huzur nagar
-
రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం.. తహసీల్దార్ అరెస్ట్
సూర్యాపేట, సాక్షి: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో రైతుబంధు పేరుతో భారీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. లేని భూమిని ఉన్నట్లు చూపించి పాస్ పుస్తకాలు ఎమ్మార్వో జయశ్రీ సృష్టించారు. ఈ కుంభకోణానికి ధరణి ఆపరేటర్ జగదీష్ సహకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు.. తహసీల్దారు జయశ్రీ, ధరణీ ఆపరేటర్ జగదీష్‌ను అరెస్ట్ చేశారు. గోప్యంగా 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. కనీసం అరెస్ట్ వివరాలు కూడా బయటకు తెలియకుండా జాగ్రత్త పడిన వైనం. గతంలో హుజూర్నగర్ తహసీల్దార్‌గా పనిచేస్తూ కుంభకోణానికి పాల్పడ్డట్లు అధికారులు గుర్తించారు. హుజూర్ నగర్, బూరుగడ్డ రెవిన్యూ పరిధిలో 36.23 ఎకరాలకు ధరణి ద్వారా పాసు పుస్తకాలు సృష్టించి రైతుబంధు నిధులును స్వాహా చేశారు. రూ.14,63,004 లక్షల రైతుబంధు నిధులు తహసీల్దార్, ధరణి ఆపరేటర్ పక్కదారి పట్టించారు. ధరణి ఆపరేటర్ జగదీష్ బంధువుల పేరిట 2019 పట్టాదారు పాసుబుక్కులు తహసీల్దార్ జయశ్రీ జారీ చేశారు. తహసీల్దార్, ధరణి ఆపరేటర్ జగదీష్ చెరిసగం చొప్పున రైతుబంధు నదులు పంచుకున్నారు. తహసీల్దార్ పై 420, 406, 409, 120(b), 468, 467 IPC సెక్షన్లు కింద పోలీసులు కేసు నమోదు చేవారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా అనుముల తహసీల్దార్‌గా జయశ్రీ పనిచేస్తున్నారు. గోప్యంగా రిమాండ్‌కు తరలించడమేంటని ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. -
సూర్యాపేట జిల్లాలో స్వల్ప భూకంపం
హుజూర్నగర్: సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలోని చింతలపాలెం మండలంలో శుక్రవారంరాత్రి మళ్లీ స్వల్ప భూకంపం వచ్చింది. పలు గ్రామాలతోపాటు పులిచింతల ప్రాజెక్టు ప్రాంతంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు చోటుచేసుకున్నట్లు పలువురు తెలిపారు. దాదాపు 5 నుంచి 10 సెకండ్లపాటు భూమి కంపించింది. ఈ ప్రకంపనలను కొద్దిమంది మాత్రమే గుర్తించినట్లు చెబుతున్నారు. ఈ నెల 19న ఏపీలోని గుంటూరు జిల్లా సత్తెనపల్లి కేంద్రంగా వచ్చిన భూకంపం 2.3 మ్యాగ్నట్యూడ్‌గా నమోదైంది. కాగా, 2020, 2022 సంవత్సరాల్లో కూడా పలుమార్లు భూప్రకంపనలు సంభవించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 2వ తేదీ ఉదయం వచ్చిన భూకంపం 3.0 మ్యాగ్నట్యూడ్‌గా నమోదైంది. ఇప్పడు మళ్లీ భూకంపం రావడంతో ఈ ప్రాంత ప్రజలు భయాందోళనకు గురయ్యారు. -
కాంగ్రెస్ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం ఖాయం: ఉత్తమ్
సాక్షి, (సూర్యాపేట): రాష్ట్రంలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 70 నుంచి 80 వరకు ఎమ్మెల్యే సీట్లు గెలుపొంది అధికారంలోకి రావడం ఖాయమని, కాంగ్రెస్ పార్టీ ఉప్పెనలో బీఆర్ఎస్ కొట్టుకుపోవడం తధ్యమని నల్లగొండ ఎంపీ ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో, అలాగే మఠంపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. తాను కార్యకర్తల అభీష్టం మేరకు సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వేల కోట్ల రూపాయలతో చేపట్టిన అభివృద్ధి పనులను కార్యకర్తలంతా విస్తృతంగా ప్రచారం చేయాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు అంగబలం, అర్ధబలంతో ఎన్నికష్టాలు పెట్టినా, ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా కార్యకర్తలంతా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం మిలిటెంట్లలాగా కృషిచేయాలని పిలుపునిచ్చారు. చదవండి: అవినీతిలో ఆస్కార్ ఇవ్వొచ్చు.. కేసీఆర్‌కు ఎదురుదెబ్బ ఖాయం.. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మొత్తం 12 స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం ఖాయమన్నారు. కోదాడ, హుజూర్నగర్ స్థానాల్లో 50 వేలకు పైగా మెజార్టీతో గెలుస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు ఓపికతో వ్యవహరిస్తారని, రెండుసార్లు కేసీఆర్‌కు అధికారమిచి్చ.. ఇక మూడోసారి ఇచ్చేది లేదన్న నిర్ణయానికి వచ్చారని తెలిపారు. వ్యవసాయంలో అద్భుతాలు చేస్తున్నట్లుగా సీఎం చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని, దేశంలోనే క్రాప్ ఇన్సూరెన్స్ లేని ఏకైక రాష్ట్రం తెలంగాణ ఒక్కటేనన్నారు. హౌసింగ్ స్కీమ్‌లో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అవినీతిలో ముందంజలో ఉందన్నారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు పోలీసు వ్యవస్థను తమ చెప్పుచేతల్లో పెట్టుకుని ఇసుక, మైనింగ్, వసూళ్లు, లిక్కర్ ఇలా అన్నిరకాలుగా దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ సమావేశంలో కోదాడ మాజీ ఎమ్మెల్యే పద్మావతి, పీసీసీ అధికార ప్రతినిధి చకిలం రాజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రియురాలి మృతిని తట్టుకోలేక.. ప్రియుడు సెల్ఫీ సూసైడ్
సాక్షి, సూర్యాపేట: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. హుజూర్నగర్ మండలం బూరుగడ్డలో ప్రేమికుల జంట బలవన్మరణానికి పాల్పడింది. ముందుగా మౌనిక అనే యువతి గురువారం పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకోగా.. ప్రియురాలు మరణం తట్టుకోలేక మనస్తాపంతో ప్రియుడు పవన్ కూడా పురుగుల మందు తాగి శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండు రోజుల వ్యధిలో ప్రేమికులిద్దరూ ప్రాణాలు వదలడంతో హుజూర్ నగర్లో విషాద చాయలు అలుముకున్నాయి. ఇదిలా ఉండగా పురుగుల మందు సేవిస్తూ ప్రియుడు పవన్ తీసుకున్న సెల్ఫీ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. -
సివిల్స్ పరీక్షలో సత్తా చాటిన సూర్యాపేట వాసి
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ వర్మ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటారు. పినాన్ని కోటేశ్వరరావు, ప్రభావతిల రెండో కుమారుడైన ఆయన సివిల్ పరీక్షల్లో 244వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎన్నిక కానున్నారు. అయితే 2016లో అతను 732వ ర్యాంక్‌తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఐఆర్ఎస్కు సెలవు పెట్టి ఐఏఎస్ సాధించారు. ఇతని తండ్రి కోటేశ్వరరావు విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా(జేఏఓ)గా పని చేస్తున్నారు. తల్లి అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన తండ్రి చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. కోటేశ్వరరావు చిన్నతనంలో సోడా అమ్మి చదువుకొని పదవ తరగతిలో మంచి ర్యాంకు సాధించారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ బహుమతి ఇచ్చారు. (వాళ్ల తర్వాత ఆ క్రెడిట్ నాగబాబుకే) ఆయన కొడుకు సందీప్ వర్మ చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఖాన్ స్టడీ సర్కిల్లో కోచింగ్ తీసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐనా మహేష్ భగవత్‌ను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో చదివేవారు. ఈ క్రమంలో మహేష్ భగవత్ అనేక సలహాలు ఇస్తూ, వెన్ను తట్టి నడిపించారని సందీప్ తెలిపారు. సందీప్ పేద ప్రజలకు సేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కోటేశ్వరరావు మొదటి కుమారుడు సంపత్ ఇప్పటికి రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లి సివిల్స్ సాధించలేకపోయారు. అయితే అక్టోబర్‌లో జరిగే సివిల్స్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల) -
ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలె..
పాలకవీడు (హుజూర్నగర్) : ఓటెత్తి కొడితే ఢిల్లీ కైవసం కావాలని, అందుకు టీఆర్ఎస్కు చెందిన ప్రతి కార్యకర్త కృషి చేయాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ఆదివారం మండలంలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని టీఆర్ఎస్ నేతలు మంత్రి జగదీశ్‌రెడ్డి, హుజూర్నగర్ నియోజకవర్గ పార్టీ ఇన్చార్జి శానంపూడి సైదిరెడ్డి ప్రారంభించారు. టీఆర్ఎస్ పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి నర్సింహారెడ్డి గెలుపును కాంక్షిస్తూ ఆయనతో కలిసి మండలం లోని జాన్‌పహాడ్‌దర్గా నుంచి ప్రచారాన్ని ప్రారంభించారు. ముందుగా దర్గాలో సైదులు బాబాకు చాదర్, దట్టీ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ 70ఏళ్ల కాంగ్రెస్ పాలనలోని దరిద్రాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగున్నరేళ్లలో అభివృద్ధి పరుచుకున్నామని తెలిపారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా కాంగ్రెస్ మాటలు వినే స్థితిలో ప్రజలు లేరని, అలాంటి పార్టీకి ఓటేస్తే మోరీల్లో వేసినట్లేనన్నారు. ఈ ఎన్నికల్లో వేమిరెడ్డి నర్సిం హారెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దేశంలో రైతులకు 24గంటల కరెంట్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం మనదేనన్నారు. రాష్ట్రంలోని రైతులు ఆర్థికంగా ఎదగడం కోసం రైతుబందు, రైతుబీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిందని కూ డా మనమేనన్నారు. ఇంకా కల్యాలక్ష్మి, షాదీముబారక్ పథకాలతోపాటు వితంతు, వికలాంగులు, వృద్ధులకు రెట్టింపు స్థాయిలో పెన్షన్లు అందిస్తున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్లగొండ ప్రజల ఫ్లోరిన్ సమస్యను ఎందుకు పట్టించుకోలేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజకీయ అవగాహనలేని వారిని నామీద ఎంపీ అభ్యర్థిగా నిలిపారని మాట్లాడుతున్న ఉత్తమ్‌ను దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఎన్నికల్లో గెలవాలని మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్ విసిరారు. హుజూర్‌నగర్‌కు ముందుగానే ఎమ్మెల్యే టికెట్ కేటాయించినట్లయితే ఈ రోజు పరిస్థితి వేరేలా ఉండేదన్నారు టీఆర్ఎస్ 16ఎంపీ స్థానాలు గెలిపించుకుంటే దేశంలో గుణాత్మకమార్పుకు సీఎం కేసీఆర్ శ్రీకారం చుడతారన్నారు. అభ్యర్థి నర్సింహారెడ్డి మా ట్లాడుతూ తనను ఆదరించి నల్లగొండ ఎంపీగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు జిన్నారెడ్డి శ్రీనివాసరెడ్డి, రైతు సమన్వయ సమితి జిల్లా సభ్యులు మలిమంటి దర్గారావు, వై.సత్యనారాయణరెడ్డి క్యాకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. -
పది నిమిషాలైతే...గమ్యస్థానానికి చేరేవారు...
అంతలోనే మృత్యువు తరుముకొస్తున్నట్లుగా...వరికోత యంత్రం రాంగ్రూట్లో వచ్చి బైక్‌ను ఢీకొట్టింది...గుండెల్లో గునపాలు దిగినట్టుగా... హార్వెస్టర్ ఇనుపరాడ్లు...ఇద్దరి గుండెల్లో గుచ్చుకున్నాయి...తండ్రి ఎగిరిపడగా...కూతురు ఆ రాడ్లకు చిక్కుకుపోయింది...ఈ దృశ్యం...అందరినీ కంటతడి పెట్టించింది....తండ్రి, అక్క విగతజీవులయ్యారు..అమ్మ గాయాలతో ఆస్పత్రిలో చేరింది...ఏం జరిగిందో తెలియక...ఆ చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు...సొంతూరికి వెళుతున్నామన్న ‘సంతోషమే’ లేదు... అయ్యప్ప పూజకు బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబానికి అనుకోని ఆపదఎదురైంది.. మరో పదినిమిషాలు గడిస్తే గమ్యస్థానానికి చేరుకునే వారు.. విధి వక్రీకరించింది.. మృత్యురూపంలో వచ్చిన వరికోత యత్రం.. ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. రాంగ్రూట్లో వచ్చిన యంత్రం బైక్‌ను ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వేములపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన గుడిపల్లి వెంకట్‌రెడ్డి (34) హుజూర్‌నగర్‌లో బ్యాటరీల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్ల పాటు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు బ్యాటరీల కంపెనీలో పనిచేశాడు. ఆరేళ్ల క్రితం జ్యోతిని పెళ్లి చేసుకుని హుజూర్‌నగర్‌లో దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి శ్రీజ(4), సంతోష్‌రెడ్డి జన్మించారు. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వగ్రామంలో గురువారం తన కుటుం బం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి పూజల్లో పాల్గొనేందుకు భార్య, పిల్లలతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. మరో అర కిలోమీటరు వెళితే రహదారి ని క్రాస్ చేసి తన గ్రామం వెళ్లే రోడ్డు వైపు చేరుకునేవాడు. ఇంతలోనే మృత్యువు రూపంలో రాంగ్ రూట్లో వచ్చిన వరికోత యంత్రం మాడ్గులపల్లి సమీపంలో బైకును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ముందు కూర్చొని ఉన్న కూతు రు శ్రీజ (4), వెంకట్‌రెడ్డి ఎగిరి యంత్రంపై పడడంతో రాడ్లు గుచ్చుకుని అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. బైక్‌పై వెనక కూర్చున్న వెంకట్‌రెడ్డి భార్య, రెండేళ్ల కుమారుడు సంతోష్‌రెడ్డి పక్కకుపడడంతో జ్యోతికి గాయాలయ్యా యి. సంతోష్‌రెడ్డికి ఏలాంటి గాయాలు కాలేదు. స్థానికు లు గాయపడిన జ్యోతిని, ఆమె కుమారుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లిదండ్రి కనిపించకపోవడంతో బేలాగా రోదిస్తున్న సంతోష్‌రెడ్డిని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు. కలచివేసిన ప్రమాద దృశ్యాలు మాడ్గులపల్లి వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మరికొంత మంది అయితే కళ్లు తిరిగి పడిపోయారు. గ్రామస్తులు, బంధువులు వరికోత యంత్రానికి ముందు రాడ్లు పెట్టుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే అర్ధగంట సేపు రాస్తారోకో చేశారు. పోలీసులు సర్థిచెప్పి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గుర్రప్పగూడెంలో విషాదఛాయలు గుర్రప్పగూడెం(వేములపల్లి) : అందరితో కలుపుగోలుగా ఉండే వెంకట్‌రెడ్డి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. తన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప పూజలో పాల్గొనేందుకు వస్తూ కూతురితో సహా వెంకట్‌రెడ్డి మృతిచెందడంతో గుర్రప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజతో సందడిగా ఉండాల్సిన భిక్షంరెడ్డి ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భిక్షంరెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు. -
బెల్టుషాపులు నిర్వహిస్తే కఠిన చర్యలు
హుజూర్నగర్ : సారా విక్రయించినా, బెల్టు షాపులు నడిపినా కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ డాక్టర్ ప్రభాకర్‌రావు హెచ్చరించారు. ఆదివారం స్థానిక పోలీస్‌స్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. శిథిలావస్థలో ఉన్న పోలీస్ క్వార్టర్స్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గ్రామాల్లో జరుగుతున్న మద్యం విక్రయాలు ప్రశాంత వాతావరణానికి భంగం కలిగించే విధంగా ఉన్నాయన్నారు. అందుకే వాటిపై ఉక్కుపాదం మోపుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధి లో సారా తయారీ కేంద్రాలపై, బెల్టు షాపులపై దాడులు నిర్వహిస్తూ కేసులు నమోదు చేస్తున్న ట్లు తెలిపారు. కొందరు జల్సాలకు అలవాటు పడి ద్విచక్ర వాహనాలను అపహరిస్తున్నారని.. ఇటీవల గుర్రంబోడు పోలీస్‌స్టేషన్ పరిధిలో 55 బైక్‌లను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ తెలిపారు. గత ఏడాది మంజూరైన నిధులతో దేవరకొండ, నల్లగొండలోని పోలీస్ క్వార్టర్‌సకు మరమ్మతులు చేయిం చామని, హుజూర్నగర్, గరిడేపల్లి పోలీస్స్టేషన్ల పరిధిలో గృహ సముదాయాల నిర్మాణానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు ఆయన వివరించారు. 2012 సంవత్సరం కంటే 2013 లో 1000 కేసులు ఎక్కువగా నమోదయ్యాయని పేర్కొన్నారు. వాటిలో భూ తగాదాలు, భార్యా భర్తలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నాయన్నారు. జిల్లాలో ఇటీవల జరిగిన హత్యలన్నీ వివాహేతర సంబంధాలు, భూతగాదాలకు సంబంధించినవని, ముఠాకక్షలు, రాజకీయ గొడవలు లేవని చెప్పారు. విధానపరమైన నిర్ణయాల వల్ల ఎస్ఐ, సీఐల బదిలీల ప్రక్రియలో జాప్యం జరిగిందని, వారం రోజు ల్లో బదిలీలు నిర్వహిస్తామని తెలిపారు. పోలీసులకు ఇస్తున్న వారాంతపు సెలవుల వల్ల వారు మానసికంగా ప్రశాంతత పొంది విధులను సక్రమంగా నిర్వహించేందుకు దోహద పడు తున్నాయని పేర్కొన్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌లోని సిబ్బంది ఎస్పీని శాలువాలు, పూల మాలలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ కె.మోహన్, సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ వెంకటశివరావు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
డబ్బు తరలింపు ఘటనలో మాజీమంత్రి ‘ఉత్తమ్’పై కేసు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: ఎన్నికల సమయంలో అక్రమంగా డబ్బు తరలింపు కేసులో మాజీ మంత్రి, హుజూర్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనతోపాటు వాహన యజమాని, డ్రైవర్‌పై కూడా కేసు నమోదైంది. కోదాడ నుంచి హైదరాబాద్‌కు డబ్బు అక్రమంగా తలిస్తుండగా నల్లగొండ జిల్లా సూర్యాపేట వద్ద వాహనంలో నోట్లకట్టలు దగ్ధమైన విషయం విదితమే. విచారణ జరిపిన పోలీసులు.. వాహన యజమాని గౌతం, ఎమ్మెల్యే స్టిక్కర్ ఉన్న మాజీమంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, డ్రైవర్‌పై సూర్యాపేట టౌన్ పోలీసులు నమోదు చేశారు. కేసు పురోగతిపై నివేదికను పోలీసులు కోర్టుకు పంపినట్లు తెలిసింది. -
జగన్ సభలకు ముమ్మర ఏర్పాట్లు
హుజూర్నగర్/కోదాడ టౌన్, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్సీపీ అభ్యర్థులను గెలిపిం చాలని కోరుతూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఇందుకోసం ఆ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో స్థానికంగా ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. హుజూర్‌నగర్‌లోని సాయిబాబా థియేటర్ పక్కనున్న నగర పంచాయతీ స్థలం లో సభా వేదికను ఏర్పాటు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ఆవిర్భావం తర్వాత హుజూర్నగర్ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్న వైఎస్.జగన్మోహన్రెడ్డిని చూసేందుకు వేలా దిమంది ప్రజలు ఎంతో అభిమానంతో ఎదురుచూస్తున్నారు. గతంలో రెండుసార్లు ఓదార్పుయాత్ర తేదీలు ఖరారైనా అనివార్య కారణాల వల్ల అవి వాయిదా పడ్డాయి. హుజూర్‌నగర్‌లో వైఎస్సార్సీపీ ఇప్పటికే బలమైన పార్టీగా ఉంది. వైఎస్సార్సీపీ ఏర్పడ్డాక నియోజకవర్గంలో మొదటిసారిగా జరుగుతున్న సాధారణ ఎన్నికల్లో పార్టీ సత్తా చాటేందుకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఇప్పటికే తీవ్రంగా కృషి చేస్తున్నారు. వైఎస్.జగన్ పర్యటనతో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూరే అవకాశం మెండుగా కనిపిస్తుంది. అంతేగాక సభకు ప్రజలు వేలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో సభాప్రాంగణంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి పర్యవేక్షణలో ఏర్పాట్లు చేస్తున్నారు. కోదాడలో... జననేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి శనివారం కోదాడలో నిర్వహించే బహిరంగ సభకు ఆ పార్టీ నాయకులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. పట్టణంలోని ఖమ్మం క్రాస్‌రోడ్డులో సభను ఏర్పాటు చేస్తున్నట్లు ఆ పార్టీ నల్లగొండ పార్లమెంట్ సభ్యుడు గున్నం నాగిరెడ్డి, కోదాడ అసెంబ్లీ అభ్యర్థి ఎర్నేని బాబులు తెలిపారు. నియోజకవర్గంలోని పలు గ్రామాల నుండి వేలాదిమంది వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్ అభిమానులు సభకు తరలివచ్చే అవకాశం ఉందని వారు తెలిపారు. పట్టణ పరిధిలోని బైపాస్‌రోడ్డు వద్ద ెహ లిప్యాడ్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో ఆయన సభాస్థలికి చేరుకుంటారు. శనివారం సభా ప్రాంగణాన్ని శుభ్రం చేయించడంతో పాటు వేదిక ఏర్పాట్లను పూర్తి చేశారు. ఈ కార్యక్రమంలో అభ్యర్థులతో పాటు పట్టణ నాయకులు తుమ్మలపల్లి భాస్కర్, పెంట్యాల పాపారావు, నెమ్మాది భాస్కర్, తోట ఆదిత్య, కర్ల సుందర్‌బాబు, జమీల్, లైటింగ్ ప్రసాద్‌లు పాల్గొన్నారు. సభలను జయప్రదం చేయాలి గట్టు శ్రీకాంత్‌రెడ్డి హుజూర్నగర్, కోదాడలలో జరిగే వైఎస్సార్ జనభేరి సభలను విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి గట్టు శ్రీకాంత్‌రెడ్డి కోరారు. శుక్రవారం స్థానిక సాయిబాబా థియేటర్ సమీపంలోని సభ నిర్వహణ స్థలంలో ఏర్పాట్లను ఆయన పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పార్టీ ఆవిర్భా వం తర్వాత మొదటిసారిగా నియోజకవర్గ పర్యటనకు వస్తున్న పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డికి నియోజకవర్గ ప్రజలు భారీగా స్వాగ తం పలకనున్నట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు, సానుభూతిపరులు, అనుబంధసంఘాల కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొని సభను జయప్రదం చేయాలన్నారు. ఆయన వెంట ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలి
వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి హుజూర్నగర్, న్యూస్‌లైన్ స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎ స్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటేందుకు పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. నేరేడుచర్ల మండలం మహంకాళిగూడానికి చెందిన పలువురు కార్యకర్తలు సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా పార్టీలో చేరిన వారికి ఆయన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించా రు. అనంతరం ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి సంక్షేమ పథకాల వల్ల అ నేక మంది బడుగు, బలహీనవర్గాల వారికి లబ్ధి చేకూరిందన్నారు. వైఎస్ మరణానంతరం కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను కొనసాగించకుండా, ప్రజల సమస్యలను పట్టించుకోకుండా పదవులను అనుభవించి కాలయాపన చేసిందన్నారు. కాంగ్రెస్ పాలన వైఫల్యం వల్లనే నేడు రాష్ట్రంలో వరుస ఎన్నికలు వచ్చాయన్నారు. జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలలో అత్యధిక స్థానాలను గెలుపొందేందుకు ప్రతి ఒక్కరూ సైనికుల్లాగా పనిచేయాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను, వైఎస్సార్ సంక్షేమ పథకాలను, పార్టీ లక్ష్యాలను ప్రతి గడప గడపకూ తెలియజేయాలన్నారు. పార్టీలో చేరిన వారిలో పిడమర్తి వినోద్, మురళి, రాము, వెంకట్రావు, దుర్గాప్రసాద్, మహేష్‌రెడ్డి, పవన్,సతీష్, రామాంజి, గోపి, ఉపేందర్, కోట్యా ఉన్నారు. కార్యక్రమంలో వైఎ స్సార్సీపీ నేరేడుచర్ల మండల అధ్యక్షుడు పోరెడ్డి నర్సిరెడ్డి పాల్గొన్నారు. మండల అధ్యక్షులు, జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుల నియామకం వైఎస్సాఆర్ సీపీ మునుగోడు నియోజకవర్గంలోని మండలాలకు వైఎస్సార్సీపీ మండల అధ్యక్షులను నియమిస్తూ ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి సోమవారం నియామక ఉత్తర్వులను జారీ చేశారు. మర్రిగూడెం మండ లానికి కొప్పు విజయ్‌కుమార్, చండూరు మం డలం మోదుగునాగిరెడ్డి, నారాయణపూర్ మండలం గూడూరు వెంకటరెడ్డి, నాంపల్లి మండలం రఘునందన్, మునుగోడు మండలం శ్రీనివాస్‌లను నియమించారు. అలాగే మునుగోడు నియోజకవర్గానికి చెందిన ఎండి.షరీఫ్, మల్లాది పవన్‌కుమార్‌లను వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులుగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. -
అన్ని స్థానాల్లో వైఎస్సార్సీపీ పోటీ
హుజూర్నగర్, న్యూస్‌లైన్: సార్వత్రిక, స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని అన్నిస్థానాలకు వైఎస్సార్ సీపీ అభ్యర్థులు పోటీ చేస్తారని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి చెప్పారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని రెండు ఎంపీ, 12 అసెంబ్లీ స్థానాలకు పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారన్నారు. జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కలిసి వచ్చే పార్టీలతో పొత్తులు పెట్టుకొని పోటీ చేయనున్నట్లు తెలిపారు. హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలలో మున్సిపాలిటీలు, ఎంపీపీ, జెడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ సీపీ కైవసం చేసుకునేందుకు కృషి చేస్తుందన్నారు. ైవె ఎస్సార్ పథకాలు, వైఎస్సార్ ఫొటోతో గెలుపొందిన మాజీ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియోజకవర్గంలో వైఎస్సార్ విగ్రహాలను కాల్చివేయించిన విషయాన్ని, వైఎస్సార్ సీపీ కార్యకర్తలు, నాయకులను హింసించిన విషయాలను ప్రజలు మరిచిపోలే దన్నారు. సమావేశంలో ఆ పార్టీ హుజూర్నగర్ పట్టణ, మండల అధ్యక్షులు అయిలవెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, జిల్లాస్టీరింగ్ కమిటీసభ్యులు పోతుల జ్ఞానయ్య, కోడి మల్లయ్యయాదవ్,పెదప్రోలు సైదులుగౌడ్, పీఏసీఎస్ డెరైక్టర్ జడరామకృష్ణ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో పలువురి చేరిక స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మేళ్లచెరువు, గరిడేపల్లి మండలం వెలిదండకు చెందిన వివిద పార్టీల నాయకులు వేర్వేరుగా ఆయన సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీ ఆవిర్భావం తర్వాత మొదటిసారిగా జరుగుతున్న ఎంపీటీసీ, జెడ్పీపీటీసీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను అత్యధిక స్థానాల్లో గెలిపించుకోలన్నారు. కార్యక్రమంలో మేళ్లచెరువు, గరిడేపల్లి మండల పార్టీ అధ్యక్షుడు చిలకల శ్రీనివాసరెడ్డి, బొల్లగాని సైదులుగౌడ్, నాయకులు నర్సింహారావు, వెంకన్నస్వామి, మల్లయ్య, కోటయ్య, అన్నెపంగు రామయ్య, రామకృష్ణారెడ్డి, పెండెం ముత్యాలుగౌడ్, గుండు రామాంజిగౌడ్, కర్నాటి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
అసెంబ్లీకి అంతంతే..
నల్లగొండ, న్యూస్‌లైన్ : చట్ట సభలకు ప్రాతినిధ్యం వహించడంలో జిల్లా మహిళలకు సముచిత స్థానం లభించలేదనే చెప్పవచ్చు. 1952 నుంచి 2009 దాకా శాసనసభకు జరిగిన ఎన్నికల ఫలితాలను పరిశీలిస్తే బోధప డుతుంది. వచ్చే నెలలో జరిగే సార్వత్రిక ఎన్నికల్లోనైనా మహిళా ప్రాతినిధ్యం పెరుగు తుందని ఆశిద్దాం. అసెంబ్లీకి...ఆరుట్ల మొదలు రాష్ట్ర అవతరణకు ముందు తెలంగాణ సాయుధ పోరాటంలో ముందుండి నడిపించిన ఆరుట్ల కమలాదేవి తొలిసారిగా 1952లో ఆలేరు నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలుపొందారు. ఆమెతో మొదలైన మహిళల రాజకీయ ప్రస్థానం గత ఎన్నికల వరకు కొనసాగింది. ఇదే ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సుమిత్రాదేవి ఓటమిపాలయ్యారు. ఆ తర్వాత నుంచి జరిగిన వరుస ఎన్నికల్లో పలువురు మహిళలు పోటీ చేసి ఓటమిపాలైనా చట్టసభల్లో అడుగుపెట్టేందుకు తమ వంతు ప్రయత్నమే చేశారు. ఇక రాష్ట్ర అవతరణ తర్వాత అంటే 1957, 1962లో కూడా ఆరుట్ల కమలాదేవి ఆలేరు నుంచి పోటీ చేసి గెలుపొందారు. తెలంగాణ సాయుధ పోరాటంతో చరిత్రలో నిలిచిన కమలాదేవి మూడుసార్లు గెలుపొందడం పెద్ద హ్యాట్రిక్‌గా చెప్పొచ్చు. కమ్యూనిస్టు కంచుకోటగా పేరొందిన నకిరేకల్ సెగ్మెంట్ నుంచి 1972లో కాంగ్రెస్ తరపున తొలి మహిళ అభ్యర్థి మూసాపేట కమలమ్మ గెలుపొంది రికార్డు సృష్టించారు. తెలంగాణ సాయుధ పోరాటం, మద్యపాన వ్యతిరేక ఉద్యమం, ఇతర ప్రజా ఉద్యమాలతో చరిత్రకెక్కిన మల్లు స్వరాజ్యం తుంగతుర్తి నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 1983 ఎన్నికల్లో టీడీపీ తరపున నల్లగొండ నుంచి పోటీ చేసిన గడ్డం రుద్రమదేవి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా మోహన్‌రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే ఆ తర్వాత 1985లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె నల్లగొండ అసెంబ్లీ నుంచి పోటీ చేసి గెలుపొందారు. 1989 ఎన్నికల్లో మహిళలకు ప్రాతినిధ్యం లభించలేదు. కానీ 1994, 99 ఎన్నికల్లో తుంగతుర్తి, మిర్యాలగూడ అసెంబ్లీ స్థానాల నుంచి పోటీచేసిన మల్లు స్వరాజ్యం, సుందరి అరుణలు ఓటమి పాలయ్యారు. నక్సలైట్ల చేతిలో మాజీ హోంమంత్రి దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి హత్యకు గురైన తర్వాత ఆయన సతీమణి ఉమా మాధవరెడ్డి రాజకీయ ప్రవేశం చేశారు. మాధవరెడ్డి మరణంతో 2000 సంవత్సరంలో జరిగిన ఉప ఎన్నికల్లో భువనగిరి నుంచి ఉమామాధవరెడ్డి ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత జరిగిన 2004, 2009 ఎన్నికల్లో ఆమె భువనగిరి నుంచి పోటీ చేసి రెండుసార్లు గెలుపొందారు. మొత్తంగా ఉమామాధవరెడ్డి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడంతో పాటు, రాష్ట్ర మంత్రిగా కూడా పనిచేశారు. నక్సలైట్ల కాల్పుల్లో అకాల మరణం చెందిన మరోనేత, గిరిజన నాయకుడు మాజీ ఎమ్మెల్యే రాగ్యానాయక్ సతీమణి భారతీ రాగ్యానాయక్ రాజకీయాల్లోకి వచ్చారు. 2002లో దేవరకొండలో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత వరుసగా శాసన మండలికి ప్రాతినిధ్యం వహించారు. దీంతో పాటు ప్రభుత్వ చీప్‌విప్‌గా కూడా పనిచేశారు. పార్లమెంట్ స్థానాలకు వేర్వేరుగా తల్లీకూతురు పోటీ చేసి ఓరికార్డు నెలకొల్పారు. 1996లో అప్పటి మిర్యాలగూడ ఎంపీ స్థానానికి మల్లు స్వరాజ్యం పోటీచేశారు. కానీ ఆమె బద్దం నర్సింహారెడ్డి చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత 2009 ఎన్నికల నాటికి ఆమె కూతురు పాదూరి కరుణ పోటీ చేసే అవకాశం దొరికింది. ఆమె 2009 ఎన్నికల్లో నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ప్రజారాజ్యం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి గుత్తా సుఖేందర్‌రెడ్డి -
హుజూర్నగర్ మండల రిసోర్స్ కార్యాలయంలో అగ్నిప్రమాదం
-
హత్యా రాజకీయాలను నిరసించాలి
హుజూర్నగర్, న్యూస్‌లైన్ : హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తూ, ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే వారికి ప్రజలు తగిన రీతిలో గుణపాఠం చెప్పడం ఖాయమని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ గట్టు శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. హుజూర్‌నగర్‌లోని తన స్వగృహంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మునగాల మండలం నర్సింహులగూడెం సర్పంచ్ పులీందర్‌రెడ్డి హత్యను ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. పంచాయతీ ఎన్నికల నాటి నుంచి నర్సింహుల గూడెంలో ఉద్రిక్తత నెలకొన్నప్పటికీ ప్రశాంతత నెలకొల్పడంలో పోలీసులు నిర్లక్ష్యం వహించారని ఆరోపించారు. ప్రజల మద్దతుతో సర్పంచ్‌గా గెలిచిన అభ్యర్థిని హత్య చేయడం అంటే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనన్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఇలాం టి దౌర్జన్య రాజకీయాల వెనుక ఎవరి అండ ఉందో వెం టనే పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలన్నారు. ఇలాం టి చర్యలు ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు అన్నారు. పులీందర్‌రెడ్డిని హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఆయన మృతికి తమ పార్టీ సంతాపం వ్యక్తం చేస్తుందని, ఆ కుటుంబానికి పార్టీ నిరంతరం అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో ఆ పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యులు కోడి మల్లయ్యయాదవ్, హుజూర్నగర్ పట్టణ, మండల కన్వీనర్లు అయిల వెంకన్నగౌడ్, వేముల శేఖర్‌రెడ్డి, మేళ్లచెరువు, మఠంపల్లి మండల కన్వీనర్లు చిలకల శ్రీనివాసరెడ్డి, జాలా కిరణ్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ప్లీనరీ జిల్లా ప్రతినిధుల నియామకం ఈనెల 2న ఇడుపులపాయలో జరిగే వైఎస్సార్సీపీ ప్లీనరీ సమావేశానికి జిల్లా ప్రతినిధులుగా ఇరుగు సునీల్‌కుమార్, మేకల ప్రదీప్‌రెడ్డిని నియమించినట్లు గట్టు శ్రీకాం త్‌రెడ్డి వెల్లడించారు. జిల్లా నుంచి ప్లీనరీకి హాజరవుతున్న పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంబంధించిన ఎటువంటి అవసరాలు ఉన్నా వారి దృష్టికి తీసుకెళ్లాలన్నారు. -
నిర్వాసితులపై దౌర్జన్యమా..?
పులిచింతలప్రాజెక్ట్(హుజూర్నగర్), న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి వెళ్లిన ముంపు బాధితులను పోలీసులు చెక్‌పోస్టులు పెట్టి మరీ అడ్డుకున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై నిర్మించిన పులిచింతల ప్రాజెక్ట్‌ను శనివారం ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఆర్భాటంగా ప్రారంభించారు. ప్రాజెక్ట్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైన నాటినుంచే పులిచింతల బాధితులు తమకు పూర్తిస్థాయి నష్టపరిహారం అందజేశాకే ప్రారంభించాలని, లేనిపక్షంలో అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటనను అడ్డుకుంటారన్న సాకుతో ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్ద నుంచి మేళ్లచెరువు మండలం వైపు అడుగడుగునా పోలీసు చెక్‌పోస్టులు పెట్టారు. బాధితులతోపాటు జెన్కో ఉద్యోగులు, ఇతరులు వెళ్లకుండా కట్టడి చేశారు. కనీసం మీడియా వారిని కూడా అనుమతించలేదు. దీంతో కవరేజికి వెళ్లిన ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియా వారు పోలీసుల చర్యలను నిరసిస్తూ ప్రాజెక్ట్ మెయిన్ గేట్ వద్ద ప్రధాన రహదారిపై రాస్తారోకో చేశారు. ఈ క్రమంలో కొందరు పోలీసు ఉన్నతాధికారులు స్పందించి గుర్తింపుకార్డులను పరిశీలించి విలేకరులను మాత్రమే అనుమతించారు. పులిచింతల బాధితులను మాత్రం ఒక్కరినీ కూడా అనుమతించలేదు. పోలీసుల ఆధీనంలో ప్రాజెక్టు ప్రాజెక్ట్ ప్రధాన ద్వారం నుంచి కుడివైపు ప్రారంభానికి సిద్ధం చేసిన పైలాన్ వరకు భారీగా పోలీసులను మోహరించారు. ప్రాజెక్ట్‌పై అధికారులు, పోలీసులు తప్ప మరెవరూ కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. పులిచింతల బాధితులను అనుమతిస్తే పర్యటనలో గందరగోళం జరుగుతుందని ముందుగానే పసిగట్టిన పోలీసు ఉన్నతాధికారులు శుక్రవారం రాత్రి నుంచే ప్రాజెక్ట్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. అంతేగాక ప్రాజెక్ట్ ప్రారంభానికి ముందుగా 11 గంటల సమయం నిర్ణయించగా ముఖ్యమంత్రి కిరణ్ కుమార్‌రెడ్డి మధ్యాహ్నం 1.07 గంటలకు పైలాన్ వద్దకు చేరుకొని ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. 1.10 గంటలకు పైలాన్‌ను ప్రారంభించారు. అయితే మేళ్లచెరువు మండలానికి చెందిన పులిచింతల బాధితులను కట్టడి చేసేందుకు భారీగా పోలీసులను మోహరించడంతోపాటు డీఐజీ నవీన్‌చంద్, ఎస్పీ ప్రభాకర్‌రావులు స్వయంగా బందోబస్తు పర్యవేక్షించారు. ప్రాజెక్ట్‌పై ముఖ్యమంత్రి 20 నిముషాల్లో తన పర్యటన పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. ఎలాంటి గందరగోళం లేకుండా సాఫీగా జరగడంతో పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. అప్పటి వరకు ప్రాజెక్ట్ మెయిన్ గేటు వద్దకు చేరుకున్న కొందరు పులిచింతల బాధితులు తమకు నష్టపరిహారం అందజేయకుండానే నిర్మాణం పూర్తిగాని ప్రాజెక్ట్‌ను ప్రారంభించేందుకు పోలీసులతో తమను ఆపివేయడం అన్యాయమంటూ ఆవేదన వ్యక్తం చేశారు. -
హడావుడి వెనుక ఆంతర్యమేమిటో?
హుజూర్నగర్,న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ అనేక దఫాలుగా పనులు కొనసాగించిన ప్రభుత్వం పనులు పూర్తిస్థాయిలో ముగియకముందే ప్రారంభానికి సిద్ధంకావడం వెనక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల బాధితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయలేదు. బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు బాధితుల గృహ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి. ప్రాజెక్ట్‌ను ఈ నెల 27 లేదా 30న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రారంభించేందుకు హడావుడిగా తేదీ ప్రకటించి సన్నాహాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై రూ.1260 కోట్లతో కృష్ణాడెల్టా పరిధిలోని 13లక్షల 8వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తికాగా, ముంపుబాధితుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి. పునరావాస కేంద్రాల్లో కొనసా..గుతున్న పనులు మేళ్లచెరువు మండలంలోని నెమలిపురి, చింతిర్యాల, కిష్టాపురం, అడ్లూరు, వెల్లటూరు, పీక్లానాయక్‌తండా, తంబారం, రేపల్లె, శోభనాద్రిగూడెం, నేరేడుచర్ల మండలంలోని రావిపాడ్, గుండెబోయినగూడెం, మఠంపల్లి మండలంలోని గుండ్లపాడ్, సుల్తాన్పూర్తండాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకుదోరకుంట, గుడిబండ, మేళ్లచెరువు, కిష్టాపురం అడ్డరోడ్డు, నక్కగూడెం, చింతిర్యాల, తంబారం, శోభనాద్రిగూడెం, పీక్లానాయక్‌తండా, పెదవీడు సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పునరావాస కేంద్రాలలో పనులు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం అడ్డరోడ్డు పునరావాస కేంద్రంలో మాత్రమే కొన్ని కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు. మిగిలిన కేంద్రాలలో ఎక్కడా కూడా బాధితులు గృహ ప్రవేశాలు చేయలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాలలోనే నివాసం ఉంటూ సమీప సాగుభూములలో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. అంతేగాక నెమలిపురి, చింతిర్యాల, నక్కగూడెం రెండో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల సంబంధిత అధికారులు సర్వేలు నిర్వహించారు. భూ సేకరణ చేసి నక్కగూడెం, చింతిర్యాల పునరావాస కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే చేశారు. అయితే నెమలిపురి పునరావాస కేంద్రం ఏర్పాటుకు సేకరించిన భూమి విషయంలో సమస్యలు ఉండటంతో నేటి వరకు పునరావాస కేంద్రం పనులు ప్రారంభం కాలేదు. -
ఉలిక్కిపడిన ఉత్తమ్
సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార దుర్వినియోగానికి ఓ ప్రజాప్రతినిధి ఎలా పాల్పడవచ్చో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి నేర్చుకోవచ్చని వైఎస్సార్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మొన్నటి భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలను సందర్శించి, ఓదార్చాలనుకున్నారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలో తన పర్యటన ముగించుకుని మధ్యాహ్నం జిల్లాకు రావడానికి సిద్ధమయ్యారు. కానీ పూర్తిగా అధికార కాంగ్రెస్ నేతలకు జీ ‘హుజూర్..’ అంటున్న పోలీసులు విజయమ్మను జిల్లా సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు. రెండురోజులుగా హుజూర్‌నగర్‌లో మకాం వేసిన మంత్రి ఉత్తమ్ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో విజయమ్మను అడుగుపెట్టనిచ్చేది లేదంటూ పభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. రవాణా శాఖ అధికారుల(ఎంవీఐ)లతో ఆటో యజ మానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. అయినా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజూర్నగర్, కోదాడ నియోజకవర్గాలకు తరలివస్తుండగా చిలుకూరు వద్ద అడ్డుకుని వెనక్కి పంపారు. ఎలాగోలా కోదాడకు చేరుకున్న పార్టీ నేతలను సరిహద్దులోని శాంతినగర్ వద్దే ఆపేసి వెనక్కి పంపారు. ఎంతోపెద్ద ఎత్తున శాంతిభద్రతల సమస్య తలెత్తిన సందర్భంలో మాత్రమే వినియోగించేంతటి స్థాయిలో పోలీసుల బలగాలను దింపారు. ఏకంగా నాలుగు జిల్లాల పోలీసు అధికారులను ఇక్కడ మోహరించారు. నల్లగొండతోపాటు, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పోలీసు అధికారులను ఇక్కడకు రప్పించారంటే ఏస్థాయిలో మంత్రి ఒత్తిళ్లు పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏమీ లేని చోట ఉద్రిక్తతకు కారణమయ్యారు. జిల్లా పర్యటనకు వస్తున్న విజయమ్మకు శాంతియుతంగానే తమ నిరసన తెలుపుతామని తెలంగాణ జేఏసీ, టీఆర్ఎస్ ప్రకటించగా స్థానికంగా ఉన్న నాయకులను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొచ్చారు. వీలైతే విధ్వంసం సృష్టించేందుకు ప్రత్యేక వాహనాల్లో నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి మందిని తీసుకువచ్చారు. కోదాడ, హుజూర్నగర్ తమకు రాసిచ్చిన నియోజకవర్గాలు, ఏ పార్టీ వారు తిరగడానికి వీల్లేదన్నంతగా మంత్రి వ్యవహారం నడిపారు. చివరకు మంత్రి భార్య కూడా కోదాడలో హల్చల్ చేయడం చూస్తే.. ఇది వారి రాజకీయ వ్యక్తిగత ఎజెండాలో భాగంగా నడిచిన కథని పలువురు వ్యాఖ్యానించారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్నగర్, మేళ్లచెర్వు, చిలుకూరు, కోదాడ మండలాల్లో రాత్రికి రాత్రే వైఎస్ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయించారు. కోదాడలో విగ్రహం విధ్వంసానికి ప్రధాన కారకుడు ఉత్తమ్ అని కోదాడ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆరోపించారు. హుజూర్నగర్లోనూ మంత్రి అనుచరులు భయోత్పాతం సృష్టించారు. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనంతో హడావిడి చేశారు. రెండు రోజులపాటు కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల్లో ఉద్రిక్తతకు మంత్రి ఉత్తమ్ ప్రత్యక్షంగా కారణమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు కొందరు టీఆర్ఎస్ నాయకులకు ఫోన్లు చేసి విజయమ్మ పర్యటనను అడ్డుకునేందుకు తమకు సహకరించాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నేతలకు ఫోన్లు చేసి అడ్డుకోవాలని ప్రకటనలు ఇవ్వాల్సిందిగా, ఆయా జేఏసీ నుంచి జనాన్ని పంపించి అండగా ఉండాలని కూడా కోరారు. కోదాడలోని దాదాపు అన్ని విద్యాసంస్థలకు ఫోన్లు చేసి విద్యార్థులను పంపించి, రోడ్లపై బైఠాయించాలని కూడా కోరారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే కేవలం తన రాజకీయ భవిష్యత్, రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విజయమ్మ పర్యటనకు తీవ్రమైన అడ్డంకులు సృష్టించారన్న అభిప్రాయం కలుగుతోంది.