
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో భారీ స్థాయిలో ఐఏఎస్, ఐపీఎస్‌ల బదిలీలు జరగనున్నట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగిసే 16వ తేదీ తర్వాత ట్రాన్స్‌ఫర్లపై రాష్ట్ర సర్కారు నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఎక్కువ కాలం ఒకే పోస్టులో ఉంటున్న.. ముఖ్యంగా ప్రత్యేక ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా కొనసాగుతున్న సీనియర్లను స్థానచలనం చేయనున్నట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు అత్యంత నమ్మకస్తులుగా ఉండి కీలక శాఖల్లో ప్రధాన, ముఖ్య కార్యదర్శులుగా చాలాకాలంగా కొనసాగుతున్న కొంత మంది సీనియర్ ఐఏఎస్‌లను పరస్పరం బదిలీ చేయనున్నట్టు తెలిసింది. కీలక శాఖలకు కొత్త అధికారులు వస్తారని తెలుస్తోంది. ప్రాధాన్యం లేని పోస్టుల్లో మగ్గుతున్న కొందరు అధికారులకూ కొత్త పోస్టింగ్స్‌లో కొంత ప్రాధాన్యం కల్పించాలనుకుంటున్నట్టు సమాచారం.
ఆర్థిక, ఐటీ, సింగరేణి, జలమండలిల్లో..
దీర్ఘకాలంగా ఒకే పోస్టులో కొనసాగుతున్న ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు.. పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్, సింగరేణి బొగ్గు గనుల సంస్థ సీఎండీ ఎన్. శ్రీధర్, పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిశోర్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ లొకేశ్‌కుమార్‌కు స్థానచలనం కల్పించే అవకాశముంది. కీలకమైన రెవెన్యూ శాఖతో పాటు కమర్షియల్ ట్యాక్స్, ఎక్సైజ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్, సీసీఎల్‌ఏ శాఖల కార్యదర్శిగా అదనపు బాధ్యతల్లో సీఎస్ సోమేశ్‌కుమార్ కొనసాగుతున్నారు. ఆయనపై భారం తగ్గించేందుకు కొన్ని శాఖలు/విభాగాలను సీనియర్ ఐఏఎస్‌లకు అప్పగించే అవకాశముంది.
ఎన్నికల నేపథ్యంలో కొత్త జట్టు
మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సి ఉండటంతో రాష్ట్ర ప్రభుత్వం కొత్త జట్టు కూర్పుపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. యువ, సీనియర్ అధికారుల సమ కూర్పుతో పాలన యంత్రాంగంలో కొత్త ఉత్తేజం నింపాలని సర్కారు భావిస్తోంది. ఈ దిశగా బదిలీలపై చేపట్టిన కసరత్తు కొంత కొలిక్కి వచ్చినట్టు సమాచారం. కొందరు అధికారులు చాలాకాలంగా ఒకే పోస్టులో ఉండటంతో ఆ శాఖల్లో కొంత నిస్తేజం నెలకొంది. ఆ శాఖలకు త్వరలో కొత్త అధికారులను నియమించే అవకాశముంది. ఎన్నికల నాటికి జిల్లా పాలన యాంత్రాంగంపై పట్టు సాధించేలా భారీగా కలెక్టర్లు, ఎస్పీల బదిలీలూ చేసే అవకాశం కనిపిస్తోంది. పలువురు అదనపు డీజీలు, ఐజీలు, డీఐజీలు, ఎస్పీలు, పోలీసు కమిషనర్లు కూడా బదిలీ అయ్యే అవకాశముంది.