రెండేళ్ల క్రితం సంభవించిన నీలం తుపాను నష్టపరిహారం బకాయి రూ.3 కోట్లు పంపిణికీ సిద్ధంగా ఉందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు.
కూచిపూడి, న్యూస్‌లైన్ : రెండేళ్ల క్రితం సంభవించిన నీలం తుపాను నష్టపరిహారం బకాయి రూ.3 కోట్లు పంపిణికీ సిద్ధంగా ఉందని రాష్ట్ర మాధ్యమిక విద్యాశాఖ, ఎక్సైజ్ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఆయన మొవ్వ మండలంలోని కారకంపాడులోని స్వగృహంలో గురువారం విలేకరులతో మాట్లాడారు.
జిల్లాలో రూ.13కోట్లు పంటనష్టపరిహారంగా గుర్తించామని అందులో తొలి విడత రూ.10 కోట్లు అప్పట్లోనే విడుదల కాగా మిగిలిన రూ.3కోట్లు వారం రోజుల క్రితం విడుదలయ్యాయని, రెండు మూడు రోజుల్లో వ్యవసాయ శాఖాధికారులు రైతుల ఖాతాలకు నేరుగా పంపుతారని చెప్పారు. ఈ మేరకు జేడీకి ఆదేశాలు జారీచేశామని వెల్లడించారు. కాగా కారకంపాడు నుంచి నిడుమోలు వరకు డబుల్‌రోడ్డుకు రూ.10.10కోట్లతో అంచనాలు వేయించామన్నారు.
దీనికి సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఆమోదం తెలిపారని చెప్పారు. కాంట్రాక్టు లెక్చరర్లను రిటైర్ అయ్యే వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. అయితే రిటైరయ్యే పోస్టుల్లో మాత్రం ఏపీపీఎస్సీ ద్వారానే భర్తీ చేస్తామని తెలిపారు. రాష్ట్ర విభజన జరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. కేంద్రప్రభుత్వం ఏక పక్ష నిర్ణయం తీసుకున్నా... అది అమలు జరిగే అవకాశాలు లేవన్నారు. ఇరు ప్రాంతాల ఎమ్మెల్యేలు, విడివిడిగా ఏకగ్రీవ తీర్మానాలు చేస్తేనే రాష్ట్ర విభజనకు అవకాశం ఏర్పడుతుందన్నారు.
సాక్షాత్తు ముఖ్యమంత్రే రాష్ట్రం విడిపోతేనే తీవ్ర పరిణామాలు ఏర్పడుతాయని పేర్కొంటుండటంతో విభజన ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదని సార థి తేల్చి చెప్పారు.ఆయన అంతకుముందుగా మొవ్వ ఎంపీడీవో వై.పిచ్చిరెడ్డి, తహశీల్దార్ జీ భద్రుతో చర్చించారు. ఆర్‌డబ్ల్యుఎస్ ఈఈ అమరేశ్వరరావు, డీఈ ఏ శ్రీనివాసరావుతో శాఖాపరమైన చర్చలు జరిపారు.