సాక్షిప్రతినిధి, నల్లగొండ : అధికార దుర్వినియోగానికి ఓ ప్రజాప్రతినిధి ఎలా పాల్పడవచ్చో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని చూసి నేర్చుకోవచ్చని వైఎస్సార్ పార్టీ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఆ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ గురువారం మొన్నటి భారీ వర్షాలకు తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించి, పంట పొలాలను సందర్శించి, ఓదార్చాలనుకున్నారు. ఈ మేరకు వైఎస్ విజయమ్మ ఖమ్మం జిల్లాలో తన పర్యటన ముగించుకుని మధ్యాహ్నం జిల్లాకు రావడానికి సిద్ధమయ్యారు. కానీ పూర్తిగా అధికార కాంగ్రెస్ నేతలకు జీ ‘హుజూర్..’ అంటున్న పోలీసులు విజయమ్మను జిల్లా సరిహద్దుల్లోనే అడ్డుకున్నారు.
రెండురోజులుగా హుజూర్‌నగర్‌లో మకాం వేసిన మంత్రి ఉత్తమ్ ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలో విజయమ్మను అడుగుపెట్టనిచ్చేది లేదంటూ పభుత్వ యంత్రాంగాన్ని రంగంలోకి దింపారు. రవాణా శాఖ అధికారుల(ఎంవీఐ)లతో ఆటో యజ మానులు, ట్యాక్సీ డ్రైవర్లను బెదిరించారు. అయినా జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు హుజూర్‌నగర్, కోదాడ నియోజకవర్గాలకు తరలివస్తుండగా చిలుకూరు వద్ద అడ్డుకుని వెనక్కి పంపారు. ఎలాగోలా కోదాడకు చేరుకున్న పార్టీ నేతలను సరిహద్దులోని శాంతినగర్ వద్దే ఆపేసి వెనక్కి పంపారు. ఎంతోపెద్ద ఎత్తున శాంతిభద్రతల సమస్య తలెత్తిన సందర్భంలో మాత్రమే వినియోగించేంతటి స్థాయిలో పోలీసుల బలగాలను దింపారు. ఏకంగా నాలుగు జిల్లాల పోలీసు అధికారులను ఇక్కడ మోహరించారు. నల్లగొండతోపాటు, ఖమ్మం, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల నుంచి పోలీసు అధికారులను ఇక్కడకు రప్పించారంటే ఏస్థాయిలో మంత్రి ఒత్తిళ్లు పనిచేశాయో అర్థం చేసుకోవచ్చు. అసలు ఏమీ లేని చోట ఉద్రిక్తతకు కారణమయ్యారు. జిల్లా పర్యటనకు వస్తున్న విజయమ్మకు శాంతియుతంగానే తమ నిరసన తెలుపుతామని తెలంగాణ జేఏసీ, టీఆర్‌ఎస్ ప్రకటించగా స్థానికంగా ఉన్న నాయకులను రెచ్చగొట్టి రోడ్లపైకి తీసుకొచ్చారు.
వీలైతే విధ్వంసం సృష్టించేందుకు ప్రత్యేక వాహనాల్లో నల్లగొండ, నకిరేకల్ నియోజకవర్గాల నుంచి మందిని తీసుకువచ్చారు. కోదాడ, హుజూర్‌నగర్ తమకు రాసిచ్చిన నియోజకవర్గాలు, ఏ పార్టీ వారు తిరగడానికి వీల్లేదన్నంతగా మంత్రి వ్యవహారం నడిపారు. చివరకు మంత్రి భార్య కూడా కోదాడలో హల్‌చల్ చేయడం చూస్తే.. ఇది వారి రాజకీయ వ్యక్తిగత ఎజెండాలో భాగంగా నడిచిన కథని పలువురు వ్యాఖ్యానించారు. నేరేడుచర్ల, గరిడేపల్లి, హుజూర్‌నగర్, మేళ్లచెర్వు, చిలుకూరు, కోదాడ మండలాల్లో రాత్రికి రాత్రే వైఎస్‌ఆర్ విగ్రహాలను ధ్వంసం చేయించారు. కోదాడలో విగ్రహం విధ్వంసానికి ప్రధాన కారకుడు ఉత్తమ్ అని కోదాడ వైఎస్సార్ సీపీ కోఆర్డినేటర్ ఎర్నేని వెంకటరత్నం బాబు ఆరోపించారు. హుజూర్‌నగర్‌లోనూ మంత్రి అనుచరులు భయోత్పాతం సృష్టించారు. ధర్నాలు, రాస్తారోకోలు, దిష్టిబొమ్మల దహనంతో హడావిడి చేశారు. రెండు రోజులపాటు కోదాడ, హుజూర్‌నగర్ నియోజకవర్గాల్లో ఉద్రిక్తతకు మంత్రి ఉత్తమ్ ప్రత్యక్షంగా కారణమయ్యారన్న విమర్శలు వ్యక్తమయ్యాయి. చివరకు కొందరు టీఆర్‌ఎస్ నాయకులకు ఫోన్లు చేసి విజయమ్మ పర్యటనను అడ్డుకునేందుకు తమకు సహకరించాలని కోరారు. పొలిటికల్ జేఏసీ నేతలకు ఫోన్లు చేసి అడ్డుకోవాలని ప్రకటనలు ఇవ్వాల్సిందిగా, ఆయా జేఏసీ నుంచి జనాన్ని పంపించి అండగా ఉండాలని కూడా కోరారు.
కోదాడలోని దాదాపు అన్ని విద్యాసంస్థలకు ఫోన్లు చేసి విద్యార్థులను పంపించి, రోడ్లపై బైఠాయించాలని కూడా కోరారు. ఈ అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని చూస్తే కేవలం తన రాజకీయ భవిష్యత్, రేపటి ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే విజయమ్మ పర్యటనకు తీవ్రమైన అడ్డంకులు సృష్టించారన్న అభిప్రాయం కలుగుతోంది.