సాక్షి, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల అంశం కాంగ్రెస్, బీఆర్‌ఎస్ మధ్య మంటలు పుట్టిస్తోంది. నేతల సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, విమర్శలతో రాజకీయం వేడెక్కుతోంది. ఓవైపు సీఎల్పీ నేత భట్టి తన పాదయాత్రలో చేస్తున్న వ్యాఖ్యలు.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రతిగా చేస్తున్న విమర్శలు చర్చనీయాంశంగా మారుతున్నాయి.
నక్కలగండి నుంచి మొదలు..
ఈ నెల 8న నల్లగొండ జిల్లాలో ప్రవేశించిన భట్టి పాదయాత్ర ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులే లక్ష్యంగా కొనసాగుతోంది. కాంగ్రెస్ హయాంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రారంభించిన శ్రీశైలం సొరంగ మార్గం, నక్కలగండి, పెండ్లిపాకల, బ్రాహ్మణ వెల్లంల వంటి ప్రాజెక్టులపై భట్టి చర్చ పెడుతున్నారు. ఈ ప్రాజెక్టులపై బీఆర్‌ఎస్ సర్కారు నిర్లక్ష్యం చూపుతోందని.. జిల్లాకు చెందిన మంత్రి జగదీశ్‌రెడ్డి, శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి పట్టించుకోవడం లేదని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నక్కలగండి రిజర్వాయర్ కింద నిర్వాసితులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందని.. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును ఎందుకు పూర్తి చేయలేదని నిలదీశారు. నల్లగొండ జిల్లా ప్రాజెక్టులపై చర్చకు తాను సిద్ధమని సవాల్ విసిరారు. ఆ తర్వాత రెండు రోజులకు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఎదురుదాడికి దిగారు.
జిల్లాలో 3 లక్షల ఎకరాలకు సాగునీరు ఇచ్చిన ఏఎమ్మార్పీ ప్రాజెక్టు పూర్తి చేయడంలో తన కృషి ఉందని.. హైదరాబాద్‌కు దాని ద్వారానే తాగునీళ్లు వచ్చాయని చెప్పారు. ఇక జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశం పెట్టి.. ఎస్‌ఎల్‌బీసీ సొరంగ మార్గాన్ని దుర్మార్గమైన టెక్నాలజీతో తెచ్చారని, పర్యావరణ అనుమతుల పేరుతో ఆగిపోయేలా చూశారని ఆరోపించారు. నల్లగొండ జిల్లా అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు తాను సిద్ధమని ప్రకటించారు. దీనికి ప్రతిగా సోమవారం భట్టి విక్రమార్క మరోసారి విరుచుకుపడ్డారు. ప్రాజెక్టులను ఎందుకు పూర్తి చేయలేదన్న దానికి నేరుగా సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
చదవండి: ధరణి పోర్టల్‌పై రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు..
భట్టికి తోడుగా కోమటిరెడ్డి, ఉత్తమ్..
భట్టి పాదయాత్రలో పాల్గొన్న ఎంపీలు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కూడా బీఆర్‌ఎస్ నేతలపై విమర్శలు గుప్పించారు. ఎస్‌ఎల్‌బీసీ కోసం నాటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డిని ఒప్పించి, 2005లో అనుమతి తీసుకొని పనులు మొదలుపెట్టి 70శాతం పూర్తి చేస్తే.. బీఆర్‌ఎస్ సర్కారు పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రాజెక్టు వద్ద కుర్చీ వేసుకొని పనులు పూర్తి చేయిస్తానని 2014లో ప్రకటించిన సీఎం కేసీఆర్.. తర్వాత దీనిని పట్టించుకోకుండా, కమీషన్ల కాళేశ్వరంపైనే దృష్టి పెట్టారని మండిపడ్డారు.
ఇక పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును పూర్తి చేయకుండా నల్లగొండ రైతులను సీఎం కేసీఆర్ మోసం చేశారని, దీనిపై క్షమాపణ చెప్పాలని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి డిమాండ్ చేశారు. కాగా.. భట్టి పాదయాత్ర సందర్భంగా ఈ నెల 15న నల్లగొండ పట్టణంలో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నేతృత్వంలో భారీ బహిరంగ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment