
ఇప్పటికే ఐపీఎస్ శిక్షణలో జయసింహారెడ్డి
తాజాగా ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు
హన్మకొండ: హనుమకొండకు చెందిన రావుల జయసింహారెడ్డి ఐదో ప్రయత్నంలో ఐఏఎస్ ర్యాంకు సాధించాడు. గతంలో ఐపీఎస్‌కు ఎంపికైన జయసింహారెడ్డి ఈసారి ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. ఆల్ ఇండియా స్థాయిలో 46వ ర్యాంకు సాధించారు.
జయసింహారెడ్డి తండ్రి రావుల ఉమారెడ్డి వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన కేంద్రంలో సహ పరిశోధన సంచాలకుడిగా విధులు నిర్వహిస్తుండగా తల్లి లక్ష్మి గృహిణి. జయసింహారెడ్డి గతంలో సివిల్స్ రాయగా ఒకసారి 217, మరోసారి 104 ర్యాంకు సాధించగా ఐపీఎస్ వచ్చింది. ప్రస్తుతం నేషనల్ అకాడమీ హైదరాబాద్‌లో ఐపీఎస్ శిక్షణ పొందుతున్నారు. జయసింహారెడ్డి పాఠశాల విద్య 7వ తరగతి వరకు జగిత్యాలలో, 8 నుంచి 10 వరకు హనుమకొండ ఎస్‌ఆర్ ఎడ్యు స్కూల్‌లో చదివారు.
హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్ పూర్తి చేశారు. హైదరాబాద్ ఐఐటీలో బీటెక్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అభ్యసించారు. తర్వాత 2020 నుంచి సివిల్స్‌కు సన్నద్ధమయ్యారు. మొదటి రెండు ప్రయత్నాల్లో ప్రిలిమ్స్ వరకు వెళ్లారు. మూడో ప్రయత్నంలో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూ్యలో ప్రతిభ కనబరిచి 217వ ర్యాంకు సాధించారు.
నాలుగో ప్రయత్నంలో మరింత మెరుగైన ప్రతిభ కనబరిచి 104వ ర్యాంకు సాధించారు. ఓ వైపు ఐపీఎస్ శిక్షణ పొందుతూనే ఐదో ప్రయత్నంలో 46వ ర్యాంకు సాధించి తన లక్ష్యం చేరుకున్నారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు రావుల లక్ష్మి, ఉమారెడ్డి మాట్లాడుతూ తమ కుమారుడు ఐఏఎస్ సాధించడం సంతోషంగా ఉందన్నారు. తనకు ఇద్దరు కుమారులని, అందులో జయసింహారెడ్డి చిన్నవాడని, పెద్ద కుమారుడు మనీష్ చంద్రారెడ్డి కాలిఫోరి్నయాలో ఆపిల్ సంస్థలో విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.