నల్లగొండ: పురుగుల మందు తాగిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతిచెందాడు. ఈ ఘటన తిప్పర్తి మండలంలోని ఎల్లమ్మగూడెం గ్రామంలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎల్లమ్మగూడెం గ్రామానికి చెందిన నున్న వీరయ్య, సరిత దంపతుల కుమారుడు నున్న సాయిరాం(27) డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రితో పాటు వ్యవసాయ పనులు చేస్తున్నాడు.
శనివారం ఉదయం వీరయ్య గోదాంలో హమాలీ పనులకు, సరిత వ్యవసాయ పనులకు వెళ్లారు. మధ్యాహ్నం సమయంలో సాయిరాం ఇంట్లో గడ్డి మందు తాగాడు. స్థానికులు గమనించి నకిరేకల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం సాయంత్రం మృతిచెందాడు. కాగా సాయిరాం ఆత్మహత్యకు గల కారాణాలు తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులను వివరణ కోరగా తమకు ఎటువంటి ఫిర్యాదు రాలేదని పేర్కొన్నారు.
ముఖ్య గమనిక:
ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com
పులిచింతల ప్రాజెక్టులో యువకుడు గల్లంతు
మేళ్లచెరువు: పులిచింతల ప్రాజెక్టు దిగువన కృష్ణా పుష్కరఘాట్ వద్ద యువకుడు గల్లంతయ్యాడు. ఈ ఘటన ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. సూర్యాపేట జిల్లా మేళ్లచెరువు మండల కేంద్రానికి చెందిన యాంపంగు సందీప్(19) తన స్నేహితులు పాష, వెంకటేష్, నవీన్, సాయితో కలిసి కృష్ణా నదిలో ఈత కొట్టేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం మాదిపాడు గ్రామ పంచాయతీ పరిధిలోని జడపల్లి తండా సమీపంలోని పుష్కరఘాట్ వద్దకు వెళ్లారు. అందరూ కలిసి నదిలోకి దిగగా సందీప్ గల్లంతైనట్లు అతడి స్నేహితులు తెలిపారు. సమాచారం అందుకున్న అచ్చంపేట పోలీసులు అక్కడకు చేరుకొని కృష్ణా నదిలో వెతకడం ప్రారంభించారు. చీకటి పడడంతో గాలింపు చర్యలు ఆపినట్లు తెలిపారు.
చెరువులో పడి వ్యక్తి మృతి
కేతేపల్లి: చెరువులో చేపలు పట్టేందుకు వెళ్లిన వ్యక్తి ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందాడు. ఈ ఘటన కేతేపల్లి మండలంలోని గుడివాడ గ్రామంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ శ్రీకాంత్‌గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. గుడివాడ గ్రామానికి చెందిన చెవుగాని జానయ్య(52) వృత్తిరిత్యా వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. గ్రామ సమీపంలోని చెరువులో గాలంతో చేపలు పట్టేందుకు వెళ్లిన జానయ్య చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు జారి చెరువులో పడి మునిగి మృతిచెందాడు.
సాయంత్రం చెరువులో మృతదేహం తేలియాడుతుండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో చెరువు వద్దకు చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గుర్తించి బయటకు తీశారు. మృతుడి భార్య యల్లమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం తరలించి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment