సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మహాదుర్మార్గుడని, ఆయన వైఖరి ఫలితమే బ్రిజేశ్ కుమార్ ట్రిబ్యునల్ తీర్పని బీజేపీ నాయకుడు నాగం జనార్దన్‌రెడ్డి మండిపడ్డారు. ఎందుకూ పనికి రాడనుకున్న సుదర్శన్‌రెడ్డి అనే న్యాయవాదిని పెట్టి సరిగా వాదనలు వినిపించకుండా చేశారని ధ్వజమెత్తారు. పార్టీ నేతలు దాసరి మల్లేశం, మాలతీరాణి, కృష్ణసాగర్‌తో కలిసి గురువారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడారు. తమ ప్రాంతం హైదరాబాద్ రాష్ట్రంలోనే ఉండి ఉంటే మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలకు కృష్ణా జలాలలో అన్యాయం జరిగి ఉండేది కాదన్నారు. ఆర్డీఎస్ కుడికాల్వకు నాలుగు టీఎంసీల నీరు కేటాయించుకునేలా వాదనలు వినిపించిన న్యాయవాది కరువు ప్రాంతమైన మహబూబ్‌నగర్ జిల్లాకు మేలు చేసే నెట్టెంపాడు, జూరాల సంగతిని విస్మరించారని ఆరోపించారు. పులిచింతల ప్రాజెక్టు కింద తమ గ్రామాలు పోతుంటే, లాభాలు మాత్రం కృష్ణా ఆయకట్టుకు దక్కుతున్నాయని వివరించారు. ఈ అన్యాయంపై సుప్రీంకోర్టుకు వెళతామని చెప్పారు.