రాజధాని ప్రాంతంలో వేదిక
సాక్షి, అమరావతి: ఎన్నికల్లో విజయం సాధించడంతో చంద్రబాబు నాలుగోసారి సీఎం పీఠం ఎక్కనున్నారు. ఈ నెల 9వ తేదీన ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. రాజధాని ప్రాంతంలోని ఉద్ధండరాయునిపాలెం సమీపంలో సభ ఏర్పాటుచేసి ప్రమాణస్వీకారోత్సవం నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. చంద్రబాబు బుధవారం ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీని, హోం మంత్రి అమిత్‌షాను కలిసిన తర్వాత ప్రమాణస్వీకారం, ఇతర అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
తన ప్రమాణస్వీకారానికి మోదీ, బీజేపీ పెద్దలు, ఎన్డీఏ ముఖ్యులను చంద్రబాబు ఆహ్వానిస్తారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఎన్డీఏ కూటమిగా ఎన్నికల్లో పోటీచేసి గెలవడంతో కూటమిగానే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్నారు. బాబు ప్రమాణస్వీకారోత్సవం సమయంలోనే జనసేన, బీజేపీలకు చెందిన ముఖ్యనేతలు ఒకరిద్దరిని మంత్రులుగా ప్రమాణం చేయించనున్నట్లు తెలిసింది. మలివిడతలో మరికొందరికి అవకాశం ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు కేంద్ర మంత్రివర్గంలో టీడీపీ, జనసేన చేరే అవకాశం ఉందని చెబుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్‌గా చంద్రబాబును నియమించేందుకు బీజేపీ ప్రతిపాదించినట్లు ఊహాగానాలు వెలువడ్డాయి.
ఈ మేరకు చంద్రబాబుతో బీజేపీ సంప్రదింపులు జరిపినట్లు టీడీపీ వర్గాలు లీకులిచ్చాయి. బాబు ఢిల్లీ పర్యటన తర్వాత దీనిపై స్పష్టత వచ్చే అవకాశముంది. టీడీపీ 16 ఎంపీ సీట్లు గెలవడం, బీజేపీకి సొంతంగా మెజారిటీ రాకపోవడంతో ఎన్డీఏలో ఆ పార్టీ కీలకంగా మారింది. దీంతో బాబును కన్వీనర్‌గా నియమిస్తారనే ప్రచారం జరుగుతోంది. ఫలితాలు వెల్లడైన తర్వాత చంద్రబాబుకు ప్రధాని మోదీ ఫోన్‌చేసి అభినందించినట్లు టీడీపీ నేతలు తెలిపారు. చంద్రబాబు మంగళవారం జనసేన కార్యాలయానికి వెళ్లి పవన్‌తో సమావేశమై పలు విషయాలపై చర్చించారు.
Comments
Please login to add a commentAdd a comment