
సాక్షి, సూర్యాపేట: సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన సందీప్ వర్మ సివిల్ సర్వీసెస్ పరీక్షలో సత్తా చాటారు. పినాన్ని కోటేశ్వరరావు, ప్రభావతిల రెండో కుమారుడైన ఆయన సివిల్ పరీక్షల్లో 244వ ర్యాంక్ సాధించి ఐఏఎస్‌గా ఎన్నిక కానున్నారు. అయితే 2016లో అతను 732వ ర్యాంక్‌తో ఇండియన్ రెవెన్యూ సర్వీస్(ఐఆర్ఎస్)కు ఎంపికయ్యారు. కానీ ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో ఐఆర్ఎస్‌కు సెలవు పెట్టి ఐఏఎస్ సాధించారు. ఇతని తండ్రి కోటేశ్వరరావు విద్యుత్ శాఖలో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్‌గా(జేఏఓ)గా పని చేస్తున్నారు. తల్లి అదే శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పని చేస్తున్నారు. ఆయన తండ్రి చాలా పేద కుటుంబం నుంచి వచ్చారు. కోటేశ్వరరావు చిన్నతనంలో సోడా అమ్మి చదువుకొని పదవ తరగతిలో మంచి ర్యాంకు సాధించారు. ఆ సమయంలో నల్లగొండ జిల్లా కలెక్టర్ బహుమతి ఇచ్చారు. (వాళ్ల తర్వాత ఆ క్రెడిట్ నాగబాబుకే)
ఆయన కొడుకు సందీప్ వర్మ చిన్నతనం నుంచి సేవా కార్యక్రమాల్లో పాల్గొనేవారు. జేఎన్టీయూలో బీటెక్ పూర్తి చేశారు. ఢిల్లీలో రెండు సంవత్సరాలు ఖాన్ స్టడీ సర్కిల్‌లో కోచింగ్ తీసుకున్నారు. ఐపీఎస్ ఆఫీసర్ ఐనా మహేష్ భగవత్‌ను ఆదర్శంగా తీసుకొని పట్టుదలతో చదివేవారు. ఈ క్రమంలో మహేష్ భగవత్ అనేక సలహాలు ఇస్తూ, వెన్ను తట్టి నడిపించారని సందీప్ తెలిపారు. సందీప్ పేద ప్రజలకు సేవ చేయాలని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో పాలు పంచుకోవాలని స్థానిక ప్రజలు ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కోటేశ్వరరావు మొదటి కుమారుడు సంపత్ ఇప్పటికి రెండుసార్లు సివిల్స్ పరీక్షలు రాసి ఇంటర్వ్యూ దాకా వెళ్లి సివిల్స్ సాధించలేకపోయారు. అయితే అక్టోబర్‌లో జరిగే సివిల్స్ పరీక్షలో తప్పకుండా విజయం సాధిస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. (2019 సివిల్ సర్వీసెస్ ఫలితాల విడుదల)