గడ్డి విత్తనాల పంపిణీ, ఇతర జిల్లాల నుంచి గడ్డి సరఫరా చేయాలని కోరుతున్నారు. -
గిది.. ఖాయం..!
దేవరకొండ : ఊగిసలాటకు తెరపడింది... ఊహాగానాలకు చెక్ పడింది. నక్కలగండి ప్రాజెక్టుపై నెలకొన్న సంశయాలు దాదాపు తీరిపోయాయి. అన్ని అనుమానాలకు తెరతీస్తూ తెలంగాణ ప్రభుత్వం నక్కలగండి ఎత్తిపోతల (డిండి ఎత్తిపోతల) పథకానికి పచ్చజెండా ఊపింది. ఈ ప్రాజెక్టుపై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ శుక్రవారం నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. జూరాల- పాకాల, నక్కలగండి రెండవ డిజైన్ వంటి ఆలోచనలు చేసిన ప్రభుత్వం ఎట్టకేలకు ప్రజాభీష్టం మేరకు పాత డిజైన్‌కే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వచ్చే నెల 5న డిండి మండలం గోనబోయినపల్లి వద్ద ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసే అవకాశాలున్నాయి. ఇటీవల నక్కలగండికి రూ. 6500 కోట్ల నిధులు కేటాయిస్తున్నట్టు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకేసింది. నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి త్వరితగతిన పనులు చేయడానికి నిర్ణయించింది. తొలుత నక్కలగండి ప్రాజెక్టు స్థానంలో జూరాల - పాకాల ప్రాజెక్టును చేపడతామని ప్రకటించడంతో స్థానికంగా కొంత నిరసనలు వ్యక్తమయ్యాయి. ఆ తర్వాత మంత్రి చేసిన ఓ ప్రకటనతో ఈ ప్రాజెక్టుపై కొన్ని అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఇదిలా ఉండగా ఎట్టిపరిస్థితుల్లో నక్కలగండి ప్రాజెక్టును చేపడతామని హామీ ఇవ్వడంతో పాటు రూ. 6500 కోట్లు ఇస్తామని ముఖ్యమంత్రి కొన్ని రోజుల క్రితమే ప్రకటించడంతో అన్ని అనుమానాలకు తెరపడింది. అయితే జూరాల - పాకాల ప్రాజెక్టుతో పాటు ఏకకాలంలో నక్కలగండి ప్రాజెక్టును కూడా చేపడతామని ప్రకటించిన ప్రభుత్వం ప్రస్తుతానికి నక్కలగండిని చేపట్టేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శుక్రవారం ఉన్నత స్థాయి ఇంజినీరింగ్ అధికారులతో నిర్వహించిన సమావేశంలో చర్యలు కూడా తీసుకున్నట్లు సమాచారం. అయితే వచ్చే నెల 5వ తేదీన పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు నక్కలగండి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. నక్కలగండి వద్ద గానీ లేదా మిడ్ డిండి సమీపంలోని గోనబోయినపల్లి వద్ద గానీ శంకుస్థాపన చేస్తారని సమాచారం. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలోనే డీపీఆర్ పూర్తయినందున ఈ బడ్జెట్ సమావేశాల్లోపు పరిపాలన అనుమతులకు సంబంధించిన ప్రక్రియనంతా పూర్తి చేసి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ఈ ప్రాజెక్టుకు నిధులు ప్రకటించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ హయాంలోనే సర్వేకు గ్రీన్‌సిగ్నల్ నక్కలగండి ప్రాజెక్టు ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలోని అచ్చంపేట, కల్వకుర్తి నియోజకవర్గాలకు సాగునీటితో పాటు నల్లగొండ జిల్లాలోని మునుగోడు, సంస్థాన్ నారాయణపురం, భువనగిరి నియోజకవర్గాలలోని ఫ్లోరైడ్‌పీడిత ప్రాం తాలకు తాగునీరు లక్ష్యంగా నిర్దేశించిన ఈ ప్రా జెక్టును దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో నిర్ణయించారు. అప్పట్లోనే సర్వేకు వైఎస్ఆర్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. దీని ద్వారా మహబూబ్‌నగర్ , నల్లగొండ జిల్లాల్లో సుమారు లక్ష ఎకరాల మేర సాగు, తాగునీరు అందుతుంది. (ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు నిర్ణయించిన ఆయకట్టు 3 లక్షల ఎకరాల్లోనే) . డిజైన్ ఇలా.. ప్రస్తుతం నక్కలగండి ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలమైన నక్కలగండి (లోయర్ డిండి) నుంచి డిండి ప్రాజెక్టు (అప్పర్ డిండి)కు 18 కిలోమీటర్ల మేర నీటిని లిఫ్ట్ చేయడం ద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు సాగు, తాగునీటిని అందించాలని ప్రాజెక్టు డిజైన్‌ను రూపొందించారు. ఈ మేరకు గతంలో డీపీఆర్ కూడా పూర్తయ్యింది. ప్రస్తుత ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో భాగంగా సిద్ధాఫూర్ (మిడ్ డిండి) వద్ద 11 టీఎంసీల నీటి నిల్వ సామర్ధ్యం గల రిజర్వాయర్‌ను ఏర్పాటు చేస్తారు. అక్కడి నుంచి ప్రస్తుత డిండి ప్రాజెక్టును మరో మూడు అడుగులు పెంచి ఈప్రాజెక్టులోకి నీటిని లిఫ్ట్ చేస్తారు. తద్వారా మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లో నిర్ణయించిన ప్రాంతాలకు తాగు, సాగునీటిని అందిస్తారు. అయితే డిండి ప్రాజెక్టు రిజర్వాయర్‌ను మరో 3 అడుగుల ఎత్తు పెంచ డం ద్వారా మహబూబ్‌నగర్ జిల్లాలో కొంత ప్రాంతం ముంపునకు గురవుతుందని అక్కడి ప్రజాప్రతినిధులు, ప్రజలు వ్యతిరేకిస్తున్నందున డిండి ప్రాజెక్ట్ ఎత్తు పెంచకుండా నిర్దేశించిన అదనపు ఆయకట్టును స్థిరీకరించేందుకు డిజైన్‌లో స్వల్ప మార్పులు చేసినట్లు ఇంజనీరింగ్ నిపుణులు పేర్కొంటున్నారు. మాటిచ్చారు.. నిలబెట్టుకున్నారు ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిసినప్పుడు నీ నియోజకవర్గ అభివృద్ధి, నీ రాజకీయ భవిష్యత్ కేసీఆర్‌కు వదిలిపెట్టు అన్నారు. ఆ ఒక్క మాటతో టీఆర్ఎస్లో చేరా. మాటిచ్చిన ఆయన అక్షరాలా దానిని నిలబెట్టుకుంటున్నారు. ఇప్పటికే నక్కలగండి ఎత్తిపోతల ప్రాజెక్ట్ కోసం రూ. 6500 కోట్లు కేటాయిం చారు. ప్రాజెక్ట్‌ను త్వరితగతిన పూర్తి చేస్తారన్న ప్రగాఢ విశ్వాసం ఉంది. కేసీఆర్ హయాంలోనే ఈ ప్రాజెక్ట్ పూర్తి కావడం ఖాయం. జిల్లా ప్రజలంతా ఆయనకు రుణపడి ఉండాలి. - బాలునాయక్, జెడ్పీ చైర్మన్ , టీఆర్ఎస్ దేవరకొండ నియోజకవర్గ ఇన్చార్జ్ -
‘మాయాబజార్’ దుకాణాలకు తాళం
దేవరకొండ : దేవరకొండలోని మాయాబజార్లో గల 35 నగర పంచాయతీ దుకాణాలకు తాళం పడింది. ఈ వ్యవహారంపై ఆదివారం ‘సాక్షి ’లో మాయాబజార్ పేరిట ప్రత్యేక కథనాన్ని స్పందించింది. దీనికి స్పందించిన నగర పంచాయతీ అధికారులు దుకాణాలను మూసివేశారు. దీనిపై దుకాణాదారుల నుంచి నిరసన వ్యక్తమవుతుండగా ఈ వ్యవహారం జెడ్పీ చైర్మన్ వరకు వెళ్లింది. దేవరకొండ నగర పంచాయతీలోని 35 దుకాణాలను క్రమబద్ధీకరణ పేరుతో కొందరు వ్యాపారులు సొంతం చేసేందుకు కార్యచరణ రూపొందించారు. ఈ వైనాన్ని ‘సాక్షి’ సవివరంగా ప్రచురించింది. దీంతో ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్న పాలకవర్గం సోమవారం దుకాణాలకు తాళాలు వేసింది. నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, వైస్ చైర్మన్ జాన్‌యాదవ్, మేనేజర్ రవిందర్‌రావు తదితర సిబ్బందితో దుకాణాలను మూసివేయించి తాళాలు వేశారు. ఈ క్రమంలో తీవ్ర ఆందోళన కొనసాగింది. దుకాణాదారులు మాకు ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఖాళీ చేయించడం ఏంటంటూ మొండికేశారు. అధికారులు ఇవేం లెక్కచేయకపోవడంతో కొంత రసాభాస చోటు చేసుకుంది. మేనేజర్‌కు, దుకాణాదారులకు మధ్య జరిగిన స్వల్ప వివాదం పోలీస్‌స్టేషన్ వరకు వెళ్ళింది. దీంతో పోలీసులు కూడా సంఘటన స్థలానికి వచ్చారు. శాంతిభద్రతల దృష్ట్యా నిబంధనల ప్రకారం వ్యవహరించాలని ఎస్ఐ మోహన్‌రెడ్డి చెప్పారు. ఇదిలా ఉండగా సుమారు 20 షాపులకు పంచాయతీ సిబ్బంది తాళాలు వేశారు. కాగా పంచాయతీలోని కామాటీలు, ఇతర సిబ్బంది పూర్తి స్థాయిలో సంఘటన స్థలం వద్ద ఉండటంతో కొంత ఘర్షణ వాతావరణం నెలకొంది. దుకాణాదారులు ఏమంటున్నారంటే.... లీజు గడువు ముగిసినప్పటికీ తాము 2015 వరకు మార్చి వరకు అద్దె చెల్లించామని, కనీసం మార్చి వరకు కూడా గడువు ఇవ్వలేదని దుకాణాదారులు ఆరోపిస్తున్నారు. పంచాయతీ అధికారులు ఏమంటున్నారంటే... ఇప్పటికే చాలాసార్లు నోటీసులు ఇచ్చామని, ఫైనల్ నోటీసులు ఇచ్చినా దుకాణాదారులు స్పందించలేదని కాబట్టి నిబంధనల ప్రకారమే దుకాణాదారులను ఖాళీ చేయించడానికి తాళాలు వేశామని అంటున్నారు. ఇదే సమయంలో మార్చి వరకు గడువు ఉండగా ముందుగానే ఖాళీ చేయించారన్న ఆరోపణలున్నాయని ప్రశ్నించగా నెలకు అద్దె రూ. 1200 అని పేర్కొనగా, అది సంవత్సరానికి ఒకసారి కడుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ప్రవర్తించొద్దు : జెడ్పీ చైర్మన్ బాలునాయక్ దుకాణాలకు తాళాలు వేయడంతో దుకాణాదారులంతా మూకుమ్మడిగా జెడ్పీ చైర్మన్ బాలునాయక్‌ను ఆశ్రయించారు. దౌర్జన్యంగా షాపులకు తాళాలు వేశారని ఏకరువు పెట్టడంతో అధికారులకు ఫోన్ చేసి ఏం చేసినా నిబంధనల ప్రకారమే చేయాలి తప్ప ఇష్టానుసారంగా ప్రవర్తించొద్దని హితువు పలికారు. దుకాణాదారులందరినీ కూర్చోబెట్టి లీజు, అద్దె వంటి అంశాలను మాట్లాడిన తర్వాత చర్యలు తీసుకోవాలన్నారు. -
ఆత్మీయ.. పరామర్శ
దేవరకొండ : దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి మరణ వార్త విని గుండె పగిలి మరణించినవారి కుటుంబాలను పరామర్శించడానికి వైఎస్ తనయ షర్మిల చేపట్టిన పరామర్శ యాత్ర బుధవారం మొదటి రోజు దేవరకొండ నియోజకవర్గంలో ప్రారంభమైంది. చింతపల్లి మండలంలోని మదనాపురం, చందంపేట మండలంలోని యల్మలమంద గ్రామపంచాయతీ పరిధిలో గల దేవరచర్ల, కంబాలపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని గువ్వలగుట్ట గ్రామాల్లోని బాధితులను ఆమె పరామర్శించారు. ఆ కుటుంబాలను అక్కున చేర్చుకుని ఆత్మీయంగా ఆమె పలకరించారు. ఒక్కొక్క కుటుంబంతో అరగంటకు పైగా ఆమె గడిపి వారి బాగోగులను, యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఉదయం 11 గంటల 45 నిమిషాలకు మదనాపురం గ్రామానికి చేరుకున్న ఆమె అక్కడ వైఎస్ మరణించిన వార్తను తట్టుకోలేక మరణించిన ఆడెపు బాలమ్మ కుటుంబాన్ని పరామర్శించారు. బాలమ్మ భర్త మైబయ్య, కొడుకు సత్తయ్య, కూతుళ్లను పరామర్శించారు. మెబయ్య ఇంట్లోకి అడుగుపెట్టిన షర్మిల ఆయనను పెద్దయ్యా... అంటూ పలకరిం చారు. ఎట్లా ఉన్నావ్.. పెద్దయ్యా... ఆరోగ్యం ఎట్లా ఉంది పెద్దయ్యా... అని ప్రశ్నించగా అట్లనే ఉంది బిడ్డా... అంటూ మైబయ్య సమాధానం ఇచ్చాడు. యోగక్షేమాలను తెలుసుకునే క్రమంలో ఆమె మైబయ్యను, కొడుకు సత్తయ్యను పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. షర్మిల : ఎంత మంది కొడుకులు పెద్దయ్యా? మైబయ్య : ఒక కొడుకు, నలుగురు కూతుళ్లు. ముసలమ్మ చచ్చిపోవడంతో బిడ్డలకాడనే ఉంటున్నా. షర్మిల : పెన్షన్ వస్తుందా పెద్దయ్యా మైబయ్య : వస్తుందమ్మా షర్మిల : రేషన్ వస్తుందా అన్నా (సత్తయ్యనుద్దేశించి) షర్మిల : పొలం కాడనే ఉంటున్నా. రేషన్ ఇంకా రాట్లే. షర్మిల : ఏం పంట వేశావ్ ? సత్తయ్య : వర్షం ఉంటేనే కాత. మెట్ట పంటలే వేశాం. షర్మిల : ఏమన్న మిగులుతుందా ? సత్తయ్య : పంటలు, పెట్టుబడులు ఏదో... షర్మిల : చేతనైతుందా పెద్దయ్యా ? షర్మిల : కాళ్ల నొప్పులు సేతనైతలేదు. షర్మిల : ఆ రోజు ఏమైంది ? మైబయ్య : అయ్య... సచ్చిపోయిండని తెలవడంతో ముద్ద దిగలె.. అప్పుడే అన్నం తింటున్న ముసల్ది అన్నం కుక్కలకేసింది. బయటనే కూసోని ఆలోచించింది. అట్లనే పడి సచ్చిపోయింది. షర్మిల : అప్పులు ఉన్నాయా అన్నా ? సత్తయ్య- మైబయ్య : ముసల్ది సచ్చినప్పుడే అప్పులు తెచ్చినం. మిత్తి మీద... మిత్తి అయ్యింది. మొన్న సంవత్సరం చూస్తే రూ. 17 వేలు అయ్యింది. షర్మిల : బాధపడకు పెద్దయ్యా... నీకు మేమున్నాం. ఆరోగ్యం జాగ్రత్త.. ఏ ఆపదున్నా ఫోన్ చెయ్.. (పర్సనల్ నంబర్లు ఉన్న విజిటింగ్ కార్డును ఇస్తూ) సుమారు 37 నిమిషాల పాటు వైఎస్ తనయ షర్మిల బాలమ్మ కుటుంబంలోని వ్యక్తులను పరామర్శించారు. మైబయ్య కూతుళ్లతో పాటు గ్రామ విశేషాలను కూడా ఆమె అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి దేవరచర్లకు వెళ్లిన ఆమె అక్కడ మరణించిన హన్మానాయక్ కొడుకు రతన్‌సింగ్, అతని కొడుకులు తులసీరాం, ధరమ్సింగ్లను పరామర్శించారు. అక్కడ కూడా అంతే ఆప్యాయతతో అంతే ఓపికతో వారిని కూడా యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. కుటుంబ సభ్యుల వివరాలు, చదువు వివరాలు, వారి సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. షర్మిల పరామర్శించడంతో కన్నీరు మున్నీరైన హన్మానాయక్ మనవడు ధరమ్‌సింగ్‌ను బాధపడొద్దంటూ ఓదార్చారు. అక్కడ కూడా సుమారు అరగంట సేపు గడిపిన ఆమె అక్కడి నుంచి గువ్వలగుట్టకు వెళ్లి అక్కడ మరణించిన భీమిని కుటుంబాన్ని పరామర్శించారు. -
రైతులతో ఎంపీల ముఖాముఖి
దేవరకొండ : రైతుల సమస్యలను అధ్యయనం చేయడానికి పార్లమెంటరీ స్టాం డింగ్ కమిటీ బుధవారం సాయంత్రం డిండికి వచ్చింది. రైతులతో ముఖాముఖి మాట్లాడింది. పలువురు రైతులు చెప్పిన విషయాలను కమిటీ సభ్యులు క్షుణ్ణంగా విన్నారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళుతామని వారికి హామీ ఇచ్చారు. డిండి ఎత్తిపోతల చేపడితేనే ఈ ప్రాంతానికి మేలు : రాఘవాచారి ఈ ప్రాంతంలో కరువు పోవాలంటే కేవలం డిండి ఎత్తిపోతలను చేపట్టాల్సిందే. డిండి ఎత్తిపోతల చేపడితే జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు లబ్ధి చేకూరుతుంది. ఈ ప్రాజెక్టుపై సానుకూలంగా స్పందించాలి. విద్యుత్ సమస్య తీవ్రంగా ఉంది : లక్పతి ఈ ప్రాంతంలో విద్యుత్ సమస్య బాగా ఉండటం వల్ల రాత్రి వేళల్లో కూడా కరెంటు కోసం తాపత్రయ పడాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికీ వేల మంది రైతులు విద్యుదాఘాతంతో మృతి చెందిన ఘటనలున్నాయి. విద్యుత్ సమస్యను తీర్చడానికి ఎన్ఆర్ఈజీఎస్ను అనుసంధానం చేయాలి. గిట్టుబాటు ధర లేదు : గుర్రం రాములు బజారులో ఏ వస్తువు కొన్నా ప్రస్తుతం ఒక నిర్ణీత ధర ఉంది. కానీ శ్రమించి పంట పండించిన రైతు పంటకు మాత్రం కనీస ధర లేదు. ఈ ధర లేకపోవడం వల్లే రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారు. పార్లమెంటులో దీనిపై చర్చించాల్సిన అవసరం ఉంది. క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి : రాఘవేందర్రావు పండించిన పంటకు తప్పనిసరిగా క్రాప్ ఇన్సూరెన్స్ అందించాలి. నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్‌తో వేల మంది మృత్యువాత పడుతున్నారు. దీనికి కేవలం ప్రత్యామ్నాయం నక్కలగండి ఎత్తిపోతల మా త్రమే. రైతులు పండిం చిన పంటను అమ్ముకోవడానికి దళారుల బెడద లేకుండా గిట్టుబాటు ధర కల్పిం చాలి. అనువాదంతో ఆకట్టుకున్న ఆర్డీఓ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ బుధవారం డిండి మండలంలో రైతులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. అయితే ఈ కమిటీలో ఉన్న 15 మంది ఎంపీలలో బీహార్, అస్సాం, తమిళనాడు, ఛత్తీస్‌ఘడ్, ఒరిస్సా రాష్ట్రాలకు చెందిన పలువురు ఎంపీలున్నారు. కేవలం తెలుగు భాష తెలిసిన రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డే కావడంతో రైతులు తమ సమస్యను తెలుగులో చెప్పుకోవడంతో ఎంపీలకు వారి బాష అర్థం కాలేదు. దీంతో దేవరకొండ ఆర్డీఓ రవినాయక్ రైతుల సమస్యలను ఇంగ్లీష్‌లోకి అనువదించి ఒక్కొక్కరి సమస్యను క్లుప్తంగా వివరించి అక్కడి వారిని మెప్పించారు. -
సహకారం
దేవరకొండలో 676 నకిలీ పుస్తకాలు పెట్టి రుణం తీసుకున్నారని, అసలు ఎలాంటి బుక్స్ లేకుండా 1992 మంది రుణం పొందారని, పెట్టిన పాస్ పుస్తకాలు కూడా ప్రింటింగ్ ప్రెస్‌లో ముద్రించినవని తెలుస్తోంది. పీఏపల్లిలో 700 మంది బినామీలు, 150 మంది నకిలీ పాస్‌పుస్తకాలు పెట్టి, అసలు ఎలాంటి టైటిల్ డీడ్స్ లేకుండా దాదాపు 2000 మంది, తిమ్మాపూర్ సొసైటీలో 220 దొంగ పుస్తకాలు పెట్టి రుణాలు తీసుకున్నారని తెలిసింది. ఈ విషయాలన్నీ విచారణలో తేలినట్టు సమాచారం. సాక్షి ప్రతినిధి, నల్లగొండ : పట్టాదారు పాస్పుస్తకాల్లేవు... చూపెట్టినవేమో దొంగవి... ప్రింటింగ్ ప్రెస్‌లలో ముద్రించి వాటినే పాస్పుస్తకాలన్నారు... రైతుల పేరుతో రుణమివ్వమన్నారు... పాస్‌పుస్తకాలు సరే... అసలు రైతులు లేకుండానే ఏవో పేర్లు రాశారు.. వాటి మీద కూడా రుణాలు తీసుకున్నారు... అంతా కలిపి రూ.18 కోట్లకు పైగా దోచుకున్నారని ఆరోపణలు... రాజకీయ నాయకులు, ఉన్నతాధికారులు కుమ్మక్కై చేసిన ఈ అవినీతి చరిత్ర జిల్లా వాసులందరికీ సుపరిచితమే. దేవరకొండ జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పెద్దఅడిశర్లపల్లి పరపతి సంఘాలలో జరిగిన ఈ అవినీతి వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. ఈ నాలుగు సంఘాల్లో కలిపి 2009-13 సంవత్సరాల మధ్యలో దాదాపు రూ.18కోట్ల మేర అక్రమాలు జరిగాయని అప్పటి మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, ఇటీవల జిల్లా సహకార అధికారి జరిపిన విచారణలో కూడా రూ.8కోట్లకు పైగా అవినీతి జరిగిందని నిర్ధారించారు. అయితే, ఈ ఫిర్యాదు, విచారణలపై ఎలాంటి చట్టపరమైన చర్యలు తీసుకోకుండానే, ఆయా సంఘాల్లో తీసుకున్న రుణాల మాఫీకి ప్రతిపాదనలు పంపడం గమనార్హం. ఆ సంఘాలలో రుణాలు తీసుకున్న నిజమైన రైతులకు రుణమాఫీ వర్తింపజేయడంలో ఎలాంటి అభ్యంతరం లేదు కానీ...ఆ సంఘాల్లో రుణాలు తీసుకున్న రైతులందరికీ సుమారు రూ.22కోట్లకు పైగా మాఫీ చేయవచ్చని స్థానిక అధికారులు ప్రతిపాదనలు పంపడం వెనుక ఎవరి హస్తం ఉందనేది చర్చనీయాంశమవుతోంది. గతంలో జరిగినట్టు నిర్ధారణ అయిన అక్రమాల్లో భాగస్వాములయిన అక్కడి ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకుల ఒత్తిడి మేరకు స్థానిక రెవెన్యూ యంత్రాంగం పంపారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఒకరిద్దరిని అరెస్టు చేసి... ఈ అవినీతి వ్యవహారంలో అప్పటి సీఈఓ భాస్కరరావు సూచన మేరకు దేవరకొండ బ్యాంకు బ్రాంచ్‌మేనేజర్ డిసెంబర్ 21, 2013న పోలీసులకు ఫిర్యాదు చేశారు. దేవరకొండ, చింత్రియాల, తిమ్మాపూర్, పీఏపల్లి సంఘాల్లో రూ.18 కోట్ల మేర అవినీతి జరిగిందని, దీని నిగ్గు తేల్చాలని ఆయన తన ఫిర్యాదులో కోరారు. అయితే, ఈ ఫిర్యాదుపై గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. ఆయా సంఘాల్లోని టైటిల్బుక్స్, రికార్డులు స్వాధీనం చేసుకున్న పోలీసులు అవి అసలైనవో కాదో తేల్చాలని రెవెన్యూ అధికారులకు పంపి చేతులు దులుపుకున్నారు. ఒకరిద్దరు అధికారులు, పీఏసీఎస్ చైర్మన్లను అరెస్టు చేసిన పోలీసులు ఆ తర్వాత అసలు గుట్టును పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారనే ఆరోపణలున్నాయి. ఆ తర్వాత ఈ అవినీతిపై జిల్లా సహకార అధికారి విచారణ జరిపారు. పీఏపల్లి సొసైటీలో రూ. 4.5కోట్లు, దేవరకొండలో రూ.1.60 కోట్లు, తిమ్మాపూర్, చింత్రియాల సొసైటీల్లో రూ.1.5కోట్లు చొప్పున అవినీతి జరిగిందని నిర్ధారించి తన నివేదికను రాష్ట్ర సహకార శాఖ రిజిస్ట్రార్‌కు నెలరోజుల క్రితం పంపినట్టు సమాచారం. అయితే, సహకార చట్టం 51 ప్రకారం డీసీఓ జరిపిన ఈ విచారణ కూడా సమగ్రంగా లేదనే వాదనలు వినిపిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి విచారణ చేయాల్సి ఉందని, అలాంటి ప్రక్రియ డీసీఓ విచారణలో జరగలేదని తెలుస్తోంది. సొసైటీ మినిట్స్ బుక్స్‌ను స్వాధీనం చేకుని, కమిటీని రద్దు చేసి విచారణ జరపాల్సి ఉందని, ఇప్పటివరకు అలాంటిది జరగలేదని సమాచా రం. అయినా, ఈ విచారణలోనే రూ.8కోట్ల మేర అవినీతి తేలితే విచారణ సమగ్రంగా జరిపితే మరింత తేలుతుందనే వాదన వినిపిస్తోంది. డీసీసీబీ మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదులో రూ.18 కోట్లు అవినీతి జరిగిందని ఉండగా, డీసీఓ జరిపిన విచారణలో రూ.8 కోట్లు అక్రమాలు జరిగాయని నిర్ధారణ అయిందంటే ఆ సొసైటీల్లో అవకతవకలు జరిగినట్టేనని చెబుతుండగా, ఇప్పుడు హడావిడిగా రుణమాఫీ ప్రతిపాదనలు పంపడం ఎందుకనేది అంతుపట్టని ప్రశ్న. కలెక్టర్ జోక్యంతో నిలిపివేత అయితే, ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు దృష్టి సారించడంతో ప్రస్తుతానికి ఆ ప్రక్రియ నిలిచిపోయింది. దేవరకొండ డీసీసీబీ పరిధిలోని ఆ నాలుగు సం ఘాలతో పాటు డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల రుణమాఫీ ప్రతిపాదనలపై ఆయ న విచారించారు. వెంటనే ఆ సంఘాలకు మాఫీ నిలిపివేయాలని ఆదేశాలివ్వగా, డీసీఓ విచారణ అనంతరం డిండి, మల్లేపల్లి, తేట్లాపూర్ సంఘాల్లో మాఫీ మంజూరుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిన ఆయన ఆ నాలుగు సంఘాలకు మాత్రం నిలిపివేశారు. అయితే, జిల్లా కలెక్టర్ టి.చిరంజీవులు ఈ సంఘాల్లో రైతురుణమాఫీ ప్రక్రియను నిలిపివేయాలని ఆదేశించినా, డీసీఓ నివేదిక వచ్చిన తర్వాత ఈ సంఘాలకు కూడా మాఫీ వర్తింపజేసే అవకాశం ఉందని డీసీసీబీ డెరైక్టర్లలో ఆందోళన వ్యక్తమవుతోంది. స్థానిక అధికారులు పంపిన ప్రతిపాదనల ప్రకారం రూ.22 కోట్ల మేర మాఫీ చేయడానికి గ్రీన్‌సిగ్నల్ లభిస్తే... అం దులో 25 శాతం అంటే దాదాపు రూ.5.5 కోట్లు మళ్లీ అక్రమార్కుల పాలవుతుందనేది వారి వాదన. అదే విధంగా రైతు తీసుకున్న రుణం మొత్తాన్ని ప్రభుత్వం మాఫీ చేస్తుంది కనుక సహకార పరపతి సంఘాల్లో రైతుల మూలధనం కూడా (రుణంతో పాటు) తీసేసుకుంటారని, ఇది మరో రూ.2కోట్లు ఉం టుందని వారంటున్నారు. ఈ నేపథ్యంలో వెంటనే ఆ సంఘాల్లో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణకు ఆదేశించాలని వారు కో రుతున్నారు. అయితే, ఎలాంటి అక్రమాలు జరగలేదని నిర్ధారించుకున్న అసలైన రైతులకు వెంటనే రుణమాఫీ ఇవ్వాలని, లేదంటే కనీసం వారి రుణాలు రెన్యువల్ చేయాలని వారు కోరుతున్నారు. అక్రమాలకు పాల్పడిన వారి విషయంలో మాత్రం ప్రత్యేక విచారణ సంస్థతో విచారణ జరిపించి దోషులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈ విషయంలో జిల్లా యంత్రాంగం, సహకార శాఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో, గతంలో జరిగిన దోపిడీ నిగ్గు తేలుస్తారా.... మాఫీ చేసి చేతులు దులుపుకుంటారా అనేది వేచి చూడాల్సిందే. -
ఆగని..అకృత్యాలు..!
మగాడిలో మృగాడు పూనుతున్నాడు...మానవత్వం మరిచి ఉన్మాదిగా మారుతున్నాడు. క్రూరత్వానికి కేరాఫ్‌గా మారుతూ.. విచక్షణ మరిచి దారుణాలకు తెగబడుతున్నాడు. ప్రేమ పేరుతో ఒకడు వంచించి ప్రాణాలు తీస్తే.. మరొకడు మనవరాలి వయస్సున్న చిన్నారిపై లైంగికదాడి చేశాడు.. ఇంకొకడు బ్లాక్‌మెయిల్‌కు తెగబడి బాధితురాలే బలవన్మరణానికి పాల్పడేలా చేశాడు. ఇలా రోజురోజుకూ పెరుగుతున్న మృగాళ్ల అకృత్యాలకు అంతే ఉండడం లేదు. - దేవరకొండ ⇒ మృగాళ్లకు కేరాఫ్‌గా దేవరకొండ ⇒ చదువు పేరుతో వచ్చి దారుణాలకు పాల్పడుతున్న వైనం ⇒ చట్టాలను కఠినతరం చేయాలంటున్న ప్రజలు దేవరకొండ.. మారుమూల గిరి జన ప్రాంతమే అయినా అన్నింటా దినదినాభివృద్ధి చెందుతూనే ఉంది. కానీ మగాడి నైజంలో మాత్రం మార్పురావడం లేదు. దీంతో చిన్నారులు, యువతులు, వివాహితలపై మృగాళ్ల అకృత్యాలు ఎక్కువయ్యాయి. ఏడాది కాలంలోనే హృదయం ద్రవించే ఘటనలు కోకొల్లలు. నిరక్షరాస్యత, అవగాహనారాహిత్యం, పేదరికం వెరసి వెలుగుచూడని దారుణాలు మరెన్నో..!? వెకిలి చేష్టలను చిత్రీకరించి.. పట్టణంలోని ఓ ఇంట్లో అద్దెకు దిగిన ఇంజినీరింగ్ కుర్రాడు సదరు ఇంటి మహిళతోనే అసభ్యంగా ప్రవర్తించాడు. ఆవెకిలి చేష్టలను సెల్ఫోన్లో చిత్రీకరించి యూట్యూబ్‌లో పెట్టి పాశవికానందం పొందా డు. బాధిత మహిళ పోలీసులను ఆశ్రయించి నా ఫలితం లేకపోయింది. సమాజం చిన్నచూపు చూస్తదని భావించిన ఆ అభాగ్యురాలు బలవన్మరణానికి పాల్పడింది. చిన్నారిపై వృద్ధుడి ఘాతుకం మొన్నటికి మొన్న చందంపేట మం డలం తెల్దేవర్పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ఓ తం డాలో 55 ఏళ్ళ వృద్ధుడు 11 ఏళ్ల చిన్నారిని అడవిలో అటకాయించి లైంగికదాడి చేశాడు. ఆ చిన్నారి రక్తస్రావంతో బాధపడుతుండటం తో ఓ డాక్టర్‌ను కలవగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది.తాజాగా శుక్రవారం పట్టణం లో చోటు చేసుకున్న ఘటనతో ఈ ప్రాంత వాసులు ఉలిక్కిపడ్డారు. చట్టాలను కఠినతరం చేయాలి దేవరకొండలో చోటు చేసుకున్న మూడు ఘటనల్లోనూ కారణమైంది స్థానిక ఇంజి నీరింగ్ కళాశాల విద్యార్థులే కావడం గమనార్హం. ఆంధ్రా, బీహార్ రాష్ట్రానికి చెందిన విద్యార్థులు స్థానికంగా ఉంటూ కళాశాలలో చదువుతుండడంతో వారిపై తల్లిదండ్రుల నిఘా కరువయ్యింది. దీంతో వారు ఆడిందే ఆటగా మారింది. పోలీసులు ఇటువంటి వారిపై నిఘా పె ట్టాలని ప్రజలు కోరుతున్నారు. దీంతో చట్టాలను మరింత కఠినతరం చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఆరేళ్ల బాలికపై లైంగికదాడికి యత్నం దేవరకొండ : ఆరేళ్ల బాలికను ఇంట్లోకి పిలిచి ఓ ఇంజినీరింగ్ విద్యార్థి లైంగికదాడికి యత్నించాడు. ఈ ఘటన దేవరకొండలో శుక్రవారం చోటు చేసుకుంది. పట్టణానికి చెందిన ఓ బాలిక శుక్రవారం ఉదయం కిరాణ దుకాణానికి వెళుతుండగా స్థానిక ఖాదర్ మెమోరియల్ కళాశాలలో బీటెక్ ఫైనలియర్ చదువుతున్న బీహార్ రాష్ట్రానికి చెందిన షహన్షా హలీం అనే విద్యార్థి తన గదిలోకి పిలిచాడు. ఆ చిన్నారిపై అసభ్యంగా ప్రవర్తిస్తుండగా భయంతో కేకలు వేసింది. దీంతో తల్లిదండ్రులు అక్కడికి వచ్చారు. చిన్నారి జరిగిన విషయం చెప్పడంతో కాలనీవాసులు సదరు విద్యార్థిని చితకబాది పోలీసులకు అప్పగించారు. సంఘటన స్థలానికి వచ్చిన పోలీసులు ఆ గదిలో అద్దెకుంటున్న నలుగురు విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. చిన్నారి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు షహన్షా హలీంపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. -
అడుగడుగునా ఆత్మీయత
దేవరకొండ/చింతపల్లి : అదో చిన్న గ్రామం... అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉందా ప్రాంతమంతా. అక్కడక్కడా ఉన్న పోలీసులు బందోబస్తుకు సూచికగా కనిపిస్తున్నారు. ఎవరినో ఆహ్వానించడానికి అన్నట్లు కొంతమంది నాయకులు ఎదురుచూపులు చూస్తున్నారు. అప్పుడే దూరం నుంచి ఓ బస్సు దగ్గరకొచ్చింది. ఆ బస్సు దగ్గరకు సమీపించే కొద్దీ జనం కూడారు. బస్సుపై ఓవైపు మౌన మునిలా యోగాసనంలో కూర్చున్న దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్రం. మరో వైపు... నేనున్నానంటూ చిరునవ్వుతో చేయి ఊపుతూ భరోసానిస్తున్నట్లు ఉన్న జగనన్న చిత్రం... బస్సు దగ్గరకొచ్చి జనం మధ్యలో ఆగింది. చిరునవ్వుతో అభివాదం చూస్తూ, ఆత్మీయతనంతా మోములో ఒదగగా బస్సు దిగి వచ్చారామె. ఆమె దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల. ఆమెను చూడగానే ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా హోరెత్తిపోయింది. జై వైఎస్ఆర్ నినాదాలతో మార్మోగిపోయింది. అప్పటి వరకు నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతమంతా ఒక్కసారిగా వం దల మందితో గుమికూడింది. ఇదంతా చింతపల్లి మండలం మాల్ గ్రామంలోని సదృశ్యం. సోమవారం మహబూబ్‌నగర్ జి ల్లాకు పరామర్శయాత్రకు వెళ్తున్న వైఎస్ కుమార్తె షర్మిల జిల్లాలోని మాల్, కుర్మేడు గ్రామాల మీదు గా వెళ్తూ అక్కడ ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ ప్రియతమ నేత వైఎస్ కుమార్తె షర్మిలను చూడటానికి మహిళలు వృద్ధులు, విద్యార్థులు ఎంతో ఆసక్తి కనబరిచారు. ఇళ్లు, భవనాలు ఎక్కి ఆమెను చూడటానికి, ఆమె మాటలు వినడానికి ఉత్సుకత చూపారు. పలకరింపు.. అక్కడికి వచ్చిన వారిలో మహిళలు షర్మిలను ఆత్మీయంగా పలకరించారు. బాగున్నావా అమ్మా.. అంటూ పలకరించారు. మరికొంత మంది తమ గోడు చెప్పుకున్నారు. వైఎస్ హయాం లో పింఛన్ వచ్చేది.. ఇప్పుడు పింఛన్ రాకపోవడంతో ఎలా బతకాలో తెలియడం లేదంటూ ఆమెకు ఏకరువు పెట్టుకున్నారు. దీంతో వారిని ఊరడించిన షర్మిల మన రోజులు.. వ ుంచి రోజులు వస్తాయంటూ భరోసానిచ్చారు. బాధ పడవద్దంటూ ధైర్యం చెప్పి ఆమె అక్కడినుంచి కదిలారు. కిక్కిరిసిన జనం.. షర్మిల కుర్మేడు, మాల్ గ్రామాలలో సుమారు 20 నిమిషాల పాటు గడిపారు. ఆమె వెంట వందలాది వాహనాలు, ప్రజాప్రతినిధులు, నాయకులు, అనుచరులు, కార్యకర్తలు రావడంతో గ్రామమంతా కిక్కిరిసిపోయింది. దీంతో షర్మిలను చూడటానికి వచ్చిన కొంత మంది గ్రామస్తులు రాజన్న బిడ్డను చూడలేక నిరాతో వెనుదిరిగారు. కాగా షర్మిల వెంట తెలంగాణ వైఎస్ఆర్సీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, వైఎస్సార్ సీపీ కేంద్రపాలక మండలి సభ్యుడు నల్లా సూర్యప్రకాష్, రాష్ట్ర కమిటీ సభ్యులు శివకుమార్, మల్లు రవీందర్‌రెడ్డి, జిల్లా ఎస్సీసెల్ అధ్యక్షుడు ఇరుగు సునీల్‌కుమార్, బెదరకోట భాస్కర్, పార్టీ చింతపల్లి, పీఏపల్లి మండలాల కన్వీనర్లు కర్నాటి శ్రీనివాస్, వంగాల వెంకట్‌రెడ్డి, పుప్పాల పాండు, ముడిగ మల్లేష్‌యాదవ్, సిద్ధిఖ్బాబా, గబ్బార్పాష, అల్వాల యాదయ్య, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
కంబాలపల్లిలో బాంబుల కలకలం
దేవరకొండ : జిల్లాలో ఫ్యాక్షన్ వాతావరణం కన్పించే ప్రాంతమైన చం దంపేట మండలం కంబాలపల్లిలో బాంబులు కలకలం రేపాయి. ఒకటి కాదు, రెండు కాదు 59 హైలీ ఎక్స్‌ప్లోజివ్ బాంబులను పోలీసులు కనుగొన్నా రు. కంబాలపల్లి గ్రామ సమీపంలోని నల్లమల అటవీ ప్రాంతంలో గల మోద్గులబొంద సమీపంలో బయటపడ్డ డర్డీ బాంబుల ఘట నతో మళ్లీ పాత కక్షలు భగ్గుమంటాయా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఫ్యాక్షన్ నేపథ్యం ఉన్న ఈ గ్రామం పలుసార్లు వార్తల్లోకెక్కింది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్నోసా ర్లు పాత కక్షలతో బాంబు దాడుల ఘటనలు చోటు చేసుకున్నాయి. 2008లో కాంగ్రెస్, టీడీపీ వర్గాల మధ్య వర్గపోరుతో బాంబులు వేసుకున్న ఘటన చోటు చేసుకుంది. 2009లో సుమారు 40 నాటు బాంబులను పోలీ సులు స్వాధీనం చేసుకున్నారు. అతి కొద్ది కాలంలోనే మరోసారి కాంగ్రెస్, టీడీపీల మధ్య ఉన్న వర్గ విభేదాలతో ఫ్యాక్షన్ రీతిలో ఒకరిపై ఒకరు బాంబు దాడులకు పాల్పడ్డారు. 2011లోనూ ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై ఒకరు బాంబులు వేసుకోవడంతో పలువురు గాయాలపాలయ్యారు. గతానికి భిన్నం గతంలో బాంబు దాడులకు పాల్పడినప్పటికీ, అప్పుడు వేసుకున్న బాంబులు మరీ అంత ప్రమాదకరమైనవి కావు. కానీ ఈసారి బయటపడ్డ బాంబులు పొటాషియం, గంధకం, సీస పెంకులు, పదునైన గాయాలు చేసే రాళ్లతో కూడి డిటోనేటర్‌తో పేలుడుకు గురయ్యే అతి ప్రమాదకరమైన బాంబులుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ బాంబులకు వాహనాలను కూడా పేల్చే సామర్థ్యం ఉంటుందని తెలియజేస్తున్నారు. జాతరే లక్ష్యమా ? దాచి ఉంచిన 59 నాటుబాంబులు వెలుగు చూడడంతో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. గతంలో ఉన్న రెండు వర్గాల మధ్య వివాదం తారస్థాయికి చేరుకుందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇటీవల గ్రామంలో రెండు పార్టీల మధ్య ఏర్పడ్డ చిన్న వివాదం చినికిచినికి గాలి వానలా మారింది. ఒక వర్గం మరొక వర్గంపై కేసు పెట్టడంతో ఒక వర్గానికి చెందిన ఏడుగురు వారం రోజులుగా రిమాండ్‌లో ఉన్నారు. ఇదిలా ఉండగా ఈ రెండు వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో ఎవరైనా నాటు బాంబులను తెప్పించి ఉంచారా అన్న అనుమానాలున్నాయి. అంతేకాక ప్రతి ఏటా కంబాలపల్లిలో మహాలక్ష్మమ్మ జాతరను ఘనంగా నిర్వహిస్తారు. ఈ జాతరకు పలు జిల్లాల నుంచి కూడా జనం వస్తుంటా రు. కాగా ఈసారి ఈ జాతరను ఒక వర్గం వాయిదా వేయగా, మరో వర్గం నిరాడంబరంగా జరుపుకున్నారు. పోలీసులు ముందస్తుగా బాంబులను గుర్తించడంతో పెనుప్రమాదమే తప్పింది. -
ఇక... భూసేకరణే అడ్డంకి!
దేవరకొండ : ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తి చేయడంపై నిన్నమొన్నటి వరకు నెలకొన్న సందిగ్ధం..ఇటీవల అసెంబ్లీలో జరిగిన చర్చతో వీడింది. 2016 లోగా ప్రాజెక్టును పూర్తిచేస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇవ్వడంతో ఇక్కడి ప్రజలకు కొంత ఊరట లభించింది. ఈ ప్రాజెక్టులో అంతర్భాగమైన సొరంగమార్గం పనులను చేస్తున్న కాంట్రాక్టు కంపెనీలు జేపీ అసోసియేట్స్, రాబిన్స్ నిర్మాణ వ్యయాన్ని పెంచాలని డిమాండ్ చేయడం.. మరోవైపు ఇక్కడి ప్రజలు, ప్రతిపక్షాలు మొండిపట్టు పట్టడంతో తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చేపట్టడానికి నిర్ణయం తీసుకుంది. అయితే జీఓనంబర్ 13పై ఒక నిర్ణయానికి వస్తే ప్రాజెక్టుకు ముందడుగు పడుతుంది. ఇదిలాఉంటే ప్రాజెక్టుకు భూసేకరణ అడ్డంకిగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభుత్వం నూతన భూసేకరణ చట్టం ప్రకారం భూమి సేకరించాలని భావిస్తున్నప్పటికీ, ఇప్పటికే 200ఎకరాలు సేకరిం చగా ఆ భూములకు కూడా కొత్త భూసేకరణ చట్టం ప్రకారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వం ప్రాజెక్టుకు అవసరమైన భూమిని సేకరించడానికి నూతన భూసేకరణ చట్టం వర్తింపజేయాలని భావిస్తున్న సంగతి తెలిసిందే. ప్రాజెక్టుల నిర్మాణ విషయంలో భూములు కోల్పోయే రైతులకు దేశంలోనే అత్యుత్తమ ప్యాకేజీని అందించాలని, మార్కెట్ ధరలతో సమానంగా చెల్లించాలని నిర్ణయించింది. అయితే ఎస్ఎల్బీసీ ప్రాజెక్టులో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కోసం 3723 ఎకరాల భూమి అవసరముండగా, ఇప్పటికే రిజర్వాయర్ బండింగ్ నిర్మాణం కోసం 200 ఎకరాలను కొనుగోలు చేశారు. పాత భూసేకరణ చట్టం ప్రకారం భూములు కోల్పోయిన రైతులు తమకు అన్యాయం జరిగిందని, అప్పట్లో తమకు ఇష్టం లేకున్నా బలవంతంగా అధికారులు భూమిని సేకరించారని, బత్తాయి తోటల రైతులకు అన్యాయం జరిగిందని వాపోతున్నారు. ఇప్పుడు తమకు కూడా నూతన భూసేకరణ చట్టం వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొలిక్కిరాని సర్వేనంబర్ 129 సమస్య.. 129వ సర్వేనంబర్‌లో ప్రభుత్వ రికార్డుల కన్నా, ఎక్కువ భూములకు పట్టాదారు పాస్‌పుస్తకాలున్నా యి. అధికారులు సర్వే నిర్వహించగా భూమి తక్కు వ, పాస్‌పుస్తకాలు ఎక్కువగా ఉండడంతో వారు ఈ విషయంలో ఓ కొలిక్కి రాలేకపోతున్నారు. దీనిపై ఇప్పటికీ ఎనిమిది సార్లు సర్వే నిర్వహించారు. అయి నా వివాదం సద్దుమణగలేదు. ఈ రెండు సమస్యలు ఎస్ఎల్బీసీ ప్రాజెక్టుకు ఆటంకంగా మారనున్నాయి. ప్రాజెక్టు త్వరితగతిన పూర్తి కావాలంటే.. ప్రభుత్వం అనుకున్న సమయానికి ప్రాజెక్టును పూర్తి చేయాలంటే అడ్డంకిగా మారిన భూసేకరణ సమస్యను మొట్టమొదటగా పరిష్కరించాలి. ప్రస్తుతం వెంటనే పనులు చేపట్టాల్సిన బండ్ నిర్మాణం ఇప్పటికే సేకరించిన 200 ఎకరాల భూముల్లోనే ఉంది. కాగా, అదే రైతులు వివాదానికి దిగుతున్నారు. వీరి సమస్యలు పరిష్కరించడం కీలకంగా మారింది. గతంలో భూసేకరణ అధికారులను చాలాసార్లు రైతులు అడ్డుకున్నారు. పనులు జరగకుండా ఆందోళనకు కూడా దిగారు. ఈ సమస్య చిన్నదే అయినా పరిష్కరించడానికి అధికారులకు నిబంధనలు అడ్డు వస్తున్నందున 129వ సర్వేనంబరు సమస్యను, ఇప్పటి వరకు సేకరించిన 200 ఎకరాల భూముల రైతులకు కొత్త భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారాన్ని అందించే విషయంలో ప్రభుత్వం ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఎన్నిసార్లు భూములు కోల్పోవాలి గతంలో నాగార్జునసాగర్ నిర్మాణ సమయంలో మేము రాయారం గ్రామంలో ఉండగా మా భూములు కోల్పోయాం. మళ్లీ ఇప్పుడు నక్కలగండి ప్రాజెక్టు నిర్మాణ సమయంలో భూములు కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఎకరానికి వంద రూపాయలు ఇచ్చారు. ఇప్పుడు మళ్లీ యాభై ఏళ్ల తర్వాత మా భూములన్నీ సాగులోకొచ్చాక కేవలం లక్ష రూపాయలిస్తే ఏం సరిపోతాయి. ఇదెక్కడి న్యాయం? నూతన భూసేకరణ చట్ట ప్రకారం పరిహారం చెల్లించాల్సిందే. - చిర్ర సుదర్శన్‌రెడ్డి, తెల్దేవర్పల్లి కాపుకొచ్చిన బత్తాయి తోటకు ఎకరాకు రూ.లక్షా60వేలు ఇచ్చారు ఏడు సంవత్సరాల పాటు బత్తాయి తోటను పెంచి పెద్దచేసి సరిగ్గా కాపు వస్తుందనుకున్న సమయంలో భూములు కోల్పోవాల్సి వచ్చింది. ఎకరా బత్తాయి తోటకు రూ.లక్షా 60వేలు ఇచ్చారు. సుమారు రూ.5 లక్షలు తోటకు పెట్టుబడి అయ్యింది. పరిహారం కింద వచ్చింది కూడా అంతంతే. మాకు ప్రభుత్వం ఏం నష్టపరిహారం ఇచ్చినట్టు ? కనీసం తెలంగాణ ప్రభుత్వంలోనైనా మాకు సరైన న్యాయం చేకూరుతుందని ఆశిస్తున్నాం. - ఎన్.భరత్‌కుమార్, తెల్దేవర్పల్లి, మోత్యతండా -
పారాహుషార్..పరార్..
దేవరకొండ/చింతపల్లి : చింతపల్లి మండలం కుర్మేడు సమీపంలోని ఇసుక తరలింపునకు బ్రేక్ పడింది. శనివారం ‘సాక్షి’లో సరి‘హద్దు’ దాటుతోంది అనే శీర్షికన మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లా సరిహద్దు ప్రాంతమైన కుర్మేడు నుంచి ఇసుక తరలిపోతున్న వైనంపై ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీంతో ఇసుకాసురులు అలర్ట్ అయ్యారు. ఆధారాలు లేకుండా చేసేందుకు ఇసుక ఫిల్టర్లను నిర్వీర్యం చేసి గప్‌చుప్ అయ్యారు. ఇదిలా ఉండగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం నాంపల్లి సీఐ, తహసీల్దార్ అక్కడి వాగులను పరిశీలించారు. పరిస్థితిని సమీక్షించారు. కాగా, నిన్నటివరకు అక్కడ కనిపించిన అక్రమ ఇసుక ఫిల్టర్లు నిర్వీర్యం చేసి ఉన్నాయి. అక్కడ ఇసుక తరలింపునకు ఆధారాలను తొలగించేందుకు ఇసుకాసురులు ప్రయత్నించారు. ఫొటోలు తీసుకోవడానికి ప్రయత్నించగా అక్కడున్న వారు ‘సాక్షి’తో వాదనకు దిగారు. ఇప్పటికే ఇసుక ఫిల్టర్లను తొలగించినట్లు, మూడు,నాలుగురోజుల క్రితం ఇసుక రవాణ జరిగిందని తెలుస్తోందని నాంపల్లి సీఐ ‘సాక్షి’కి ఫోన్‌చేసి తెలిపారు. కానీ ఇసుక ఫిల్టర్లు తమ పరిధిలోని కావని ఆయన పేర్కొన్నారు. మహబూబ్‌నగర్ జిల్లా మాడ్గుల మండల పోలీసులతో తాను మాట్లాడినట్లు తెలిపారు. అయితే హైవేపై పోలీస్ గస్తీ ఉన్నందున, ఇసుక ఈ రూట్లో తరలిపోయే అవకాశం లేదన్నారు. -
కేంద్ర ప్రభుత్వ పథకాలపై.. ప్రచారం ఉద్యమంలా చేపట్టాలి
దేవరకొండ :కేంద్ర ప్రభుత్వం నూతనంగా చేపట్టిన స్వచ్ఛభారత్, జన్‌ధన్ యోజన, ఆడపిల్లలను రక్షిద్దాం-చదివిద్దాం వంటి కార్యక్రమాలపై క్షేత్రస్థాయి ప్రచారాన్ని ఉద్యమంలాగా చేపట్టాలని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ పిలుపునిచ్చారు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం ఆధ్వర్యంలో దేవరకొండలో మంగళవారం నిర్వహించిన జన ర్యాలీని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అంకితభావంతో చేపట్టే ప్రతీపని వందశాతం సఫలీకృతమవుతుందని, జన్‌ధన్ యోజన కింద దేవరకొండ ఎస్బీహెచ్లో ఒకే రోజు రెండువేల ఖాతాలు తెరచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. గ్రామాల్లో శిశు విక్రయాలు, శిశు హత్యలపై సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత అంగన్వాడీ సిబ్బంది, ఆశా వర్కర్లపై ఉందని చెప్పారు. అలాగే వ్యక్తిగత మరుగుదొడ్లపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. భారత ప్రభుత్వ క్షేత్ర ప్రచార విభాగం మెదక్, ఖమ్మం జిల్లాల అధికారి హరిబాబు, క్షేత్ర విభాగం అసిస్టెంట్ డెరైక్టర్ శ్రీధర్‌బాబు మాట్లాడుతూ గ్రామాల్లో బహిరంగ మల విసర్జన జాడ్యం పెరిగిందని, ముందుగా వ్యక్తిత్వాల్లో మార్పు రావాలని అన్నారు. మానవ అభివృద్ధి సూచికలో దేశంలో మన రాష్ట్ర 136వ స్థానంలో ఉందన్నారు. ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతమైన దేవరకొండలో ఆడపిల్లలను విక్రయించే చర్యలు తగవ న్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, నగర పంచాయతీ చైర్మన్ మంజ్యానాయక్, ఆర్థిక అక్షరాస్యత మండలి అధికారి బ్రహ్మచారి, ఐసీడీఎస్ పీడీ మోతి, ఐసీడీఎస్ ఏపీడీ కృష్ణవేణి, క్షేత్ర ప్రచార విభాగం జిల్లా ఇన్చార్జ్ కోటేశ్వర్రావు, ఎంపీడీఓ విజయలక్ష్మి, తహసీల్దార్ గణేష్, చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్, నగర పంచాయతీ కమిషనర్ స్వామినాయక్ పాల్గొన్నారు. కన్నీళ్లు పెట్టించిన వీడియో.. ఆడపిల్లల విక్రయాలు, బ్రూణ హత్యల గురించి సమావేశంలో ఆర్డీఓ రవినాయక్ మాట్లాడుతూ కొంత ఉద్వేగానికి గురయ్యారు. అదే సమయంలో తన స్మార్ట్ ఫోన్లో ఉన్న వీడియో విజువల్ వాయిస్‌ను వినిపించారు. తల్లి కడుపులో ఉన్న ఓ శిశువు తనను చంపొద్దని ప్రాదేయపడడం చూసి కార్యక్రమంలో పాల్గొన్న అంగన్వాడీ సిబ్బంది, అధికారులు కన్నీళ్లు పెట్టుకున్నారు. -
వక్ఫ్ .. రగడ
దేవరకొండ: వక్ఫ్‌భూముల పరిరక్షణకు అటు ప్రభుత్వం..ఇటు వక్ఫ్ బోర్డు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. ఇప్పటివరకు జరిగిన ఆక్రమణలను గుర్తించి భూములను స్వాధీనం చేసుకోవాలని వక్ఫ్ పరిరక్షణ బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఎక్కడెక్కడ కబ్జాకు గురయ్యాయి...ఎవరి చేతుల్లో ఉన్నాయో ఆరా తీస్తోంది. దీంతో ఆక్రమణదారుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. వక్ఫ్గ్రడ ప్రభుత్వ కార్యాలయాలకుతగిలింది. చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లో ఉండడంతో అధికారులకు ఏం చేయాలో పాలుపోవడం లేదు. జిల్లావ్యాప్తంగా సుమారు 5వేల ఎకరాల వక్ఫ్ భూములుండగా అందులో 85 శాతం భూములు ఇతరుల ఆక్రమణలో ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్క దేవరకొండలో 111 ఎకరాల 8 గుంటల వక్ఫ్ భూములుండగా, అందులో సుమారు 83 ఎకరాలు పలువురి ఆక్రమణలో ఉన్నాయి. వక్ఫ్ భూముల పరిరక్షణ కమిటీ ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తోంది. పరాయి, ప్రైవేట్ అని కాదు.. ప్రభుత్వ ఆధీనంలో ఉన్న కార్యాలయాల స్థలాలను కూడా వదులుకునేది లేదని తేల్చి చెబుతోంది. గతంలో నగర పంచాయతీ స్థలం వక్ఫ్ భూమిగా పేర్కొంటూ కొందరు మైనార్టీలు కోర్టును ఆశ్రయించారు. దీనిపై తీర్పు రాకపోవడంతో భవన నిర్మాణానికి మంజూరైన 2 కోట్ల రూపాయల నిధులు మూలుగుతున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ స్థలం కూడా వక్ఫ్ ల్యాండేనని (సర్వేనంబర్ 754) సదరు వక్ఫ్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న అదనపు గదుల పనులను స్టేట్ వక్ఫ్ ప్రొటెక్ట్ ఆఫీసర్ సనా ఉల్లాఖాన్ నిలుపుదల కూడా చేయించారు. అసలు వక్ఫ్ కథ ఏమిటంటే .. నిజాం కాలం నుంచి మైనార్టీల సంక్షేమం కోసం కేటాయించిన వక్ఫ్, వక్ఫ్ ఇనాం భూములు దేవరకొండ పట్టణంలో 111 ఎకరాలు ఉన్నాయి. ఇవి అష్రాఖానా, దర్గా, ఖాదర్‌షా సాహెబ్, దర్గా, హాజీదర్వేష్ మహ్మద్‌ఖాద్రి, హజ్రత్ జెల్షెహద్ఖాద్రి, దర్గా హసులేమాన్, జామా మసీద్ వంటి వాటి పరిధిలో ఉన్నాయి. ప్రభుత్వ రికార్డుల ప్రకారం 224, 244, 399, 402, 408, 412, 535, 534, 489, 454, 489, 464, 420, 407, 404, 403, 398, 397, 395, 396 సర్వేనంబర్లలో ఈ వక్ఫ్ భూములు ఉన్నాయి. కాలక్రమంలో 83 ఎకరాల మేర కబ్జాకు గురైంది. ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ఆటంకంగా మారిన ‘వక్ఫ్’ దేవరకొండలోని చాలా ప్రభుత్వ కార్యాలయాలు వక్ఫ్ భూముల్లోనే ఉన్నాయి. దేవరకొండ నగర పంచాయతీ కార్యాలయం, సివిల్ సప్లయీస్ గోడౌన్, శాఖా గ్రంథాలయం, తహసీల్దార్ కార్యాలయం ఇవన్నీ వక్ఫ్ సర్వేనంబర్లలోనే ఉం డడం గమనార్హం. ఇప్పటికే నగర పంచాయతీ నిర్మాణానికి ఆటంకంగా మారిన వక్ఫ్ రగడ.. ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాలకు కూడా తగిలింది. ఆయా కార్యాలయాల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయి. అయితే వీటి నిర్మాణానికి పట్టణానికి సమీపంలో ప్రభుత్వ భూములు లేవు. ప్రస్తుతం తహసీల్దార్ కార్యాలయం శిథిలావస్థకు చేరుకోగా ఆ భవనాన్ని కూల్చి అక్కడే ఈ రెండు కార్యాలయాలను నిర్మించాలని మొదట అధికారులు భావించారు. కానీ తహసీల్దార్ కార్యాలయం వక్ఫ్ సర్వేనంబర్‌లోనే ఉండడంతో ఉన్న భవనాన్ని కూల్చి నిర్మాణం చేపడితే చట్టపరమైన చర్యలు తలెత్తే అవకాశం ఉందని అధికారులు కూడా వెనుకంజ వేస్తున్నట్లు సమాచారం. ఇప్పుడేంటి .. వక్ఫ్ భూములపై వక్ఫ్ పరిరక్షణ బోర్డు దృష్టి సారించింది. ఆక్రమణకు, కబ్జాలకు గురైన స్థలాలను స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా బోర్డు అధికారులు గత ఏడాది దేవరకొండ పరిధిలోని మెయిన్‌రోడ్డులో ఉన్న వాణిజ్య స్థలాలను స్వాధీనం చేసుకునేందుకు డీఆర్ఓ, కలెక్టర్లను సంప్రదించారు. ఆయా స్థలాల్లో కబ్జాలో ఉన్న 105 మందికి నోటీసులు జారీ చేశారు. వెంటనే ఖాళీ చేయాలని పేర్కొన్నారు. కానీ రాజకీయ జోక్యంతో ఆ వివాదం సద్దుమణిగినా ఇప్పుడు ఆ అంశం మళ్లీ తెరమీదకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో ఆ భూములను స్వాధీనం చేసుకుని తిరిగి సంవత్సరం వారీగా లీజ్‌కు ఇవ్వాలని, తద్వారా రాబడి పెంచుకోవాలని వక్ఫ్ భావిస్తోంది. ఒకవైపు ప్రభుత్వం.. మరోవైపు వక్ఫ్‌బోర్డు ఈ భూముల స్వాధీనానికి కఠినంగా వ్యవహరిస్తుండడంతో ఆక్రమణదారుల్లో భయం మొదలైంది. -
అండగా ఉంటాం..
దేవరకొండ/చందంపేట : ‘‘అధైర్య పడొద్దు..అండగా ఉంటాం..’’ అంటూ ఆత్మహత్యకు పాల్పడిన గిరిజన రైతు కుటుంబానికి సీఎల్పీ నేత కుందూరు జానారెడ్డి భరోసా ఇచ్చారు. చందంపేట మండలం గాగిళ్లాపురం గ్రామపంచాయతీ కొర్రోనితండాకు చెందిన కౌలురైతు కొర్ర రూప్లానాయక్ ఇటీవల ఆత్మహత్యకు పాల్పడగా అతని కుటుంబాన్ని మంగళవారం సీఎల్పీ నేత జానారెడ్డి, ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ నేనావత్ బాలునాయక్, మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి పరామర్శించారు. రూప్లానాయక్ ఇంటికి వెళ్లిన కాంగ్రెస్ నేతలు అతని భార్య లచ్చిని ఓదార్చారు. ఆత్మహత్యకు పురికొల్పిన పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. సాగుకు వ్యవసాయ భూమి లేక, బతకడానికి దారిలేక అప్పులబాధ ఎక్కువై ఆత్మహత్యకు పాల్పడినట్లు లచ్చి నాయకులతో తెలిపింది. స్పందిం చిన నాయకులు తక్షణ సాయంగా ఆమెకు రూ.50వేలు అందించారు. కాంగ్రెస్ హయాంలో ఆత్మహత్యకు పాల్పడిర కుటుంబానికి అందించే లక్ష రూపాయల ఆర్థికసాయాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేయకున్నప్పటికీ అధికారులతో ఈ విషయం మాట్లాడతానని జానారెడ్డి ఆమెకు హామీ ఇచ్చారు. రోడ్డుకు రూ.10 లక్షల జెడ్పీ నిధులు.. తండాకు వెళ్లడానికి రోడ్డు మార్గం లేకపోగా జానారెడ్డి పర్యటన ఖరారు కాగానే కాంగ్రెస్ నాయకులు అప్పటికప్పుడు తాత్కాలిక రోడ్డు మార్గాన్ని ఏర్పాటు చేశారు. పూర్తిస్థాయి రోడ్డు నిర్మాణం కోసం ప్రస్తావించిన జానారెడ్డి, గుత్తా సుఖేందర్‌రెడ్డిలు జిల్లాపరిషత్ నిధుల నుంచి రూ. 10లక్షల వరకు కేటాయించాలని చైర్మన్ నేనావత్ బాలునాయక్‌ను కోరారు. దీనికి స్పం దించిన ఆయన అక్కడికక్కడే రోడ్డుకు నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అదే విధంగా తండాలో తాగునీటి వసతి లేకపోవడంతో వ్యవసాయ బావి నుంచి నీటిని తెచ్చుకుంటున్నామని, ట్రాన్స్ఫార్మర్ లేక ఇబ్బందులకు గురవుతున్నామని సమస్య పరిష్కరించాలని గిరిజనులు కోరారు. వెంటనే బోరును రిపేర్ చేయించి జెడ్పీ నిధుల కింద చేతిపంపు మంజూరు చేస్తామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, మండల పార్టీ అధ్యక్షుడు గోవిందు యాదవ్, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, మైనార్టీ నాయకులు సిరాజ్‌ఖాన్, దేవరకొండ నగర పంచాయతీ చైర్మన్ కేతావత్ మంజ్యానాయక్, మాజీ ఎంపీపీ ముత్యాల సర్వయ్య, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్లు సురేష్‌రెడ్డి, ముక్కమల్ల వెంకటయ్య, రవి, ఎంపీటీసీ వెంకటయ్య, బెరైడ్డి కొండల్‌రెడ్డి, లక్ష్మానాయక్, సర్పంచ్ కొత్తపల్లి కృష్ణ, ఎంపీటీసీ గిరి యాదగిరి, బిక్కునాయక్, నేనావత్ భరత్‌కుమార్, మహాలక్ష్మయ్య, కొర్ర రాంసింగ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి
దేవరకొండ :ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి ఓ అంధ విద్యార్థినిని నమ్మించాడు ఓ కామపిశాచి. ఆపై మాయమాటలు చెప్పి లోబర్చుకున్నాడు. మూడు నెలలుగా లైంగికదాడికి పాల్పడ్డాడు. అంతేకాదు తన స్నేహితులతోనూ లైంగికదాడి చేయించి ఆ విద్యార్థినికి నరకం చూపాడు. తమ కూతురు కనిపించడం లేదని తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఫోన్‌సిగ్నల్ ఆధారంగా పోలీసులు నిందితులను కనిపెట్టారు. ఈ సంఘటనకు సంబంధించి దేవరకొండ డీఎస్పీ కె.మనోహర్ మంగళవారం తన కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. వివరాలు ఇవి... నాంపల్లి మండలం ముష్టిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని రాజ్యానగర్తండాకు చెందిన ఓ అంధ విద్యార్థిని హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని అంధుల వసతి గృహంలో ఉంటూ బీఈడీ చదువుతోంది. తనతో పాటే కర్నూలుకు చెందిన ఓ వివాహిత అయిన మరో అంధ విద్యార్థిని కమల కూడా అదే వసతిగృహంలో ఉంటుంది. కమల భర్త అయిన మణిరాజు తరచు హైదరాబాద్‌కు వస్తుండగా, కమల స్నేహితురాలయిన బాధితురాలితో మణిరాజుకు పరిచయం ఏర్పడింది. వీరిపరిచయం సాన్నిహిత్యంగా మారడంతో దాన్ని అలుసుగా చేసుకున్న మణిరాజు బయటకు వెళ్లి వద్దామంటూ జూలై 30న కారులో ఆమెను తీసుకెళ్లాడు. కారులో తనతో పాటు వచ్చిన మణిరాజు స్నేహితులు సత్యనారాయణ, సందీప్‌లు కలిసి సామూహికంగా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఈ విషయం బయటకు చెప్పుకోవడానికి సంకోచించిన ఆ అంధవిద్యార్థిని ఎప్పటిలాగా ఉండిపోయింది. ఇదే క్రమంలో ఈనెల 2న మళ్లీ మణిరాజు ఆమెను కారులో తీసుకెళ్లి కర్నూలుకు సమీపంలోని లింగదేవరపాడులో తన బాబాయి అయిన రఘు ఇంట్లో తనను ఉంచాడు. అప్పటి నుంచి ఆమెను బంధించి పలుమార్లు లైంగికదాడి పాల్పడ్డారు. ఇదే క్రమంలో మణిరాజు బాబాయి రఘు కూడా ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఇదిలాఉండగా కొన్ని రోజులుగా తమ కూతురు ఆచూకీ తెలియకపోవడంతో నాంపల్లి పోలీసులకు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించడంతో పాటు ఆ అంధ విద్యార్థిని ఫోన్ సిగ్నల్ ఆధారంగా కర్నూలులోని లింగదేవరపాడులో ఉన్నట్లు గ్రహించి నిందితులయిన మణిరాజు, అతని స్నేహితులు సందీప్, సత్యనారాయణ, బాబాయి అయిన రఘును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీడు మహా... ముదురు ఈ కేసులో ప్రధాన నిందితుడైన కర్నూలుకు చెందిన మణిరాజు మహాముదురు. స్వల్ప అంధుడైన మణిరాజు పలువురికి ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ నమ్మబలికి మోసం చేసేశాడు. ఇదే తరహాలో అంధ విద్యార్థినిని కూడా లొంగదీసుకున్నాడు. కర్నూలులో గతంలో కూడా కొంత మందికి ఉద్యోగాలు ఇప్పిస్తానని, పెన్షన్లు ఇప్పిస్తానంటూ డబ్బులు దండుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై గతంలో కర్నూలు పోలీస్‌స్టేషన్‌లో అతనిపై ఫిర్యాదులు కూడా ఉన్నాయి. మణిరాజును విచారణకు పిలిచిన కర్నూలు 3 టౌన్ ఎస్ఐ పైనే అంధుడినైన తనను బెదిరిస్తున్నాడని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసిన ఘనుడు. -
గురువా.. ఇది తగునా ?
దేవరకొండ : విద్యార్థులకు ఆదర్శప్రాయుడిగా నిలిచి, వారిని సన్మార్గంలో పయనించేలా చూడాల్సిన ఉపాధ్యాయుడే తలదించుకునే పనిచేశాడు..పూటుగా తాగి పాఠశాలలో వీరంగమాడాడు..అడ్డువచ్చిన సహచర ఉపాధ్యాయులపై చిందులేశాడు..అతడి నిర్వాకం చూసి సహచరులే ఛీకొట్టారు..విద్యార్థులు, గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవరకొండ మండలం గొట్టిముక్కల ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ఎండీ అలీం గురువారం విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్నం తన స్నేహితులను పిలిపించుకుని పాఠశాలలోని ఓ గదిలో మద్యం సేవించాడు. అనంతరం తాగిన మత్తులో ఆ గది నుంచి బయటకు వచ్చిన అలీం వీరంగం సృష్టించాడు. తానేం చేస్తున్నాడో తెలియని స్థితిలో తరగతి గది కిటికీలో నుంచి బయటకు మూత్రం పోయడానికి ప్రయత్నిస్తూ తరగతి గదిలోనే ఆ పని కానిచ్చేశాడు. పాఠశాలకు చెందిన రిజిస్టర్లను కొన్నింటిని చిందరవందరగా పడేసి చించేశాడు. తోటి ఉపాధ్యాయురాలి స్కూటర్లో గాలి తీసేశాడు. ఇదేంటని అడగటానికి వచ్చిన హెడ్మాస్టర్ ఇద్దయ్యపై జులుం ప్రదర్శించాడు. విద్యార్థుల ముందే విచ్చలవిడిగా ప్రవర్తించడంతో ఈ విషయం గ్రామస్తులకు తెలిసింది. పాఠశాలలో జరుగుతున్న వ్యవహారం మీడియాకు తెలియడంతో అక్కడి నుంచి పరారయ్యాడు. గతంలోనూ.... ఉపాధ్యాయుడు అలీం గతంలోనూ ఇలాంటి నిర్వాకానికి పాల్పడినట్లు తెలిసింది. మరో ఉపాధ్యాయుడుతో కలిసి అలీం మహిళా ఉపాధ్యాయురాళ్లతో అసభ్యంగా ప్రవర్తించినట్లు సమాచారం. దీనిపై సదరు ఉపాధ్యాయురాళ్లు రాతపూర్వకంగా ఎంఈఓకు ఫిర్యాదు చేశారు. క్షమాపణ చెప్పడంతో అప్పట్లో క్రమశిక్షణ చర్యలు తీసుకోకుండా విడిచిపెట్టారు. అటువంటి వారిని ఉపేక్షించేది లేదు : విశ్వనాథరావు, డీఈఓ పాఠశాలలో వీరంగమాడిన ఉపాధ్యాయుడు అలీంపై క్రమ శిక్షణా చర్యలు తీసుకోనున్నట్లు డీఈఓ విశ్వనాథరావు చెప్పారు. ఇలాంటి చర్యలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించబోమని ఆయన స్పష్టం చేశారు. ఎంఈఓ సెలవులో ఉండడంతో విషయం తన దృష్టికి రాలేదన్నారు. సదరు ఉపాధ్యాయుడిని వెంటనే సస్పెండ్ చేసి క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటామన్నారు. -
దేవరకొండ అభివృద్ధికి కృషి
కొండమల్లేపల్లి :దేవరకొండ నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి సారించి అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లాపరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. మంగళవారం దేవరకొండ మండల పరిధిలోని ముదిగొండ గ్రామంలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడారు. నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని మండలాలు, గ్రామాలకు కృష్ణా జలాలు అందించడానికి చర్యలు చేపడుతామని పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలోని సమస్యలపై ఎప్పటికప్పుడు స్పందిస్తూ పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని, ప్రజలకు అందుబాటులో ఉంటానన్నారు. అనంతరం గ్రామంలో ఎన్‌ఆర్‌డీడబ్ల్యూపీ నిధులు 23.75లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన 40వేల లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌ను వారు ప్రారంభించారు. పలువురు ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు జెడ్పీచైర్మన్, ఎమ్మెల్యేను శాలువాలు, పూలమాలలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ తిప్పర్తి సురేష్‌రెడ్డి, జిల్లా ప్రచార కార్యదర్శి సీరాజ్‌ఖాన్, వైస్ ఎంపీపీ వేణుధర్‌రెడ్డి, సర్పంచ్ నర్యానాయక్, ఎంపీటీసీ భాగ్యలక్ష్మి సత్యం, రవీందర్‌రెడ్డి, కొర్ర శంకర్‌నాయక్, కేశ్యానాయక్, కోట్యానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
అనిత.. తొలి అడుగు
దేవరకొండ : చందంపేట మండలం తిమ్మాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చెంచుకాలనీలో 50 కుటుంబాలు ఉంటాయి. సుమారు రెండు వందల మంది జనాభా ఉంటుంది. ఆ చెంచుకాలనీకి చెందిన దాసరి అంజయ్య, ఈదమ్మలకు ముగ్గురు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరిలో అనిత పెద్దకూతురు. ఈ కాలనీలో 50 కుటుంబాలున్నప్పటికీ పిల్లల చదువులు మాత్రం సగంలో ఆగిపోతున్నాయి. ఐటీడీఏ వారు ఈ కాలనీలో ప్రాథమిక పాఠశాలను నిర్వహించేవారు. కుటుంబం గడవని పరిస్థితుల్లో చాలామంది పిల్లలు తల్లిదండ్రులతో కలిసి బడి మానేసి కూలి పనికో.. వలసబాటనో పడుతున్నారు. దీంతో ఆ పాఠశాల కూడా ప్రస్తుతం మూతబడింది. అయితే అనితను పదవ తరగతి వరకు దేవరకొండలోని ఎంబీ హైస్కూల్లో చదివిం చారు. పదో తరగతిలో ఉత్తీర్ణురాలైంది. చెంచులకు రిజర్వేషన్ అమలవుతుండడంతో ఇంటర్ చదివించాలన్న ఆలోచనతో దామరచర్లలోని ఏపీటీడబ్ల్యూఆర్జీ జూనియర్ కళాశాలలో చేర్పించారు. అనిత ఇటీవల ఇంటర్లో ఉత్తీర్ణురాలు కావడంతో ఉన్నత చదువుల కోసం ప్రయత్నాలు చేస్తోంది. కలెక్టర్ ఆశయాన్ని నిజం చేసిన అనిత.. 24 ఏళ్ళ క్రితం ఓ కలెక్టర్ కన్న కల నేటికి సాకారమైంది. చెంచులు అడవిలో ఆకులు అలములు తింటూ గడ్డు జీవితాన్ని గడపడాన్ని జీర్ణించుకోలేని అప్పటి కలెక్టర్ తుకారాం (చెంచు) చెంచుల అభ్యున్నతి కోసం ఏదైన చేయాలని తలచారు. చందంపేట అటవీ ప్రాంతంలో ఉన్న నాలుగు ప్రాంతాల్లో చెంచుకాలనీలు ఏర్పాటు చేసి, మౌలిక సదుపాయాలు కల్పించి, భూమి లేని వారికి భూమి పంపిణీ చేసి వారిలో మార్పును తీసుకురావడం కోసం ప్రయత్నించారు. ఆయన బదిలీపై వెళ్లిపోవడం.. ఆ తర్వాత అధికారుల నిర్లక్ష్యం, నిధుల మంజూరులో అలసత్వం కారణంగా కలెక్టర్ తుకారాం ఆశయం నీరుగారింది. ఈ చెంచుకాలనీలను శ్రీశైలం ఐటీడీఏలో భాగస్వామ్యం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఉపాధి అవకాశాలు లేకపోగా, చెంచులు జీవిత గమనం మళ్ళీ అడవికే చేరింది. ప్రభుత్వం నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణా చట్టం, విద్యాహక్కు చట్టం వంటి ఎన్నో పథకాలను తీసుకొచ్చినప్పటికీ ప్రయోజనం మాత్రం శూన్యంగా మారిందనడానికి అనిత ఉదంతమే ఒక ఉదాహరణ. ఏదేమైనా కలెక్టర్ తుకారాం ఆశయాన్ని నిజం చేసే దిశగా అనిత అడుగులు వేస్తోంది. కాగా టీటీసీ చదవడానికి ఆమె దాతల నుంచి సాయం కోరుతోంది. ఓ వైపు కుటుంబానికి ఆసరాగా.. మరోవైపు లక్ష్యసాధన దిశగా.. ఇంటర్ వరకు చదివిన అనిత పై చదువుల కోసం తపిస్తోంది. ప్రభుత్వ టీచర్ కావాలన్న లక్ష్యంతో టీటీసీ పరీక్షకు హాజరైంది. కానీ తన ర్యాంకుకు ప్రభుత్వ కోటాలో సీటు రాదేమోనని బెంగపెట్టుకుంది. అయితే ప్రస్తుతం ఖాళీగా ఉన్న అనిత తన కుటుంబానికి ఆసరాగా కూలి పనిచేస్తుంది. తల్లిదండ్రులతో పాటు తమ్ముడు శివ కూడా మామిడి మొక్కలు నాటడానికి గోతులు తీసే పనికి వెళ్తున్నారు. ఉద్యోగం చేసి చెల్లెళ్లను చదివిస్తా మా అమ్మనాన్న రోజు కూలి పనిచేసి కష్టపడి చదివిస్తున్నారు. వాళ్ళ కష్టం నాకు తెలుసు. అందుకే నేను బాగా చదివి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని పట్టుదలతో ఉన్నాను. ఉద్యోగం చేస్తూ నా ఇద్దరు చెల్లెళ్ళను చదివించాలన్నదే నా కోరిక. ఇప్పుడు చెల్లెలిద్దరిని మోడల్స్కూల్లో చదివిస్తున్నారు. తమ్ముడు చదువు మానేసి అమ్మానాన్నలతో కలిసి కూలి చేస్తుండు. నేను కూడా అప్పుడప్పుడు మా వాళ్ళతో కలిసి ఊళ్లో కూలికెళ్తుంటా. అందరం కష్టపడితేనే ఇళ్లు గడుస్తుంది. ఈ కష్టాలన్నీ తీరాలంటే నేను ఖచ్చితంగా ఉద్యోగం సంపాదించుకోవాలి. మున్ముందు మా అమ్మానాన్నలను బాగా చూసుకుంటా. ప్రభుత్వం చేయూతనిస్తే మా కుటుంబం కష్టాల నుంచి గట్టెక్కుతుంది. - అనిత దరిచేరని పథకాలు.. కాగా, గత 24 ఏళ్ల క్రితం ప్రభుత్వం ఈ చెంచుకాలనీలోని వారి అభ్యున్నతి కోసం మౌలిక సదుపాయాలు కల్పించి భూమి లేని వారికి భూమినిచ్చిఆదుకుంది. ఆ తర్వాత ఐటీడీఏ అధికారులు మాత్రం వారి అభ్యున్నతిని గాలికొదిలేశారు. దీంతో ఆ చెంచుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. చాలామంది వలసబాట పట్టడంతో కొంతమంది మాత్రమే ప్రస్తుతం కాలనీలో నివాసం ఉంటున్నారు. కాగా, అంజయ్యకు అప్పటికి వివాహం కాకపోవడంతో ప్రభుత్వం ఇచ్చే రెండు ఎకరాలకు అనర్హుడయ్యాడు. దీంతో ఆ కుటుంబం రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. అంజయ్య, ఈదమ్మలు రోజువారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని ఈడ్చుకొస్తున్నారు. నిర్బంధ ప్రాథమిక విద్య, బాలికా సంరక్షణ చట్టం, విద్యాహక్కుచట్టం వంటి ఎన్నో చట్టాలు అమలుచేసి విద్యను ప్రోత్సహిస్తున్నామని అధికారుల మాటలు కోటలు దాటుతున్నాయే తప్ప ఆచరణకు నోచుకోవడం లేదు. చెంచులు కూడా విద్యాపరంగా అంత ఆసక్తి చూపకపోవడం.. .వారిని చైతన్యం చేయడంలో అధికారులు విఫలమవుతుండడంతో వారి బతుకులు మారడం లేదు. -
ఆ.. నాలుగు అంశాలనే నమ్ముకున్నా
దేవరకొండ :నా ఎదుగుదలను అడ్డుకోవడానికి ఎవరు అడ్డుపడినా..నేను మాత్రం ఆ దేవుడిని, నా గురువు జానారెడ్డిని, కష్టపడిన పనిచేసే నా నైజాన్ని, ప్రజ లను మాత్రమే నమ్ముకున్నానని, అవే నా ఎదుగుదలకు కారణమని జిల్లా పరిషత్ చైర్మన్ నేనావత్ బాలునాయక్ అన్నారు. జెడ్పీ చైర్మన్‌గా ఎన్నికైన అనంతరం తొలిసారిగా సోమవారం ఆయన సొంత నియోజకవర్గం దేవరకొండకు వచ్చారు. ఈ సందర్భంగా కొండమల్లేపల్లి నుంచి దేవరకొండ వరకు కార్యకర్తలు భారీ విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ చైర్మన్‌గా జిల్లాసమగ్రాభివృద్ధికి కృషి చేయడంతోపాటు నా సొంత నియోజకవర్గ అభివృద్ధికి కృషిచేస్తానని హామీనిచ్చారు. 2019 నాటికి ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకువచ్చి, జానారెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు అందరూ కష్టపడాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, శాసనసభాపక్ష నేత జానారెడ్డిల సహకారం, జెడ్పీ సభ్యుల తోడ్పాటుతో అభివృద్ధిలో జిల్లాను ఆదర్శంగా తీర్చిదిద్దుతానన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలోని ఎంపీపీలు, జెడ్పీటీసీలను ఆయన అభినందించారు. జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ కర్నాటి లింగారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధినేత సోనియాగాంధీ..ఇక్కడి ప్రజల చిరకాల ఆకాం క్షను గుర్తించి తెలంగాణ ఇచ్చారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అనైతికంగా కుట్రలు పన్ని జిల్లా పరిషత్‌ను సొంతం చేసుకునేందుకు చూసిందని, అయినా వారి కుట్రలు పనిచేయలేదన్నారు. తెలంగాణలో నల్లగొండకు ఎంతో చరిత్ర ఉందని, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలంటే..ఇక్కడినుంచే బీజం వేయాలన్నారు. భారీ వర్షంలోనే ర్యాలీ సాగింది. కార్యక్రమంలో జెడ్పీటీసీ ఆలంపల్లి నర్సింహ, దేవరకొండ ఎంపీపీ మేకల శ్రీనివాస్‌యాదవ్, నాయకులు గోవింద్, సిరాజ్‌ఖాన్, వెంకటేశ్వర్లు, భాస్కర్, రవి, ఇద్రిస్, యూ నిస్, సైదులు, కొండల్‌రెడ్డి పాల్గొన్నారు. ఫ్లోరైడ్ నివారణకు కృషి జిల్లాలో ఫ్లోరోసిస్ నివారణ కోసం రూ.1400 కోట్లతో చేపట్టిన పథకం పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని జెడ్పీ చైర్మన్ బాలునాయక్ తెలిపారు. దేవరకొండలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. డిండి ఎత్తిపోతల పథకాన్ని పక్కకు పెట్టే ఆలోచన ప్రభుత్వానికి ఉంటే దానిని మానుకోవాలన్నారు. గ్రామాల్లో మౌలిక వసతులు సమకూర్చేందుకు పాటుపడతానన్నారు. ఆయన వెంట ఎంపీపీ మేకల శ్రీనివాస్, పలువురు నాయకులు ఉన్నారు. -
మూడు కుటుంబాల్లో తీరని శోకం
దేవరకొండ/: వారంతా యువత...అందరూ బంధువులే. భవి ష్యత్తుపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఒకరు ఉద్యోగం చేస్తుండగా మరొకరు ఉద్యోగ వేటలో ఉన్నారు. ఇంకొకరు ఇంజినీరింగ్ చదువుతుండగా మరొకరు.. ఉన్నత చదువుల కోసం ఎదురుచూస్తున్నారు..మరో విద్యార్థిని ఇంటర్ చదువుతోంది. తల్లిదండ్రులకు అండగా ఉండాల్సిన వీరిని చూసి..విధి వక్రించింది. తాత చినకర్మకు హాజరైన వీరు డిండి ప్రాజెక్టు బ్యాక్ వాటర్‌లో సరదాగా స్నానానికి వెళ్లారు. లోతు తెలియక లోనికి వెళ్లారు. గుం తలో కూరుకుపోయి మృత్యువాతపడ్డారు. చేతికి ఎదిగిన పిల్లలు ఒక్కసారిగా శవాలై కనిపించడంతో ఆ తల్లిదండ్రుల రోదన ప్రతిఒక్కరినీ కంటతడి పెట్టించింది. డిండికి చెందిన దోవతి మల్లారెడ్డి (85) పది రోజుల క్రితం మరణించగా ఆదివారం ఆయన దశదిన కర్మ జరిగింది. సోమవారం మల్లారెడ్డి పెద్దకుమారుడు దత్తారెడ్డి కుమారులు హర్షవర్దన్‌రెడ్డి(30),ప్రణీత్‌రెడ్డి(20), రెండవ కుమారుడు కర్ణాకర్‌రెడ్డి కుమార్తెలు జ్యోత్స్న (20), దేవమణి(17), మల్లారెడ్డి బావమరిది వరంగల్ జిల్లా వనపర్తికి చెందిన నర్సిరెడ్డి కుమారుడు అవినాష్‌రెడ్డి(20), మూడవ కుమారుడు సుధాకర్‌రెడ్డి కుమారుడు అరవింద్‌రెడ్డి, మరో బంధువుల అమ్మాయి కలిసి డిండి ప్రాజెక్టు బ్యాక్‌వాటర్‌లో స్నానం కోసం వెళ్లారు. హర్షవర్దన్‌రెడ్డి, ప్రణీత్‌రెడ్డి, జ్యోత్స్న, దేవమణి నీటిలో మునిగి చనిపోగా, వారిని కాపాడబోయిన అవినాష్‌రెడ్డి కూడా మునిగి మృత్యువాత పడ్డాడు. గోతుల వల్లే..ప్రమాదం డిండి ప్రాజెక్టు శిఖం భూమిలో గతంలో కొంతమంది కాంట్రాక్టర్లు రోడ్డు పనుల నిమిత్తం జేసీబీ సాయంతో మట్టి తోడి రోడ్డు పనులకు ఉపయోగించారు. ఒడ్డు వెంబడే కదా అని సరదాగా గడుపుదామని వెళ్తే మృత్యుగుంతలుగా మారి ఐదుగురి ప్రాణాలను బలిగొన్నాయని గ్రామస్తులు తెలిపారు. వంశాంకురం లేకుండా.. దత్తారెడ్డికి ఇద్దరు కుమారులు.. ఈయన మహబూబ్‌నగర్ జిల్లా మిడ్చిల్ మండలంలోని ఏపీజీవీబీలో క్యాషియర్. పెద్దకుమారుడు హర్షవర్దన్‌రెడ్డి ప్రైవేటు జాబ్ చేస్తుండగా, తమ్ముడు ప్రణీత్‌రెడ్డి ఎమ్మెస్సీ ఎంట్రెన్స్ రాసి రిజల్ట్ కోసం ఎదురుచూస్తున్నాడు. ఇద్దరు కుమారులతో ఆ..కుటుంబం ఎంతో సంతోషంగా ఉండేది. తాత చినకర్మలో పాల్గొన్న ఇద్దరూ తలనీలాలు తీయించుకున్నారు. ఈత.. సరదా వారి ప్రాణాలు తీసింది. ఇద్దరు కుమారులు చనిపోవడంతో దత్తారెడ్డికి వంశాంకురం లేకుండాపోయింది. కరుణాకర్‌రెడ్డి.. డిండిలోనే టైలర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కుమార్తెలు. ఇద్దరిని పెద్ద చదువులు చదివించాలన్నది ఆయన కోరిక. అందుకే పెద్దకుమార్తె జ్యోత్స్నను హైదరాబాద్‌లోని విజ్ఞాన్ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదివిస్తున్నాడు. జ్యోత్స్న ప్రస్తుతం ఫైనలియర్ చదువుతోంది. చిన్నకూతురు దేవమణి డిండిలోని మోడల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. కొడుకులైనా..కూతుళ్లయినా ఒక్కటేనని.. కరుణాకర్‌రెడ్డి పిల్లలకు ఏదీ తక్కువ చేసేవాడు కాదు. కానీ ఇప్పుడు ఆ.. ఇద్దరు కూతుళ్లు తండ్రిని విడిచి కానరాని లోకాలకు వెళ్లడంతో అతని రోదన వర్ణనాతీతం. మల్లారెడ్డి బావ వరంగల్ జిల్లా లింగాలఘనపురం మండలంలోని వనపర్తికి చెందిన నర్సిరెడ్డి వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి కుమారుడు, కూతురు ఉన్నారు. కుమారుడు అవినాష్‌రెడ్డిది బీటెక్ పూర్తయ్యింది. ఉద్యోగ వేటలో ఉన్నాడు. విదేశాలకు వెళ్లేందుకు వీసా కూడా వచ్చింది. రేపోమాపో విదేశాలకు వెళ్తావనుకుంటే.. ఎవరికీ కానరాని లోకాలకు వెళ్లావా అంటూ అతని తల్లిదండ్రులు, బంధువుల రోదిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టించింది. -
నక్కలగండి..!నత్తేనయం..!!
దేవరకొండ : నక్కలగండి బండ్ (రిజర్వాయర్) పనుల ప్రక్రియ నత్తకంటే నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఐదు నెలల కాలంగా ఏ ఫైలు గానీ, ఏ పని గానీ ఇంచు కూడా ముందుకు జరగలేదు. ఈ విషయం అందరికీ తెలిసినా పట్టించుకునే నాథుడు లేడు. ఎన్నికలకు ముందు రేపటినుంచే పనులు చేస్తామన్నట్లు హడావిడి చేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు, అధికారులు ఇప్పుడు రైతుల గురించి పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఒకవైపు రిజర్వాయర్‌కు సేకరించిన భూమిలో నష్టపరిహారం చెల్లించకపోవడం..మరోవైపు పనులు ముం దు కు సాగకపోవడంతో అటు ముంపు బాధితులు, ఇటు రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రంలోనైనా సమస్యను పరిష్కరిస్తారని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇదీ.. అసలు కథ ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు 2009వరకు పూర్తి కావాల్సి ఉండగా మూడేళ్లు పొడిగించి2012వరకు పూర్తి చేస్తామన్నారు. ఆ తర్వాత మరో రెండేళ్ల జాప్యానికి చేరి 2014లో పూర్తిచేస్తామన్నారు. సొరం గం 49 కిలోమీటర్ల మేర పూర్తి కావాల్సి ఉండగా టన్నెల్-1, టన్నెల్-2 కలిసి ఇప్పటివరకు 25కిలోమీటర్ల మేర మాత్రమే పూర్తయింది. బడ్జెట్ కేటాయింపులో ప్రాజెక్టులపై గత ఏడాది తక్కు వ మొత్తంలో కేటాయించడంతో అతిపెద్ద ప్రాజె క్టు అయినా ఎస్ఎల్బీసీ పనుల్లో కూడా జాప్యం జరిగింది. దీనిలో అంతర్భాగమైన నక్కలగండి రిజర్వాయర్ కట్ట (బండ్) పనుల విషయానికి వస్తే మొత్తం 3700ఎకరాల భూసేకరణ చేయగా, అందులో బండ్ నిర్మాణానికి 85 ఎకరాలు అవసరమని గుర్తించి ఆ భూముల రైతులకు పరిహారం కూడా చెల్లించారు. వీటితోపాటు 3700ఎకరాల్లో కేవలం సుమారు 300 ఎకరాలకు మాత్రమే రైతులకు నష్టపరిహారం చెల్లించగా, ఇంకా 3400 ఎకరాల మేర నష్టపరిహారం చెల్లించాల్సిఉంది. అయితే రిజర్వాయర్ కట్ట నిర్మాణ పనులకు 2007లో రూ.220 కోట్ల అంచనా వ్యయంతో టెండర్లను పిలవగా లెస్‌లో జీవీవీ సంస్థ కాంట్రాక్ట్ దక్కించుకుంది. రూ.200 కోట్లతో పనులు చేపడితే నష్టం వచ్చే అవకాశముందని భావించి టెండర్ కాస్ట్ పెంచాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వం ససేమిరా అనడంతో కోర్టును ఆశ్రయించారు. దీంతో ఆ ప్రక్రియ పెండింగ్‌లో పడిపోగా, పనుల్లో జాప్యం జరిగే అవకాశమున్నందున తాజాగా టెండర్లు పిలువచ్చని కోర్టు తీర్పునిచ్చింది. దీంతో ప్రభుత్వం రిజర్వాయర్ కట్ట పనులకు రూ.435 కోట్ల అంచనా వ్యయంతో సంబంధిత అధికారులు ఆన్లైన్ టెండర్ నోటిఫికేషన్ జారీచేశారు. ఈ ప్రక్రియ ఇంకా కొనసాగుతూనే ఉంది. కొత్తరాష్ట్రంలోనైనా ఆశలు నెరవేరేనా.. అయితే ఇక్కడిరైతుల్లో ఆందోళన మాత్రం తగ్గడం లేదు. తమ ఆవేదనను తెలంగాణ ప్రభుత్వమైనా అర్థం చేసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2013 భూ సేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని కోరుతున్నారు. ప్రాజెక్టు పనులు, సొరంగం పనులు ఏళ్ల తరబడి సాగడం వల్ల చుట్టు పక్కల భూముల్లో భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వంలోనైనా నష్టపరిహారం పూర్తిగా చెల్లించి పనులు పూర్తవుతాయన్న ఆశతో ఉన్నారు. -
అవినీతికొండలు
బీబీనగర్ రోజురోజుకూ పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చెందుతోంది. అందుకుతగినట్టు రవాణా సౌకర్యం లేకుండా పోయింది. ఇక్కడ రైల్వే జంక్షన్ ఏర్పాటు చేయాలని 40 ఏళ్ల క్రితమే అనుకున్నారు. ప్రభుత్వాలు మారిపోతున్నాయి..పాలకులు మారిపోతున్నారు. కానీ జంక్షన్ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా కేంద్రంపై ఒత్తిడి తెచ్చిన దాఖలాలు లేవు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతో జంక్షన్ ఏర్పాటవుతుందని భువనగిరి డివిజన్ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దేవరకొండ : కొడితే కుంభస్థలాన్నే కొట్టాలనేది వాడుక సామెత. ఈ సామెతను బాగా ఒంట పట్టించుకుంటున్నారు దేవరకొండ సబ్‌డివిజన్ అధికారులు. వేలకు వేల జీతాలు సరిపోవన్నట్టు బల్ల కింద చేతులు పెడుతూ అడ్డంగా దొరికిపోతున్నారు. ఇక్కడిప్రజల వెనుకబాటు, నిరక్షరాస్యత, అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని లంచాలకు అలవాటు పడి అవినీతికి తెరతీస్తున్నారు. దేవరకొండ సబ్‌డివిజన్‌లో ఇటీవల కాలంలోనే చాలామంది అధికారులు అవినీతికి పాల్పడి అడ్డంగా దొరికిపోవడమే ఇందుకు నిదర్శనాలు. అవినీతికి ఛాన్స్ దొరికితే చాలు చేతివాటం ప్రదర్శిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఘటనల్లో కొన్ని.. వారం రోజుల క్రితం దేవరకొండ సబ్‌డివిజన్‌లో జిల్లా నీటిపారుదల శాఖలో నకిలీ ప్రొసీడింగ్స్ సృష్టించి లక్షల రూపాయల సొమ్మును కాజేశారు. ఎటువంటి అగ్రిమెంట్, ప్రొసీడింగ్ లేకుండానే సుమారు 23 పనులు చేపట్టి అవినీతికి పాల్పడిన దేవరకొండ డీఈ సురేందర్‌రావు, జేఈ మోహన్లతో పాటు మరో ఇద్దరు అధికారులు సస్పెండ్ అయ్యారు. వీరి అవినీతి రీతిని చూసిన వారు ముక్కున వేలేసుకున్నారు. ఈ సంఘటన కంటే ముందు నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి ఏకంగా బ్యాంకునే టార్గెట్ చేసిన బ్యాంకు అధికారులు సస్పెండ్ అవడమే కాకుండా జైలు ఊచలు కూడా లెక్కపెట్టారు. దేవరకొండ సహకార బ్యాంకులో నకిలీ పాస్‌బుక్కులు సృష్టించి బినామీ పేర్లతో కోట్ల రూపాయల మేర అవినీతి చేశారు. సుమారు రూ.ఆరు నుంచి రూ.ఏడు కోట్ల మేర అవినీతి జరిగిందని భావిస్తున్న ఈ కేసులో అసిస్టెంట్ జనరల్ మేనేజరు రామయ్య సస్పెండ్‌కు గురయ్యారు. ఆరు నెలల క్రితం ఉద్యానవన శాఖ నుంచి రైతులకు మంజూరు చేసే కూరగాయల సాగు పందిర్ల సబ్సిడీ పథకంలో ఓ రైతు నుంచి 20 వేల రూపాయలు లంచం తీసుకుంటూ దేవరకొండ ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏడాది క్రితం చందంపేట ఇన్చార్జ్ ఏంఈఓ కె.మల్లయ్య 2012 ఏప్రిల్ 30న పదవి విరమణ పొందాల్సి ఉండగా, అతను తన పుట్టిన తేదీ 21.04.1954 కాగా.. స్వల్పంగా మార్పు చేసి, పదవీ విరమణ తేదీని పెంచుకున్నాడు. ఇది గ్రహించిన జిల్లా అధికారులు మల్లయ్యను సస్పెండ్ చేశారు. కొంతకాలం క్రితం పెద్దఅడిశర్లపల్లి ఎలక్ట్రిసిటీ ఏఈ శ్రీనివాస్‌నాయక్ ట్రాన్స్ఫార్మర్ మంజూరు చేయడం కోసం మండల పరిధిలోని భారతీపురానికి చెందిన ఓ రైతును డబ్బులు డిమాండ్ చేయడంతో ఆ రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రూ.30వేలు తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి సస్పెండ్‌కు గురయ్యాడు. లెక్కలేని చిన్న చేపలెన్నో.... అవినీతిలో చిన్న చేపలెన్నో ఏసీబీ అధికారులకు పట్టుబడి సస్పెండ్‌కు గురైన సంఘటనలు ఉన్నాయి. అధికారులకు చిక్కడమే కాకుండా ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడంతో సస్పెండ్ అయిన వీఆర్ఓలు, లైన్మన్లు, ఇతర అధికారులు తమ ఉద్యోగాలను వదులుకోవాల్సి వచ్చింది. -
ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా
దేవరకొండ : దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో నకిలీ పాస్‌పుస్తకాలతో కోట్ల రూపాయలు డ్రా చేసిన విషయం వెలుగు చూసిన నేపథ్యంలోనే ఫోర్జరీ సంతకంతో బంగారం డ్రా చేసిన మరో సంఘటన వెలుగులోకి వచ్చింది. దేవరకొండకు చెందిన ఎం.ప్రేమలత 2012 సెప్టెంబరు 18న 15 తులాల బంగారు ఆభరణాలను దేవరకొండ కో-ఆపరేటివ్ బ్యాంకులో తనఖా పెట్టి 2లక్షల40వేల రూపాయలను లోనుగా తీసుకుంది. అయితే ప్రేమలత తన భర్త అశ్విన్‌కుమార్‌తో విబేధాలు రావడంతో ఏడాదిగా విడిగా ఉంటుంది. విడాకుల కోసం కోర్టులో కూడా దరఖాస్తు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల బ్యాం కులో బంగారు నగల విషయం వాకబు చేయగా 27డిసెంబరు 2013న డబ్బులు చెల్లించి బంగారాన్ని డ్రాచేసినట్లు బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో తన బ్యాంకు ఖాతాలో ఉన్న సొమ్మును తన ప్రమేయం గానీ, తన సంతకం గానీ లేకుండా ఎలా డ్రా చేశారని బ్యాంకు అధికారులను ప్రశ్నించింది. ఆమె సంత కం స్థానంలో మరొకరు ఫోర్జరీ సంతకం చేశారని, దీనిపై విచారణ నిర్వహిస్తామని బ్యాంకు అధికారులు తెలిపారు. దీంతో ప్రేమలత అకౌంట్లో తన ఫొటో ఉండగా బ్యాంకు అధికారుల ప్రమేయం లేనిదే నగలను ఎలా డ్రా చేశారంటూ ప్రశ్నించడంతో పాటు ఆవేదన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా ప్రేమలత బ్యాంకు అధికారులపై, సంతకం ఫోర్జరీ చేసినట్లు అనుమానిస్తున్న తన భర్త అశ్విన్‌కుమార్‌పై దేవరకొండ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన నగలను తనకు ఇప్పించాలని వేడుకుంటుంది. ఇప్పటికే భర్తకు దూరంగా ఉంటూ ఇద్దరు ఆడపిల్లలతో ఎలా బతకాలంటూ బోరున విలిపించింది. ఈ విషయమై దేవరకొండ కో ఆపరేటివ్ బ్యాంకు మేనేజరు రవిని వివరణ కోరగా ఆమె అకౌంట్ నుంచి బంగారు ఆభరణాలు డ్రా చేసిన విషయం వాస్తవమేనని, అయితే లావాదేవీలు అధికంగా ఉన్నందున ఎవరు డ్రా చేశారనే విషయంపై విచారణ చేపడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెకు అన్యాయం జరగదని పేర్కొన్నారు. ఇదే విషయమై ఎస్ఐ శేఖర్‌ను వివరణ కోరగా కేసు విషయమై పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
గుర్తు.. గుబులు
దేవరకొండ నియోజకవర్గంలో కామన్ ‘కొడవలి’ తెచ్చిన తంటా ఇద్దరు అభ్యర్థుల పేర్లు మొదటి అక్షరం ‘ఆర్’ దేవరకొండ, న్యూస్‌లైన్,దేవరకొండలో సీపీఐ పార్టీకి గుర్తు గుబులు పట్టుకుంది. సీపీఎం పార్టీకి సుత్తి కొడవలి, సీపీఐ పార్టీకి కంకి కొడవలి గుర్తు కాగా కామన్ కొడవలి వారిని బెంబేలెత్తిస్తోంది. ఈ గుర్తులు చూడ్డానికి ఒకే రకంగా ఉండడం, రెండింటిలోనూ కొడవలి కామన్‌గా ఉండడంతో చాలా మంది తికమకకు గురవుతుంటారు. ఇదిలా ఉంటే ఇక్కడ ఎక్కువగా సీపీఎం పోటీ చేయలేదు. ఈ సారి సీపీఐ తరఫున మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్, సీపీఎం తరఫున రవినాయక్‌లు పోటీ చేస్తుండడంతో ఈ తంటా వచ్చిపడింది. దీనికి తోడు ఇద్దరి పేర్లు ‘ఆర్’ అనే అక్షరంతోనే మొదలు కావడంతో ఈ రెండు గుర్తులు కూడా ఈవీఎం మిషన్‌లో దగ్గరి దగ్గరిగా ఉన్నా యి. దీంతో వృద్ధులు, గుర్తుల పట్ల అవగాహన లేని వారు తికమకకు పడడం వల్ల ఓట్లు తారుమారయ్యే అవకాశముం దని విశ్లేషకులు భావిస్తున్నారు. దేవరకొండలో ఇప్పటి వరకు ఐదుసార్లు గెలుపొందిన సీపీఐ ఆరోసారి ఈ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి ప్రయత్నిస్తుం డగా ఆ ప్రయత్నానికి గండి కొట్టేందుకే సీపీఎం కావాలని అభ్యర్థిని బరిలో ఉం చిందని మాజీ ఎమ్మెల్యే, సీపీఐ అభ్యర్థి రవీంద్రకుమార్ ఆరోపిస్తున్నారు. గుర్తుల పట్ల అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తూ ఆయన ప్రతి సమావేశంలోనూ తనను గెలిపించడానికి కంకి కొడవలి గుర్తుపై ఓటు వేయాలని, గుత్తా సుఖేందర్‌రెడ్డి చేయి గుర్తుకు ఓటు వేయాలని స్పష్టం చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. దీనికి తోడు ప్రతి సమావేశంలోనూ సీపీఎం కుట్ర పన్నిందని ఆరోపిస్తున్నారు. నియోజకవర్గంలో అతి తక్కువ ఓట్లున్న సీపీఎం నామినేషన్ వేయడం వెనుక వేరే ఉద్దేశం ఉందని, ఓటర్లను తికమక పెట్టేందుకే ‘ఆర్’ అనే అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తిని బరిలో ఉంచారని ఆరోపిస్తున్నారు. సీపీఎం కూడా పట్టణంలో విసృ్తత ప్రచారం నిర్వహిస్తోంది. రవీంద్రకుమార్ ఆరోపిస్తున్నట్లు సీపీఐ ఓట్లకు గండి కొట్టడానికి సీపీఎం చేస్తున్న ప్రయత్నాలు ఏమేరకు ప్రభావం చూపుతాయో అనేది ఎన్నికల తర్వాత గాని తెలియదు. -
ఇక.. మాటల్లేవ్! తొలివిడతకు సన్నద్ధం
ముగిసిన ప్రాదేశిక ప్రచారం నల్లగొండ, న్యూస్‌లైన్,ప్రాదేశిక ఎన్నికల తొలి విడత ప్రచారానికి శుక్రవారంతో తెరపడింది. ఇక.. ఓటర్లను ప్రభావితం చేసేందుకు అభ్యర్థులు, వివిధ పార్టీల నాయకులు పడరాని పాట్లు పడుతున్నారు. సార్వత్రిక సమరానికి ముందు జరుగుతున్న ఈ ఎన్నికలను అన్ని పార్టీలూప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.అత్యధిక స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు నాయకులు తీవ్రంగా పోటీ పడుతున్నారు. గ్రామాల్లో ఓటర్లను ఆకర్షించేందుకు భారీగా డబ్బు, మద్యం పంపిణీ చేస్తున్నారు. సూర్యాపేట, మిర్యాల గూడ, దేవరకొండ డివిజన్ల పరిధిలో ఎన్నికలు జరుగుతుండడంతో మాజీ మంత్రులు కె.జానారెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డిలకు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారాయి. అదే విధంగా ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి మిర్యాలగూడ, నాగార్జున సాగర్, దేవరకొండ నియోజకవర్గాల్లో పార్టీ గెలుపునకు సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఇక సీపీఎం శాసనసభ పక్ష నేత జూలకంటి రంగారెడ్డి, మునుగోడు ఎమ్మెల్యే ఉజ్జిని యాదగిరావు తమ పార్టీ అభ్యర్థులను గెలిపిం చాలని ఓటర్లను ప్రాధేయపడుతున్నారు. ఈ మూడు డివిజన్లలో కాంగ్రెస్ ఒంటిరిగానే పోటీచేస్తుండగా, టీడీపీ, వైఎస్సార్ కాంగ్రెస్, టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలు అవగాహన మేరకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. తొలిసారిగా ప్రాదేశిక బరిలో దిగిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోదాడ, హుజూర్నగర్, సూర్యాపేట నియోజకవర్గాల్లో అత్యధిక స్థానాలను సాధించే దిశగా ఇప్పటికే పల్లెలో విస్తృతంగా ప్రచారం నిర్వహించింది. ఈ నియోజక వర్గాల్లో అధికార కాంగ్రెస్‌కు వైఎస్సార్ కాంగ్రెస్ గట్టి పోటీ ఇవ్వబోతుంది. 33 మండలాల్లో ఎన్నికలు... మూడు డివిజన్లలో 33 మండలాల పరిధిలో ఎంపీటీసీ 473, జెడ్పీటీసీ 33 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో ఎంపీటీసీ 14 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 459 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం ఎన్నికలు జరగనున్నాయి. తొలి విడత పోరులో మొత్తం 11,94,433 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. వీరిలో పురుషులు 5,96,704, మహిళలు 5,97,729 మంది ఉన్నారు. ఎంపీటీసీ 459 స్థానాలకు 1,699 మంది అభ్యర్థులు, జెడ్పీటీసీ 33 స్థానాలకు 213 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.. ఈ ఎన్నికల నిర్వహణకు మొత్తం 3,292 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. 908 ప్రాంతాల్లో 1554 పోలింగ్స్టేషన్లను ఏర్పాటు చేశారు. జెడ్పీటీసీకి గులాబీ, ఎంపీటీసీ సభ్యులకు తెల్ల రంగు బ్యాలెట్ పత్రాలను వినియోగిస్తారు. మూడు డివిజన్లను 164 జోన్లుగా విభజించి 164 రూట్లను గుర్తించారు. ఎన్నికల విధుల్లో 7,770 మంది సిబ్బంది పాల్గొననున్నారు. మైక్రో అబ్జర్వర్స్ -175, వీడియోగ్రాఫర్స్-317, వెబ్ కాస్టింగ్ సిబ్బంది-52 మందిని నియమించారు. సమస్యాత్మక గ్రామాల్లో ప్రత్యేక నిఘా.. మూడు డివిజన్లలో 381 గ్రామాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించారు. అతి సున్నితమైన గ్రామాలు 383 ఉన్నట్లు పోలీస్ శాఖ గుర్తించింది. మావోయిస్టుల ప్రభావితం ఉండే గ్రామాలు 61గా గుర్తించారు. వీటిలో 52 గ్రామాల్లో వెబ్ కాస్టింగ్ ద్వారా ఎన్నికల సరళిని వీక్షించనున్నారు. మరో 317 గ్రామాల్లో ఎన్నికల ప్రక్రియను వీడియో ద్వారా చిత్రీకరిస్తారు. సమస్యాత్మక గ్రామాల్లో ఎన్నికలను సజావుగా పూర్తిచేసేందుకు ప్రత్యేకంగా 175 మంది సూక్ష్మ పరిశీలకులను నియమించారు. -
ఉద్యానవనంలో గంజాయి మొక్క
దేవరకొండ, న్యూస్‌లైన్: అతనొక ఉద్యానవన శాఖ అధికారి.. పచ్చగా ఉంచాల్సిన ఉద్యానవన శాఖలో అతనే గంజాయి మొక్కయ్యాడు. పచ్చని చెట్లకు అవినీతి పందిరి అల్లుతూ లంచం పేరుతో రైతులను పీడించాడు. పైస పైసకు కక్కుర్తి పడి రైతులను వేధించడంతో కడుపు మండిన రైతులే పక్కాగా ప్లాన్ వేసి ఏసీబీ అధికారులకు పట్టించారు. పథకం ప్రకారం వల వేయడంతో దేవరకొండ మండలం తూర్పుపల్లి గ్రామానికి చెందిన రైతు నేనావత్ గోపాల్ నుంచి రూ.20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారుల వలలో గురువారం చిక్కుకున్నాడు ఆ అధికారి. తిరిగి..తిరిగి.. ఏసీబీకి ఫిర్యాదు పందిరి నిర్మాణానికి ఉద్యానవన శాఖ లక్షా 20వేల రూపాయల రుణం ఇస్తుంది. ఇందులో 50శాతం సబ్సిడీ ఉంటుంది. ఈ రుణం పొందేందుకు నేనావత్ గోపాల్ నాలుగు నెలల క్రితం ఉద్యానవన శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. పందిరి కూడా నిర్మించుకున్నాడు. అయితే, పందిరి నిర్మాణం అనంతరం దానిని ఉద్యానవన శాఖ అధికారి ధ్రువీకరించాల్సి ఉంది. అయితే ఈ పని చేయడానికి అధికారి భాస్కర్ రైతు గోపాల్ తరచూ తిప్పించుకుంటున్నాడు. ఈ క్రమంలోనే తనకు రూ.30వేలు ఇవ్వాలని రైతును డిమాండ్ చేశాడు. చివరకు రూ.20వేలకు బేరం కుదుర్చుకున్నాడు. అయినా, పని చేయకుండా కొన్ని రోజుల నుంచి రోజూ కార్యాలయానికి తిప్పించుకుంటున్నాడు. దీంతో విసిగిపోయిన రైతు గోపాల్ ఈ నెల 3వ తేదీన అధికారి భాస్కర్‌పై ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఏసీబీ అధికారులు వలపన్ని గురువారం గోపాల్ నుంచి భాస్కర్ రూ. 20వేలు తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతని నుంచి రూ.20వేలు స్వాధీనం చేసుకున్నారు. సంఘటనపై పంచనామా నిర్వహించారు. ఈ దాడిలో నల్గొండ ఏసీబీ డీఎస్పీ ప్రభాకర్, నల్గొండ ఇన్స్పెక్టర్ ముత్తు లింగయ్య, రంగారెడ్డి ఇన్స్పెక్టర్ రాజు, మహబూబ్‌నగర్ ఇన్స్పెక్టర్ తిరుపతిరాజు తదితరులు పాల్గొన్నారు. భాస్కర్ అవినీతి చిట్టా... దేవరకొండ సబ్ డివిజన్ పరిధిలో ఉద్యానవన శాఖ అధికారి భాస్కర్ రైతులనుంచి ముక్కుపిండి లంచాలు వసూలు చేశాడనే ఆరోపణలున్నాయి. ఇప్పుడు భాస్కర్ ఏసీబీకి పట్టుబడడంతో పలువురు రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రైతులకు అందుబాటులో ఉండకుండా ప్రతిదానికీ లంచాలు అడుగుతూ రైతులను చెప్పులరిగేలా తిప్పించుకుంటున్నాడన్న ఆరోపణలున్నాయి. పీఏపల్లి మండలం ఎల్లాపురంలో ఓ రైతు దగ్గర లంచం అడగడంతో ఆ రైతు రెండు సంవత్సరాల క్రితమే ఏసీబీని ఆశ్రయించాడు. లంచం అడుగుతున్న విషయాన్ని ముందస్తుగా రికార్డింగ్ చేస్తున్నట్టు సమాచారం లీకవడంతో భాస్కర్ అప్పట్లో తప్పించుకున్నాడు. దేవరకొండ మండలం గుమ్మడవల్లి గ్రామపంచాయతీ పరిధిలో దొండతీగకు రుణం మంజూరు చేయడానికి రూ.3వేలు లంచం పుచ్చుకున్నట్లు ఓ రైతు ఆరోపించారు. రైతులను పీడించి లంచాలు వసూలు చేసే భాస్కర్‌కు, రాష్ట్ర వ్యవసాయ సాంకేతిక సలహామండలి సభ్యుడు అబ్బనమోని శ్రీనుకు మధ్య వివాదం జరగడంతో కొన్ని రోజుల క్రితం అసిస్టెంట్ డెరైక్టర్ ఆఫ్ హార్టికల్చర్‌కు భాస్కర్‌పై ఫిర్యాదు కూడా చేశారు. కూరగాయల సాగు, బత్తాయి తోటల పెంపకం, ముదురు తోటల పునరుద్దరణ పథకంలో భాగంగా భాస్కర్ పీఏపల్లి మండలం పోల్కంపల్లి, మాధాపురం, కోనాపురం, ఊట్లపల్లి, దేవరకొండ మండలం గుమ్మడవల్లి గ్రామాల పరిధిలోని రైతుల వద్ద లక్షల రూపాయలను లంచం రూపంలో పొందినట్లు ఆరోపణలున్నాయి. వెనుకబడిన దేవరకొండ నియోజకవర్గంలో గిరిజన రైతులకు అందుబాటులో ఉండకుండా రైతులను సతాయిస్తుండడంతో రైతులు దేవరకొండ ఎమ్మెల్యే నేనావత్ బాలునాయక్ దృష్టికి తీసుకవెళ్లారు.. ఇటీవల ఎమ్మెల్యే భాస్కర్‌ను పిలిపించి తీవ్రంగా మందలించి ఉన్నతాధికారులకు కూడా ఫిర్యాదు చేశారు. సాధారణంగా 3సంవత్సరాలకు మించి ప్రభుత్వ ఉద్యోగులు దీర్ఘకాలికంగా ఒకేచోట ఉండకూడదని నిబంధనలున్నప్పటికీ ఉన్నతాధికారుల అండదండలతో 2008 సంవత్సరం నుంచి భాస్కర్ దేవరకొండలోనే పనిచేస్తున్నాడు. 2014జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ కార్యాలయం ఎదుట జాతీయ జెండాను ఆవిష్కరించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించాడు. ఈ విషయాన్ని మరునాడే ‘సాక్షి’ వెలుగులోకి తెచ్చింది. -
నష్టం ఎక్కువే..!
దేవరకొండ, న్యూస్‌లైన్: జిల్లా అధికారులు చెప్పిన దానికంటే నష్టం ఎక్కువే జరిగిందని, ఈ విషయం తమ పరిశీలనలో అర్థమైందని పంటనష్టాన్ని అంచనా వేసేం దుకు వచ్చిన కేంద్ర బృందం పేర్కొంది. మంగళవారం జిల్లాలో పర్యటించిన బృందం సభ్యులు ఎ.చంద్రశేఖర్, కె. శ్రీరామవర్మలు దేవరకొండలోని అతిథిగృహంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాము కేంద్రానికి పంట నష్టం అంచనా రిపోర్టును అందించిన 15 రోజుల్లోపు నిధులు మంజూరవుతాయని తెలిపారు. జిల్లాలో 108శాతం వర్షపాతం నమోదయిందని, వేలాది హెక్టార్లల్లో పంట నష్టం జరిగిందని వారు తెలి పారు. జిల్లా అధికారులు ఇప్పటికే తమకు పంటనష్టంపై ఒక రిపోర్టును సమర్పించారని, అందులో 2 లక్షల 17 వేల హెక్టార్ల నష్టం జరిగిందని పేర్కొన్నారని చెప్పారు. అయితే, తాము మిర్యాలగూడ,పెద్దవూర మండలాల్లో పర్యటించిన తర్వాత అధికారులు చెప్పిన దానికంటే నష్టం అధికంగా ఉందన్న విషయం అర్థమైందన్నారు. ఎకరానికి నష్టపరిహారం రూ.10వేలు ఇవ్వాలని స్థానిక ఎమ్మెల్యే బాలునాయక్ బృందం సభ్యులను కోరారు. దీనిపై బృందం సభ్యులు మాట్లాడుతూ నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారమే నష్టపరిహారం అందుతుందని, ఆ విషయం తమ పరిధిలోకి రాదని తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్యే బాలునాయక్, ఆర్డీఓ రవినాయక్, జెడ్పీ సీఈఓ వెంకట్రావు, జేడీఏ నర్సింహరావు, మిర్యాలగూడ ఆర్డీఓ శ్రీనివాస్‌రెడ్డి, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేష్‌రెడ్డి తదితరులున్నారు. -
కన్నీటి మజిలీ
కనిపించే దైవాలు అమ్మానాన్న. తల్లి నవమా సాలు మోసి ప్రాణం పోస్తే.. ఆలనాపాలనతో బంగారు భవిష్యత్‌కు దిశానిర్దేశం చేస్తాడు తండ్రి. కడుపులో ఉండగా తల్లిని.. ఆడుకుంటూ తండ్రి గుండెలపై కాళ్లతో తన్నినా తరగని ప్రేమ చూపడం వారికే చెల్లు. తడబడే అడుగులను సరిచేస్తూ.. చిన్న గాయమైనా ఆ బాధ తమదిగా భావించే తల్లిదండ్రుల రుణం ఏమిచ్చి తీర్చుకోగలం. లింగ భేదం లేకుండా.. వైకల్యంపై వివక్ష చూపకుండా కంటికి రెప్పలా చూసుకునే ఆ దేవుళ్లు పిల్లల దృష్టిలో ఉత్సవ విగ్రహాలవుతున్నారు. పెరిగి పెద్దయ్యాక.. జీవితంలో స్థిరప డ్డాక.. వారికంటూ ఓ కుటుంబం ఏర్పడ్డాక.. తల్లిదండ్రులు కానివారవుతున్నారు. ఈ కోవలోనే ఓ వృద్ధ జంట రోడ్డు పాలైంది. దేవనకొండ, న్యూస్‌లైన్: చేతిలో చిల్లిగవ్వ లేదు.. తినేందుకు తిండి లేదు.. కట్టుకునేందుకు గుడ్డ లేదు. ఉన్నదంతా.. పిల్లల కోసం కరిగించిన కండలు.. రెక్కలు ముక్కలు చేసుకోగా చుట్టుముట్టిన వ్యాధులే. ఇదీ కల్లూరు మండలం పర్ల గ్రామానికి చెందిన మంగలి వెంకటన్న(75), లక్ష్మమ్మ(65) దంపతుల దీనగాథ. భిక్షాటనతో ప్రస్తుతం దేవనకొండ చేరుకున్న వీరిని ‘న్యూస్‌లైన్’ పలకరించగా కన్నీటి గాథను ఏకరువు పెట్టారు. పర్లలో కుల వృత్తి చేసుకుని జీవనం సాగించే ఈ దంపతులకు ఐదుగురు సంతానం. నలుగురు ఆడ పిల్లలు కాగా.. ఒక్క కుమారుడు ఉన్నారు. తమను కంటికి రెప్పలా చూసుకుంటాడనే ఉద్దేశంతో ఆడ పిల్లలను కాదని.. కొడుకు పరమేష్‌ను మాత్రమే పాఠశాలకు పంపారు. డిగ్రీ వరకు చదివించారు. ఆ తర్వాత కల్లూరు మండల పరిధిలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన పద్మావతితో వివాహం జరిపించారు. ఇదే సమయంలో నలుగురు కూతుళ్లకూ పెళ్లిళ్లు చేశారు. ప్రస్తుతం ముగ్గురు కూతుళ్లు కర్నూలు నగరంలోని షరీఫ్‌నగర్‌లో, మరో కూతురు ముజఫర్‌నగర్‌లో నివసిస్తున్నారు. ఇంతవరకు ఆ కుటుంబం సాఫీగానే సాగింది. బాధ్యతలన్నీ నెరవేర్చిన ఆ దంపతులను ఆ తర్వాతే కష్టాలు చుట్టుముట్టాయి. కుమారుడికి అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని బొమ్మనహాల్‌లో ఉన్న ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం లభించింది. ఇక తనకు తల్లిదండ్రులతో పని లేదన్నట్లుగా భార్యతో కలిసి ఆ ప్రాంతానికి మకాం మార్చాడు. కొంత కాలం కుల వృత్తితోనే జీవనం సాగించిన వెంకటన్న, లక్ష్మమ్మలకు వయస్సు మీద పడే కొద్దీ పూట గడవటం కష్టమైంది. పూలమ్మిన చోటే కట్టెలమ్మడం ఇష్టం లేక ఇరువురూ దాదాపు 16 సంవత్సరాల క్రితం ఊరొదిలారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో తిరుగుతూ మనసొప్పకపోయినా పొట్ట నిం పుకునేందుకు చేయి చాచారు. ఈ కోవలోనే పత్తికొండలో ఉండగా నాలుగు నెలల క్రితం వెంకటన్న కిందపడటంతో తుంటి భాగంలో ఎముక విరిగింది. అప్పటి నుంచి భర్తను లక్ష్మమ్మ కంటికి రెప్పలా కాపాడుకుంటోంది. ఆసుపత్రిలో చూపించేందుకు అష్టకష్టాలు పడుతోంది. రెండు నెలల క్రితం దేవనకొండకు చేరుకున్న ఈ దంపతులకు స్థానిక బస్టాండ్ ఆశ్రయిమిస్తోంది. అటువైపుగా వెళ్లే స్థానికులు వీరి దీనస్థితికి కరిగిపోయి తోచిన సహాయం చేస్తూ అండగా నిలుస్తున్నారు. అదే ప్రాంతంలోని హోటల్ నిర్వాహకుడు కాశీం రోజూ తిండి పెట్టి మానవత్వం చాటుకుంటున్నాడు. విషయం తెలిసిన వీరి స్వగ్రామంలోని పెద్దలు కుమారుడితో సంప్రదించే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. తన కుటుంబం గడవటమే కష్టమైన పరిస్థితుల్లో తల్లిదండ్రుల పోషణభారం భుజానికెత్తుకునేందుకు ససేమిరా అనడంతో వారు కూడా తమ ప్రయత్నాలను విరమించుకున్నారు. చివరి మజిలీలోని ఈ దంపతులు ఒకరికొకరు తోడుగా జీవితాన్ని భారంగా వెల్లదీస్తున్నారు. పున్నామ నరకాన్ని తప్పించే కొడుకు పుట్టాడని వీరు ఆ సమయంలో ఎంతో సంతోషించినా.. ప్రస్తుతం కాటికి వెళ్లక ముందే ప్రత్యక్ష నరకాన్ని చేరువ చేసిన ఆ తనయుడు గుర్తుకొచ్చినప్పుడల్లా వీరి కళ్లలో కన్నీళ్లు నిండుకుంటున్నాయి. -
దేవరకొండలో హై అలర్ట్
దేవరకొండ, న్యూస్‌లైన్: దేవరకొండలో ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు పట్టణంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉదయం నుంచి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఘర్షణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఓ వర్గం వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసులను దేవరకొండకు రప్పించారు. ఏపీఎస్పీ పోలీసులను కూడా రంగంలోకి దించారు. సుమారు 400 మంది పోలీసులు పట్టణంలో విధులు నిర్వహించారు. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ముందస్తుగా పోలీసులు పట్ణణంలో 144సెక్షన్ విధించారు. ఎటువంటి ఆవేశపూరిత చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రభాకర్‌రావు మైక్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ఘటనకు కారకులైన వారిని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టమని చెప్పడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దేవరకొండలో రాత్రి వరకు పోలీసు పహారా కొనసాగింది. పరిస్థితి అదుపులోనే ఉంది : హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో దేవరకొండలో పరిస్థితి అదుపులోనే ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించినట్లు తెలిపారు. బందోబస్తులో భాగంగా 280 మంది పోలీసులు, 20మంది ఎస్ఐలు, 12 మంది సీఐలు, ఇద్దరు డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే మరికొంత మంది బలగాలను కూడా రప్పిస్తామన్నారు. బాధితులకు తప్పిన ముప్పు.. ఘర్షణలో గాయపడిన బాధితులకు ప్రాణాపాయం తప్పింది. దేవరకొండ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లిన నక్క వెంకటేష్‌యాదవ్, అశోక్‌ల పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. అయితే వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్లు బాధితుల బంధువులు పేర్కొన్నారు. అందరూ కలిసిమెలసి ఉండాలి : గుత్తా నల్లగొండ : రాగద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలసి ఉండాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకొండలో చోటుచేసుకున్న స్వల్ప ఘటనలు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. అన్ని వర్గాలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్న తరుణంలో కొన్ని అరాచక శక్తులు చేసిన ఆగడాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మందడి మధుసూదన్‌రెడ్డి, శేషనాల రఘువీర్ పాల్గొన్నారు.