అచ్చంపేట, న్యూస్‌లైన్
రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తు న్న ‘పులిచింతల’ ప్రాజెక్టు పనులు పూర్తి కాకుండానే శనివారం ముఖ్యమంత్రి ఎన్. కిరణ్‌కుమార్ ప్రారంభించనున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే 15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించడంతోపాటు 46 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం వుంది. దీని ద్వారా 120 మెగా వాట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. ఇన్ని బహుళ ప్రయోజనాలు కలిగిన పులిచింతల ప్రాజెక్టును ‘జలయజ్ఞం’ పథకంలో భాగంగా నిర్మించతలపెట్టిన అప్పటి ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో శంకుస్థాపన చేశారు. పర్యావరణ అనుమతుల్లో జాప్యం తదితర కారణాలతో ప్రాజెక్టు పనులు 2005లో ప్రారభమయ్యాయి. మహానేత వైఎస్ మృతి నాటికి ప్రాజెక్టు 60శాతం పూర్తయింది. ఆ తరువాత పనులు మందగించి ఇప్పటికి 90 శాతం పూర్తి చేసుకుంది. మిగిలిన పది శాతం పనులు కూడా పూర్తయితేనే వినియోగంలోకి రాగలదని ఇంజినీరింగ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి.
ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే....
ప్రాజెక్టులో నీటిని నిల్వ ఉంచాలంటే గుంటూరు జిల్లాలో 15, నల్లగొండ జిల్లాలో 13 గ్రామాలను ఖాళీ చేయించి ప్రజలను పునరావాస కేంద్రాలకు పంపాలి. బెల్లంకొండ, అచ్చంపేట, పిడుగురాళ్ల, రాజుపాలెం, మాచవరం మండలాల్లో 13 పునరావాస కేంద్రాలను నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకు 12,602 ఎకరాల భూమి కావలసి ఉండగా ఇప్పటివరకు 11,588 ఎకరాలను సేకరించారు. ఇప్పటివరకు 4,661 కుంటుంబాలకు పునరావాస కేంద్రాల్లో పట్టాలు ఇచ్చారు. మరో 1,784 కుంటుంబాలకు ఇవ్వవలసి ఉంది. గుంటూరు జిల్లాలో పునరావాస కేంద్రాల నిర్మాణాలకు రూ.168 కోట్లు వెచ్చించారు.
అచ్చంపేట మండలంలో పునరావాస కేంద్రాలు..
అచ్చంపేట మండలం చిగురుపాడు, నీలేశ్వరపాలెం, పెదపాలెం పంచాయతీల పరిధిలో కోళ్లూరు, చిట్యాలతండా, కేతవరం గ్రామాలకు పునరావాస కేంద్రాల నిర్మాణం చేపట్టారు. పెదపాలెం పంచాయతీ పరిధిలో చిట్యాల తండా నిర్వాసితులకు 292 ప్లాట్లు వేసి గృహాల నిర్మాణం కూడా చేపట్టారు. ఇప్పటి వరకు 92 కుటుంబాలు గ్రామం వదిలి వచ్చాయి. అయితే కనీస సదుపాయాలు లేక అల్లాడుతున్నారు. దీంతో తిరిగి తమ గ్రామం వెళ్లిపోతామని నిర్వాసితులు చెబుతున్నారు. చిగురుపాడు పంచాయతీ పరిధిలో 196 ప్లాట్లు వేయవలసి ఉంది. ఇటీవల 19 ఎకరాల భూసేకరణ చేశారు. ప్రస్తుతం అంతర్గత రహదారులు వేసే పనిలో ఉన్నారు. ఇక్కడ అన్ని పనులు పూర్తి కావాలంటే కనీసం మరో సంవత్సర కాలమైనా పడుతుంది. నీలేశ్వరపాలెం పునరావాస కేంద్రంలో కేతవరం నిర్వాసితులకు 227 ప్లాట్లు వేశారు. ప్రభుత్వం భవనాలు కూడా నిర్మించారు. కాని నిర్వాసితులు ఈ కేంద్రానికి వచ్చేందుకు విముఖత చూపుతున్నారు. ఈ కేంద్రం వాగు కింద ఉండటం వల్ల నివాసాలకు అనుకూలంగా లేదని చెబుతున్నారు. అదీకాక కేతవరం లక్ష్మీ నరసింహా స్వామి భూములపై జీవిస్తున్న తమకు కూడా పరిహారం ఇవ్వనిదే గ్రామం వదిలి వచ్చేది లేదని భీష్మించుకు కూర్చున్నారు.
పూర్తికాని ‘పులిచింతల’
Published Sat, Dec 7 2013 3:20 AM | Last Updated on Mon, Jul 29 2019 5:31 PM
Advertisement
Advertisement