70 కోట్లడిగితే..115 కోట్లు ఇచ్చారు! | Pulichintala project contractor gain profit by kiran kumar reddy | Sakshi
Sakshi News home page

70 కోట్లడిగితే..115 కోట్లు ఇచ్చారు!

Published Thu, Feb 20 2014 2:56 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM

Pulichintala project contractor gain profit by kiran kumar reddy

దిగిపోతూ పులిచింతల కాంట్రాక్టర్‌కు ముఖ్యమంత్రి లబ్ధి  
 సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి దిగిపోతూ... పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్‌కు భారీ లబ్ధి చేకూర్చారు. సీఎం పదవికి రాజీనామా చేసే ముందు రోజు రాత్రి రూ. 115 కోట్ల అదనపు చెల్లింపులకు సంబంధించిన ఫైల్‌పై సంతకం చేశారు. రూ. 70 కోట్లకు మించి ఇవ్వకూడదన్న నిపుణుల కమిటీ నివేదికను పట్టించుకోకుండా ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
 
 అయితే, తమకు రూ. 125 కోట్ల అదనపు చెల్లింపు చేయాలని పులిచింతల ప్రాజెక్టు కాంట్రాక్టర్ ప్రభుత్వంపై కొంత కాలంగా ఒత్తిడి తీసుకువస్తున్నారు. పనులకు సంబంధించిన బిల్లుల చెల్లింపులో జాప్యం కారణంగా.. తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరిగాయని, అలాగే ప్రాజెక్టు నిర్మాణానికి అంచనా కంటే స్టీల్, సిమెంట్ వంటి వాటిని ఎక్కువగా ఉపయోగించినందున వ్యయం పెరిగిందని.. ఈ మేరకు రూ. 125 కోట్ల అదనపు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే.. దీనిపై ప్రభుత్వం సీనియర్ ఇంజనీర్లతో ఒక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది.
 
 ఆ కమిటీ పులిచింతల ప్రాజెక్టు నిర్మాణంలో సదరు కాంట్రాక్టర్ చేసిన వ్యయం, బ్యాంకుల నుంచి తెచ్చిన రుణాలు, వాటికి అయిన వడ్డీని క్షుణ్నంగా పరిశీలించి... సదరు కాంట్రాక్టర్‌కు రూ. 70 కోట్లకు మించి ఇవ్వడానికి వీలు లేదని నివేదిక ఇచ్చింది. కానీ, ముఖ్యమంత్రి మాత్రం అధికారుల నివేదికను పక్కనబెట్టి... రూ. 115 కోట్లను ఇవ్వడానికి వీలుగా నిర్ణయం తీసుకున్నారు. దాంతో ఆ నిధులను సదరు కాంట్రాక్టర్‌కు చెల్లించడానికి అధికారులు సిద్ధమయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement