
‘ఆమె తండ్రి పరిహారం పెంచమని అడుగుతున్నాడు. ఆ అమ్మాయి వేదనను చేస్తే మనకే గుండె తరుక్కుపోతోంది. కన్నవారికి ఎలా ఉంటుంది?’ అని ఆవేదన చెందారు
ముంబై హైకోర్టు బెంచ్ మీదున్న ఇద్దరు జడ్జ్‌లు. 2017లో రైల్వే వారి కారు ఢీకొనగా కోమాలోకి వెళ్లిన 17 ఏళ్ల నిధి జత్మలాని కేసుకు ముగింపు పలుకుతూ రైల్వే మంత్రిని 5 కోట్ల పరిహారం ఇవ్వడం గురించి సానుభూతితో ఆలోచించమని కోరింది కోర్టు. వివరాలు...
ఒక జీవితానికి పరిహారం ఎంత? ఒక తూనీగకు రెక్కలు విరిగిపడితే నష్ట పరిహారం ఎంత? కోయిల గొంతును నులిమి పాట రాకుండా చేస్తే ఆ నష్టాన్ని ఏమి ఇచ్చి భర్తీ చేయగలం? ఒక ఎగిరి దుమికే జలపాతాన్ని ఎండపెట్టేశాక ఎన్ని డబ్బులు ధారబోస్తే జల ఊరుతుంది?
నష్టపరిహారం ఏ నష్టాన్ని పూర్తిగా పూడ్చలేదు. కాకపోతే కొంత సాయం చేయగలదు అంతే. అందుకే ముంబై హైకోర్టుకు చెందిన జడ్జీలు గిరిష్ కులకర్ణి, అద్వైత్ సెత్నా ఒక అమ్మాయికి వచ్చిన కష్టాన్ని లెక్కలతో కాకుండా హృదయంతో చూడమని రైల్వే మినిష్టర్‌ని కోరారు. పరిహారం పెంచే అవకాశాన్ని పరిశీలించమన్నారు. జడ్జీలను కదిలించిన ఆ కేస్ ఏమిటి?
రెక్కలు తెగిన పిట్ట
2017, మే 28. ముంబై మెరైన్ డ్రైవ్‌లో 17 ఏళ్ల నిధి జెత్మలాని రోడ్డు దాటుతోంది. ఆ రోడ్డులోనే ఉన్న కేసీ కాలేజ్‌లో ఆ అమ్మాయి ఇంటర్ చదువుతోంది. ఆమె రోడ్డు దాటడం మొదలుపెట్టగానే అతివేగంతో వచ్చిన ఇన్నోవా ఆమెను ఢీకొట్టింది. నిధి ఎగిరి దూరం పడింది. తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను ఢీకొట్టాక ఇన్నోవా రోడ్డు డివైడర్‌ను కూడా ఢీకొట్టి ఆగింది. అప్పటి వరకూ ఎగురుతూ తుళ్లుతూ చదువుకుంటూ ఉన్న నిధి ఆ రోజు నుంచి మళ్లీ మాట్లాడలేదు. నవ్వలేదు. నడవలేదు. నిలబడలేదు. జీవచ్ఛవంలా మారింది. కొన్నాళ్లు కోమాలో ఉండి ఆ తర్వాత పడక్కుర్చీకి పరిమితమైంది. ఇంత పెద్ద నష్టం చేకూర్చిన ఈ కేసులో నష్టపరిహారం కోసం పోరాటం మొదలైంది.
నిధి వెర్సస్ వెస్ట్రన్ రైల్వేస్
నిధిని ఢీకొట్టిన ఇన్నోవా వెస్ట్రన్ రైల్వేస్ వారి సిగ్నలింగ్ సర్వీసెస్ విభాగానికి చెందినది. కనుక దీనిలో ప్రతివాది ఆ సెక్షన్‌కు చెందిన సీనియర్ ఇంజనీర్ అయ్యాడు. కేసు నమోదయ్యాక ‘మోటార్ యాక్సిడెంట్స్ క్లైమ్స్ ట్రైబ్యునల్’ 2021లో 69,92,156 రూపాయల (సుమారు 70 లక్షలు) పరిహారం వడ్డీతో సహా నిధి తల్లిదండ్రులకు ఇవ్వాలని, కోర్టుకు ఒకటిన్నర కోటి రూపాయలు డిపాజిట్ చేసి ఆ వచ్చే వడ్డీని నెల నెలా నిధి వైద్య అవసరాలకు ఇవ్వాలని రైల్వేశాఖను ఆదేశించింది. రైల్వే శాఖ ఒకటిన్నర కోటి డిపాజిట్ చేసింది. అయితే ఈ పరిహారం చాలదని నిధి తండ్రి హైకోర్టుకు వెళ్లాడు.
ఆమె తప్పు ఉంటే?
హైకోర్టులో నష్టపరిహారానికి సంబంధించి వాదనలు మొదలైనప్పుడు రైల్వే శాఖ తరఫు అడ్వకేటు రోడ్డు దాటే సమయంలో నిధి పెడస్ట్రియన్ క్రాసింగ్‌లో నడవలేదని, పైగా ఆ సమయంలో సెల్‌ఫోన్ మాట్లాడుతోందని వాదనలు వినిపించాడు. అయితే కోర్టు పట్టించుకోలేదు. నిధి తరఫు లాయర్లు ఇప్పుడు నిధికి 25 సంవత్సరాలని జీవితాంతం ఆమె వీల్‌చైర్ మీద మాటా పలుకూ లేకుండా జీవచ్ఛవంలా బతకాలని అందుకు చాలా డబ్బు అవసరమవుతుందని అందువల్ల నష్టపరిహారం కనీసం 7 కోట్లు ఇవ్వాలని కోరారు. ప్రతివాదులు ‘ఇది చాలా ఎక్కువ’ అని అభ్యంతరం చెప్పారు.
ఇదంతా పరిశీలించిన న్యాయమూర్తులు ‘మేము ఆ అమ్మాయివి యాక్సిడెంట్‌కు ముందు ఫొటోలు ఇప్పటి ఫొటోలు చూశాం. మా గుండె తరుక్కుపోయింది. ఒక ఆడేపాడే అమ్మాయి ఈ వ్యథను ఎలా భరించగలదు? మాకే ఇలా ఉంటే తల్లిదండ్రులు ఈ బాధను ఎలా తట్టుకుంటారు. వారు ఇప్పటికే చేయవలసిందల్లా చేశారు. ఇకపైనా చేయాలి. ఇది ఎంతో వ్యథ. ఇది అరుదైన కేసుల్లోకెల్లా అరుదైనది. అందుకే సహానుభూతిని చూపాలి. అందుకే మేము రైల్వే మంత్రిని ఇప్పటి వరకూ ఇచ్చిన దానితో సహా అంతా కలిపి ఐదు కోట్ల రూపాయల పరిహారంతో కేసును సెటిల్ చేసుకునే అవకాశం పరిశీలించమని కోరుతున్నాం’ అన్నారు.
బహుశా రైల్వే మంత్రి స్పందించవచ్చు. స్పందించకపోవచ్చు. కాని రోడ్డు సెఫ్టీ గురించి మన దేశంలో ఎంత చైతన్యం రావాలో మాత్రం ఈ కేసు తెలియచేస్తూ ఉంది. పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్త చెప్పాలి. రోడ్డు మీద నడిచినా, వారికి వాహనాలు కొనిచ్చి పంపినా ఎంత భద్రం చెప్పాలో అంతా చెప్పాలి. జర భద్రం.
Comments
Please login to add a commentAdd a comment