హాజరుకానున్న ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్‌షా, పలువురు ఎన్డీయే నేతలు
ప్రత్యేక అతిథులుగా రజనీకాంత్, చిరంజీవి
మెగా డీఎస్సీపై తొలి సంతకం చేసే అవకాశం.. గన్నవరం ఐటీ పార్కు వద్ద ఏర్పాట్లు పూర్తి
సాక్షి, అమరావతి/గన్నవరం: ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు బుధవారం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా రెండుసార్లు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్ర విభజన తర్వాత 2014లో ఆయన మూడోసారి ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. ఇప్పుడు నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. బుధవారం ఉదయం 11.27 గంటలకు ఆయన ప్రమాణ స్వీకారం చేసేందుకు గన్నవరం ఐటీ పార్కు వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఆయనతోపాటు ఉప ముఖ్యమంత్రిగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేయడం దాదాపు ఖరారైంది. మరికొందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ప్రమాణ స్వీకారం తర్వాత తొలి సంతకం మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌పై చేసే అవకాశం ఉన్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ఎన్నికల్లో గెలిస్తే తొలి సంతకం మెగా డీఎస్సీపై చేస్తానని చంద్రబాబు ప్రకటించారు. ఆ హామీని నెరవేర్చేలా ప్రమాణ స్వీకార వేదికపైనే సంబంధిత ఫైలుపై సంతకం చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ల్యాండ్ టైట్లింగ్ చట్టం రద్దుకు సంబంధించిన అంశంపైనా ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.
హాజరుకానున్న ప్రధాని, రాజకీయ ప్రముఖులు
ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్‌షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, పలువురు కేంద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు హాజరవుతున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు అమిత్‌షా, నడ్డా ఇప్పటికే విజయవాడ చేరుకున్నారు. సినీ ప్రముఖులు రజనీకాంత్, చిరంజీవి, ఇతర సినీ ప్రముఖులను తన ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు అతిథులుగా ఆహ్వానించగా చిరంజీవి కుటుంబంతో సహా ఇప్పటికే విజయవాడ వచ్చారు.
ఐటీ పార్కు ప్రాంగణం సిద్ధం
ప్రమాణ స్వీకారానికి ఐటీ పార్కు వద్ద 14 ఎకరాల ప్రాంగణాన్ని అధికార యంత్రాంగం సిద్ధం చేసింది. 2.5 ఎకరాల్లో ప్రధాన వేదిక, వీఐపీ గ్యాలరీ, మిగిలిన 11.5 ఎకరాల్లో నాయకులు, ప్రజల కోసం గ్యాలరీలు సిద్ధం చేస్తున్నారు. సభా ప్రాంగణం లోపల, వెలుపల ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేశారు. గన్నవరం ఎయిర్‌పోర్ట్ ప్రధాన గేటుకు సమీపంలోనే ఉన్న సభా వేదిక వద్దకు ప్రధాని, కేంద్ర మంత్రులు నేరుగా చేరుకునే సౌకర్యం కల్పించారు.
వీఐపీల కోసం ఐదు ప్రత్యేక గ్యాలరీలు సిద్ధం చేశారు. నాయకులు, కార్యకర్తల కోసం 36 గ్యాలరీలుగా విభజించారు. ఈ కార్యక్రమానికి వచ్చే బస్సులు, కార్లు, ఇతర వాహనాల కోసం గన్నవరం పరిసర ప్రాంతాల్లో పలుచోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పిస్తున్నారు. ప్రముఖుల భద్రత, వేదిక, వసతుల కల్పన, బారికేడ్ల ఏర్పాటు, పారిశుధ్యం వంటి పనులను ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు ఈ కార్యక్రమం కోసం 7 వేల మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకార కార్యక్రమ సమన్వయాధికారి ప్రద్యుమ్న ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లతో సమావేశం నిర్వహించారు.
రద్దీగా మారిన గన్నవరం ఎయిర్‌పోర్టు
ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు ఎక్కువ మంది వీఐపీలు వస్తుండడంతో గన్నవరం ఎయిర్ పోర్టు రద్దీగా మారిపోయింది. ఢిల్లీ, హైదరాబాద్ ఎయిర్‌పోర్టుల నుంచి పలు ప్రత్యేక విమానాల్లో అతిథులు రావడంతో గన్నవరం ఎయిర్‌పోర్టు సందడిగా మారింది. బుధవారం ఉదయం ఇంకా రద్దీగా మారే పరిస్థితి ఉండడంతో ఎయిర్‌పోర్టులో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ప్రయాణికుల రాకపోకలపై ఆంక్షలు విధించారు. ఉదయం 9.30 గంటలలోగా ప్రయాణికులు ఎయిర్ పోర్టుకు చేరుకోవాలని ఎయిర్‌పోర్టు అధికారులు సూచించారు. ప్రయాణికుల విమానాల రాకపోకలపై ఆంక్షలు లేవని, కానీ ముందుగా ఎయిర్‌పోర్టుకు చేరుకోవాలని సూచిస్తున్నారు.
తిరుమల వెళ్లనున్న చంద్రబాబు
ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత బుధవారం సాయంత్రం చంద్రబాబు తిరుమల వెళ్లనున్నారు. రాత్రికి అక్కడే బస చేసి గురువారం ఉదయం కుటుంబ సమేతంగా వెంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు. అనంతరం అదే రోజు తిరిగి విజయవాడ చేరుకుంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి.
Comments
Please login to add a commentAdd a comment