
రూ.500 ఇచ్చినా వదిలిపెట్టని జ్యోతిష్యుడు
పోలీస్ స్టేషన్‌కు చేరిన చిలుక పంచాయితీ
హనుమకొండ జిల్లా: అత్యాశ కొంపకు చేటు అన్నట్లు.. ఓ రామచిలుక జ్యోతిష్యుడు చేసిన పని అతడి ఉపాధికి ఎసరు తెచ్చింది. చినికి చినికి చిలుక పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. వారం రోజులుగా జరుగుతున్న ఈ చిలుక పంచాయితీ వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని అంబేడ్కర్ క్రాస్ సమీపంలో దాస్ అనే ఓ బైక్ మెకానిక్ దుకాణం వద్దకు వారం క్రితం రామస్వామి అనే జ్యోతిష్యుడు చిలుక జోస్యం చెబుతానని వచ్చాడు. దాస్ జోస్యం చెప్పించుకునేందుకు ఒప్పుకోవటంతో, చిలుక తీసిన బొమ్మను చూసి జ్యోతిష్యుడు రూ.1,650 ఇస్తే తాయత్తు కడతానని చెప్పాడు.
అయితే పొద్దున్నే గిరాకీ కాలేదని, తర్వాత రమ్మని దాస్ చెప్పి జ్యోతిష్యుడిని పంపించేశాడు. ఆ జ్యోతి ష్యుడు ఊరంతా తిరిగి సాయంత్రానికి మళ్లీ దాస్ వద్దకు వచ్చాడు. చిలుక మళ్లీ అదే బొమ్మను తీస్తే తాయత్తు కట్టించుకుంటానని దాస్ చెప్పాడు. దీంతో ఆ జ్యోతిష్యుడు మరోసారి పంజరంలో ఉన్న చిలుకను బయటకు పిలుస్తూనే నిద్రలోకి జారుకున్నాడు. చిలుక బయటకు వచ్చిన సమయంలో పక్కనే ఓ బైక్ టైరు పేలటంతో, ఆ శబ్ధానికి భయపడి అది తుర్రుమని ఎగిరి సెల్‌టవర్‌పై వాలింది. చిలుక పారిపోయిందని జ్యోతి ష్యుడిని దాస్ నిద్ర లేపడంతో, అతడు ఒక్కసారిగా లేచి సెల్ టవర్ వద్దకు పరుగెత్తాడు.
కానీ, మూడు గంటలు వేచి చూసినా అది తిరిగి రాలేదు. జ్యోతి ష్యుడి బాధ చూడలేక దాస్ అతడిని ఓ వైన్స్ వద్దకు తీసుకెళ్లి రూ.500తో మద్యం కొనిచ్చాడు. అయితే, తన చిలుకను దాస్ మాయం చేశాడని అతడి ఇంటికి వెళ్లి జ్యోతిష్యుడు గొడవ చేశాడు. మూడు రోజుల క్రితం దాస్‌పై పరకాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు దాస్‌ను పిలిచి జ్యోతిష్యుడి రామచిలుక ఏమైందని ప్రశ్నించారు. దాదాపు 3 గంటల పాటు చిలుక పంచాయితీ జరిగినా, ఎటూ తెగకపో వడంతో ‘నీ చిలుక నీ దగ్గరకు రావాలని కోరుకుంటున్నాం’అని జ్యోతిష్యుడికి నచ్చజెప్పి పంపించేశారు.