
హ్యాట్రిక్ సాధించిన అవినాష్‌రెడ్డి, మిధున్‌రెడ్డి
తిరుపతి నుంచి మద్దిల గురుమూర్తి, అరకు నుంచి తనూజారాణి ఎన్నిక
సాక్షి ప్రతినిధి, కడప/తిరుపతి సిటీ/పాడేరు/పార్వతీపురం టౌన్: వరుసగా మూడుసార్లు ఎంపీలుగా ఎన్నికై వైఎస్ అవినాష్‌రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి హ్యాట్రిక్ సాధించారు. కడప పార్లమెంటరీ స్థానంలో ఈవీఎం, పోస్టల్ బ్యాలెట్ ద్వారా 12,97,362 ఓట్లు పోలయ్యాయి. వైఎస్ అవినాష్‌రెడ్డికి 5,97,101 ఓట్లు లభించగా, టీడీపీ అభ్యర్థి భూపేష్‌రెడ్డికి 5,31,611 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి షర్మిలకు 1,35,731 ఓట్లు వచ్చాయి. అవినాష్‌రెడ్డి తన సమీప ప్రత్యర్థి భూపేష్‌రెడ్డిపై 65,490 ఓట్ల ఆధిక్యతతో గెలుపొంది తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. బద్వేలు, పులివెందుల నియోజకవర్గాలు మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో భూపేష్ ఆధిక్యత సాధించారు.
మాజీ సీఎం నల్లారిపై మిథున్‌రెడ్డి జయకేతనం
రాజంపేట వైఎస్సార్‌సీపీ ఎంపీ అభ్యర్థి పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిని మట్టి కరిపించారు. దాదాపు 76,071 ఓట్ల తేడాతో ఆయన విజయం సాధించారు. రాజంపేట, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మెంట్ల ఓటర్లు మిథున్‌రెడ్డి పట్ల సానుకూలత వ్యక్తం చేసినట్టు కనిపించింది. తొలిసారిగా మిథున్‌రెడ్డి 2014లో 1,74,062 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. నాటి బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిని ఆయన ఓడించారు. 2019లో మిథున్‌రెడ్డి టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల మెజార్టీ సా«ధించారు. ముచ్చటగా మూడోసారి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డిపై విజయబావుటా ఎగురవేశారు.
తిరుపతి ఎంపీగా గురుమూర్తి
తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గంలో ఎంపీ డాక్టర్ మద్దిల గురుమూర్తి మరోసారి విజయకేతనం ఎగురవేశారు. మద్దిల గురుమూర్తికి 6,32,228 ఓట్లు లభించగా, బీజేపీ అభ్యర్థి వరప్రసాద్‌కు 6,17,659 ఓట్లు పోలయ్యాయి. ఎంపీ మద్దిల గురుమూర్తి 14,569 మెజార్టీతో గెలుపొందినట్టు అధికారులు ప్రకటించారు.
అరకు ఎంపీగా తనూజారాణి
అరకు లోక్‌సభ స్థానంలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి డాక్టర్ గుమ్మ తనూజారాణి విజయకేతనం ఎగురవేశారు. అరకు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో తొలి రౌండ్ నుంచి చివరి రౌండ్ వరకు తనూజారాణి స్పష్టమైన ఆధిక్యత కనబరిచారు. బీజేపీ అభ్యర్థి కొత్తపల్లి గీతపై 50,580 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. తనూజారాణికి 4,77,005 ఓట్లు రాగా, కొత్తపల్లి గీతకు 4,26,425 ఓట్లు లభించాయి.