సమీక్ష సమావేశంలో మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పెండింగ్ పనులను వచ్చే రెండేళ్లలోగా పూర్తి చేయాలని మంత్రులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో నీటిపారుదల శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించారు. లక్ష ఎకరాలకు సాగునీరు అందించే ఉదయసముద్రం, బ్రహ్మణవెల్లంల ఎత్తిపోతల పథకాల కింద కాల్వలతో పాటు ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ఎస్‌ఎల్‌బీసీ కాల్వలను పూర్తి చేసినప్పటికీ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీసం నిర్వహణ కూడా చేపట్టలేదని విమర్శించారు. 10 ఏళ్లుగా నిర్వహణ లేకపోవడంతో చెట్లు, పూడికతో నిండిపోయాయన్నారు. సత్వరమే నిర్వహణ పనులు చేపట్టాలని, బెడ్, సైడ్ లైనింగ్ పనులను ఈ ఏడాదే పూర్తి చేయాలని ఆదేశించారు.
ఉదయ సముద్రం ప్రాజెక్టు కింద తొలి దశలో 50 వేల ఎకరాలకు, రెండవ దశలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో భూసేకరణ, కాల్వల నిర్మాణం పనులు పూర్తి చేయాలని కోరారు. ఉదయ సముద్రం మొదటి దశ భూసేకరణకు రూ.100 కోట్లు, పనుల కోసం మరో రూ.100 కోట్లను సత్వరంగా విడుదల చేస్తామని, పనులు నిర్విరామంగా కొనసాగించాలని కోరారు. వచ్చే ఏడాదిలో పనులు పూర్తి చేసి 50 వేల ఎకరాలకు సాగునీరు అందించాలని ఆదేశించారు.
గత ప్రభుత్వం అన్యాయం చేసింది..: కోమటిరెడ్డి
గత ప్రభుత్వం నల్లగొండ సాగునీటి ప్రాజెక్టులకు తీరని అన్యాయం చేసిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. పనులు చివరి దశలో ఉన్న ఎస్‌ఎల్‌బీసీ ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేసిందన్నారు. అసెంబ్లీలో తాను ఎన్నో మార్లు మాట్లాడినా ఆనాటి ముఖ్యమంత్రి కనీసం స్పందించలేదన్నారు. సమీక్షలో నీటిపారుదల శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా, ఈఎన్‌సీ మురళీధర్ రావు, చీఫ్ ఇంజనీర్ అజయ్‌కుమార్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment