ఒక్క ‘ఐడియా’తో రూ.70 వేలు ఊడ్చేశారు!  | Person Complains To Cyber Crime For Cheating In Name Idea Network Tower | Sakshi
Sakshi News home page

ఒక్క ‘ఐడియా’తో రూ.70 వేలు ఊడ్చేశారు! 

Published Tue, Jun 9 2020 7:59 AM | Last Updated on Tue, Jun 9 2020 8:02 AM

Person Complains To Cyber Crime For Cheating In Name Idea Network Tower - Sakshi

సాక్షి, సిటీబ్యూరో : ఐడియా నెట్‌వర్క్‌ పేరుతో ఫోన్‌ చేశారు. అనువైన స్థలంలో టవర్‌ ఏర్పాటు చేస్తామన్నారు.. ఆకర్షణీయంగా బల్క్‌ ఎస్సెమ్మెస్‌లు పంపారు. చివరకు సెక్యూరిటీ డిపాజిట్ల పేరు చెప్పి రూ.70 వేలు కాజేశారు. బాధితుడు సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఠాణాలో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. నల్లగొండ జిల్లాకు చెందిన ఓ యువకుడు ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని తన సమీప బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. రాజేంద్రనగర్‌ పరిధిలోని ఓ కళాశాలలో ఎంబీఏ రెండో సంవత్సరం చదువుతున్నాడు. ఇతడికి గత నెల 30న ఐడియా నెట్‌వర్క్‌ సంస్థ నుంచి అంటూ ఓ ఫోన్‌కాల్‌ వచ్చింది. తన కవరేజ్‌ను పెంచడానిక రాష్ట్ర వ్యాప్తంగా టవర్లు ఏర్పాటు చేస్తున్నామంటూ తెలుగులో మాట్లాడారు. ఇందుకు అవసరమైన స్థలాల కోసం అన్వేషిస్తున్నామన్నారు. ఆసక్తి, హైదరాబాద్‌తో పాటు చుట్టు పక్కల అనువైన స్థలం ఉంటే చెప్పాలని కోరారు.

తొలుత సదరు యువకుడు తనకు ఆసక్తి లేదంటూ చెప్పేశాడు. అయినప్పటికీ ఐడియా పేరుతో ఉండేలా పలు బల్క్‌ ఎస్సెమ్మెస్‌ల్ని, వాట్సాప్‌ ద్వారా సందేశాలను నిందితులు పంపారు. వీటిలో రూ.10 లక్షలు అడ్వాన్స్‌ చెల్లిస్తామని, కుటుంబంలో ఒకరికి తమ సంస్థలో ఉద్యోగం ఇస్తామంటూ ఎర వేశారు. దీంతో వారి వలలో పడిన ఎంబీఏ విద్యార్థి పరిగిలో ఉండే తన మామకు విషయం చెప్పారు. టవర్‌ ఏర్పాటుకు తన స్థలం ఇస్తానంటూ ఆయన ముందుకు వచ్చి వారితో సంప్రదింపులు జరిపారు. ప్రాసెసింగ్‌ మొదలు పెడుతున్నామని చెప్పిన మోసగాళ్లు స్థలం పత్రాలు, యజమాని ఆధార్‌కార్డు తదితరాలను వాట్సాప్‌ ద్వారా తెప్పించుకున్నారు.

వీటి ఆధారంగా ఆ స్థలాన్ని తమ టవర్‌ ఏర్పాటు కోసం అద్దెకు తీసుకుంటున్నట్లు పత్రాలు రూపొందించారు. వీటినీ వాట్సాప్‌ ద్వారా పంపడంతో బాధితులు పూర్తిగా సైబర్‌ నేరగాళ్ల వలలో పడిపోయారు. ఆపై అసలు అంకం ప్రారంభించిన అవతలి వ్యక్తులు టవర్‌ ఏర్పాటుపై తుది ఉత్తర్వుల్ని తమ లీగల్‌ విభాగం ఇస్తుందని చెప్పారు. దీని కోసం ఘజియాబాద్‌లో ఉండే ఆ బృందానికి సెక్యూరిటీ డిపాజిట్‌గా రూ.70 వేలు చెల్లించాలని కోరారు. అనుమానం వచ్చిన బాధితుడు హైదరాబాద్‌లో సంస్థ ఉన్నప్పుడు ఘజియాబాద్‌ ఖాతాల్లోకి డబ్బు ఎందుకు చెల్లించాలంటూ ప్రశ్నించాడు. తమ లీగల్‌ టీమ్‌ ఆఫీస్‌ అక్కడే ఉందంటూ చెప్పిన నేరగాళ్లు ఆ మొత్తం డిపాజిట్‌ చేయించుకున్నారు.

డబ్బు డిపాజిట్‌ అయిన తర్వాత వారి మాట మారటం, సరైన స్పందన లేకపోవడంతో బాధితుడు తన డబ్బు తిరిగి పొందాలని భావించారు. దీంతో తమ నుంచి తీసుకున్న డబ్బులో కనీసం రూ.50 వేలు అయినా తిరిగి ఇప్పించాలని కోరినా నేరగాళ్లు స్పందించలేదు. దీంతో సదరు ఎంబీఏ విద్యార్థి సోమవారం సిటీ సైబర్‌ క్రైమ్‌ ఏసీపీ కేవీఎం ప్రసాద్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన ఆదేశాల మేరకు కేసు నమోదు చేసుకున్న ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.రామిరెడ్డి దర్యాప్తు చేపట్టారు. నేరగాళ్లు వినియోగించిన ఫోన్‌ నంబర్లు,బ్యాంకు ఖాతాల ఆధారంగా ముందుకు వెళ్లనున్నారు.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement