
సాక్షి, చిత్తూరు: ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి కారణమని అన్నారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. నాడు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారని తీవ్ర విమర్శలు చేశారు.
కాగా, పెద్దిరెడ్డి శుక్రవారం పుంగనూరులో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రంలో అనేక కుటుంబాలు ఆర్థికంగా బలపడ్డాయి. విద్య, వైద్యం కోసం వేల కోట్లు రూపాయలు ఖర్చు చేసి సీఎం జగన్ ప్రజలకు అండగా నిలుస్తున్నారు. పేద కుటుంబాలు వైద్యం కోసం ఖర్చు చేసే పనిలేకుండా ముఖ్యమంత్రి జగన్ బాధ్యత తీసుకున్నారు. సీఎం జగన్‌ను మళ్లీ గెలిపించి మన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి.
ఒకే కుటుంబం ఇక్కడ 30 ఏళ్లు అధికారంలో ఉండి కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయలేదు. ఐదేళ్లలో నియోజకవర్గాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసి చూపించాం. త్వరలోనే ఇంటింటికీ నల్లా ద్వారా నీరు అందిస్తాం. మే 13న జరిగే ఎన్నికల్లో నన్ను, ఎంపీగా మిథున్ రెడ్డిని గెలిపించాలని కోరుతున్నాను. మీ ఓటును ఫ్యాన్ గుర్తుకు వేసి గెలిపించాలని కోరారు. వైఎస్సార్‌సీపీ విజయానికి మనమంతా కృషి చేయాలి.
ఇదే సమయంలో.. గతంలో ఇద్దరు కేంద్ర మంత్రులను ఓడించాం. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రిని ఓడిస్తాం. చిత్తు చిత్తుగా కిరణ్ కుమార్ రెడ్డిని ఓడిస్తాం. కిరణ్ కుమార్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సీఎం వైఎస్ జగన్‌ను వేధించారు. ప్రత్యేక హోదా రాకపోవడానికి, రాష్ట్ర విభజన జరగడానికి కిరణ్ కుమార్ రెడ్డి కారణం. కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఉండి ఇప్పుడు నిస్సిగ్గుగా బీజేపీలో చేరారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉండి మనకు నీరు కూడా రాకుండా అడ్డుకున్నారు. కిరణ్ కుమార్ నమ్మకద్రోహి’ అంటూ కామెంట్స్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment