Naveen chand
-
తెలంగాణలో ఏడుగురు ఐపీఎస్ అధికారుల బదిలీ
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఏడుగురు ఐపీఎస్ అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. బదిలీ అయిన అధికారులు వివరాలు: ఇంటెలిజెన్స్ ఐజీగా నవీన్ చంద్ సైబరాబాద్ కమిషనర్‌గా సందీప్ శాండిల్యా వరంగల్ డీఐజీగా రవివర్మ ఐజీ పర్సనల్ గా బి.శివధర్ రెడ్డి ఇంటెలిజెన్స్ డీఐజీగా టి.ప్రభాకర్ రావు సీఐడీ డీఐజీగా ఎన్.శివశంకర్ రెడ్డి రాచకొండ కమిషనరేట్ ట్రాఫిక్ డీసీపీగా కె.రమేశ్ నాయుడు -
సింధియా హంతకుడిని పట్టించిన వారికి అభినందన
-రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహకం శంషాబాద్ రూరల్ భార్య మృతదేహాన్ని కాల్చి వేసి కారులో పరారవుతుండగా సమయస్పూర్తితో వ్యహరించి నిందితుడుని పోలీసులకు పట్టించిన మదన్‌పల్లి యువకులను సైబరాబాద్ వెస్ట్ కమిషనర్ ఎన్.నవీన్‌చంద్ ఆదివారం అభినందించారు. ముగ్గురు యువకులకు రూ.5వేల చొప్పున నగదు ప్రోత్సాహం అందించారు. గచ్చిబౌలిలో నివాసముండే రూపేశ్‌కుమార్ ఈ నెల 4న తన భార్య సింథియాను హత్య చేయడమే కాకుండా ముక్కలుగా నరికి బ్యాగులో పెట్టి కారులో మండలంలోని మదన్‌పల్లి వచ్చాడు. రాత్రి పూట ఊరికి దూరంగా ఉన్న నిర్మానుష్య ప్రదేశంలో ఆమె మృతదేహాన్ని పెట్రోలుతో కాల్చి వేసి కారులో పరారు అవుతుండగా బురదలో ఇరుక్కుపోయాడు. స్థానిక యువకులు కుమ్మరి వెంకటేష్, ఎన్.లాల్‌సింగ్‌నాయక్, కట్ట రాంచందర్ అక్కడకు వెళ్లి పరిస్థితిని గమనించి శంషాబాద్ పోలీసులకు సమాచారం అందించడంతో నిందితుడు పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో పూర్తి ఆధారాలతో నిందితుడు పట్టుబడడానికి కారణమైన ముగ్గురు యువకులకు కమిషనరేట్ కార్యాలయంలో ప్రత్యేకంగా కలిసిన కమిషనర్ వారిని అభినందించారు. అంతేకాకుండా సమాచారం అందిన వెంటనే సకాలంలో స్పందించిన ఎస్ఐ భాస్కర్‌నాయక్‌ను కూడా కమిషనర్ అభినందించారు. నేరాల అదుపులో ప్రజల భాగస్వామ్యం ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయని ఈ సందర్భంగా కమిషనర్ అన్నారు. ఈ కార్యక్రమంలో శంషాబాద్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ ఉన్నారు. -
నృసింహుని సన్నిధిలో తెలంగాణ ఐజీ
మంగళగిరి: మంగళగిరిలో వేంచేసియున్న శ్రీ దేవి, భూదేవి సమేత శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి వారిని తెలంగాణా ఐజీ నవీన్ చంద్ కుటుంబ సభ్యులతో కలసి ఆదివారం దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తొలుత ఐజీ కుటుంబ సభ్యులకు అర్చక స్వాములు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం వారు ఎగువ, దిగువసన్నిధిల్లోని స్వామి వార్లను, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పట్టణ సీఐ రావూరి సురేష్‌బాబు మర్యాదపూర్వకంగా ఐజీ కుటుంబ సభ్యులను కలిశారు. -
నిర్వాసితులపై దౌర్జన్యమా..?
పులిచింతలప్రాజెక్ట్(హుజూర్నగర్), న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన ముంపు బాధితులను పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి మరీ అడ్డుకున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్‌ను శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైన నాటినుంచే పులిచింతల బాధితులు తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందజేశాకే ప్రారంభించాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారన్న సాకుతో ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్ద నుంచి మేళ్లచెరువు మండలం వైపు అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు పెట్టారు. బాధితులతోపాటు జెన్కో ఉద్యోగులు, ఇతరులు వెళ్లకుండా కట్టడి చేశారు. కనీసం మీడియా వారిని కూడా అనుమతించలేదు. దీంతో కవరేజికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారు పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రాజెక్ట్ మెయిన్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గుర్తింపుకార్డులను పరిశీలించి విలేకరులను మాత్రమే అనుమతించారు. పులిచింతల బాధితులను మాత్రం ఒక్కరినీ కూడా అనుమతించలేదు. పోలీసుల ఆధీనంలో ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రధాన ద్వారం నుంచి కుడివైపు ప్రారంభానికి సిద్ధం చేసిన పైలాన్ వరకు భారీగా పోలీసులను మోహరించారు. ప్రాజెక్ట్‌పై అధికారులు, పోలీసులు తప్ప మరెవరూ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పులిచింతల బాధితులను అనుమతిస్తే పర్యటనలో గందరగోళం జరుగుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి నుంచే ప్రాజెక్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేగాక ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుగా 11 గంటల సమయం నిర్ణయించగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 1.07 గంటలకు పైలాన్ వద్దకు చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 1.10 గంటలకు పైలాన్‌ను ప్రారంభించారు. అయితే మేళ్లచెరువు మండలానికి చెందిన పులిచింతల బాధితులను కట్టడి చేసేందుకు భారీగా పోలీసులను మోహరించడంతోపాటు డీఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావులు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి 20 నిముషాల్లో తన పర్యటన పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. ఎలాంటి గందరగోళం లేకుండా సాఫీగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి వరకు ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్దకు చేరుకున్న కొందరు పులిచింతల బాధితులు తమకు నష్టపరిహారం అందజేయకుండానే నిర్మాణం పూర్తిగాని ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు పోలీసులతో తమను ఆపివేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే.. ఈ ప్రమాదం
వనపర్తి, న్యూస్‌లైన్: బస్సు ప్రమాదానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమని ప్రాథమికంగా నిర్ధారణ అయినట్టు డీఐజీ నవీన్‌చంద్ వెల్లడించారు. ఘటనా స్థలాన్ని బుధవారం ఆయన పరిశీలించారు. ప్రమాదంలో 45 మంది దుర్మరణం పాలవగా ఐదుగురు ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ప్రాణాలతో బయటపడ్డారని తెలిపారు. బెంగళూరు నుంచి హైదరాబాద్‌కు బయలుదేరిన జబ్బార్ ట్రావెల్స్‌కు చెందిన ప్రైవేట్ బస్సు కొత్తకోట దాటగానే పాలెం సాయి దాబా వద్ద రోడ్డు పక్కనున్న కల్వర్టును ఢీకొట్టింది. దాంతో బస్సు డీజిల్ ట్యాంక్ పగిలిపోయి మంటలు చెలరేగాయి. అవి క్షణాల్లో వ్యాపించడంతో ప్రయాణికులు నిస్సహాయంగా సజీవ దహనమయ్యారు’’ అని వివరించారు. ‘‘దీన్ని సీరియస్‌గా తీసుకుంటున్నాం. ఇంతటి ప్రాణనష్టానికి కారణమైన డ్రైవర్‌పై కఠిన చర్యలు తీసుకుంటాం. అతన్ని అదుపులోకి తీసుకుని మరిన్ని వివరాలు రాబడతాం. ఘటనపై ఐపీసీ 337, 338, 309, 109 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా పూర్తిగా కాలిపోయాయన్నారు. ముగ్గురి శవాలను మాత్రం వారి బంధువులు గుర్తించడంతో పోస్టుమార్టం అనంతరం వారికప్పగించామని తెలిపారు. బస్సుకు దివాకర్ రోడ్‌లైన్స్ పేర అనుమతి ఉందని, నిబంధనలు అతిక్రమించినట్టు తేలితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బెంగళూరు నుంచి బయల్దేరినప్పుడు బస్సులో 37 మంది పేర్లు మాత్రమే నమోదై ఉన్నాయని, మధ్యలో అక్కడక్కడ ఎక్కిన వారి వివరాలు తెలియరాలేదని అన్నారు. మృతుల కుటుంబీకులు తమవారి వివరాల కోసం జిల్లా ఎస్పీ, ఓఎస్డీలను సంప్రదించాలని సూచించారు. ఏ మాంసపు ముద్ద ఎవరిదో? ప్రమాదం గురించి తెలిసి హుటాహుటిన తరలివచ్చిన మృతుల బంధువుల రోదనలతో ఘటనా స్థలి శోకసంద్రమైంది. గుర్తించలేనంతగా కాలిపోయిన శవాల ముద్దలను చూసి వారంతా గుండెలవిసేలా రోదించారు. ప్రయాణికుల బంధువుల్లో పలువురు హైదరాబాద్ లక్డీకపూల్ చౌరస్తాలోని జబ్బార్ ట్రావెల్స్ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ సరైన సమాచారం లభించక తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విషయం అర్థమైన వారు ట్రావెల్స్ ముందే కుప్పకూలారు. వారి రోదనలు, పెడబొబ్బలతో ఆ ప్రాంతమంతా హృదయవిదారకంగా మారింది. -
దేవరకొండలో హై అలర్ట్
దేవరకొండ, న్యూస్‌లైన్: దేవరకొండలో ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో పోలీస్‌శాఖ అప్రమత్తమైంది. పట్టణంలో భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. మంగళవారం రాత్రి నుంచి జిల్లా ఎస్పీ ప్రభాకర్‌రావు పట్టణంలోనే ఉండి పరిస్థితిని సమీక్షించారు. బుధవారం హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ ఘటన స్థలాన్ని పరిశీలించారు. ఉదయం నుంచి పట్టణంలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఘర్షణకు కారకులైన వారిని కఠినంగా శిక్షించాలని ఓ వర్గం వారు ఆందోళనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అయితే పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చేందుకు జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పోలీసులను దేవరకొండకు రప్పించారు. ఏపీఎస్పీ పోలీసులను కూడా రంగంలోకి దించారు. సుమారు 400 మంది పోలీసులు పట్టణంలో విధులు నిర్వహించారు. అడుగడుగునా నిఘా ఏర్పాటు చేశారు. ముందస్తుగా పోలీసులు పట్ణణంలో 144సెక్షన్ విధించారు. ఎటువంటి ఆవేశపూరిత చర్యలకు పాల్పడినా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ప్రభాకర్‌రావు మైక్‌లో హెచ్చరికలు జారీ చేశారు. ఘటనకు కారకులైన వారిని ఎట్టిపరిస్థితిలోనూ విడిచిపెట్టమని చెప్పడంతో పరిస్థితి కొంత అదుపులోకి వచ్చింది. దేవరకొండలో రాత్రి వరకు పోలీసు పహారా కొనసాగింది. పరిస్థితి అదుపులోనే ఉంది : హైదరాబాద్ రేంజ్ డీఐజీ ఇరువర్గాల ఘర్షణ నేపథ్యంలో దేవరకొండలో పరిస్థితి అదుపులోనే ఉందని హైదరాబాద్ రేంజ్ డీఐజీ నవీన్‌చంద్ చెప్పారు. అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల నుంచి పోలీసు బలగాలను రప్పించినట్లు తెలిపారు. బందోబస్తులో భాగంగా 280 మంది పోలీసులు, 20మంది ఎస్ఐలు, 12 మంది సీఐలు, ఇద్దరు డీఎస్పీలు విధులు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే మరికొంత మంది బలగాలను కూడా రప్పిస్తామన్నారు. బాధితులకు తప్పిన ముప్పు.. ఘర్షణలో గాయపడిన బాధితులకు ప్రాణాపాయం తప్పింది. దేవరకొండ ఆస్పత్రి నుంచి హైదరాబాద్‌కు తీసుకువెళ్లిన నక్క వెంకటేష్‌యాదవ్, అశోక్‌ల పరిస్థితి బాగానే ఉందని తెలిసింది. అయితే వారికి ప్రమాదం ఏమీ లేదని వైద్యులు తెలిపినట్లు బాధితుల బంధువులు పేర్కొన్నారు. అందరూ కలిసిమెలసి ఉండాలి : గుత్తా నల్లగొండ : రాగద్వేషాలకు తావివ్వకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలసి ఉండాలని నల్లగొండ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి పిలుపునిచ్చారు. దేవరకొండలో చోటుచేసుకున్న స్వల్ప ఘటనలు దురదృష్టకరమని ఆయన వ్యాఖ్యానించారు. బుధవారం స్థానిక తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎంపీ మాట్లాడారు. అన్ని వర్గాలు అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉంటున్న తరుణంలో కొన్ని అరాచక శక్తులు చేసిన ఆగడాలను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, డీసీసీబీ డైరక్టర్ పాశం సంపత్‌రెడ్డి, మాజీ కౌన్సిలర్ మందడి మధుసూదన్‌రెడ్డి, శేషనాల రఘువీర్ పాల్గొన్నారు.