ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల ఫలితాలు సర్వత్రా నివ్వరపోయేలా చేశాయి. ఎవరూ ఊహించని విధంగా వచ్చిన ఈ రిజల్ట్స్ తో సహజంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ షాక్‌కు గురి అవుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీలు సంబరపడతాయి. వీరి కూటమి సఫలం అయింది. ఒంటరిగానే గెలవగలనన్న ధీమాతో ఉన్న వైఎస్సార్‌సీపీకి గట్టి దెబ్బ తగిలింది. గతసారికి భిన్నంగా సామాజిక సమీకరణలు మారిపోవడం కూడా వైఎస్సార్‌సీపీకి నష్టం చేసింది. పాలనాపరంగా ముఖ్యమంత్రిగా జగన్ చేసిన తప్పు ఏమిటా అని ఆలోచిస్తే ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడమా? అన్న ప్రశ్న వస్తుంది. దేశంలో ఏ ముఖ్యమంత్రి తేనన్ని సంస్కరణలు, వ్యవస్థలు జగన్ తెచ్చారు. ఎవరూ అమలు చేయని సంక్షేమ కార్యక్రమాలు ఈయన చేపట్టారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా ఓడరేవులు, మెడికల్ కాలేజీలు మొదలైనవాటిని అభివృద్ది చేస్తున్నారు. అంతదాకా ఎందుకు! దశాబ్దాల తరబడి కిడ్నీ వ్యాధితో బాధ పడుతున్న వారికోసం ఉద్దానం వద్ద ఒక పెద్ద ఆస్పత్రిని, పరిశోధన కేంద్రాన్ని,నీటి పధకాన్ని తీసుకు వస్తే అక్కడ కూడా వైఎస్సార్‌సీపీ ఓడిపోయింది. రామాయం పట్నం వద్ద ఓడరేవు నిర్మాణం జరుగుతుంటే,ఆ ప్రాంతంలో కూడా వైఎస్సార్‌సీపీ ఓటమి చెందింది. మచిలీపట్నంలో ఓడరేవు, వైద్య కళాశాల ఏర్పాటు అవుతుంటే అక్కడా ఓటమి ఎదురైంది. విశాఖపట్నం కార్యనిర్వాహక రాజధాని అవుతుందని ప్రకటించినా, అక్కడ పలు అభివృద్ది పనులు నిర్వహించినా జనం పట్టించుకోలేదు. కర్నూలు లో పలు లీగల్ ఆఫీస్ లు ఏర్పాటు చేసినా జనం ఓట్లు వేయలేదు. వైఎస్సార్‌సీపీకి కంచుకోటగా భావించే రాయలసీమలో దారుణ పరాజయం వచ్చింది.
వలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలందరికి ఇళ్ల వద్దకే సేవలు అందిస్తుంటే, ఎంతో సంతోషపడ్డారు. వృద్దులకు చెప్పినట్లు పెన్షన్ మూడువేల రూపాయల చేశారు. అయినా జగన్ ప్రభుత్వం ఓడిపోయింది.చేయూత పేరుతో లక్షల మంది 18750 రూపాయల చొప్పున ఆర్ధిక సాయం చేస్తే వైఎస్సార్‌సీపీకి కేవలం నలభై శాతం ఓట్లతో అంత తక్కువ సీట్లు రావడమా! చివరికి ప్రతిపక్ష హోదా దక్కకపోవడమా!వినడానికే విడ్డూరంగా ఉంది. అయినా చేదు వాస్తవం భరించకతప్పదు. పార్టీ పరంగా జగన్ ఆత్మవిశ్లేషణ చేసుకోవచ్చు. ఎక్కడ తప్పు జరిగిందన్నది గమనించి, మళ్లీ పార్టీకి ఉత్తేజం తేవలసి ఉంది.కొందరు అభిమానులు ఈ ఓటమి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంటున్నట్లు, గుండెపోటుకు గురై మరణించినట్లు వార్తలు వస్తున్నాయి. క్లిష్ట సమయాలలోనే ఎవరైనా ధైర్యంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజం. ఎవరూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని మనవి. ఎందుకింత ఘోర పరాజయం అని ఆలోచిస్తే కొన్ని కారణాలు కనిపిస్తాయి. జగన్ పేదలకు, బలహీనవర్గాలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.
వారి అభ్యున్నతికి తోడ్పడ్డారు. వారు ఆర్ధికంగా మెరుగు అవ్వాలని ఆశించారు. రకరకాల స్కీములను అమలు చేశారు. అమ్మ ఓడి అనే కొత్త స్కీము తెచ్చి, బలహీనవర్గాల పిల్లలు ప్రభుత్వ బడులలో విద్య కొనసాగించేలా చేశారు. వారికి ఆంగ్ల మీడియం అందుబాటులోకి తెచ్చారు.ఐబి వంటి సిలబస్ ను తీసుకురావాలని తలపెట్టారు. ఇలా వివిధ కార్యక్రమాలను బలహీనవర్గాలకు అమలు చేయడం అగ్రవర్ణాలలోని కొందరికి అంతగా నచ్చలేదు. ఎస్సి,ఎస్టి, బిసి ,మైనార్టీలకే అన్నీ చేస్తున్నారన్న అపోహ ఏర్పడింది. దీంతో సమాజంలో వైరుద్యాలు పెరిగినట్లయింది. ఫలితంగా ఈ అగ్రవర్ణాలకు చెందిన వారిలో పలువురు కూటమి వైపు మొగ్గు చూపారన్న అభిప్రాయం కలుగుతుంది. ఇక్కడ ఒక ఉదాహరణ చెప్పుకోవచ్చేమో! తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఎస్సి వర్గాల కోసం దళిత బంధు స్కీమును తెచ్చి ఒక్కో కుటుంబానికి పది లక్షల సాయం చేయాలని సంకల్పించారు.
అది తెలంగాణ సమాజంలో ప్రత్యేకించి గ్రామాలలో వివిధ వర్గాల మధ్య వైరుధ్యాలకు దారి తీసింది. దాంతో ఇతర వర్గాలు దూరం అయ్యయని చెబుతారు. అంతేకాక ఎస్సిలలో కూడా లబ్ది పొందినవారిని చూసి, తమకు ఎందుకు రాలేదన్న అసంతృప్తి మరికొందరికి ఏర్పడింది. తత్ఫలితంగా గ్రామీణ ప్రాంతాలలో బిఆర్ఎస్ ఓటమికి దారితీసిందన్న విశ్లేషణ ఉంది. అలాగే జగన్ మోహన్ రెడ్డి చిత్తశుద్దితో నిమ్మవర్గాలకు మేలు చేయాలని అనుకున్నారు. ప్రత్యేకించి బిసిలకు ఆయా స్కీములతో పాటు రాజకీయంగా ఇతోధిక ప్రాధాన్యత ఇచ్చారు. ఇది కూడా రాజకీయంగా జగన్ కు నష్టం చేసిందా అన్న అభిప్రాయం వస్తోంది. అటు అగ్రవర్ణాలలో అసంతృప్తి ఉంటే, మరో వైపు బలహీనవర్గాల వారు పూర్తిగా ఓన్ చేసుకున్నారా? లేదా?అన్న సందేహం వస్తుంది. ఎందుకంటే వారిలో పలువురు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటించిన సూపర్ సిక్స్ లోని కొన్ని అంశాలకు ప్రభావితం అయినట్లు సమాచారం వస్తోంది.
పెన్షన్ నాలుగు వేలు చేస్తామని అనడం, తల్లికి వందనం పేరుతో బడికి వెళ్లే పిల్లలు ఎంత మంది ఉంటే అంతమందికి పదిహేనువేల రూపాయల చొప్పున ఇస్తామని చెప్పడం,మహిళలకు నెలకు 1500 చొప్పున ఇవ్వచూపడం,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, బిసిలకు ఏభైఏళ్లు దాటితో పెన్షన్ హామీ మొదలైనవాటికి కొంత శాతం బలహీనవర్గాలు అట్రాక్ట్ అయ్యారని చెబుతున్నారు. ఈ రకంగా రెండువైపులా నష్టం జరిగి ఉండవచ్చు. పేదలు vs పెత్తందార్ల నినాదం ఫలించలేదని అనుకోవాలి. వలంటీర్ల వ్యవస్థ వల్ల లాభం జరిగిందా? నష్టం జరిగిందా? అన్నది చర్చనీయాంశంగా ఉంది. వీరివల్ల పార్టీ స్థానిక నేతలకు, క్యాడర్‌కు ప్రాధాన్యత తగ్గిపోయిందని పార్టీ వర్గాలు అంటున్నాయి. అయితే ఈ వ్యవస్థ ప్రజలకు బాగా మేలు చేసిన అంశం. ఎవరికి ఏ సర్టిఫికెట్ కావాలన్నా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రజలకు అందించారు.
గ్రామ, వార్డు సచివాలయాలు పెట్టడం ద్వారా ప్రజలకు పరిపాలనను బాగా దగ్గర చేశారు. అయినా జనం ఎందుకు ఓట్లు వేయలేదో అర్ధం కావడం లేదు. ప్రభుత్వపరంగా ఆర్ధిక ఇబ్బందులు ఉండడం వల్ల పార్టీ నేతలు చేపట్టిన వివిధ నిర్మాణాలకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో క్యాడర్ కొంత ఇబ్బంది పడిందని చెబుతారు. 31 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చినా, ఇరవై లక్షల మందికి ఇళ్లు కట్టిస్తున్నా, ప్రయోజనం కనిపించలేదు. మద్యం విధానం వల్ల ప్రభుత్వానికి కొంత నష్టం జరిగిందన్నది మరికొందరి భావన. మానిఫెస్టోలోని హామీలను దాదాపు అన్నిటిని అమలు చేసిన నేతగా, అందువల్లే ఓడిన నేతగా జగన్ చరిత్రలో నిలిచిపోతారు. నేరుగా సుమారు మూడు లక్షల కోట్ల మేర నగదును పేదలకు బదిలీ చేయడం రాజకీయంగా జగన్‌కు పెద్దగా కలిసివచ్చినట్లు లేదు. పైగా కొన్ని వర్గాలు వ్యతిరేకించాయి.
చంద్రబాబు ఇంకా ఎక్కువ హామీలు, ఏడాదికి లక్షన్నర కోట్లు ఖర్చుచేస్తానని సూపర్ సిక్స్ ప్రకటించారు కదా అని అంటే, ఆయన చేసినప్పుడు కదా! అని కొందరు భావించారు. పేదలేమో ఆ స్కీములకు కొంత ఆకర్షితులైతే, మధ్యతరగతి,ధనికవర్గాలేమో అవేవి చేయలేరులే అని అనుకున్నారు. జగన్ మాదిరి చంద్రబాబు మాటకు కట్టుబడి ఉండరన్నది వారి నమ్మకం. అమరావతి రాజధాని విషయంలో కూడా సరిగా హాండిల్ చేయలేదన్న అభిప్రాయం ఏర్పడింది. జగన్ ప్రభుత్వంపై జరిగినంత అబద్దపు ప్రచారం, దుష్ఫ్రచారం బహుశా దేశంలో ఏ ప్రభుత్వంపై జరగలేదు. చివరికి అబద్దపు ప్రచారానిదే పై చేయి అయింది. లాండ్ టైటిలింగ్ యాక్ట్ తో భూములు లాగేసుకుంటారు అంటూ చేసిన అసత్య ప్రచారం కూడా బాగా డామేజీ చేసిందని అంటున్నారు.
1955 ఆంద్ర శాసనసభ ఎన్నికలలో కమ్యూనిస్టుపార్టీ విజయం సాధిస్తుందన్న భావన ఉండేదట. కాని అప్పట్లో కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. ఒక వర్గం మీడియా ఒక వదంతిని సృష్టించి ప్రజలను భయాందోళనలకు గురి చేసిందట.భూస్వాముల భార్యల మెడలపై కాడివేసి దున్నిస్తామని ఒక కమ్యూనిస్టు నాయకుడు అన్నట్లు చేసిన ప్రచారంతో సిపిఐ పదిహేను సీట్లకే పడిపోయి అధికారంలోకి రాలేకపోయింది.రాజకీయాలలో ఒక్కోసారి అబద్దాలు ఎంతగా ప్రభావితం చేస్తాయనడానికి ఇది ఒక ఉదాహరణ అని చెప్పాలి. కాగా తెలుగుదేశం పార్టీకి చెందినవారు కొందరు విజయం సాధించామన్న అత్యుత్సాహంతో కొన్ని చోట్ల దాడులు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది మంచిది కాదు. ఎన్నికలు అయిపోయాక కూడా ఘర్షణ వాతావరణం కొనసాగిస్తే,అది సమాజానికి హానికరం.
– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు
Comments
Please login to add a commentAdd a comment