
హుజుర్‌నగర్ సభలో సన్నబియ్యం పథకంపై రేవంత్
సూర్యాపేట జిల్లా: శ్రీమంతుడు తినే సన్నబియ్యం పేదవాడు తినాలన్న ఉద్దేశంతో ఈ పథకం ప్రారంభిస్తున్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హుజూర్ నగర్ సభలో సన్నబియ్యం పథకాన్ని లాంఛనంగా ప్రారంభించిన సీఎం.. అనంతరం మాట్లాడారు. ఈ సన్న బియ్యం పథకం మామూలు పథకం కాదన్నారు. సాయుధ రైతాంగం, ఇందిరా గాంధీ రోటీ కప్డా ఔర్ మకాన్ తర్వాత అంతటి గొప్ప పథకం సన్నబియ్యం పథకమన్నారు. ఉగాది నాడు పథకాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. సీఎం రేవంత్ ప్రసంగంలోని ముఖ్యాంశాలు..
‘నల్లగొండ ప్రాంతం చైతన్యానికి మారుపేరు. 25 లక్షల ఎకరాల భూములను ఇందిరా గాంధీ పేదలకు పంచిపెట్టింది ఇప్పటికీ ఇళ్లలో దేవుడు ఫోటో పక్కన ఇందిరా గాంధీ ఫోటో పెట్టుకుంటున్నారు. రూ. 1.90 కే బియ్యం పథకం తీసుకొచ్చారు. 1957 లోనే నెహ్రూ హయాంలో పీడీఎస్ విధానాన్ని తీసుకొచ్చింది. గత ప్రభుత్వం 21 వేల కోట్ల ధాన్యాన్ని మిల్లర్లకి కట్టబెట్టారు. మిల్లర్లు పీడీఎస్ బియ్యం రిసైక్లింగ్ చేస్తున్నారు. 10 వేల కోట్ల రూపాయల దొడ్డుబియ్యం మిల్లర్లు, దళారుల చేతుల్లోకి వెళ్తోంది.
ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోల సన్నబియ్యం
అందుకే సన్నబియ్యం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతీ ఒక్కరికీ ఆరు కిలోలు ఇవ్వాలని ఆలోచన చేశాం. దేశంలోనే తొలిసారి సన్నబియ్యం ఇస్తున్నాం. 80 వేల పుస్తకాలు చదివిన వ్యక్తి పదేళ్లు సన్నబియ్యం ఎందుకు ఇవ్వలేదు. వరి వేస్తే ఉరి వేసుకున్నట్లే అని బెదిరించిండు. ఆయన ఫాంహౌస్ లో వెయ్యి ఎకరాల్లో వరి వేశాడు. ఆ ధాన్యాన్ని 4500 రూపాయలకు క్వింటాల్ చొప్పున కావేరి సీడ్స్ కొనుగోలు చేసింది. సన్నధాన్యం పండిస్తే క్వింటాల్ కి ఐదు వందలు బోనస్ ఇస్తున్నాం. అత్యధికంగా సన్నధాన్యం పండించేది నల్లగొండ రైతులే. అత్యధికంగా రైతు రుణమాఫీ పొందింది నల్లగొండ రైతులే
ఈ పథకం రద్దు చేసే ధైర్యం ఏ సీఎం చేయడు
సన్నబియ్యం పథకం రద్దు చేసే ధైర్యం భవిష్యత్తులో ఏ సీఎం చేయడు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ను పదేళ్లు కేసీఆర్ పట్టించుకోలేదు. సంవత్సరానికి కిలోమీటర్ చొప్పున తవ్వినా టన్నెల్ పూర్తయి 3.30 లక్షల ఎకరాలకు నీరు అందేది. నల్లగొండ జిల్లా ప్రజలపై కోపంతోనే టన్నెల్ ను పూర్తి చేయలేదు. ఉత్తమ్ నాయకత్వంలో అన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చేస్తాం.
రూ. లక్ష కోట్లతో నిర్మించిన కాళేశ్వరం మూడేళ్లలో కుప్పకూలింది. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రపంచంలో ఎనిమిదో వింత కాదు. ప్రపంచంలో ఏకైక వింత. మూడేళ్లలో లక్ష కోట్లు మింగినందుకు మిమ్మల్ని ఉరేసినా తప్పులేదు. కాళేశ్వరం కుప్పకూలిపోయినా 1.56 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించాం. మా ఆలోచనలో లోపం లేదు. ప్రజా సేవ చేయడానికే నేను వచ్చా . 2006 లో జెడ్పీటీసీ గా రాజకీయం మొదలుపెట్టి ఈనాడు సీఎంగా ఉన్నా. శకునం పలికే బల్లి కుడితిలో పడినట్లు అయింది బీఆర్ఎస్ పరిస్థితి. నాకు కేసీఆర్ కు నందికి పందికి ఉన్న పోలిక ఉంది
నాకు కేసీఆర్‌తో పోలిక ఏంటి?
నాతో నీకు పోలిక ఏంటి కేసీఆర్. పదేళ్లలో కేసీఆర్ 16 వేల కోట్ల రుణమాఫీ చేస్తే అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే 20 వేల కోట్ల రుణమాఫీ చేశాం . కేసీఆర్ ఎగ్గొట్టిన 7625 కోట్లను కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే వేశాం త్వరలోనే రైతు భరోసా పూర్తిస్థాయిలో ఇస్తాం. రైతు భరోసా కింద ఏడాదికి 20 వేల కోట్లి పంపిణీ చేస్తాం. ఇవ్వాల్టికి రుణమాఫీ, రైతు భరోసా మొత్తం 33 వేల కోట్లు రైతులకు చెల్లించాం
పదేళ్లలో తెలంగాణను నంబర్ వన్ చేస్తా
రైతుల గుండెళ్లో ఇందిర, సోనియా పేరు శాశ్వతంగా ఉండేలా చేశాం. గతంలో క్వింటాల్ కు పది కిలోల ధాన్యం తరుగు తీసేవారు. ఈనాడు ఆ పరిస్థితి లేదు. హుజూర్ నగర్ కు అగ్రికల్చర్ కాలేజ్ ఇస్తాం. మిర్యాలగూడ, దేవరకొండ కు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు చేస్తాం. కాళ్లల్లో కట్టెబెట్టి పడేసేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. వాళ్ల కళ్లలో కారం కొట్టేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారు. పదేళ్లలో దేశంలో తెలంగాణను నంబర్ వన్ గా ఉండేలా చూస్తా’ అని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.