హుజూర్‌నగర్,న్యూస్‌లైన్: పులిచింతల ప్రాజెక్ట్ నిర్మాణం ఎప్పటికప్పుడు వాయిదా వేస్తూ అనేక దఫాలుగా పనులు కొనసాగించిన ప్రభుత్వం పనులు పూర్తిస్థాయిలో ముగియకముందే ప్రారంభానికి సిద్ధంకావడం వెనక ఆంతర్యమేమిటో అర్థం కాని పరిస్థితి నెలకొంది. ముంపు గ్రామాల బాధితులకు నేటికీ పూర్తిస్థాయిలో నష్టపరిహారం అందజేయలేదు. బాధితులకు ఏర్పాటుచేసిన పునరావాస కేంద్రాల నిర్మాణాలు కూడా పూర్తికాలేదు. ప్రస్తుతం మౌలిక వసతుల కల్పన, అంతర్గత రహదారుల నిర్మాణంతోపాటు బాధితుల గృహ నిర్మాణాల పనులు జరుగుతున్నాయి.
ప్రాజెక్ట్‌ను ఈ నెల 27 లేదా 30న ముఖ్యమంత్రి ఎన్.కిరణ్‌కుమార్‌రెడ్డితో ప్రారంభించేందుకు హడావుడిగా తేదీ ప్రకటించి సన్నాహాలు చేస్తుండడంతో ప్రాజెక్ట్ బాధితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మేళ్లచెరువు మండలం వజినేపల్లి వద్ద కృష్ణానదిపై రూ.1260 కోట్లతో కృష్ణాడెల్టా పరిధిలోని 13లక్షల 8వేల ఎకరాలకు సాగు నీరందించేందుకు పులిచింతల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం 45.77 టీఎంసీలు. ప్రాజెక్టు పనులు 90శాతం పూర్తికాగా, ముంపుబాధితుల సమస్యలు ఎక్కడివి అక్కడే ఉన్నాయి.
పునరావాస కేంద్రాల్లో కొనసా..గుతున్న పనులు
మేళ్లచెరువు మండలంలోని నెమలిపురి, చింతిర్యాల, కిష్టాపురం, అడ్లూరు, వెల్లటూరు, పీక్లానాయక్‌తండా, తంబారం, రేపల్లె, శోభనాద్రిగూడెం, నేరేడుచర్ల మండలంలోని రావిపాడ్, గుండెబోయినగూడెం, మఠంపల్లి మండలంలోని గుండ్లపాడ్, సుల్తాన్‌పూర్‌తండాలు ఉన్నాయి. ఈ గ్రామాల ప్రజలకుదోరకుంట, గుడిబండ, మేళ్లచెరువు, కిష్టాపురం అడ్డరోడ్డు, నక్కగూడెం, చింతిర్యాల, తంబారం, శోభనాద్రిగూడెం, పీక్లానాయక్‌తండా, పెదవీడు సమీపంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఆయా పునరావాస కేంద్రాలలో పనులు నేటి వరకు కొనసాగుతూనే ఉన్నాయి. ఎక్కడా పూర్తిస్థాయిలో పూర్తయిన దాఖలాలు కనిపించడం లేదు. మేళ్లచెరువు మండలం కిష్టాపురం అడ్డరోడ్డు పునరావాస కేంద్రంలో మాత్రమే కొన్ని కుటుంబాల వారు నివాసం ఉంటున్నారు.
మిగిలిన కేంద్రాలలో ఎక్కడా కూడా బాధితులు గృహ ప్రవేశాలు చేయలేదు. ప్రస్తుతం ఆయా గ్రామాలలోనే నివాసం ఉంటూ సమీప సాగుభూములలో పంటలు పండించుకుంటూ జీవిస్తున్నారు. అంతేగాక నెమలిపురి, చింతిర్యాల, నక్కగూడెం రెండో పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు ఇటీవల సంబంధిత అధికారులు సర్వేలు నిర్వహించారు. భూ సేకరణ చేసి నక్కగూడెం, చింతిర్యాల పునరావాస కేంద్రాల నిర్మాణానికి శంకుస్థాపన మాత్రమే చేశారు. అయితే నెమలిపురి పునరావాస కేంద్రం ఏర్పాటుకు సేకరించిన భూమి విషయంలో సమస్యలు ఉండటంతో నేటి వరకు పునరావాస కేంద్రం పనులు ప్రారంభం కాలేదు.
హడావుడి వెనుక ఆంతర్యమేమిటో?
Published Sat, Nov 23 2013 4:36 AM | Last Updated on Sat, Sep 2 2017 12:52 AM
Advertisement
Advertisement