96,369 క్యూసెక్కులకు పెరిగిన వరద
ఎగువన కృష్ణా ప్రధాన పాయలో పెరిగిన వరద ఉధృతి
ఆల్మట్టి నుంచి 1.50 లక్షలు, నారాయణపూర్ 1.45 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు
జూరాల నుంచి 1.19 లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల
సాక్షి, హైదరాబాద్: శ్రీశైలం ప్రాజెక్టులోకి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు 96, 369 క్యూసెక్కుల నీరు రావడంతో నీటినిల్వ 822.5 అడు గుల్లో 42.73 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జునసాగర్ లోకి ఎలాంటి వరద చేరకపోగా.. పులిచింతల ప్రాజెక్టు లోకి కేవలం 640 క్యూసెక్కుల ప్రవాహం చేరుతోంది. కాగా పులిచింతలకు దిగువన నదిపరీవాహక ప్రాంతం(బేసిన్)లో విస్తారంగా కురిసిన వర్షాలకు కట్టలేరు, మున్నేరు పరవళ్లు తొక్కగా, ఏపీలోని ప్రకాశం బ్యారేజీలోకి 13,634 క్యూసెక్కుల నీరు చేరింది.
ఇందులో కృష్ణా డెల్టా కు 1,309 క్యూసెక్కుల నీటి విడుదల చేస్తూ మిగులుగా ఉన్న 12,325 క్యూసెక్కులను 17 గేట్లు ఒక అడుగు మేర ఎత్తి సముద్రంలోకి అధికారులు వదిలేస్తున్నారు. పశ్చిమ కనుమల్లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల కృష్ణా ప్రధానపాయలో ఎగువన వరద ప్రవాహం కొంత పెరిగింది. ఆల్మట్టిలోకి 1.24 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1.50 లక్షల క్యూసెక్కులను దిగువకు వదిలారు.
దాని దిగువన నారాయణపూర్ డ్యామ్‌లోకి 1.25 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా, గేట్లు ఎత్తి 1,45,750 క్యూసెక్కుల నీటికి వదలడంతో జూరాల ప్రాజెక్టులోకి చేరుతున్న వరద క్రమేపి పెరుగుతోంది. జూరాల ప్రాజెక్టులోకి 1,29,000 లక్షల క్యూసెక్కుల నీరు చేరగా.. విద్యుదుత్పత్తి చేస్తూ, గేట్లు ఎత్తి 1,34,161 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు.
మూడు రోజుల్లో తుంగభద్ర గేట్లు ఎత్తేసే అవకాశం
ఇక కృష్ణా ప్రధాన ఉపనది తుంగభద్రలో వరద ఉధృతి మరింత పెరిగింది. తుంగభద్ర డ్యామ్‌లోకి 1,17,647 క్యూసెక్కుల నీటిరాకతో నీటినిల్వ 78.67 టీఎంసీలకు చే రుకుంది. నిండుకుండను తలపిస్తున్న తుంగభద్ర డ్యామ్ లో ఆదివారం విద్యుదుత్పత్తిని ప్రారంభించిన అధికారు లు.. 4,754 క్యూసెక్కులను దిగువకు వదిలారు. తుంగభద్రలో మరో మూడు రోజులు ఇదే రీతిలో వరద వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. మరో 27 టీఎంసీలు చేరితే తుంగభద్ర డ్యామ్ నిండుతుంది. మూడు రోజుల్లో తుంగభద్ర డ్యామ్ నిండే అవకాశముంది.
సాగర్ నీటిమట్టం 504.30 అడుగులు
నాగార్జునసాగర్/మునగాల: నాగార్జునసాగర్ నీటిమట్టం ప్రస్తుతం 504.30 అడుగులుగా ఉంది. తాగునీటికి అవసరాల కోసం కుడి కాల్వ ద్వారా 5,700 క్యూసెక్కులు, ఎడమ కాల్వ ద్వారా 3,146 క్యూసెక్కులు, ఏఎమ్మార్పీ ద్వారా 800 క్యూసెక్కులు ఇలా మొత్తం 9,646 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. సాగర్‌కు ఇన్‌ఫ్లో ఏమాత్రం లేదు.
ఎడమకాల్వ లాకుల వద్ద పహారా: సూర్యాపేట జిల్లా మునగాలలోని సాగర్ ఎడమకాల్వ ప్రధాన లాకుల వద్ద రెవెన్యూ, పోలీస్ సిబ్బంది పహారా కాస్తున్నారు. తాగునీటి అవసరాల కోసం సాగర్ ఎడమకాల్వకు నీటిని విడుదల చేస్తుండగా, రైతులు ఈ నీటిని పంటల సాగుకు మళ్లించకుండా ఉండేందుకు పహారా ఏర్పాటు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment