దేవరకొండ, న్యూస్‌లైన్: దేవరకొండలో ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు పట్టణంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు.
ఉదయం నుంచి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఘర్షణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఓ వర్గం వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసులను దేవరకొండకు రప్పించారు. ఏపీఎస్పీ పోలీసులను కూడా రంగంలోకి దించారు. సుమారు 400 మంది పోలీసులు పట్టణంలో విధులు నిర్వహించారు. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ముందస్తుగా పోలీసులు పట్ణణంలో 144సెక్షన్ విధించారు. ఎటువంటి ఆవేశపూరిత చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రభాకర్‌రావు మైక్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ఘటనకు కారకులైన వారిని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టమని చెప్పడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దేవరకొండలో రాత్రి వరకు పోలీసు పహారా కొనసాగింది.
పరిస్థితి అదుపులోనే ఉంది : హైదరాబాద్ రేంజ్ డీఐజీ
ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో దేవరకొండలో పరిస్థితి అదుపులోనే ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించినట్లు తెలిపారు. బందోబస్తులో భాగంగా 280 మంది పోలీసులు, 20మంది ఎస్‌ఐలు, 12 మంది సీఐలు, ఇద్దరు డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే మరికొంత మంది బలగాలను కూడా రప్పిస్తామన్నారు.
బాధితులకు తప్పిన ముప్పు..
ఘర్షణలో గాయపడిన బాధితులకు ప్రాణాపాయం తప్పింది. దేవరకొండ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లిన నక్క వెంకటేష్‌యాదవ్, అశోక్‌ల పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. అయితే వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్లు బాధితుల బంధువులు పేర్కొన్నారు.
అందరూ కలిసిమెలసి ఉండాలి : గుత్తా
నల్లగొండ : రాగద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలసి ఉండాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకొండలో చోటుచేసుకున్న స్వల్ప ఘటనలు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. అన్ని వర్గాలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్న తరుణంలో కొన్ని అరాచక శక్తులు చేసిన ఆగడాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మందడి మధుసూదన్‌రెడ్డి, శేషనాల రఘువీర్ పాల్గొన్నారు.
దేవరకొండలో హై అలర్ట్
Published Thu, Oct 17 2013 4:57 AM | Last Updated on Fri, Sep 1 2017 11:41 PM
Advertisement