పులిచింతలప్రాజెక్ట్(హుజూర్‌నగర్), న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన ముంపు బాధితులను పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి మరీ అడ్డుకున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్‌ను శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైన నాటినుంచే పులిచింతల బాధితులు తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందజేశాకే ప్రారంభించాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారన్న సాకుతో ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్ద నుంచి మేళ్లచెరువు మండలం వైపు అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు పెట్టారు. బాధితులతోపాటు జెన్‌కో ఉద్యోగులు, ఇతరులు వెళ్లకుండా కట్టడి చేశారు. కనీసం మీడియా వారిని కూడా అనుమతించలేదు. దీంతో కవరేజికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారు పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రాజెక్ట్ మెయిన్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గుర్తింపుకార్డులను పరిశీలించి విలేకరులను మాత్రమే అనుమతించారు. పులిచింతల బాధితులను మాత్రం ఒక్కరినీ కూడా అనుమతించలేదు.
పోలీసుల ఆధీనంలో ప్రాజెక్టు
ప్రాజెక్ట్ ప్రధాన ద్వారం నుంచి కుడివైపు ప్రారంభానికి సిద్ధం చేసిన పైలాన్ వరకు భారీగా పోలీసులను మోహరించారు. ప్రాజెక్ట్‌పై అధికారులు, పోలీసులు తప్ప మరెవరూ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పులిచింతల బాధితులను అనుమతిస్తే పర్యటనలో గందరగోళం జరుగుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి నుంచే ప్రాజెక్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేగాక ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుగా 11 గంటల సమయం నిర్ణయించగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 1.07 గంటలకు పైలాన్ వద్దకు చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 1.10 గంటలకు పైలాన్‌ను ప్రారంభించారు.
అయితే మేళ్లచెరువు మండలానికి చెందిన పులిచింతల బాధితులను కట్టడి చేసేందుకు భారీగా పోలీసులను మోహరించడంతోపాటు డీఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావులు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి 20 నిముషాల్లో తన పర్యటన పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. ఎలాంటి గందరగోళం లేకుండా సాఫీగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి వరకు ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్దకు చేరుకున్న కొందరు పులిచింతల బాధితులు తమకు నష్టపరిహారం అందజేయకుండానే నిర్మాణం పూర్తిగాని ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు పోలీసులతో తమను ఆపివేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
నిర్వాసితులపై దౌర్జన్యమా..?
Published Sun, Dec 8 2013 3:01 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement