Western railway
-
పెరిగిన ఏసీ రైళ్ల ట్రిప్పులు.. ప్రయాణికులకు తిప్పలు!
దాదర్: పశ్చిమ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్ల 13 ట్రిప్పులు పెంచడంతో సామాన్య ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏసీ లోకల్ రైళ్ల కారణంగా నాన్ ఏసీ రైళ్ల ట్రిప్పులు తగ్గిపోయాయి. రైల్వే అధికారులు అకస్మాత్తుగా తీసుకున్న నిర్ణయంతో సాధారణ ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముంబైకర్ల ప్రయాణం ఠండా, ఠండా, కూల్ కూల్‌గా సాగాలనే ఉద్దేశంతో తొలుత సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లను ప్రవేశపెట్టారు. మొన్నటి వరకు ఫాస్ట్ మార్గంలో పరుగులు తీసిన ఏసీ లోకల్ రైళ్లు ఇప్పుడు స్లో మార్గంలో కూడా సేవలందిస్తున్నాయి. దీంతో ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.సెంట్రల్ రైల్వే మార్గంలో ఏసీ లోకల్ రైళ్లకు ప్రయాణికుల నుంచి వస్తున్న విశేష స్పందనను దృష్టిలో ఉంచుకుని పశ్చిమ మార్గంలో కూడా ప్రవేశ పెట్టారు. ప్రారంభంలో చార్జీలు చాలా ఎక్కువ ఉండటం వల్ల గిట్టుబాటు కాకపోయేది. దీంతో ప్రయాణికులు ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు కొంత వెనకడుగు వేశారు. దీనిపై దృష్టిసారించిన రైల్వే అధికారులు ప్రయాణికుల సంఖ్య తగ్గడానికి గల కారణాలను వెలికి తీశారు. ఏసీ చార్జీలు ఫస్ట్ క్లాస్ కంటే చాలా ఎక్కువ ఉండటమేనని గుర్తించారు. దీంతో అనేక మంది ఏసీ లోకల్ రైళ్లలో ప్రయాణించేందుకు ముఖం చాటేస్తున్నట్లు తేలింది. దీనిపై విచారణ జరిపిన అధికారులు చార్జీలు తగ్గించాలని నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు కొద్ది నెలల కిందట చార్జీలు తగ్గించడంతో ప్రయాణికుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయింది. ఫలితంగా ఉదయం, సాయంత్రం పీక్ హవర్స్‌లో రద్దీ కారణంగా డోరు మూసుకోలేని పరిస్థితి ఎదురవుతోంది. ముఖ్యంగా ఏసీ లోకల్ రైళ్లు డోరు మూసుకోనిదే ముందుకు కదలవు. గత్యంతరం లేక ప్లాట్‌ఫామ్‌పై విధులు నిర్వహిస్తున్న రైల్వే పోలీసులు, ఆర్పీఎఫ్ సిబ్బంది జోక్యం చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రయాణికులను బలవంతంగా లోపలికి నెడుతున్నారు. ఇది రోజూ ఉదయం, సాయంత్రం వేళల్లో జరుగుతున్నదే. దీన్ని సీరియస్‌గా తీసుకున్న రైల్వే అధికారులు ఏసీ రైళ్ల సంఖ్య పెంచాలని నిర్ణయించారు. ఉదయం, సాయంత్రం రద్దీ కొంతమేర తగ్గుతుందని భావించారు. ఆ ప్రకా>రం గత బుధవారం నుంచి 13 ఏసీ లోకల్ రైళ్లను పెంచారు. దీంతో ప్రస్తుతం వాటి సంఖ్య 96 నుంచి 109కి చేరింది. ఏసీ రైళ్ల సంఖ్య పెరగడంతో రద్దీ కొంతమేర తగ్గింది. కానీ ఏసీ రైళ్ల కారణంగా నాన్ ఏసీ లోకల్ రైళ్ల సంఖ్య తగ్గిపోయింది. గతంలో కూడా ఇలాగే ఏసీ లోకల్ రైళ్ల ట్రిప్పులు పెంచడతో నాన్ ఏసీ రైళ్ల తగ్గిపోయింది. ఫలితంగా సాధారణ లోకల్ రైళ్లలో ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. పెంచిన ఏసీ లోకల్ రైళ్లను ఫాస్ట్ మార్గంలో నడుపుతున్నారు. 13 ట్రిప్పుల్లో ఆరు ట్రిప్పులు విరార్–చర్చిగేట్ స్టేషన్ల మధ్య, భాయిందర్–చర్చిగేట్ మధ్య మూడు ట్రిప్పుల చొప్పున, ఒక ట్రిప్పు చర్చిగేట్–విరార్ (డౌన్) మధ్య ఇలా మొత్తం 13 ట్రిప్పులు పెరిగాయి. -
వాటర్ పోలో చాంపియన్ పోటీల్లో విజేత వెస్ట్రన్ రైల్వే
గచ్చిబౌలి: తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న 2వ ఆల్ ఇండియా ఇంటర్ క్లబ్ వాటర్ పోలో చాంపియన్ షిప్ పోటీలు శనివారం ముగిశాయి. ఈ పోటీల్లో విజేతగా నిలిచిన వెస్ట్రన్రైల్వే మొదటి బహుమతి అందుకుంది. రెండో బహుమతి ఇండియన్ నేవీ, మూడవ బహుమతి ఆర్మీ రెడ్ జట్లు అందుకున్నాయి. విజేతలకు చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి, ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో తెలంగాణ స్విమ్మింగ్ అసోసియేషన్ అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, చీఫ్ ప్యాట్రన్ కొండా విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
వెస్టర్న్ రైల్వేలో 3591 అప్రెంటిస్ ఖాళీలు
భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వశాఖకు చెందిన ముంబయి ప్రధాన కేంద్రంగా ఉన్న వెస్టర్న్ రైల్వేకి చెందిన రైల్వే రిక్రూట్మెంట్ సెల్(ఆర్ఆర్సీ).. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 3591 ► ట్రేడులు: ఫిట్టర్, వెల్డర్, టర్నర్, మెషినిస్ట్, కార్పెంటర్, పెయింటర్, మెకానిక్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్స్ మెకానిక్, వైర్‌మెన్ తదితరాలు. ► అర్హత: మెట్రిక్యులేషన్/పదో తరగతి ఉత్తీర్ణతతోపాటు సంబంధిత ట్రేడుల్లో ఐటీఐ ఉండాలి. ► వయసు: 04.06.2021 నాటికి 15–24 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది. ► ఎంపిక విధానం: పదోతరగతి, ఐటీఐలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. ► దరఖాస్తు ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజులేదు. ఇతరులు రూ.100 చెల్లించాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 25.05.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 24.06.2021 ► వెబ్సైట్: https://rrc-wr.com/ మరిన్ని నోటిఫికేషన్లు: ఏపీలో గ్రామ/వార్డ్ సచివాలయ వలంటీర్ ఉద్యోగాలు సీఎస్ఐఆర్–ఎస్ఈఆర్సీలో ఉద్యోగాలు బొల్లారం ఆర్మీ పబ్లిక్ స్కూల్లో ఉద్యోగాలు -
లోకల్ రైళ్లు ప్రారంభం.. వారికే ఎంట్రీ
ముంబై: అత్యవసర సర్వీసుల కోసం నేటి నుంచి ముంబైలో లోకల్ రైళ్లను నడపనున్నారు. ఉదయం 5.30 నుంచి రాత్రి 11.30 వరకు ప్రతి 15 నిమిషాల విరామంతో రైళ్లను నడపనున్నట్లు వెస్ట్రన్ రైల్వే ట్వీట్ చేసింది. అయితే ఈ రైళ్లలో సాధారణ ప్రయాణికులకు అనుమతి ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన అత్యవసర సిబ్బంది కోసం మాత్రమే ఈ రైళ్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర ప్రభుత్వం సుమారు 1.25 లక్షల మందిని అత్యవసరమైన సిబ్బందిగా గుర్తించింది. అత్యవసర సేవల మీద ప్రయాణించే సిబ్బంది కూడా లోకల్ రైళ్లలో ప్రయాణించాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. స్టేషన్లోకి వెళ్లే ముందు, టికెట్ కొనేటప్పుడు ఈ గుర్తింపు కార్డుని చూపించాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా ప్రభుత్వ ఆదేశాల ప్రకారమే లోకల్ రైళ్లను నడుపుతున్నారు. సామాజిక దూరం మార్గదర్శకాల దృష్ట్యా సుమారు 1,200 మందికి రైలులో అవకాశం ఉన్నా.. 700 మందికి మాత్రమే అనుమతిస్తున్నట్లు రైల్వేశాఖ వెల్లడించింది. చదవండి: ఐఫోన్ 12 డిజైన్‌లో పెను మార్పు! -
ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
-
ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు
సాక్షి, ముంబై : దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరంపై వరుణుడు మరోసారి తన ప్రతాపం చూపాడు. నగర శివారు ప్రాంతాల్లో గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలతో నగర జీవనం అస్తవస్థంగా మారింది. వర్షం, వరద నీటితో పలు లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. 24 గంటల్లో 23 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. మరోవైపు రైళ్ల రాకపోకలతో పాటు రోడ్డు రవాణాపై కూడా తీవ్ర ప్రభావం పడింది. విమానాశ్రయ పరిసరాల్లో ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇక ముంబై నుంచి బయల్దేరవలసిన అనేక రైళ్లు రద్దు చేయగా, పుణెలో పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. లోనావాలాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. ఈ సందర్భంగా సెంట్రల్ రైల్వే సీపీఆర్వో సునీల్ ఉదేశీ మాట్లాడుతూ... గూడ్స్ రైలు పట్టాలు తప్పడంతో ఆ మార్గంలో నడిచే రెండు రైళ్లు రద్దు చేసినట్లు తెలిపారు. ఓ రైలును మరో మార్గంలోకి మళ్లించగా, మరో రెండు రైళ్ల రాకపోకలను రీ షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. -
రైల్వేలో భారీగా ఉద్యోగావకాశాలు
పశ్చిమ మధ్య రైల్వే మెగా రిక్రూట్మెంట్ డ్రైవ్ చేపట్టింది. వివిధ విభాగాల్లో అప్రెంటిస్ ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ప్రక్రియలో మొత్తం 5718 ఖాళీలు పూరించనుంది. అప్రెంటీస్ చట్టం1961 ప్రకారం ఏడాదికాలం శిక్షణకోసం వీరిని ఎంపిక చేయనుంది. ఆసక్తి గల అభ్యర్థులు వచ్చే నెల 2019 జనవరి 9వ తేదీ సాయంత్రం 5గంటల లోపు ఆన్లైన్లో దరఖాస్తులను సమర్పించాల్పి ఉంటుంది. https://www.rrc-wr.com/ అధికారిక వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఎంప్లాయిమెంట్ నోటిఫికేషన్ నెం.ఆర్ఆర్సి / డబ్ల్యుఆర్ / 04/2018 (ఎంగేజ్మెంట్ ఆఫ్ అప్రెంటిస్)క్లిక్ చేసి, సంబంధిత డాక్యుమెంట్స్‌ను అప్లోడ్ చేసి దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. అర్హత: కనీసం 50 శాతం మార్కులతో పదవ తరగతి లేదా ఇంటర్ పాసై వుండాలి. అలాగే సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ సర్టిఫికెట్ పొంది వుండాలి. వయసు: 15-24సంవత్సరాల వయస్సు. ఆయా కేటగిరీల వారీగా వయసులో మినహాయింపు ఎంపిక: పదవ తరగతి, ఐటీఐ మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ ఫీజు : 100 రూపాయలు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. జనవరి 15న మెరిట్ లిస్ట్ ప్రకటించే అవకాశం. సర్టిఫికెట్ వెరిఫికేషన్ 21 జనవరి నుంచి ప్రారంభం. 2019 ఏప్రిల్ 1తేదీనుంచి ట్రైనింగ్ మొదలు -
23మంది మృతి: ఆ తొక్కిసలాటకు కారణం ఇదేనట!
సాక్షి, ముంబై: 23 మంది మృతికి కారణమైన ముంబై ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్లో తొక్కిసలాట ఘటనకు కారణం భారీ వర్షమేనట.. ఈ మేరకు ఈ ఘటనపై దర్యాప్తు జరిపిన వెస్ట్రన్ రైల్వే (డబ్ల్యూఆర్) చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్.. తన నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. ఈ ఘటనలో గాయపడిన 30మంది ప్రయాణికుల వాంగ్మూలాన్ని సేకరించడంతోపాటు.. ఈ ఘటన వీడియో దృశ్యాలను పరిశీలించిన దర్యాప్తు అధికారి ఈమేరకు నిర్ధారించారని అధికారులు తెలిపారు. గత నెల 29న ఎల్ఫిన్‌స్టోన్ రైల్వేస్టేషన్ వద్ద ఉన్న పురాతన ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై జరిగిన తొక్కిసలాట ఘటనలో 23 మంది మృతిచెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 25 మంది గాయపడ్డారు. ఘటన జరిగిన రోజు భారీ వర్షం పడిందని, ఈ వర్షం వల్ల టికెట్ కౌంటర్ వద్ద ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఫుట్ఓవర్ బ్రిడ్జి మీదకు రావడంతో అప్పటికీ రద్దీగా ఉన్న ఆ వంతెనపై గందరగోళం ఏర్పడి.. తోపులాట, తొక్కిసలాట చోటుచేసుకున్నాయని దర్యాప్తు నివేదిక పేర్కొంది. క్రమంగా ప్రయాణికుల రాక పెరిగిపోవడం కూడా ఫుట్ ఓవర్ బ్రిడ్జిపై సమస్యను జఠిలం చేసిందని తెలిపింది. అయితే, ఈ ఘటనకు కొందరూ ఊహించినట్టు షార్ట్ సర్క్యూట్ కారణం కాదని ప్రయాణికులు పేర్కొన్నట్టు నివేదిక స్పష్టం చేసింది. ప్రయాణికులు భారీ లగేజ్‌లతో రావడంతో రద్దీలో వారు బ్యాలెన్స్ కోల్పోవడం కూడా తొక్కిసలాటకు దారితీసిందని తెలిపింది. రద్దీ వేళల్లో భారీ లగేజ్‌లతో ప్రయాణికులు రాకుండా చూడాలని నివేదిక సిఫారసు చేసింది. ప్రస్తుతం ఫుట్ ఓవర్ బ్రిడ్జి దగ్గరున్న బుకింగ్ కార్యాలయాన్ని మార్చాలని, ప్రస్తుతమున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జిని విస్తరించడంతోపాటు మరొక ఫుట్ ఓవర్ బ్రిడ్జిని ఏర్పాటుచేయాలని దర్యాప్తు నివేదిక సూచించింది. -
ఇక సెల్ ఫోన్‌తో రైలు టికెట్ బుకింగ్
♦ ఈ నెల 8 నుంచి ప్రవేశపెట్టనున్న వెస్ట్రన్ రైల్వే ♦ ైరె ల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభానికి సన్నాహాలు సాక్షి, ముంబై : నగరవాసులకు సెల్‌ఫోన్ ద్వారా టికెట్ బుక్ చేసుకునే సదుపాయాన్ని వెస్ట్రన్ రైల్వే కల్పిస్తోంది. ఈ నెల 8వ తేదీ నుంచి మొబైల్‌కు సంబంధించిన టికెటింగ్ విధానాన్ని రైల్వే ప్రవేశపెట్టనుంది. వెస్ట్రన్ రైల్వే ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్)ను ఉపయోగించి టికెట్‌ను కొనుగోలు చేయవచ్చు. అయితే ఈ విధానంలో ఏటీవీఎంలో టికెట్ ప్రింట్ తీసుకోవాల్సి ఉంటుంది. కాగా కొత్త విధానంలో ప్రయాణికులు రైల్వేవాలెట్ (ఆర్-వాలెట్) ద్వారా టికెట్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ఆర్-వాలెట్లో ప్రయాణికులు వంద నుంచి రూ.5,000 వరకు బ్యాలెన్స్ రిచార్జ్ చేయించుకోవచ్చు. జూలై 8వ తేదీన పేపర్‌లెస్ మొబైల్ టికెటింగ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని రైల్వే మంత్రి చేతుల మీదుగా ప్రారంభించేందుకు ప్రయత్నిస్తున్నామని రైల్వే అధికారి ఒకరు పేర్కొన్నారు. సమయం వ ృథా అవదు.. ఈ సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించడం ద్వారా టికెట్ కౌంటర్ల వద్ద కొంత మేర క్యూ తగ్గుతుందని, ప్రయాణికుల సమయం వృథా కాదని అధికారులు అంటున్నారు. మొదటిసారిగా సెల్ఫోన్లో యాప్ అందుబాటులోకి వచ్చిందని, ఆండ్రాయిడ్, విండోస్ ప్లాట్‌ఫాంలలో నడుస్తోందని, త్వరలో ఇతర ప్లాట్‌ఫాంలకు విస్తరించనున్నామని తెలిపారు. యూటీఎస్ మొబైల్ టికెటింగ్ విధానిన్ని ప్లే స్టోర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నారు. టికెట్ బుక్ చేసుకోవాలంటే మొబైల్ ఫోన్లలో జీపీఆర్ఎస్ విధానం ఉండాలన్నారు. ఇదిలా వుండగా స్మార్ట్ కార్డ్ ద్వారా ప్రయాణికులు టికెట్ బుక్ చేసిన తర్వాత టికెట్ ప్రింట్ కోసం ఇబ్బంది పడాల్సివస్తోందని, దీంతో సమయం వృథా అవుతోందని ఓ ప్రయాణికుడు వాపోయాడు. కాగా, రోజుకు ఒక లక్ష మంది స్మార్ట్ కార్డును ఉపయోగించి టికెట్‌ను బుక్ చేసుకుంటున్నారని వెస్ట్రన్ రైల్వే అధికారి పేర్కొన్నారు. -
రోజుకు రూ.15 కోట్ల నష్టం
ముంబై: రాజస్థాన్ లో గుజ్జర్ల ఆందోళనతో పశ్చిమ రైల్వే తీవ్రంగా నష్టపోతోంది. రోజుకు రూ. 15 కోట్లు నష్టం వస్తోందని పశ్చిమ రైల్వే వాణిజ్య విభాగం అధికారులు తెలిపారు. గుజ్జర్ల ఆందోళనతో ఢిల్లీ-ముంబై మార్గంలో రైళ్ల రాకపోకలకు ఆటంకం కలుగుతోంది. తరచుగా రైళ్లను రద్దు చేస్తున్నారు. దీంతో రోజువారీ ఆదాయంలో రూ12 నుంచి రూ. 15 కోట్ల వరకు కోత పడుతోందని అధికారులు వెల్లడించారు. ఐదు శాతం రిజర్వేషన్ కల్పించాలన్న డిమాండ్ సాధన కోసం గుజ్జర్లు ఆందోళన చేస్తున్నారు. భరత్ పూర్ జిల్లాలో రైల్వే ట్రాక్ ను వారు బ్లాక్ చేశారు. గూడ్స్ రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగడంతో పశ్చిమ రైల్వే ఆదాయానికి భారీగా గండిపడుతోంది. -
రైల్వే స్టేషన్లలో కొత్త ‘ఫుడ్’
సాక్షి, ముంబై: సబర్బన్ రైల్వే స్టేషన్లలో ఉన్న ఫుడ్ స్టాళ్లను కూల్చేయాలని పశ్చిమ రైల్వే యోచిస్తోంది. వీటిస్థానంలో కొత్త హంగులతో నూతన స్టాళ్లను ఏర్పాటుచేయాలని పథకం రూపొందిస్తోంది. అయితే ప్రస్తుతం ఫుడ్ స్టాళ్ల వల్ల రద్దీ సమయంలో ప్రయాణికులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఈ మేరకు పశ్చిమ రైల్వేకు చాలాకాలంగా ఫిర్యాదులు అందుతున్నాయి. దీంతో తన పరిధిలోని స్టేషన్లలో ఉన్న ఫుడ్‌స్టాళ్లను తొలగించాలని పరిపాలనా విభాగం నిర్ణయించింది. అయితే వాటిబదులు గుర్తించిన ప్రాంతాల్లో కొత్త స్టాళ్లను నిర్మించాలని యోచిస్తోంది. పాతస్టాళ్లను తొలగించడం ద్వారా ప్లాట్‌ఫాంలు మరింత విశాలంగా మారి ప్రయాణికులు ప్రశాంతంగా నడిచి వెళ్లేందుకు వీలుపడుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ స్టాళ్లను కాంట్రాక్ట్ పద్ధతిలో కొందరు ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తున్నారు. కాగా, మొదటి విడతగా 30 రైల్వేస్టేషన్లలోని పాత స్టాళ్లను తొలగించనున్నారు. దీనికోసం ఆయా స్టేషన్లలో ఉన్న పురాతన స్టాళ్ల వివరాలను సేకరిస్తున్నారు. వీటిలో చాలా స్టాళ్లు ఏర్పాటుచేసిన గదులు 40 యేళ్ల కిందటే నిర్మించినవని గుర్తించామని ఒక అధికారి తెలిపారు. వీటిని తొలగించి కొత్త భవనాలను నిర్మించేందుకు త్వరలోనే టెండర్లను ఆహ్వానించనున్నట్లు ఆయన చెప్పారు. మున్ముందు స్టేషన్లలో ఆహార పదార్థాల నాణ్యతను కూడా పెంపొందించేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ముఖ్య స్టేషన్లలో ఫుట్ఓవర్ బ్రిడ్జికి 20 మీటర్ల దగ్గర్లో గాని, లేదా వాటి కిందగాని కొత్త స్టాళ్లను ఏర్పాటుచేయడానికి యోచిస్తున్నట్లు సదరు అధికారి తెలిపారు. కాగా, ప్రస్తుతం స్టేషన్లలో సమోసాలు, భేల్, వడాపావ్ వంటి తినుబండారాలను విక్రయిస్తున్నారు. అలాగే బిస్కెట్లు, కూల్‌డ్రింక్‌లను ఎమ్మార్పీ రేట్లతో విక్రయిస్తున్నారన్నారు. అలాగే స్వచ్ఛమైన నీటిని అందించేందుకు ఆర్వో ప్యూరిఫైర్లను కూడా స్టాళ్లలో ఏర్పాటుచేశారు. ఇవి కాకుండా ప్రయాణికులకు టైంపాస్ కోసం పుస్తకాలు, పేపర్లు అందుబాటులో ఉంటున్నాయని వివరించారు. -
గుజరాత్‌కు ‘పశ్చిమ రైల్వే’ తరలింపు!
సాక్షి, ముంబై: నగరంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించే ఏర్పాట్లు జరుగుతున్నాయి. రైల్వే పరిపాలన విభాగం చేస్తున్న ఈ ప్రయత్నాలను మహారాష్ట్ర నవనిర్మాణ్ సేన (ఎమ్మెన్నెస్)తోపాటు శివసేన కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. పాల్ఘర్లోని సముద్ర తీర ప్రాంత భద్రత ప్రధాన కార్యాలయం, రిజర్వు బ్యాంక్‌లోని కొన్ని కీలక శాఖలను ఇదివరకే గుజరాత్‌కు తరలించారు. నారిమన్ పాయింట్లో ఉన్న ఎయిర్ ఇండియా ప్రధాన కార్యాలయాన్ని కూడా త్వరలో మార్చివేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. వీటితోపాటు డైమండ్ మార్కెట్‌ను, మరికొన్ని కీలక వ్యాపార, వాణిజ్య సంస్థలను గుజరాత్‌కు తరలించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాగా, మహారాష్ట్రను బలహీనపరిచే విధంగా కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని శివసేన ఎంపీ సంజయ్ రావుత్ ఆరోపించారు. దేశ వాణిజ్య రాజధాని అయిన ముంబైనుంచి పలు ప్రధాన కార్యాలయాలను వేరే ప్రాంతాలకు తరలించడంపై సమాధానం చెప్పాలని కేంద్రాన్ని ఆయన డిమాండ్‌చేశారు. అలాగే ముంబై నుంచి పలు కార్యాలయాల తరలింపును వెంటనే నిలిపివేయాలని కేంద్రానికి లేఖ రాయాలని సీఎం దేవేంద్ర ఫడ్నవిస్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు. ఒక పక్క రాష్ట్రంలో ఉన్న మైనారిటీ బీజేపీ ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు శివసేనతో పొత్తు అనివార్యమైన పరిస్థితిలో, కేంద్రంలో మోదీ సర్కార్ పనితీరుపై శివసేన తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తుండటం గమనార్హం. ముంబైలోని పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని పార్లమెంట్లో రెండు రోజుల కిందట బీజేపీకి చెందిన అహ్మదాబాద్ (పశ్చిమ) ఎంపీ కిరీట్ సోలంకి డిమాండ్ చేశారు. అహ్మదాబాద్ నగరం పశ్చిమ రైల్వే పరిధిలో నడి బొడ్డున ఉంది. దీంతో ముంబైలో ఉన్న ప్రధాన కార్యాలయాన్ని గుజరాత్‌కు తరలించాలని ఆయన డిమాండ్ చేశారు. సోలంకి చేసిన ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో దుమారం లేపాయి. ప్రయాణికుల సంఘటన్లు కూడా దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పటికే అనేక కీలక కార్యాలయాలు గుజరాత్‌కు తరలించారని, దీనిపై తన వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఫడ్నవిస్‌ను రావుత్ నిలదీశారు. ఇదిలాఉండగా గత అనేక సంవత్సరాల నుంచి పశ్చిమ రైల్వే ప్రధాన కార్యాలయం ముంబైలోనే ఉంది. అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండగా గుజరాత్‌కు తరలించడంలో ఆంతర్యమేమిటని కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ సంజయ్ నిరుపమ్ ప్రశ్నించారు. ఒకవేళ కార్యాలయాన్ని ముంబై నుంచి గుజరాత్‌కు తరలిస్తే ఆందోళన చేస్తామని ఆయన హెచ్చరించారు. -
‘హైస్పీడ్ రైలు’కు రెక్కలు!
సాక్షి, ముంబై: కొద్ది నెలలుగా అటకెక్కిన ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రవేశపెట్టనున్న హై స్పీడ్ రైలు ప్రతిపాదన మరోసారి తెరమీదకు వచ్చింది. ఈ రెండు కీలక నగరాల మధ్య రాకపోకలు సాగించే వ్యాపారులు, పారిశ్రామిక వేత్తల విలువైన సమయాన్ని తగ్గించేందుకు పశ్చిమ రైల్వే ముందుకు వచ్చింది. అందుకు గంటకు 160 కి.మీ. వేగంతో పరుగులు తీసే హైస్పీడ్ రైళ్లు నడిపేందుకు అవసరమైన రూ.1,200 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు సిద్ధంగా ఉన్నట్లు పశ్చిమ రైల్వే స్పష్టం చేసింది. అత్యంత కీలకమైన ఈ ప్రాజెక్టు ప్రతిపాదన మంజూరు కోసం త్వరలో రైల్వే బోర్డుకు పంపించనుంది. బోర్డు ద్వారా మంజూరు లభించగానే అధ్యయనం, భూ సేకరణ లాంటి కీలకమైన పనులు ప్రత్యక్షంగా ప్రారంభమవుతాయి. ఈ పనులు పూర్తిచేయడానికి సంవత్సర కాలం పట్టవచ్చని అధికారులు అంచనావేశారు. ఆ తర్వాత కాంట్రాక్టర్ల నియామకం పనులు పూర్తిచేస్తారు. 495 కి.మీ. పొడవైన ఈ మార్గం కార్యరూపం దాలిస్తే ప్రయాణికుల విలువైన సమయం దాదాపు రెండు గంటలకుపైగా ఆదా కానుందని పశ్చిమ రైల్వే చీఫ్ పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. సాధారణంగా ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య ఎక్స్‌ప్రెస్, సూపర్ ఫాస్ట్ రైళ్లలో వెళితే ఏడు నుంచి ఎనిమిది గంటల సమయం పడుతుంది. అదే గంటకు 160 కి.మీ. వేగంతో హైస్పీడ్ రైళ్లను నడిపితే సుమారు ఐదు గంటలలోపు తమ గమ్యాన్ని చేరుకోవచ్చని చంద్రాయన్ అభిప్రాయపడ్డారు. కాగా ఇలాంటి హైస్పీడ్ రైళ్లను నడపాలంటే ఇప్పుడున్న రైల్వే ట్రాక్స్, ఓవర్ హెడ్ వైర్ సామర్థ్యాన్ని పెంచాల్సి ఉంటుంది. అదేవిధంగా ప్రమాదకర మలుపులను తగ్గించాలి. ఇదిలాఉండగా, రైల్వే బోర్డు దేశవ్యాప్తంగా సెమీ హై స్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టేందుకు తొమ్మిది ప్రాంతాలను ఎంపిక చేసింది. అందులో ముంబై-గోవా, ముంబై-అహ్మదాబాద్ మార్గాలు కూడా ఉన్నాయి. ప్రస్తుతం పశ్చిమ రైల్వేలో గంటకు 130 కి.మీ. వేగం లోపు నడిచే రైళ్లు కొన్ని ఉన్నాయి. మొదటి దశలో శతాబ్ధి, దురంతో, రాజధాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను గంటకు 160 కి.మీ. నడిపేందుకు ప్రయత్నాలు చేయనున్నారు. ఆ తర్వాత విడతల వారీగా మిగతా రైళ్లను కూడా నడిపే ప్రయత్నం చేస్తామని చంద్రాయన్ అన్నారు. భారత దేశంలో మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ ముంబై-అహ్మదాబాద్ నగరాల మధ్య నడిపేందుకు ఇదివరకే సన్నహాలు ప్రారంభించిన విషయం తెలిసిందే. అందుకు జపాన్ కంపెనీ ఈ మార్గానికి సంబంధించిన తుది నివేదిక 2015లో సమర్పించనుంది. -
వెస్టర్న్ రైల్వేకు కొత్త ఏటీవీఎంలు
సాక్షి, ముంబై: ఈ నెల చివరి వరకు వెస్టర్న్ రైల్వే 400 ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్ (ఏటీవీఎం)లను కొనుగోలు చేయనుంది. త్వరలోనే పాత ఏటీవీఎంల స్థానంలో వీటిని ఏర్పాటు చేయనున్నారు. బోరివలి, కాందివలి, అంధేరి రైల్వే స్టేషన్లలో పాత ఏటీవీఎంల స్థానంలో కొత్త వాటిని ఏర్పాటు చేశారు. ఈ నెల చివరి వరకు వివిధ రైల్వే స్టేషన్లలో దాదాపు 400 కొత్త ఏటీవీఎంలను ఏర్పాటు చేయనున్నట్లు వెస్టర్న్ రైల్వే పీఆర్వో శరత్ చంద్రాయన్ తెలిపారు. ఇటీవల కాలంలో పాత ఏటీవీఎంల విషయంలో చాలా సమస్యలు తలెత్తాయన్నారు. వీటిలో చాలావరకు పని చేయడం లేదన్నారు. ఈ విషయమై ప్రయాణికుల నుంచి తమకు చాలా ఫిర్యాదులు అందాయన్నారు. కార్డును రీడ్ చేయడం, టికెట్‌ను ప్రింట్ చేయడం పెద్ద సమస్యగా మారడంతో అధికారులు ఈ సమస్యను పరిష్కరించారన్నారు. ఈ కొత్త ఏటీవీఎంలను పలు రైల్వే స్టేషన్లలో రైల్వేఫుట్ ఓవర్ బ్రిడ్జి చివరలో ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల రైల్వే ఆవరణలోకి ప్రవేశించగానే ప్రయాణికులు వీలైనంత త్వరగా టికెట్లను కోనుగోలు చేసే వీలు ఉంటుందన్నారు. అంతేకాకుండా ఈ ఏటీవీఎంలను అంధేరి స్టేషన్లో మెట్రో రైల్ ప్రవేశ ద్వారం వద్ద కూడా ఏర్పాటు చేయనున్నారు. ఇదిలా ఉండగా, ఏటీవీఎం స్మార్ట్‌కార్డు రెన్యువల్ కోసం ప్రతి రైల్వే స్టేషన్లో ఒక టికెట్ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. ఒక వేళ ప్రయాణికులు స్మార్ట్ కార్డును కొనుగోలు చేసినా అదేవిధంగా రెన్యువల్ చేసినా వారికి అదనంగా 5 శాతం రీచార్చ్ లభిస్తుంది. -
నగరానికి కొత్త టెర్మినస్
ముంబై, సాక్షి : కోటికిపైగా జనాభాతో కిక్కిరిసిపోయిన ముంబై నగరంలో ఎన్ని రైల్వే టెర్మినస్‌లు ఉన్నప్పటికీ సరిపోవడం లేదు. దీంతో రైల్వే అధికారులు నిరంతరం ఈ సమస్య పరిష్కారానికి, సేవల విస్తరణకు యత్నిస్తూనే ఉంటారు. ఇందులో భాగంగానే పశ్చిమ రైల్వే మరో టెర్మినస్ ఏర్పాటు దిశగా ఆలోచిస్తోంది. దీని పరిధిలో ప్రస్తుతం బాంద్రా, ముంబై సెంట్రల్ టెర్మినస్లున్నాయి. ఇప్పటికే ఈ రెండు టెర్మినస్లూ కిక్కిరిసిఉన్నాయి. ఏటికేటా ప్రయాణికులు, రైళ్ల సంఖ్య పెరుగుతున్నందున అయితే వచ్చే పదేళ్లలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారనుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో వీటికి తోడు మరో టెర్మినస్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఏర్పడుతోంది. దీనిపై పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ మాట్లాడుతూ కొత్త టెర్మినస్ ఏర్పాటుకు భారీ ఎత్తున స్థలం సేకరించాలని, అయితే ఇది ముంబై ఉత్తర ప్రాంతంలోనే సమకూర్చుకోవచ్చని అన్నారు. అయితే ఖచ్చితంగా కొత్తటెర్మినస్ ఎక్కడ ఏర్పాటు చేయనున్నారన్నది ఆయన చెప్పలేదు. దీనిపై ఉన్నతాధికారులు ఇంకా అధ్యయనం చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో కొత్త టెర్మినస్ ఏర్పడితే మరిన్ని ప్రాంతాలకు అనువుగా ఉంటుందని, అటు బోరివిలి, అంధేరి, ఇటు డహను ప్రాంతాలకు మంచి కనెక్టివిటీ ఉంటుందని వారు భావిస్తున్నారు. వృద్ధులకూ ప్రత్యేక బోగీలు : హైకోర్టు ఆదేశం ముంబై లోకల్ రైళ్లలో మహిళలకు కేటాయించినట్లుగానే వృద్ధులకూ ప్రత్యేక బోగీలు కేటాయించే అంశాన్ని పరిశీలించాలని పశ్చిమ, సెంట్రల్ రైల్వే అధికారులను బొంబాయి హైకోర్టు ఆదేశించింది. జస్టిస్ ఓకా, జస్టిస్ ఏఎస్ చందుర్కార్లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ మేరకు రైల్వే బోర్డుకి ప్రతిపాదనలు పంపాలని అధికారులను ఆదేశించింది. వాస్తవానికి ముంబైలోని లోకల్ రైళ్లు కిక్కిరిసి ప్రయాణిస్తుంటాయి. ప్రవేశ ద్వారం వద్ద నిలబడే ఎక్కువ మంది వెళుతుంటారు. దీనికితోడు ఏ స్టేషన్లోనూ ఇవి పట్టుమని నిమిషం కూడా ఆగవు. దీంతో ఆ క్షణంలో దిగని పక్షంలో మరో స్టేషన్‌కి వెళ్లిపోయే పరిస్థితి ఉంది. దీంతో ఆ కొన్ని సెకన్లలోనే నెట్టుకుంటూ, తోసుకుంటూ లోపలికి వెళ్లడం యువకులకే కష్ట సాధ్యం. అలాంటి పరిస్థితులున్నందునే ఈ రైళ్లలో మహిళలకు ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేశారు. దీంతో వాటిలో మహిళలు కాసింత ప్రశాంతంగా వెళ్లేందుకు అవకాశం కలుగుతోంది. ఇదే తరహాలో సీనియర్ సిటిజన్లకూ ప్రత్యేక బోగీలు ఏర్పాటు చేయాలంటూ ఓ వ్యక్తి వేసిన వ్యాజ్యం మేరకు కోర్టు ఈ సూచనలు చేసింది. వాస్తవానికి సీనియర్ సిటిజన్ల కోసం సగం బోగీని కేటాయించేలా చర్యలు తీసుకోవాలని ఇక్కడి అధికారులు రైల్వే బోర్డుకు 1998, 2005లలో ప్రతిపాదనలు పంపినా అది వాటిని తిరస్కరించింది. అయితే ఇప్పుడు కోర్టు ఉత్తర్వుల మేరకు మళ్లీ ఈ ప్రతిపాదనలు పంపుతున్నందున వాటిని ఉన్నతాధికారులు అమలు చేస్తారని సీనియర్ సిటిజన్లు భావిస్తున్నారు. -
పాస్‌లతో కాసుల వర్షం
సాక్షి, ముంబై: లోకల్ రైలు చార్జీలు కూడా పెంచనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో నగరవాసులు ముందుగానే సీజన్ పాస్‌లు కొనుగోలు చేశారు. దీంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వే పంట పండింది. సీజన్ పాస్‌ల ధరలు రెట్టింపు కానున్నాయని టీవీల్లో, వార్తా పత్రికల్లో వచ్చిన కథనాలతో బెంబేలెత్తిపోయిన నగరవాసులు అప్పుచేసి మరీ సీజన్ టికెట్లను కొనుక్కున్నారు. కొందరు వార్షిక, మరికొందరు అర్ధవార్షిక పాస్‌లు కొనుగోలు చేశారు. దీంతో సెంట్రల్, వెస్టర్న్ రైల్వేకు రోజుకు 7.5 కోట్ల రూపాయలు కేవలం సీజన్ టికెట్ల అమ్మకం ద్వారా సమకూరినట్లు సంబంధిత అధికారులు తెలిపారు. సెంట్రల్ రైల్వేలో.. 21 నుంచి 23వ తేదీ వరకు సెంట్రల్ రైల్వే సీజన్ పాస్‌లను విక్రయించడం ద్వారా రూ.11.60 కోట్లు మూటగట్టుకుంది. దీంతో రోజుకు రూ.4 కోట్లు ఈ రైల్వేకు అదనంగా సమకూరాయి. రైల్వే టికెట్ల ద్వారా పండుగలు, ఉత్సవాల సందర్భాలను మినహాయించి సాధారణ రోజుల్లో రోజుకు రూ.85 లక్షల ఆదాయం మాత్రమే సమకూరేది. ప్రభుత్వం రైల్వే చార్జీలను పెంచనున్నట్లు ప్రకటించడంతో సీజన్ టికెట్ల కోసం జనం బారులు తీరడంతో గణనీయమైన ఆదాయం సమకూరింది. 21వ తేదీ నుంచి గత మంగళవారం వరకు రోజుకు లక్షకు పైగా సీజన్ పాస్‌లను విక్రయించింది. సాధారణంగా అయితే రోజుకు 40 వేల పాస్‌లను మాత్రమే విక్రయించేది. చార్జీలు పెరుగుతాయన్న ప్రకటన పుణ్యమా అని రైల్వేకు అదనపు ఆదాయం వచ్చిపడింది. వెస్టర్న్ రైల్వేలో.. వెస్టర్న్ రైల్వే కూడా ఆదాయాన్ని భారీగా ఆర్జించింది. వెస్టర్న్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు ఈ విషయమై మాట్లాడుతూ.. రోజుకు సగటున 40 వేల సీజన్ పాస్‌లు విక్రయించామని చెప్పారు. దీంతో దాదాపు కోటి రూపాయల ఆదాయం అదనంగా సమకూరిందన్నారు. ఈ నెల 21వ తేదీ నుంచి సోమవారం సాయంత్రం నాలుగు గంటల వరకు వెస్టర్న్ రైల్వే రూ.2.57 లక్షల సీజన్ పాస్‌లను విక్రయించి రూ.16 కోట్ల ఆదాయాన్ని ఆర్జించింది. రోజుకు 64 వేల మంది ప్రయాణికులు సీజన్ పాస్‌లను కొనుగోలు చేయగా, రూ.4 కోట్ల ఆదాయం వచ్చిందన్నారు. పోగొట్టుకున్నవారికి డూప్లికేట్ సీజన్ టికెట్ ఇవ్వాలి వ్యయప్రయాసలకోర్చి వార్షిక, అర్ధవార్షిక, త్రైమాసిక సీజన్ టికెట్లను కొనుగోలు చేసినవారు ఒకవేళ టికెట్ పోగొట్టుకుంటే డూప్లికేట్ టికెట్‌ను జారీ చేయాలని ప్రయాణికుల సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ విషయమై కర్జత్-కసారా రైల్వే ప్రయాణికుల సంఘం సలహాదారుడు రాజేష్ ధన్‌గావ్ మాట్లాడుతూ.. ‘రైల్వే చార్జీలు నూటికి నూరు శాతం పెరగనున్నాయన్న భయంతో వేలాది మంది సీజన్ టికెట్లు కొనుగోలు చేశారు. జూన్ నెల చివరి వారం కావడంతో అనేక మంది తమవద్ద డబ్బులు లేకపోయినా అప్పులు చేసి మరీ సీజన్ టికెట్లు కొనుక్కున్నారు. వేల రూపాయలు వెచ్చించి కొనుగోలు చేసిన ఈ టికెట్లను దీర్ఘకాలంపాటు భద్రంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ వీటిని పోగొట్టుకుంటే మళ్లీ వేల రూపాయలు ఖర్చుచేసి కొత్త పాస్‌లు కొనుగోలు చేయాల్సి వస్తోంది. పోగొట్టుకున్న పాస్ నంబర్‌పై డూప్లికేట్ పాస్ ఇచ్చే సదుపాయం లేకపోవడంతో ప్రయాణికులపై భారం పడుతోంది. డూప్లికేట్ పాస్‌లు కూడా ఇస్తే పోగొట్టుకున్నా ఎటువంటి నష్టం ఉండద’న్నారు. విక్రయమైన సీజన్ పాస్‌ల వివరాలు... సెంట్రల్ రైల్వే.. తేదీ నెలసరి {తైమాసిక అర్ధవార్షిక వార్షిక జూన్ 21 37,333 7,369 880 555 జూన్ 22 20,605 9,698 2,346 1,381 జూన్ 23 51,008 28,809 11,278 9,369 జూన్ 24 46,940 56,917 30,275 23.513 వెస్టర్న్ రైల్వే... తేదీ నెలసరి త్రైమాసిక అర్ధవార్షిక వార్షిక జూన్ 21 29,819 9,527 1,636 1,434 జూన్ 22 17,923 10,342 2,964 3,032 జూన్ 23 34,173 28,863 14,923 18,957 జూన్ 24 18,923 25,341 17,388 21,806 -
లోకల్లో నేరాలు తగ్గాయట..!
సాక్షి, ముంబై: లోకల్ రైళ్లలో నేరాల సంఖ్య తగ్గాయి. గత ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు సెంట్రల్, వెస్టర్న్ రైల్వేలలో 929 నేరాలు నమోదు కాగా, ఈ ఏడాది ఇదే సమయంలో 909 నేరాలు (నాలుగు శాతం తక్కువ) నమోదయ్యాయి. అయితే ఈ గణాంకాలను సామాజిక కార్యకర్తలు కొట్టిపారేస్తున్నారు. రైళ్లలో దొంగతనాలు, చైన్ స్నాచింగ్‌లు, మహిళా వేధింపులు నిత్యకృత్యంగా మారిన ప్రస్తుత తరుణంలో నేరాల సంఖ్య తగ్గిందని రైల్వే గణాంకాలు పేర్కొనడం విడ్డూరంగా ఉందని వారు పేర్కొంటున్నారు. ఇటీవల సెంట్రల్ రైల్వే పరిధిలోని రైల్వేస్టేషన్ల ఆవరణలో మహిళా ప్రయాణికుల కోసం ఫిర్యాదు బాక్సులను ఏర్పాటుచేశారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల అవి కనిపించకుండా పోయాయని సామాజిక కార్యకర్త ఒకరు ఆరోపించారు. మరికొంతమంది ప్రయాణికులు వేధింపులకు భయపడి తమ సమస్యలను ఫిర్యాదు చేయడానికి గవర్నమెంట్ రైల్వే పోలీస్ (జీఆర్పీ) ఆశ్రయించడానికి ఇష్టపడడంలేదని డివిజినల్ రైల్వేకు చెందిన అధికారి అనికేట్ ఘమండి తెలిపారు. ఈ కారణం వల్ల కూడా ఫిర్యాదుల సంఖ్య తగ్గి ఉండవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా వెస్టర్న్ రైల్వే డీసీపీ దీపక్ దేవ్‌రాజ్ మాట్లాడుతూ.. ఈ ఏడాది కొంతమంది ఘరానా నేరస్తులను అదుపులోకి తీసుకోవడంతో నేరాల సంఖ్య తగ్గిందని చెప్పారు. మత్తుపదార్థాలను సేవించే వారిని పట్టుకోవడం కోసం తరచూ ప్రత్యేక డ్రైవ్‌లు కూడా నిర్వహిస్తున్నామని తెలిపారు. లైంగిక వేధింపులను అదుపులోకి తీసుకువచ్చేందుకు ‘నిర్భయ’ పేరుతో ఈ ఏడాది ఇటీవల ఓ ప్రత్యేక స్క్వాడ్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఈ స్క్వాడ్ సివిల్ డ్రెస్సుల్లో రైళ్లలోని మహిళా బోగీల్లో, ప్లాట్‌ఫాంలపై కూడా సంచరిస్తూ ఉంటారని చెప్పారు. ప్రతి జీఆర్పీ చౌకీలలో నమోదైన మహిళలు, పిల్లలకు సంబంధించిన ఫిర్యాదులను ఉన్నతాధికారులు పరిశీలించి పరిష్కరిస్తూ ఉండాలని సెంట్రల్ రైల్వే జీఆర్పీ డీసీపీ రూపాలి అంబురే ఆదేశించారు. మరోపక్క రద్దీ సమయంలో చౌకీలలో తక్కువ మంది సిబ్బందిని ఉంచి, స్టేషన్ ప్లాట్‌ఫాంలపై ఎక్కువ మంది సిబ్బందిని ఉంచేందుకు సెంట్రల్ రైల్వే జీఆర్పీ నిర్ణయించింది. ఇదిలా ఉండగా, ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకు జరిగిన నేరాల వివరాలు ఇలా ఉన్నాయి... అత్యాచారం కేసు ఒక్కటి నమోదు కాగా అది పరిష్కరించబడింది. వేధింపుల కేసులు 12 నమోదు కాగా అన్నింటినీ పరిష్కరించారు. హత్య కేసులు ఏడు నమోదు కాగా నాలుగు పరిష్కరించబడ్డాయి. మోసగించిన కేసులు 17 నమోదు కాగా ఆరు కేసులను పరిష్కరించారు. అదేవిధంగా దోపిడీలకు సంబంధించి 175 కేసులు నమోదు కాగా 114 కేసులను పరిష్కరించారు. మొత్తం దొంగతనాల కేసులు 634 నమోదు కాగా 320 పరిష్కరించబడ్డాయి. ఇలా మొత్తం 909 కేసులు నమోదు కాగా 494 కేసులు పరిష్కరించినట్లు గణాంకాల ద్వారా వెల్లడి అవుతోంది. దేశంలోని ఇతర నగరాలతో పోలిస్తే ముంబై నగర ప్రజలకు రైలు ప్రయాణం ఎక్కువగా సౌకర్యంగా ఉండడంతో లక్షలాదిమంది ప్రజలు రైళ్లను ఆశ్రయిస్తుంటారు. దీంతో ముంబై రైల్వేను ‘లైఫ్‌లైన్’గా పిలుస్తుంటారు. రైళ్లలో నేరాల సంఖ్యను శూన్యం చేయడమే తమ ముఖ్య ఉద్దేశంగా రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. -
హైస్పీడ్ రైళ్లపై ప్రజాభిప్రాయం కోరిన పశ్చిమరైల్వే
దాదర్, న్యూస్‌లైన్: కొత్తగా కొనుగోలు చేసిన హైస్పీడ్ రైళ్లపై తమ తమ అభిప్రాయాలను తెలియజేయాల్సిందిగా ప్రయాణికులను.... పశ్చిమ రైల్వే (డబ్ల్యూఆర్) కోరింది. వీటిలో చేయాల్సిన మార్పులు, చేర్పులపై ప్రయాణికులు తమ సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాత వాటినన్నింటినీ పరిశీలించి ఇకపై కొనుగోలు చేయనున్న రైళ్లను వారి మనోభావాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతామని వెస్టర్న్ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్ కుమార్ తెలిపారు. చెన్నైకి చెందిన ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్)లో తయారు చేసిన రెండు హైస్పీడ్ రైళ్లను డబ్ల్యూఆర్ ఇటీవల కొనుగోలు చేసింది. 12 బోగీలు కలిగిన ఈ రెండు రైళ్లను నవంబర్‌లో స్వాధీనం చేసుకుంది. ఒక్కో రైలు కొనుగోలు కోసం రూ.30 కోట్లను వెచ్చించినట్లు ప్రస్తుతం వీటిని స్థానిక రైలు యార్డులో ఉంచామన్నారు. రాత్రి వేళల్లో వీటిని ప్రయోగాత్మకంగా నడుపుతున్నామన్నారు. ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వెస్టర్న్ రైల్వే పరిధిలో రాకపోకలు సాగిస్తున్న 75 లక్షల మంది ప్రయాణికులకు రద్దీ నుంచి కొంతమేర ఉపశమనం లభిస్తుందన్నారు. ముంబై అర్బన్ ట్రాన్స్పోర్ట్ ప్రాజెక్ట్ (ఎంయూటీపీ) రెండో దశలో భాగంగా 72 హైస్పీడ్ రైళ్లను ప్రవేశపెట్టే అంశాన్ని సంబంధిత అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ రైళ్లు గంటకు 120 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి ఈ రైళ్లలోని సీట్లు, హ్యాండిళ్లు తలుపులు, కిటికీలను ఎంతో అందంగా, అత్యాధునికంగా తీర్చిదిద్దారు. -
పశ్చిమ రైల్వేకి 150 ఏళ్లు
ముంబై: ఒక నాటి జాలర్ల గ్రామం దేశ ఆర్థిక రాజధానిగా అభివృద్ధి కావడానికి కారణమైన పశ్చిమ రైల్వేకి 150 ఏళ్లొచ్చాయి. పశ్చిమ సముద్ర తీరంలో రవాణా అవసరాలను తీర్చడానికి ఆంగ్లేయులు ఏర్పాటు చేసిన రైల్వే మార్గంలో నవంబర్ 28న, 1864న తొలి రైలు నడిచింది. అదే నేడు విస్తరించి ఆరేబియా సముద్ర తీరం వెంట ముంబై నుంచి గుజరాత్‌కు ఆ తరువాత మొత్తం ఉత్తరాదిని కలుపుతూ విస్తరించింది. 150 సంవత్సరాల కిందట ఈ రైలు మార్గాన్ని ముంబై-బరోడాలను కలుపుతూ బరోడా అండ్ ఏఎంపీ;ఏఎంపీ ఆధ్వర్యంలో తొలినాళ్లలో మొదలయిన ప్రయాణం సెంట్రల్ ఇండియా రైల్వే (బీబీ అండ్ ఏఎంపీ;ఏఎంపీ)గా గుజరాత్‌లోని ఉట్రాన్ నుంచి ముంబైకి రవాణా నిర్వహించింది. తరువాత క్రమంలో పశ్చిమ రైల్వేగా ఊపిరి పోసుకుంది అని ఓ రైల్వే అధికారి వివరించారు. ఈ మార్గంలో తొలి టర్మినస్‌గా గ్రాంట్ రోడ్డు రోడ్డు స్టేషన్ ఏర్పడింది. తొమ్మిదేళ్ల తరువాత 1873 నాటికి అది కొలాబా వరకు విస్తరించింది. 1930 నాటికి కొలబాను మూసివేసిన అధికారులు టర్మినస్‌ను చర్చి గేట్‌కు మార్చారు. ఇప్పటికీ ఇది శివారు రైల్వే సర్వీస్‌లకు కేంద్రంగా కొనసాగుతోంది. కాలక్రమంలో ముంబై సెంట్రల్, దాదర్లు అభివృద్ధి అయ్యాయి. బీబీ అండ్ ఏఎంపీ;ఏఎంపీ సెంట్రల్ ఇండియా రైల్వేగా మారిన తర్వాత 1855లో అంకాలేశ్వర్ నుంచి గుజరాత్ రాష్ట్రంలోని ఉట్రాన్కు 47 కిలోమీటర్ల మేర బ్రాడ్‌గేజ్ మార్గాన్ని ఏర్పాటు చేసింది. ఇదే 1864 వరకు ఇది ఇటు ముంబై వరకు విస్తరించింది. అయితే తొలినాళ్లలో ఇది ప్రధానంగా రవాణా అవసరాలనే తీర్చింది. భారత సామాజిక సమస్యలపై అనన్యమైన ప్రభావం చూపిన రైల్వే ప్రజా రవాణా సాధనంగా తొలిసారి ఏప్రిల్ 16, 1853న అవతరించింది. తొలిసారి ముంబై-ఠాణేల మధ్య ప్రయాణికుల రైలు నడిచింది. ఆనాటికి వివిధ రాష్ట్రాల ఆధ్వర్యంలో ఉన్న వివిధ రైల్వే విభాగాలను కలిపి నవంబర్ 5, 1951 నాటికి పశ్చిమ రైల్వే ఏర్పాటయింది. పశ్చిమ రైల్వే ఏర్పాటయిన తరువాత భారత ద్వీకల్పం కటి సీమకు వడ్డానంలా రూపుదిద్దుకొంది. పట్టణంగా రూపుదిద్దుకున్న ముంబై శివారు ప్రాంతాలకు విస్తరించడంతో ఏప్రిల్ 1867లో ఆవిరి ఇంజన్‌తో సబర్బన్ రైలు సర్వీస్ ప్రారంభమయింది. అదే ఇంతింతై విస్తరిస్తూ పోతూ నేడు రోజుకు 35 లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తోంది. ఈ చారిత్రక సందర్భాన్ని స్మరించుకోవడానికి పశ్చిమ రైల్వే జనరల్ మేనేజర్ హేమంత్‌కుమార్ ఓ ప్రదర్శనను ప్రారంభించారు. ‘‘ముంబైలో 150వ సంవత్సర వార్షికోత్సవం’ పేరుతో రెండు రోజుల ప్రదర్శనను గురువారం ప్రారంభించారు. ఇది నేడు కూడా కొనసాగుతోంది. పశ్చిమ రైల్వేగా అభివృద్ధి చెందిన వివిధ దశలకు చెందిన అరుదైన ఛాయా చిత్రాలు ఈ ప్రదర్శనలో ఉంచారు. దేశ పశ్చిమ భాగంలో, ముంబైలో రైల్వే విస్తరించిన క్రమానికి ఈ ప్రదర్శన అద్దంపట్టింది.