పది నిమిషాలైతే...గమ్యస్థానానికి చేరేవారు...
అంతలోనే మృత్యువు తరుముకొస్తున్నట్లుగా...వరికోత యంత్రం రాంగ్‌రూట్‌లో వచ్చి బైక్‌ను ఢీకొట్టింది...గుండెల్లో గునపాలు దిగినట్టుగా... హార్వెస్టర్ ఇనుపరాడ్లు...ఇద్దరి గుండెల్లో గుచ్చుకున్నాయి...తండ్రి ఎగిరిపడగా...కూతురు ఆ రాడ్లకు చిక్కుకుపోయింది...ఈ దృశ్యం...అందరినీ కంటతడి పెట్టించింది....తండ్రి, అక్క విగతజీవులయ్యారు..అమ్మ గాయాలతో ఆస్పత్రిలో చేరింది...ఏం జరిగిందో తెలియక...ఆ చిన్నారి వెక్కివెక్కి ఏడుస్తున్నాడు...సొంతూరికి వెళుతున్నామన్న ‘సంతోషమే’ లేదు...
అయ్యప్ప పూజకు బైక్‌పై వెళ్తున్న ఓ కుటుంబానికి అనుకోని ఆపదఎదురైంది.. మరో పదినిమిషాలు గడిస్తే గమ్యస్థానానికి చేరుకునే వారు.. విధి వక్రీకరించింది.. మృత్యురూపంలో వచ్చిన వరికోత యత్రం.. ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది.. రాంగ్‌రూట్‌లో వచ్చిన యంత్రం బైక్‌ను ఢీకొనగా ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరు ప్రాణాలతో బయటపడ్డారు. వేములపల్లి మండలం గుర్రప్పగూడెం గ్రామానికి చెందిన గుడిపల్లి వెంకట్‌రెడ్డి (34) హుజూర్‌నగర్‌లో బ్యాటరీల దుకాణం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. పదేళ్ల పాటు మిర్యాలగూడలోని ఓ ప్రైవేటు బ్యాటరీల కంపెనీలో పనిచేశాడు. ఆరేళ్ల క్రితం జ్యోతిని పెళ్లి చేసుకుని హుజూర్‌నగర్‌లో దుకాణం ఏర్పాటు చేసుకున్నాడు. వీరికి శ్రీజ(4), సంతోష్‌రెడ్డి జన్మించారు.
కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని స్వగ్రామంలో గురువారం తన కుటుం బం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయ్యప్పస్వామి పూజల్లో పాల్గొనేందుకు భార్య, పిల్లలతో కలిసి బైక్‌పై బయలుదేరాడు. మరో అర కిలోమీటరు వెళితే రహదారి ని క్రాస్ చేసి తన గ్రామం వెళ్లే రోడ్డు వైపు చేరుకునేవాడు. ఇంతలోనే మృత్యువు రూపంలో రాంగ్ రూట్‌లో వచ్చిన వరికోత యంత్రం మాడ్గులపల్లి సమీపంలో బైకును ఎదురుగా ఢీకొట్టింది. దీంతో ముందు కూర్చొని ఉన్న కూతు రు శ్రీజ (4), వెంకట్‌రెడ్డి ఎగిరి యంత్రంపై పడడంతో రాడ్లు గుచ్చుకుని అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. బైక్‌పై వెనక కూర్చున్న వెంకట్‌రెడ్డి భార్య, రెండేళ్ల కుమారుడు సంతోష్‌రెడ్డి పక్కకుపడడంతో జ్యోతికి గాయాలయ్యా యి. సంతోష్‌రెడ్డికి ఏలాంటి గాయాలు కాలేదు. స్థానికు లు గాయపడిన జ్యోతిని, ఆమె కుమారుడిని జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో తల్లిదండ్రి కనిపించకపోవడంతో బేలాగా రోదిస్తున్న సంతోష్‌రెడ్డిని చూసి పలువురు కంటతడి పెట్టుకున్నారు.
కలచివేసిన ప్రమాద దృశ్యాలు
మాడ్గులపల్లి వద్ద జరిగిన ప్రమాద దృశ్యాలు ప్రతి ఒక్కరినీ కలచివేసింది. మరికొంత మంది అయితే కళ్లు తిరిగి పడిపోయారు. గ్రామస్తులు, బంధువులు వరికోత యంత్రానికి ముందు రాడ్లు పెట్టుకుని వెళ్లకుండా చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. అలాగే అర్ధగంట సేపు రాస్తారోకో చేశారు. పోలీసులు సర్థిచెప్పి మృతదేహాలను నల్లగొండ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుర్రప్పగూడెంలో విషాదఛాయలు
గుర్రప్పగూడెం(వేములపల్లి) : అందరితో కలుపుగోలుగా ఉండే వెంకట్‌రెడ్డి గ్రామంలోని లక్ష్మీ నర్సింహస్వామి ఆలయ నిర్మాణానికి ఆర్థిక సహాయాన్ని అందజేశాడు. తన కుటుంబం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అయ్యప్ప పూజలో పాల్గొనేందుకు వస్తూ కూతురితో సహా వెంకట్‌రెడ్డి మృతిచెందడంతో గుర్రప్పగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. పూజతో సందడిగా ఉండాల్సిన భిక్షంరెడ్డి ఇంట్లో రోదనలు మిన్నంటాయి. గ్రామస్తులు పెద్ద సంఖ్యలో భిక్షంరెడ్డి ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులను ఓదార్చారు.